Editorial

Sunday, May 12, 2024
కాల‌మ్‌బోథ్ గణపతి మండపంలో ఉస్తాద్ బడే ఖాన్ సాహెబ్ కచేరీ– శ్రీధర్ రావు దేశ్ పాండే...

బోథ్ గణపతి మండపంలో ఉస్తాద్ బడే ఖాన్ సాహెబ్ కచేరీ– శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ , లతా మంగేష్కర్

బడే గులాం అలీ ఖాన్ ఎక్కడ? ఆయన బోథ్ లాంటి చిన్న పల్లెటూరులో కచేరీ చేయడం ఏమిటి ? ఇది నమ్మశక్యం కాని ముచ్చటే కానీ వంద శాతం నిజం.

ఇంతకు ముందు మొహర్రం, శివరాత్రి జాగరణ గురించి వివరంగా రాసి ఉన్నాను. చిన్నప్పటి గణపతి చవితి ఉత్సవాల సంరంభం అనుభవాలు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి. ఆనాటి గణేష్ చవితి నా జ్ఞాపకాలు, అనుభవాలు చదవండి.

శ్రీర్ రావు దేశ్ పాండే

1960, 70 దశకాల్లో బోథ్ జనాభా సుమారు 10 నుంచి 15 వేలు ఉండేది. నిజాం జమానా నుంచి తాలూకా కేంద్రం, హైదరాబాద్ రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికల నాటి నుంచి శాసన సభా నియోజక వర్గ కేంద్రం కూడా. తాలూకాలో మేజర్ గ్రామ పంచాయతీల్లో పెద్దది. జాతీయ రహదారి నంబరు 7 (కన్యాకుమారి – జమ్ము) కు 11 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అభివృద్దిలో, విస్తరణలో మందకొడితనం ఉండేది. అయితే నిజాం జమానా నుంచి బోథ్ తాలూకా కేంద్రంగా ఉండడం వలన తాలూకా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా బోథ్ లో ఏర్పాటు అయినాయి. తహశీల్ ఆఫీసు, తాలూకా పంచాయతీ సమితి ఆఫీసు, బి డి ఒ ఆఫీసు, పోలీస్ ఠాణా, టప్పా ఖానా, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ ఏ ఇ ఆఫీసు లు, మెజిస్ట్రేట్ కోర్టు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, సబ్ ట్రెజరీ ఆఫీసు, తాలూకా హాస్పిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, కోపరేటివ్ బ్యాంక్, శాఖా గ్రంథాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డాక్ బంగ్లా .. ఇట్లా తాలూకా కేంద్రంలో జరిగే అన్నీ ప్రభుత్వ కార్యకలాపాలు అన్నీ బోథ్ కేంద్రంగానే జరిగేవి.

జాతీయ రహదారికి 11 కిలోమీటర్లు లోపల ఉన్నప్పటికీ తాలూకాలో అతి పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ కావడం వలన తాలూకా కేంద్రంగా ఉండే అర్హత బోథ్ కు వచ్చిందని నా అభిప్రాయం. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బైంసా పట్టణాలతో పోలిస్తే బోథ్ చాలా చిన్నఅ పట్టణంగా భావించాలి. చిన్న పట్టణమైనా దసరా, ఉగాది, పొలాల, సంక్రాంతి, గణేష్ చవితి, శివరాత్రి పండుగలు, మొహర్రం ఉత్సవాలు ఘనంగానే జరిగేవి. ఇంతకు ముందు మొహర్రం, శివరాత్రి జాగరణ గురించి వివరంగా రాసి ఉన్నాను. చిన్నప్పటి గణపతి చవితి ఉత్సవాల సంరంభం అనుభవాలు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి. ఆనాటి గణేష్ చవితి నా జ్ఞాపకాలు, అనుభవాలు చదవండి.

