Editorial

Wednesday, May 1, 2024
కాల‌మ్‌మా సాంస్కృతిక కేంద్రం - బొంతల విఠలేశ్వరుడి గుడి' : శ్రీధర్ రావు దేశ్ పాండే...

మా సాంస్కృతిక కేంద్రం – బొంతల విఠలేశ్వరుడి గుడి’ : శ్రీధర్ రావు దేశ్ పాండే తెలుపు

గుడిలో విఠల రఖుమాయి

‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి, ‘మా బొంతల విఠలేశ్వరుడి గుడి’ ఈ వారం.

శ్రీర్ రావు దేశ్ పాండే

నా బాల్యపు జ్ఞాపకాల్లో మా బొంతల విఠల రఖుమాయి గుడి ఎన్నటికీ చెరిగిపోనిది. బోథ్ లో ఆ గుడి ఒక సాంస్కృతిక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది.

బోథ్ లో హనుమాండ్ల గుడి, విఠలేశ్వరుడి గుడి, పోచమ్మగుడి, ఊరి బయట మైసమ్మ గుడులు చాలా పురాతనమైనవి. అవి ఏ కాలంలో కట్టినారో చెప్పేవాళ్ళు ఇప్పుడు లేరు కానీ కమస్కం 150 ఏండ్ల పురాతనమైనవని చెప్పవచ్చు. ఆ తర్వాత కాలంలో వేంకటేశ్వర స్వామి గుడి, మార్కండేయ గుడి, సాయిబాబా గుడి కొత్తగా నిర్మాణం అయినాయి. ఇటీవలి కాలంలో పాత హనుమాండ్ల గుడి, విఠలేశ్వరుడి గుడి పునరుద్దరణకు నోచుకున్నాయి. హనుమాండ్ల గుడి పంచముఖి హనుమాన్ గుడిగా రూపు దాల్చింది. పంచముఖ హనుమాన్ విగ్రహం అందులోకి వచ్చి చేరింది. పాత హనుమాన్ విగ్రహాన్ని పెద్దవాగు అవతల పెద్దార్ల గుట్ట వద్ద ఒక కొత్త గుడిని నిర్మించి అందులో ప్రతిష్టించినారు.

ఇక విఠల రఖుమాయి వద్దకు వద్దాము. వీళ్ళు ఈ గుడిలో ప్రధాన దేవుళ్ళు. ప్రధాన మందిరం గర్భ గుడిలో విఠలుడు సాంప్రదాయికంగా కనిపించే రీతిలో.. అంటే ఇటుకపై నిలబడి రెండు చేతులు నడుముపై ఉండే విఠలుడు ఈ గుడిలో ఉంటాడు. ఇది చెక్కతో చేసిన విగ్రహం. పునరుద్దరణకు ముందు పాత గుడిలో ఆయన పక్కన రఖుమాయి ఉండేది కాదు. ఇప్పుడు కొత్త గుడిలో ఆయన పక్కన రఖుమాయిని పెట్టారు. ఇవి రాతి విగ్రహాలు. పండరి పురంలో విఠలుడి పక్కన రుక్మాయి ఉండదు. ఆమెకు ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. ఆ సంగతులు తర్వాత చర్చిస్తాను.

బొంతల విఠలేశ్వరుడి గుడి

బోథ్ లో విఠల గర్భ గుడికి ఎడమ వైపున ఎత్తైన గద్దె మీద ఒక చిన్న గుడిలో శివ లింగం, ఎదురుగా ఒక నంది, నందికి ఎడమ వైపున చంద్రం దట్టించిన హనుమాన్ విగ్రహం ఉండేవి. ఈ రెండింటి మధ్యన ఒక మంచి నీళ్ళ బావి కూడా ఉండేది. విఠల గర్భ గుడికి ఎదురుగా ఒక 100 మంది కూర్చోగలిగే అరుగు ఉండేది. ఆ అరుగు చివరన రెండు గదులు ఉండేవి. ఒక గది గుడి ఆఫీసుగా వాడుకునేవారు. రెండో గదిలో ఇద్దరు విధవరాళ్ళు తల్లీ కూతుళ్ళు కాపురం ఉండేవారు. వీళ్ళు ఆ గుడిలో ఎందుకు ఉండేవారో, ఆ గుడికి వీరి సంబంధం ఏమిటో అప్పుడు తెలిసింది కాదు. ఇప్పుడు వాకబు చేస్తే ఆ సంగతులు కొన్ని తెలిసినాయి.

