Editorial

Saturday, May 11, 2024
కాల‌మ్‌"రింజిం రింజిం ఆదిలాబాద్.... బోథ్ వాలా జిందాబాద్" : శ్రీధర్ రావు దేశ్ పాండే శీర్షిక...

“రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్” : శ్రీధర్ రావు దేశ్ పాండే శీర్షిక ‘బొంతల ముచ్చట్లు’

‘బొంతల ముచ్చట్ల’కు స్వాగతం. ఈ శీర్షిక సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, తమ మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి. తొలివారం తమ గ్రామ పూర్వ పరాలతో ప్రారంభం.

శ్రీధర్ రావు దేశ్ పాండే 

కాలమిస్టు చిన్ననాటి ఛాయా చిత్రం

మా ఊరు ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్. మొదటి నుంచి తాలూకా కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం కూడా. ఒకప్పుడు బోథ్ పేరు బొంతల. బొంతల బోథ్ గా ఎప్పుడు మారింది? ఎందుకు మారింది? పరిశోధన చేయవలసిన అంశం. నా చిన్నప్పటి వరకు మా తండ్రుల తరం వారు బొంతలగానే పలికేవారు. మా మేన మామల ఊరు ఆదిలాబాద్ పోయినప్పుడు మమ్ములను బొంతల నుంచి వచ్చినారని అనేవారు. మా మేనమామ గోవిందరావు దేశ్ పాండే ఏకైక కుమారుడు సతీష్ చంద్ర చాలా కాలం బోథ్ లో వారి తాత రాంకిషన్ రావు దేశ్ పాండే గారి ఇంట్లో చదువుకున్నాడు. ఎనిమిదవ తరగతికి ఆదిలాబాద్ వచ్చేశాడు. ఆదిలాబాద్ లో దాదాపు ప్రతీ ఇంట్లో ఒకరికి సతీష్ అనే పేరు ఉంటుంది. కాబట్టి గుర్తు పెట్టుకోవడానికి మా మేనమామ కొడుకు సతీష్ ను బొంతల సతీష్ అనేవారు. ఇది 1970 దశకం నాటి ముచ్చట.

వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన్ శ్రీధర్ రావు దేశ్ పాండే గారు గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ  స్వయంగా పలు పుస్తకాలు రచించడమే కాకుండా తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్న సంగతి మీకు తెలుసు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులతో తమ ఊరి ముచ్చట్లను పంచుకునేందుకు గాను ఈ వారం నుంచి ఒక నూతన శీర్షికకు శ్రీకారం చుట్టారు. అదే ‘బొంతల ముచ్చట్లు’. ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య.

చానా ఏండ్ల కింద స్వాతంత్ర్యయానికి పూర్వం బొంబాయి ప్రావిన్స్ లో ప్లేగు వ్యాధి ప్రభలింది. బొంబాయి నుంచి నిజాం హైదరాబాద్ స్టేట్ లో ఉన్న మరాఠ్వాడ జిల్లాలకు, మరాఠ్వాడను ఆనుకుని ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ప్లేగు వ్యాధి వ్యాపిస్తే అది బోథ్ ను కూడా తాకింది. ఆనాటి పెద్దలు ఊరును వదిలి ఒకటి రెండేండ్లు కర్తారం (కరత్వాడ) ఊరికి దగ్గరలో పెద్దవాగు ఒడ్డున ఒకచోట తాత్కాలికంగా ఇండ్లు కట్టుకొని ఉన్నట్టు పెద్దలు చెప్పగా విన్నాను. దాన్ని ‘చిన్న బొంతల’ అన్నారు. చిన్న బోథ్ అనలేదు. అంటే ప్లేగు వ్యాధి వచ్చేనాటికి బొంతల బోథ్ గా మారలేదు అని అనుకోవాలి. ప్లేగు ఏ సంవత్సరంలో వచ్చింది అని కొంత పరిశోధన చేస్తే.. 1939 నుంచి 1945 వరకు రెండు దశలలో వచ్చిందని తెలుస్తున్నది. ఆనాటికి కూడా బొంతల బోథ్ గా పేరు మార్పు జరగలేదు. ఆ తర్వాతనే జరిగినట్టు అనుకోవాలి. పేరు మార్పు ఎందుకు జరిగినట్టు? ఎవరైనా పెద్దలు చెపితే తెలుసుకోవాలని ఉన్నది.