రాజారాం గారి ఇంట్లో గణపతి విగ్రహాల కళా సౌరభం

గణపతి విగ్రహాలను ఊర్లో ఔసలి రాజారాం, శాలోల్ల లస్మన్న.. ఈ రెండు కుటుంబాలు తయారు చేసేవి. పెద్ద విగ్రహాలైతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో, చిన్న విగ్రహాలైతే బంక మట్టితో తయారు చేసేది. ఇద్దరిలో రాజారాం తయారు చేసే విగ్రహాలకు గిరాకీ ఎక్కువగా ఉండేది.

మండపాల నిర్వాహకులు తాము ప్రతిష్టించే విగ్రహాల ఆర్డర్లను నెల ముందే ఇవ్వడం జరిగేది. విగ్రహం సైజును బట్టి ధర ఉండేది. ఇవి కాక ఇంట్లో జరుపుకునే పూజలకు కూడా ఒక వివిధ సైజుల్లో సాంచాలతో విగ్రహాలను తయారు చేసేది. వీరికి బోథ్ చుట్టూ పక్కల ఊర్ల మండపాల నిర్వాహకుల నుంచి కూడా ఆర్డర్లు వచ్చేవి. రాజారాం గారికి నలుగురు కొడుకులు. మూడో వాడు నందు మా వయసు వాడే. అందుకని వాడితో వాళ్ళింటికి తరచుగుగా పోయేవారం. రాజారాం గారు అత్యంత శ్రద్దతో, నిష్టతో విగ్రహాలను తయారు చేసే విధానాన్ని గమనించేవాడిని. ముఖ్యంగా విగ్రహానికి రంగులు వేయడాన్ని చూస్తూ గంటలు గడిపేవాడిని.

రాజారాం గారు చనిపోయిన తర్వాత వారి ఇంటిని అమ్మేసి ఎక్కడి వారు అక్కడ స్థిరపడి పోయారు. లస్మన్న తర్వాత ఆయన కళా వారసత్వాన్ని ఎవరూ కొనసాగించకపోవడం వలన గణపతి విగ్రహాల కోసం నిర్మల్ లేదా ఆదిలాబాద్ పోవలసి వచ్చేది.

సాంచాలో బంక మట్టి కూర్చి చిన్న విగ్రహాలను వారి కుటుంబం అంతా కలిసి చేసేవారు. ఆ నెల రోజుల పాటు వారి ఇంట్లో జరిగే తతంగం అంతా ఒక కళారాధనగా ఉండేది. రాజారాం కొడుకులు అందరూ ఉద్యోగాల కోసం బోథ్ వదిలి వెళ్లిపోయారు. రాజారాం గారు చనిపోయిన తర్వాత వారి ఇంటిని అమ్మేసి ఎక్కడి వారు అక్కడ స్థిరపడి పోయారు. లస్మన్న తర్వాత ఆయన కళా వారసత్వాన్ని ఎవరూ కొనసాగించకపోవడం వలన గణపతి విగ్రహాల కోసం నిర్మల్ లేదా ఆదిలాబాద్ పోవలసి వచ్చేది. ఇప్పుడైతే మండపాల సంఖ్య పెరిగింది. ఊర్లో జనాభా కూడా పెరిగింది కాబట్టి విగ్రహాల అవసరం పెరిగింది. అందుకని గణపతి విగ్రహాల కోసం మండపాల నిర్వాహకులు కోరుట్ల, మెట్ పల్లి, నిజామాబాద్ లకు కూడా వెళ్ళి విగ్రహాలు కొని తెచ్చుకుంటున్నారట.