గుడి బయటి దృశ్యం

గుడి పునరుద్దరణ

గుడి పునరుద్దరణ తర్వాత గుడిలో దేవుళ్ళ స్థానాల్లో మార్పు లేకపోయినా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. శివలింగం ఉన్న ఎత్తైన గద్దెను తీసివేసి విఠలుడి అరుగుతో సమానం చేశారు. మంచి నీళ్ళ బావిని పూడ్చి వేశారు. విఠలుడి ఎదురుగా రెండు గదులను తీసివేశారు. పాత చెక్క విగ్రహాలను తీసివేసి రాతి విగ్రహాలను ప్రతిష్టించారు. గుడికి ఆర్ సి సి చెత్తు నిర్మించారు. గర్భ గుడి పైన గోపురం నిర్మించారు. 1989 లో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మంజూరు చేసిన 3.70 లక్షల సొమ్ముతో ఈ గుడి పునరుద్దరణ జరిగినట్టు మిత్రులు చెప్పారు.

గుడి ముందు ఒక ధర్మసత్రం కూడా ఉండేది. ఆనాడు అందులో బాలికల ప్రాథమికోన్నత పాఠశాల నడిచేది. ఆడోల్ల బడిగా మా అందరికీ తెలుసు. ఆ బడి బయట ఎడమ వైపున ఒక వేప చెట్టు ఉండేది. మా బాల్యపు ఆటలు, పాటలు ఈ గుడి చుట్టూనే ఉండేవి.

పెద్దల దుర్గా నవరాత్రి ఉత్సవాలు – యువకుల వినాయక ఉత్సవాలు -పిల్లల డీప్ ఆట

దసరా సందర్భంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఈ విఠల గుడిలోనే జరిగేవి. అప్పుడు దసరా సెలవులు కాబట్టి పిల్లలం మేం అందరం గుడి చుట్టూనే ఆడుతూ, పాడుతూ కాలం గడిపేది. పగలు రాత్రి రెండు పూటలా దుర్గా దేవి పూజలు జరిగేవి. పిల్లలకు రాత్రి కూడా గుడి వద్ద ఆటల సంరంభం ఉండేది. “డీప్” అనే పేరుతో ఆడే ఆట మాకు ఎంతో సరదాగా ఉండేది. చప్పట్ల ద్వారా చివరకు ఒకడిని చోర్ ని చేసేది. మిగతావారు దాక్కునేది. వాడు వేప చెట్టు దగ్గర నిలబడి కళ్ళు మూసుకొని ఒకటి నుంచి పది లెక్క పెట్టాలి. ఈ లోపు ఎక్కడి వాళ్ళు అక్కడ గప్ చుప్. వాడు దాక్కున్న వాళ్ళను వెతుకుతూ బయలుదేరుతాడు. దాక్కున్న వాళ్ళలో ఏ ఒక్కడిని గుర్తు పట్టినా ఆట అయిపోతుంది. దొరికిన వాడు చోర్ గా మారుతాడు. ఆట కొనసాగుతుంది.

చోర్ ఎవరినైనా కనుక్కోక ముందే వాడిని దాక్కున్న వాళ్ళు ముట్టుకుంటే వాడు మళ్ళీ వేప చెట్టు వద్దకు వెళ్ళి పది వరకు లెక్క పెట్టాలి. ఇట్లా ఆట కొనసాగుతుంది. చోర్ ను మభ్య పుచ్చడానికి ఎన్ని వేషాలు వేసేదో! అంగీలు మార్చుకునేది. దుప్పటి కప్పుకొని ఇద్దరు ముగ్గురు ఒకేసారి ఎదురు పోయేది. వాడు పొరపాటున వేరే పేరు చెప్పినా వాడు చోర్ గా మళ్ళీ వేప చెట్టు వద్దకు వెళ్ళి పది వరకు లెక్క పెట్టాలి. ఇట్లా చీకట్లో ఆట గంటల కొద్దీ కొనసాగేది.

దుర్గా దేవి ప్రసాదం పంచేటప్పుడు మాత్రం ఆటకు విరామం ఇచ్చి మళ్ళీ కొనసాగించేవారం. పెద్దలు అందరూ ఇండ్లకు పోయేదాకా మా ఆటలు కూడా సాగేవి. దసరా రోజు మొదటి బంగారం పెట్టేది విఠలుడికే. ఆ తర్వాతనే పెద్దలకు బంగారం పెట్టి ఆశీర్వాదాలు తీసుకునేది.

బోథ్ కు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో కుచులాపూర్ క్రాస్ రోడ్ వద్ద వెంటేశ్వర స్వామి గుడిని శ్రీ చరణ దాస్ రెడ్డి గారు (ఆయన అప్పటికే బోథ్ తాలూకాలో పేరు గడించిన పద్య కవి) తన స్వంత ఖర్చులతో కట్టిన తర్వాత దసరా బంగారం వెంకటేశ్వరుడికి పెట్టడం షురూ అయ్యింది. అయినా ఊర్లోకి వెళ్ళిన విఠలుడి కూడా బంగారం పెడతారు.

వినాయక నవరాత్రుల్లో గుడి చుట్టూ నివసిస్తున్న యువకులు వినాయకుడి విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించేవారు. అప్పుడు కూడా చీకట్లో మా డీప్ ఆటలు కొనసాగేవి. ఆడోళ్ళ బడి తమ స్వంత భవనం లోకి మారిన తర్వాత గణేశుడి విగ్రహాన్ని ఈ ధర్మ సత్రానికి మార్చినారు. ఇప్పటికీ వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయట. దుర్గా దేవి ఉత్సవాలు మాత్రం అక్కడి నుంచి మార్చి కామిడి బొగుడ వద్ద వడ్ల బ్రహ్మం ఇల్లు ఉన్న జాగాలోకి మారింది. వడ్ల బ్రహ్మం, కమ్మరి సుదర్శన్ వారసులు ఆ ఇంటిని అమ్మేసి ఆదిలాబాద్ కు మారిపోయారు. అక్కడ ఇల్లు కూల్చివేసి ఖాళీ జాగాలో దుర్గాదేవి ఉత్సవాలు జరుపుతున్నారు.

బోథ్ లో హరి కథలకు విఠల గుడికి వేదిక అయ్యేది. సంవత్సరానికి ఒకసారో రెండు సార్లో వరంగల్ అయ్యవారు, సుంకిడి అయ్యవారు, కృష్ణమాచారి, వాసుదేవాచారి గార్లు హరి కథలు చెప్పడానికి వచ్చేవారు. వీరు కూడా బ్రాహ్మణేతర కులస్తులే.

నెల రోజుల పాటు సాగే ఈ హరికథల్లో రామాయణ, భారత కథలు చెప్పేవారు. మధ్యలో సందర్భనుసారం పిట్ట కథలు కూడా చెప్పేవారు. పాటలు పాడుతూ, నర్తిస్తూ హరి కథను రక్తి కట్టించేవారు. చివరకు బాగానే సంపాదించుకొని పోయేవారు. హరి కథలు వినడానికి చాలా పెద్ద సంఖ్యలో అన్ని కులాల జనం వచ్చేవారు. అదొక సాంస్కృతిక ఉత్సవంగా ఉండేది. వైద్య రామచంద్రం గారి పురాణ పఠనం రోజూ విఠల గుడిలోనే జరిగేది. ఈ పురాణ పఠనానికి మా ఆయి తప్పని సారి శ్రోత.