గణపతి గూడు

మా ఇంట్లో ప్రతీ గూడుకి ఒక పేరు ఉంటది. ప్రతీ అర్రకు ఒక పేరు ఉంటది. దొంతులర్ర, షాబాస్ అర్ర.. ఇట్లా . ఆ వరుసలో మా ఇంట్లో గణపతి గూడు కూడా ఉండేది. ఎప్పటి నుంచో గణపతిని ఆ గూట్లో ప్రతిష్టించి పూజ చేసేవారేమో ఆ గూడుకు గణపతి గూడు అని పేరు ఖాయం అయ్యింది. ఆ గూడు దాదాపు మూడున్నర, నాలుడు అడుగుల ఎత్తు ఉంటుంది. ఒక అడుగు వెడల్పు ఉంటుంది. అంత పెద్ద గూట్లో కొంచె పెద్ద విగ్రహం పెట్టాలని పిల్లలం మేము అనుకునే వారం. కానీ ఆయి మాత్రం బంక మట్టితో చేసిన, రంగులు కూడా లేని ఒక చిన్న బంక మట్టి సాంచా గణపతిని మాత్రమే తెప్పించేది. మూడవ రోజు సాయంత్రం ఒక వెదురు గుల్లలో విగ్రహాన్ని, పూజా సామాగ్రి అంతటినీ పెట్టి అడెల్లును తోడిచ్చి పెద్దవాగులో నిమజ్జనానికి పంపేది. నా దోస్తులను తోల్కొని అడెల్లు వెంట పెద్ద వాగుకు పోయేది. నిమజ్జనం తర్వాత తినడానికి ఊరగాయ అటుకులు, దాంట్లో దోసకాయ ముక్కలు, కాల్చిన మక్క విత్తులు కలిపి ఇచ్చేది.

గణపతి చవితి వానాకాలం వస్తుంది కనుక పెద్దవాగు ఆ సమయాన బాగానే పారుతూ ఉండేది. అడెల్లు మరీ లోపలిదాకా కాకుండా ఒడ్డు నుంచి ఒక నాలుగు ఐదు అడుగులు వాగు లోపలికి వెళ్ళి మోకాలి లోటు నీళ్ళలో గణపతిని మూడు సార్లు నీటిలో ముంచి తీసి వదిలేసేవాడు. బయటికి వచ్చి వాగు ఒడ్డున కూసోని ఆయి కలిపి ఇచ్చిన అటుకులు తినేసి ఇంటికి వచ్చేది. మాతో వచ్చిన ఇతర పిల్లలకు కూడా గుప్పెడు పలారం పంచెది. అట్లా ఇంట్లో గణపతి చవితి సంరంభం ముగిసేది.

శిశు గణేష్ మండలి

ఇక ఊర్లో జరిగే గణపతి చవితి ఉత్సవాలకు వస్తే.. తొలుత ఊర్లో రెండు మండపాలు ఉండేవని మా కంటే పెద్దవారు చెప్పగా విన్నాము. ఒకటి కత్తూరి చిన్నమల్లయ్య గారి మండపం. ఇది బజారు వీధిలో చిన్న మల్లయ్య గారి మడిగే ముందు ఏర్పాటు అయ్యేది. రెండవది బొర్ర (కత్తూరి) మల్లయ్య గారిది. ఈ మండపం వారి ఇంటికి దగ్గరలో రోడ్డు మీద ఏర్పాటు అయ్యేది. ఆ తర్వాత యువకులు మరో రెండు గణపతి మండళ్ళు ఏర్పాటు చేసుకొని గణపతులను ప్రతిష్టించడం మొదలయ్యింది. అట్లా మా అన్నతరం మిత్రులంతా కలిసి “శిశు గణేష్ మండలి”, కోమట్ల యువకులు “బాల గణేష్ మండలి” ఏర్పాటు చేసి గణపతి నవరాత్రి ఉత్సవాలు జరిపేవారు.

ఆ కాలంలో డిజె లు లేవు. గ్రాం ఫోన్ రికార్డుల మోత ఉండేది. శిశు గణేష్ మండలి చిన్న స్థాయిలో ఏర్పాటు అయ్యింది. రాంకిషన్ రావు దేశ్ పాండే గారి ఇంట్లో తనాబిల్ బంగ్లాలో గణపతిని ప్రతిష్టించే వారు. దాని కోసం వారం రోజుల నుంచి డెకోరేషన్ జరిగేది. రాజారాం వద్ద నుంచి విగ్రహాన్ని కొని తెచ్చి పెట్టేది. మేము ఇంకా చిన్నపిల్లలం కాబట్టి ఆ కార్యక్రమాల్లో అసిస్టెంట్లుగా వాళ్ళు చెప్పిన పని చేసి పెట్టేది.

ఈ తొమ్మిది రోజులు వాళ్ళు ఏవో కార్యక్రమాలు చేసేది. అందులో నాకు గుర్తు ఉన్నది ఒక నాటిక ప్రదర్శన. ఆ నాటిక ప్రదర్శన జరిగినట్టు లీలగా గుర్తున్నది. కానీ ఆ విశేషాలు అన్నీశ్యాం దాదా రాసిన వేణు సంస్మరణ వ్యాసం చదివిన తర్వాత తెలిసినాయి. ఆ విశేషాలను ఆయన మాటల్లోనే..

  • “మేము అంటే నేను, నాగోరావు @ రాజు, గంగాధర్ రావు @ బండు, స్వర్గీయ గిరిధర్ రావు@ గుండు, స్వర్గీయ అనిల్ రావు@ అనిల్, మహేష్ వైద్య, గిరీష్ వైద్య, రమేష్ వైద్య, దీలిప్ రావ్, సురేష్ వైద్య, సతీష్ చంద్ర, స్వర్గీయ సోమేశ్వరరావు@ సోమన్న (రామచంద్రం పంతులు కొడుకు), స్వర్గీయ మాధవరావు (బాపురావు కాక కొడుకు), నమిలికొండ మోహన్ రావు (ఆనందం పంతులు కొడుకు), వేణు, శ్రీధర్ @సిరు ఇంకా మిగతా చాలా మందిమి (క్షమించాలి! అందరి పేర్లు గుర్తుకు రావడం లేదు) కలిసి సుమారు 1967 లేదా 1968 లో శిశు గణేష్ మండలి అని ఒకటి ఏర్పాటు చేశాం. ఆ
  • సంవత్సరం గణపతిని పెద్దింటిలో తనాబిల్ బంగ్లా మీద మంచిగా డెకరేషన్ చేసి పెట్టాం. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఒక నాటిక మాకు మేమే వ్రాసుకున్నాము. ఆ నాటిక పేరు “అస్తి కోసం”. క్లుప్తంగా ఆ నాటికలో కథ ఇది. ఇద్దరు అన్నదమ్ములు. వారికి కొండంత అస్తి. అన్న చాలా మంచివాడు. అయన అశయం అస్తిని కాపాడుకొని ముందు తరాలకు ఉంచాలని..తమ్ముడు దురాశ పరుడు..ఆస్తి మొత్తంను ఒకేరోజే కరిగించాలని అయన ఆలోచన..తమ్ముడు తన అశయాన్ని కడుపులో దాచుకుని అన్నను కడతేర్చి ఆస్తిని కాజేయలని హత్యలు మరియు గుండాగిరి చేసే ఇద్దరు మనుషులను రహస్యంగా కలుస్తాడు. అన్నపై దాడి జరుగుతుంది. ఎవరు దాడి చేయించారో తెలియని అన్నఒక డిటెక్టివ్ ను కలిసి ఆయన సహయంతో పోలీస్ సబ్ ఇనస్పెక్టర్ కు ఫిర్యాదు చేస్తాడు. డిటెక్టివ్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ తెలివిగా తమ్ముడు పాత్రను బయటకు లాగుతారు. ఆ తరువాత సబ్ ఇన్స్పెక్టర్ ఆ తమ్ముడిని అరెస్ట్ చేయాలని ఇద్దరు కానిస్టేబుల్స్ కు ఆజ్ఞాపిస్తాడు. వారు ఇద్దరు గూండాలను అరెస్ట్ చేస్తారు. అంతటితో కథ సుఖాంతం అవుతుంది.
  • ఈ నాటికలో అన్న పాత్ర గంగాధర్ రావు@బండు, తమ్ముడి పాత్ర స్వర్గీయ అనిల్ రావు @ అనిల్, డిటెక్టివ్ పాత్ర నేను, నా అసిస్టెంట్ పాత్ర బహుశ రాజు అనుకుంటా, గుండా రౌడిలుగా రౌడీకి మహేష్ వైద్య ఇంకా మరి ఒకరు (పేరు గుర్తుకు రావటం లేదు), సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర సతీష్ చంద్ర మరియు కానిస్టేబుల్స్ పాత్రలలో వేణు ఇంకా ఇంకొకరిని (పేరు గుర్తుకు రావడం లేదు)..ఎన్నుకున్నాము. ప్రతి రోజూ రిహార్సల్ చేసేవారము. సతీష్ చంద్ర సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో వేణుకు గుండా రౌడీ గాళ్ళని అరెస్ట్ చేసి తన ముందు ఉంచాలని అంటాడు. దానికి ప్రతిగా వేణు “ఎస్ సర్” అని జవాబు ఇవ్వాలి. కానీ వేణు ప్రతి సారి “సతీష్ దాదా పట్టుకుంటాం” అనేవాడు. చాలా సార్లు సతీష్ దాదా అనకూడదు ఎస్ సర్ అనాలి అన్నా కూడా వేణు వినేవాడు కాదు..ఎస్ సర్ అనేవాడు కాదు. మాకు చివరకు తెలిసింది ఏమిటంటే సతీష్ ను వేణు కలలో కూడా వేరుగా ఊహించలేదు మరియు దాదా లాగా అంటే ఒక అన్న(సహోదరుడు) లాగా చూసేవాడు అని. వేణు అందరితో ఆత్మీయంగా ఉండేవాడు.
  • అదే నాటికలో మహేష్ వైద్యకు(గుండా పాత్రధారి) ఒక డైలాగ్ ఉండేది. ఆ డైలాగ్ “ఎస్ బాస్”. మహేష్ వైద్య కాస్త ముక్కుతో శ్వాస తీసుకుంటూ మాట్లాడేవాడు. ఆయనను మేము అందరం నన్నిమున్ని మహేష్ అనే వాళ్ళం. అయన చెప్పిన “ఎస్ బాస్” డైలాగ్ ఇప్పటికీ బోథ్ లో ఆ తరం వారికి చిరపరిచితం.”