ఖోజాగిరి పున్నమ రోజు తాంబాళం నిండా పాలు పోసి నిండు చంద్రుడిని చూసిన తర్వాత ఆ పాలను కాచి అందరూ తాగేవారు. ఈ కార్యక్రమానికి కూడా విఠల గుడి వేదిక అయ్యేది. సుభాష్ ఆధ్వర్యంలో నడిచే భజన కార్యక్రమంలో విఠలుడుని కీర్తిస్తూ సంత్ తుకారాం, నాందేవ్ తదితరులు రాసిన మరాఠీ అభంగాలు పాడడం యాదికి ఉన్నది. పొద్దున 5 గంటలకు పెద్ద మసీదులో ఆజా, విఠల గుడి నుండి వేంకటేశ్వర సుప్రభాతం అందరినీ మేలుకొలిపేది. ఇట్లా మ బొంతల విఠలేశ్వరుడి దేవాలయం ఒక సాంస్కృతిక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లేది.

విఠల గుడి నిర్వాహణ

చాలా కాలం మా లెక్కల మాస్టారు దామోదర్ రావు గుడి నిర్వాహణ బాధ్యత చూసేది. వారి ఇల్లు గుడి పక్కనే ఉండేది. ఆ తర్వాత దేవాలయ కమిటీ ఏర్పడింది. కత్తూరి బొర్ర మల్లయ్య, కత్తూరి చిన్న మల్లయ్య, కత్తూరి(రూల్) కృష్ణమూర్తి, కత్తూరి సుదర్శన్, కత్తూరి గోవర్ధన్, పడిగెల గంగాధర్, మేఘనాథ్, తమ్మల విశ్వనాథ్ తదితరులు సభ్యులుగా దేవాలయ నిర్వాహణ కమిటీ ఏర్పాటు అయ్యింది. కమిటీలో అత్యధికులు షావుకార్లే కాబట్టి ఈ గుడి నిర్వాహణకు పెట్టుబడి వారే పెట్టేది.

కుల రహిత విఠల భక్తి ఉద్యమమే మూలం

గుడిలో జరిగే సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అన్ని కులాల ప్రజలు పాల్గొనేది. ఇంతకు ముందు పేర్కొన్నట్టు భర్తలు చనిపోయిన తర్వాత విఠల గుడిలో ఆశ్రయం పొందిన మహిళలు .. గంగూబాయి, ఆమె బిడ్డ నర్సమ్మ, గంగూబాయి చెల్లె బాయక్క .. వీరు ఔసలి కులస్తులు. గుడిలో ఆశ్రయం పొందిన మరో మహిళ ఎర్రాయి వడ్ల కులస్తురాలు.

ఇక్కడ ఒక ఆసక్తిని కలిగించే ముచ్చట చెప్పాలి. గుడిలో చాలా కాలం శుచీ శుభ్రత పనులు చేసేది మాదిగ లస్మన్న. ఆయన చనిపోయేదాకా విఠలుడి సేవకు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఊరి ప్రజలు కూడా మాదిగ లస్మన్నను గుడి సేవకు అడ్డు చెప్పలేదు. ఆయన గర్భ గుడిలోకి కూడా పోయేవాడు. ఎప్పుడైనా పూజారి రాకపోతే విఠలుడి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించేవాడట.

ఇది ఎట్లా సాధ్యం అయ్యింది అనేది ఇప్పుడు విచారిస్తే, కొంత పరిశోధన చేస్తే.. మహారాష్ట్రాలో 12, 13 శతాబ్దాలలో ఉవ్వెత్తున లేచిన విఠల భక్తి ఉద్యమంలోనే దీనికి మూలాలు ఉన్నాయని అనిపించింది. విఠల భక్తి ఉద్యమానికి నాయకత్వం వహించింది బహుజన కులాల నుండి వచ్చిన సంత్ లే. కులరహిత సమాజాన్ని కాంక్షిస్తూ సాగిన ఈ భక్తి ఉద్యమంలో వారు అన్ని కులాల వారిని కలుపుకొని పోయారు. ఇందులో దళితులు ఉన్నారు. ముస్లింలు కూడా ఉన్నారు. విఠలుని ఆరాధన మహారాష్ట్రాకే పరిమితం కాకుండా దక్కన్ పీఠభూమిలో ఉన్న కర్నాటక, గోవా, హైదరాబాద్ రాష్ట్రంలో కూడా వ్యాప్తి చెందింది.

తెలంగాణలో కూడా విఠల కల్ట్ బాగా ప్రచారంలో ఉన్నది. పండరి, విఠల్ అనే పేర్లు మన సమాజంలో విస్తారంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మహారాష్ట్రా, కర్నాటక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో విఠల కల్ట్ ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తాయి. విఠలుని దేవాలయాలు తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయని వెతికితే ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. హైదరాబాద్ నగరంలో కూడా విఠల దేవాలయాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో మహారాష్ట్రులు, కన్నడిగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున చాలా చోట్ల విఠల దేవాలయాల నిర్మాణం జరిగి ఉంటుంది. బోథ్ తాలూకాలో విఠలేశ్వరుడి దేవాలయం బోథ్ లో తప్ప మరెక్కడా లేవు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్ తాలూకాల్లో కూడా విఠల దేవాలయాలు ఉన్నట్టు తెలుస్తున్నది.

కుల వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తిన సంత్ లు

దేశంలో కుల అణిచివేతకు, వివక్షకు వ్యతిరేకంగా అనేక మంది సంత్ లు గళం ఎత్తారు. ఉత్తర భారతంలో కబీర్, గురునానక్, తులసిదాస్, హరిదాస్ తదితర సంత్ లు, కవులు మనకు కనిపిస్తారు. దక్కన్ లో బసవుడు, వేమన, బ్రహ్మంగారు కనిపిస్తారు. తెలంగాణలో రామదాసు, తూము నరసింహదాసు, దున్న హనుమద్దాసు .. వీరందరూ అట్టడుగు కులాల నుంచి వచ్చిన వారు. వీరు తమ ఉపదేశాలతో, తమ సాహిత్యంతో సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినారు.

మహారాష్ట్రాలో విఠోబా ఆరాధన

సంత్ జ్ఞానేశ్వర్

అయితే మహారాష్ట్రాలో వెల్లువెత్తిన భక్తి ఉద్యమం భిన్నమైనది. ఇది విఠలుని ఆరాధన చుట్టూ సమాజంలో అట్టడుగు వర్గాలను తట్టి లేపింది. ఆ భక్తి ఉద్యమమే మహారాష్ట్రాలో వార్కరి ఉద్యమంగా పేరుగాంచింది. వార్కరీలు అంటే పాదచారి భక్తులు. ఏటా ఆషాఢ మాసంలో శయన ఏకాదశి రోజున నడుస్తూ విఠోబా కీర్తనలు పాడుతూ పండరిపురం చేరుకునే భక్త జనమే వార్కరీలు. 12, 13 వ శతాబ్దాలలో ప్రారంభం అయిన వార్కరి భక్తి సాంప్రదాయం మహారాష్ట్రాలో ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. వార్కరి భక్తి ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు సంత్ జ్ఞానేశ్వర్, సంత్ నాందేవ్, సంత్ ఏక్ నాథ్, సంత్ తుకారాం, సమర్థ రామదాసు తదితరులు ఉన్నారు. వీరందరూ బ్రాహ్మణేతర కులాలకు చెందినవారే.

వీరి అనంతరం కూడా బహుజన కులాల నుంచి, దళితుల నుంచి సంత్ లు వార్కరి ఉద్యమానికి నాయకత్వం వహించి వార్కరి ఆరాధనా సాంప్రదాయాన్ని కొనసాగించినారని తెలుస్తున్నది.