– ఇవి నాటిక గురించి శ్యాం దాదా చెప్పిన ముచ్చట్లు. నాటిక ప్రదర్శన రోజున రెండు చెక్క పలంగ్ లు, ప్రేక్షకులు కూర్చోడానికి పెద్ద శతరంజీ మా ఇంటి నుంచే వచ్చాయి. పలంగ్ ల చుట్టూ తెరలుగా ఇంటి నుంచి ఒక్కొక్క చీర / ధోతి వాళ్ళ ఆయిలను అడిగి తెచ్చారు. అందరి సహకారంతో రాత్రి లైట్ల వెలుతురులో నాటిక ప్రదర్శన బాగా జరిగింది. తొమ్మిదవ రోజు ట్రాక్టర్ లో పెద్ద వాగులో నిమజ్జనానికి తీసుకుపోయేది. శ్యాం దాదా వాళ్ళకు ట్రాక్టర్ ఉండేది కాబట్టి ట్రాక్టర్ ఖర్చు ఫ్రీ. ట్రాలీని గణపతిని నిమజ్జనానికి తయారు చేసేది. ట్రాక్టర్ డ్రైవర్ మగ్బూల్ ట్రాక్టర్ను జాగ్రత్తగా తోలి నిమజ్జనాన్ని సంపన్నం చేసేది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, శంకర పార్వతులిద్దరట – కైలాసంలో పెద్దలట, గణపతి బొప్పా మోరయా – పుడ్చా వర్షీ లౌకర్ యా.. ఇట్లా కొన్ని నినాదాలు ఇచ్చేవాళ్ళం. ఇదీ శిశు గణేష్ మండలి కథ. తొమ్మిది పది తరగతులకు వచ్చిన తర్వాత ఈ మండళ్ళ జోలికి పోలేదు. అప్పటికే హేతువాద, నాస్తిక సాహిత్య ప్రభావం కొంత వొంటి మీదకు ఎక్కింది.