విఠోబా – రఖుమాయి ఒక సాంస్కృతిక సమ్మేళనం

విఠోబా ఆరాధన వేద కాలం నాటికే ఉన్నదని చరిత్రకారుడు ఆర్ సి దేరే నిర్దారిస్తున్నాడు. స్థిర వ్యావసాయిక గ్రామాలు ఏర్పడని గణ సమాజాలలో మాతృస్వామ్యం అమలులో ఉండేది. స్థానిక అమ్మ దేవతలు పూజలు అందుకునేవారు. వింధ్య పర్వతాలను దాటుకొని దక్షిణాపథం గుండా ఆర్యుల వ్యావసాయిక సమాజాలు దక్కన్ పీఠభూమికి వ్యాపించిన తర్వాత మాతృస్వామ్యం పితృస్వామ్య వ్యవస్థలుగా, ఆహార సేకరణ దశ నుంచి స్థిర వ్యావసాయిక సమాజాలుగా మారుతున్న క్రమంలో సాంస్కృతిక సమ్మేళనం జరిగినట్టు డి డి కోశాంభి సహా అనేక మంది చరిత్రకారులు, పరిశోధకులు నిర్ధారించారు. మహారాష్ట్రాలో ఈ సాంస్కృతిక సమ్మేళనంపై కొశాంభి తన అధ్యయనంలో విస్తృతంగా ఉటంకించడం జరిగింది. ప్రాచీన గణ సమాజాలలో అమ్మ దేవతగా ఉన్న రఖుమాయి అనంతర కాలంలో విఠలునికి భార్యగా మారి పండరీపురంలో కొలువుదీరినట్టు నిర్ధారిస్తాడు. రఖుమాయి ముందు నుంచే స్థానిక ప్రజల అమ్మదేవతగా పూజలు అందుకున్నది కాబట్టి విఠోబా భార్యగా సాంస్కృతిక సమ్మేళనం తర్వాత కూడా ప్రజలు ఆమె స్వతంత్ర హోదాను కాపాడుకున్నారు. అందుకే పండరిలో విఠోబాకు, రఖుమాయికి వేరు వేరుగా మందిరాలు ఉన్నాయి.

పండరిపురం పూర్వనామం పండరగ కాబట్టి పండరిలో కొలువుదీరిన విఠలుడిని పాండురంగడు గా లేదా పండరినాథుడుగా కూడా పిలుస్తారు. ఈ సాంస్కృతిక సమ్మేళనం ఒక స్థిరమైన ఆరాధనా దశకు చేరడానికి శతాబ్దాలు పట్టింది. అయితే 12,13 వ శతాబ్డాలలో కుల వివక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తినాయి. మహారాష్ట్రా, కర్నాటక, గోల్కొండ రాజ్య ప్రాంతాల్లో విఠల ఆరాధనా రూపంలో కుల వివక్షకు వ్యతిరేకంగా భక్తి ఉద్యమం నిలదొక్కుకున్నది.

పండరిలో రెండు రకాల ఆరాధనా పద్దతులు కనిపిస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకటి మందిరం లోపల జరిగే వైదిక పూజలు(Ritual Worship). రెండు విస్తృత ప్రజానీకం భక్తి భావనతో చేసుకునే ఆరాధన(Spiritual Worship). రెండోది బహుజన కులాల నుంచి ఉద్భవించిన సంత్ ల ద్వారా స్థిరపడిన వార్కరి ఆరాధనా సాంప్రదాయం. వార్కరీలు ఏడాదికి రెండు సార్లు .. ఆషాడ మాసంలో శయన ఏకాదశికి, ఆ తర్వాత కార్తీక మాసంలో ప్రభోదిని ఏకాదశికి విఠోబా దర్శనానికి కాలి నడకన సంత్ లు రాసిన కీర్తనలు (మరాఠిలో వీటిని అభంగ్ వాణి లేదా సంత్ వాణీ అని అంటారు) పాడుకుంటూ, నాట్యం చేస్తూ పండరికి చేరుకుంటారు. ఆషాఢ మాసంలో జరిగే ఈ వార్కరి ఉత్సవాలను మహారాష్ట్రా ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. వీటిలో తెలంగాణా ప్రాంతం నుంచి కూడా వేలాది మంది పాల్గొంటారు.