బోథ్ గణపతి మండపంలో బడే గులాం అలీ ఖాన్ కచేరి

ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్

ఇదొక మహత్తర సన్నివేశం. బడే గులాం అలీ ఖాన్ ఎక్కడ? ఆయన బోథ్ లాంటి చిన్న పల్లెటూరులో కచేరీ చేయడం ఏమిటి ? నమ్మశక్యం కాని ముచ్చటే. కానీ వంద శాతం నిజం.

దేశం గర్వంగా ప్రస్తావించుకునే హిందుస్తానీ సంగీత శిఖరం ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్. పాటియాలా ఘరానా సంగీత సంప్రదాయాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయుడు. ఉస్తాద్ ముసల్మాన్ అయినా మత భేదాలు ఆనాటి గాయనీ గాయకుల్లో లేనట్టే ఉస్తాద్ లో ఉండేవి కావు. తన జీవితపు చరమాంకంలో 1967 లో ఆయన పక్షవాతానికి గురి అయినాడు.

ఒక ముసల్మాన్ ను గణపతి మండపానికి ఆహ్వానిస్తున్నాము అన్న భావన కార్యక్రమ నిర్వాహకులకు లేదు. తాను గణపతి మండపంలో పాడబోతున్నానన్న స్పృహ ఉస్తాద్ కు లేదు. ఇదే కదా భారతదేశం విశిష్టత.

ముంబాయిలో నివసించే ఉస్తాద్ పక్షవాతానికి మూలికా వైద్యం చేసే హకీం ఉన్నాడని తెలిసి చికిత్స కోసం ఆదిలాబాద్ జిల్లా బోథ్ గ్రామానికి వచ్చాడు. బోథ్ ఆనాటికి తాలూకా కేంద్రమైనా ఒక గ్రామమే. బోథ్ డాక్ బంగ్లాలో ఉస్తాద్ మూడు నెలలు ఉన్నాడు. మూలికా వైద్యం చేయించుకున్నాడు. బడే ఖాన్ సాహెబ్ కు మూలికా వైద్యం చేసిన హకీం గురించి వాకబు చేస్తే ఆయన ఆర్టీసీ కంట్రోలర్ ఉద్యోగం బోథ్ లో చేసేవాడని మాత్రమే తెలిసింది. ఆయన పేరు గాని ఇతర వివరాలు చెప్పేవారు ఇప్పుడు ఎవరూ లేరు.

లిబర్టీ చౌరస్తాలో ఉన్న బోర్డు

బడే ఖాన్ సాహెబ్ బోథ్ లో చికిత్స తీసుకుంటున్న రోజుల్లోనే గణపతి నవరాత్రులు వచ్చాయి. బోథ్ లో ఉండే సంగీత ప్రియులు గణపతి మండపంలో ఆయన సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలచి ఉస్తాద్ ను పాడమని ఆహ్వానించారు. ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. బజారు వీధిలో చిన్నమల్లయ్య గారి గణపతి మండపం వద్ద ఉస్తాద్ సంగీత కచేరికి ఏర్పాట్లు జరిగినాయి. ఆయనది భారీ శరీరం. ఒక పలంగ్ మీద ఆయనను పడుకోబెట్టి మండపానికి తీసుకొచ్చారు. హార్మోని, తబలా స్థానిక కళాకారులే వాయించినారు. తమ్మలోళ్ల రాజేశ్వర్ రావు ఆ కచేరీలో తబలా వాయించినారని తెలిసింది. నిపుణులైన షాజిందాలు (వాద్య సహాయకులు) లేకపోయినా, పక్షవాత బాదితుడు అయినా మూడు గంటల పాటూ అప్రతిహాతంగా సంగీత రాగాలు, భజన్ లు, టుమ్రీలు వినిపించాడు ఉస్తాద్. దేశంలో ఉస్తాద్ సంగీత కచేరీల కోసం నెలల తరబడి వేచి చూసే పరిస్థితి ఆనాడు ఉండేది. భారీ పారితోషికాలు ఇచ్చేవారు నిర్వాహకులు.