వార్కరి భక్తి ఉద్యమ సారధులు

సంత్ జ్ఞానేశ్వరుడే వార్కరి భక్తీ ఉద్యమాన్ని విస్తృత ప్రజానీకంలోకి తీసుకుపోయాడని చరిత్రకారుల నిశ్చితాభిప్రాయం. ఆయనే వార్కరి సాంప్రదాయానికి పునాది వేశాడని వార్కరీలు కూడా నమ్ముతారు. 22 ఏండ్ల చిన్న వయసులోనే ఆయన తనువు చాలించాడు. ఆయన సమకాలికుడైన సంత్ నాందేవ్ జ్ఞానేశ్వర్ కంటే పెద్దవాడు. ఇద్దరు కలిసి ఊరూరు తిరిగి వార్కరి ఆరాధనా సాంప్రదాయంలోకి ప్రజలను సమీకరించారు.

సంత్ నాందేవ్

సంత్ నాందేవ్ బ్రాహ్మణేతర కులంలో (దర్జీ) పుట్టి, సంత్ గా మారి మహారాష్ట్రాలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినాడు. సంత్ నాందేవ్ మరాఠీలో వేలాది కీర్తనలు రాసి వాటికి శాస్త్రీయ సంగీత బాణీలు కట్టి ప్రజల్లో వినిపించాడు. అవన్నీ విఠోబాను కీర్తిస్తూ, విఠోబా పట్ల ప్రేమ భావనను వ్యక్తీకరిస్తూ రాసిన కీర్తనలు (అభంగాలు). సంత్ నాందేవ్ రాసిన అభంగాలు విఠోబా కల్ట్ లోకి కుల మతాలకు అతీతంగా విస్తృత ప్రజానీకాన్ని సమీకరించడానికి దోహదం చేసినాయి.

వార్కరి సాంప్రదాయంలోకి స్త్రీలు, బహుజన కులాల ప్రజలు, అంటరాని కులాల ప్రజలు పెద్ద ఎత్తున చేరినారు. సమాజంలో ఉన్న కుల వివక్షను అధిగమించనికి వార్కరి ఉద్యమం ఆనాటి ప్రజానీకానికి ఆలంబనగా మారింది. విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం దక్కన్ లో చాలా ప్రాంతాలు ముస్లిం రాజుల ఏలుబడిలోకి వచ్చినాయి. తమ పాలనను సుస్థిరం చేసుకోవడానికి ముస్లిం పాలకులు కూడా విస్తృత ప్రజాదరణ పొందిన వార్కరీ ఆరాధనా సంప్రాదాయాన్ని ప్రోత్సహించక తప్పలేదు. 16 వ శతాబ్దం నాటికి వార్కరి భక్తి ఉద్యమం దక్కన్ లో సంత్ ఏక్ నాథ్ సారధ్యంలో తారాస్థాయికి చేరుకున్నది.

రాజా రవి వర్మ చిత్రించిన తుకారం

మహారాష్ట్రాలో శివాజీ పరిపాలనా కాలంలో సంత్ తుకారాం (పండ్లు సేకరించి అమ్ముకునే కులం) వార్కరి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసినాడు. తుకారాం విఠోబా భక్తి భావనతో, మనుషులందరూ ఒక్కటేనన్న సమానత్వ భావనతో సుమారు 5 వేల కీర్తనలు (అభంగాలు) రాసినట్టు చెపుతారు. వీరితో పాటు వార్కరి భక్తి ఉద్యమంలో సంత్ నాందేవ్ ఇంట్లో పని మనిషిగా ఉన్న జానాబాయి, సేనా (మంగలి), నరహరి (అవుసలి), గోరా (కుమ్మరి), సవట (తంబలి), చోఖామేల (మహార్), షేఖ్ మహమ్మద్ (ముస్లిం) లు కూడా విఠోబా కీర్తనలు రాసి, పాడి వార్కరి భక్తి ఉద్యమానికి దోహదం చేసినారు.