బోథ్ సంగీత ప్రియులు మాత్రం అనాయాసంగా, ఉచితంగా గణపతి నవరాత్రుల సందర్భంగా ఆయన సంగీత కచేరీని వినే అదృష్టాన్ని పొందారు. ఒక ముసల్మాన్ ను గణపతి మండపానికి ఆహ్వానిస్తున్నాము అన్న భావన కార్యక్రమ నిర్వాహకులకు లేదు. తాను గణపతి మండపంలో పాడబోతున్నానన్న స్పృహ ఉస్తాద్ కు లేదు. ఇదే కదా భారతదేశం విశిష్టత. భిన్నత్వంలో ఏకత్వం అంటే. ఇది మన దేశ సమ్మిళిత సహజీవన సంస్కృతి. దేశం సంతరించుకున్న ఆ విలువలు ఇవ్వాళ విచ్ఛిన్నం అవుతున్నాయి. వీటిని కాపాడు కోవడం, సమున్నతంగా నిలబెట్టుకోవడం కాలం మన ముందు నిలిపిన సవాల్.

బోథ్ లో బడే ఖాన్ సాహెబ్ సంగీత కచేరీ గురించి మొదట చెప్పింది శ్రీ సామల సదాశివ గారు. ఆ తర్వాత ఈ ముచ్చటను ఆయన యాది, సంగీత శిఖరాలు పుస్తకాలలో కూడా ప్రస్తావించినారు. ఈ విషయాన్ని హైకోర్టు రిటైర్డ్ జడ్జి శ్రీ వామన్ రావు గారి ద్వారా నిజమేనని ధృవీకరించుకున్నాను.

ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ గురించి మరి రెండు ముచ్చట్లు. 1902 ఏప్రిల్ 2 న పంజాబ్ రాష్ట్రంలో పుట్టిన బడే ఖాన్ సాహెబ్ 23 ఏప్రిల్ 1968 న హైదరాబాద్ లో పక్షవాతం ముదిరి తనువు చాలించినాడు. హైదరాబాద్ లోనే ఆయన పార్థివ శరీరాన్నిపాయెగాల అధికారిక శ్మశాన వాటికలో ఖననం చేశారు. లిబర్టీ చౌరస్తా నుంచి బషీర్ బాగ్ చౌరస్తా వరకు రోడ్డుకు ఆయన పేరు కూడా పెట్టారు.

బోథ్ లో బడే ఖాన్ సాహెబ్ సంగీత కచేరీ గురించి మొదట చెప్పింది శ్రీ సామల సదాశివ గారు. ఆ తర్వాత ఈ ముచ్చటను ఆయన యాది, సంగీత శిఖరాలు పుస్తకాలలో కూడా ప్రస్తావించినారు. ఈ విషయాన్ని హైకోర్టు రిటైర్డ్ జడ్జి శ్రీ వామన్ రావు గారి ద్వారా నిజమేనని ధృవీకరించుకున్నాను. బడే ఖాన్ సాహెన్ సంగీత కచేరీ విన్న ఆనాటి శ్రోతలు ఎంత అదృష్టవంతులో! ఆ అవకాశాన్ని వారికి కల్పించిన బడే ఖాన్ సాహెబ్ సహృదయత అంత కంటే గొప్పది కదా.

కాలమిస్టు పరిచయం

శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ  స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మూడో భాగం బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం. నాలుగో భాగం స్వామి స్నేహితులు – మాల్గుడి క్రికెట్ క్లబ్. ఐదో భాగం కోడి – గంపెడు బూరు : మా చిన్నాయి చెప్పిన కథ. ఆరో భాగం ‘కాముని బొగుడ’ – ‘హోలీ కేళీ కోలాటం’. ఏడో భాగం సహజీవన సంస్కృతికి మారు పేరు మొహర్రం. ఎనిమిదో భాగం కుంటాల జలపాతం.  మీరు చదివింది తొమ్మిదో భాగం. వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article