మహారాష్ట్రాలో హిందుస్తానీ సంగీత పరంపర

మహారాష్ట్రాలో హిందుస్తానీ సంగీత పరంపర ఇప్పటికీ కొనసాగడానికి పండరి వార్కరి భక్తి ఉద్యమం బాగా దోహదం చేసిందని, సంత్ లు రాసిన అభంగాలు అన్నీ కూడా శాస్త్రీయ సంగీత స్వరాలను ఆధారం చేసుకొని రాసినవి కాబట్టి అవి ఇప్పటికీ మరాఠి సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.

హిందుస్తానీ సంగీత పరంపర మహారాష్ట్రాలో అవిచ్చిన్నంగా కొనసాగడానికి సంత్ ల వార్కరి భక్తి సాంప్రదాయం దోహదం చేసిందని సామల సదాశివ గారు స్వర లయలు పుస్తకంలో ఒక వ్యాసంలో రాసినారు. మరాఠి భక్త కవుల కీర్తనలను, భజన్ లను లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, సుమన్ కళ్యాణ్ పురి, సురేష్ వాడ్కర్, సుధీర్ ఫడ్కే లాంటి ప్రముఖ మరాఠీ గాయకులు పాడినారు.

పండిత్ భీంసేన్ జోషి

భారత రత్న పండిత్ భీంసేన్ జోషి తన మదుర గంభీర గాత్రంతో దేశం నలుమూలలా, విదేశాలలో సైతం ఈ అభంగాలను గానం చేసి సంత్ కవుల ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసినాడు. అనంతర కాలంలో మహారాష్ట్రాలో జ్యోతిరావు ఫూలే, అంబేడ్కర్ లు నడిపించిన సామాజిక ఉద్యమాలకు ఈ సంత్ కవుల వార్కరీ భక్తి సంప్రదాయమే బీజాలు వేసిందని సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

ఇవీ నా యాదిలో ఉన్న బొంతల విఠలుడి ముచ్చట్లు.

బొంతల విఠల గుడికి ఇంతటి మహత్తరమైన చారిత్రిక నేపథ్యం ఉందని తెలుసుకొని గర్వపడినాను. విఠల దేవాలయంలో బ్రాహ్మణేతర కులాల మహిళలు ఆశ్రయం పొందినారని, మాదిగ కులస్తుడు విఠలుడి సేవలకు జీవితాన్ని అంకితం చేశాడని తెలిసి సంతోషించాను.

విఠలుడికి ఇప్పుడు దేవాదాయ శాఖ నుంచి జీతం పొందుతూ పండరి అనే వైదిక పురోహితుడు నిత్యం పూజలు నిర్వహిస్తున్నాడని మిత్రులు చెప్పారు. ఈ ముచ్చట్లు రాయడానికి వైద్య రామచంద్రం పంతులు గారి చిన్నకొడుకు, నా చిన్నప్పటి దోస్తు వైద్య సురేష్ విలువైన సమాచారం అందించినాడు. వాడికి ధన్యవాదాలు.

కాలమిస్టు పరిచయం

శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ  స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మూడో భాగం బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం. నాలుగో భాగం స్వామి స్నేహితులు – మాల్గుడి క్రికెట్ క్లబ్. ఐదో భాగం కోడి – గంపెడు బూరు : మా చిన్నాయి చెప్పిన కథ. ఆరో భాగం ‘కాముని బొగుడ’ – ‘హోలీ కేళీ కోలాటం’. ఏడో భాగం సహజీవన సంస్కృతికి మారు పేరు మొహర్రం. ఎనిమిదో భాగం కుంటాల జలపాతం.  తొమ్మిదో భాగం బోథ్ గణపతి మండపంలో ఉస్తాద్ బడే ఖాన్ సాహెబ్ కచేరీ. పదో భాగం బోథ్ లో ప్రదీప్ టూరింగ్ టాకీసు. పదకొండో భాగం బాపు స్మృతిలో. పన్నెండో భాగం నేను నిజంగానే ‘సుడిగాలి’ బాధితుడిని. పదమూడో వారం నా ఉన్నతికి చోదక శక్తి ‘ఆయి’. పద్నాలుగో వారం అంగట్లో ‘ఝటాంగి’ వెతుకులాట. మీరు చదివింది పదిహేనో వారం. వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article