బోథ్ పేరు రెవెన్యూ రికార్డుల్లో ఎప్పటి నుంచి ఉన్నది అన్నది తెలుసుకోవాలంటే పాత దస్త్రాలు వెతకవలసి ఉంటుంది. అవన్నీ ఉర్దూలో ఉంటాయి. ఆ దస్త్రాలను బయటకి తీయడం ఒక ఎత్తు అయితే వాటిని చదివి చెప్పే వారిని వెతుక్కోవడం ఒక ఎత్తు. అయితే ఈ మధ్య హైకోర్టు రిటైర్డ్ జడ్జి శ్రీ వామన్ రావు దేశ్ పాండే గారిని ఈ విషయమై సంప్రదించాను. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆనాటి పాత రెవెన్యూ రికార్డుల్లో కూడా బోథ్ అనే పేరు మొదటి నుంచి ఉందని, జనం మాత్రం బొంతల అనేవారని చెప్పారు.

పెద్ద వాగు పుట్టిన నిగ్ని కంటెగామ గుట్టలు

సముద్ర మట్టానికి సుమారు 1440 అడుగుల ఎత్తులో ఇట్లా ప్రకృతి రమణీయత వెల్లి విరిసే జాగలో ఈ ఊరును పొందిచ్చినారు మా ఊరి పూర్వీకులు.

ఇక ఈ బొంతల .. బోథ్ పేర్ల చర్చ మరెప్పుడైనా చేస్తాను. బోథ్ అందమైన ఊరు. గుట్టల నడుమ, అడవి మధ్యన, చుట్టూ జలపాతాల హోరు, ఊరికి ఉత్తరాన బోథ్ పక్క నుంచి జీవనదిలా పారే పెద్దవాగు, పెద్దవాగు ఒడ్డున రెండు మూడు కిలోమీటర్ల పొడవున వందల ఎకరాల్లో విస్తరించి వేల సంఖ్యలో ఉన్న ఊరుమ్మడి మాముళ్ళు (మనిషి స్వార్థానికి మాయమైన మామిడి తోపు), అటెన్క పెద్దార్ల గుట్ట, పాలవాగు, పశ్చిమాన కండ్రే వాగు, మరింత పశ్చిమానికి పోతే సహ్యాద్రి పర్వత శ్రేణిలో భాగమైన నిగ్ని, కంటెగామ గుట్టలు, కిందకు తూర్పుకు పోతే పొచ్చెర గుండం, ఇంకా కిందకు పోతే కుంటాల సోమన్న గుండం, దక్షిణానికి ధన్నూర్ గుట్టలు.. సముద్ర మట్టానికి సుమారు 1440 అడుగుల ఎత్తులో ఇట్లా ప్రకృతి రమణీయత వెల్లి విరిసే జాగలో ఈ ఊరును పొందిచ్చినారు మా ఊరి పూర్వీకులు.

చలికాలం ఎముకలు కొరికే చలి, ఎండాకాలం హిల్ స్టేషన్ లో ఉండే చల్లదనం, వానాకాలం ముసుర్లు పట్టే వానలు ఉండే ప్రాంతం కనుక కరువు కాటకాలు ఎన్నడూ దరి చేరని ప్రాంతం ఇది.

పొచ్చెర గుండం

బోథ్ పెద్ద బడి

బోథ్ చుట్టుపక్కల అనేక ఆదివాసీ, గిరిజన ఊర్లు. అక్కడి జనం ప్రతీ మంగళవారం బోథ్ లో జరిగే అంగడికి అమ్మకాలకు, కొనుగోళ్లకు బోథ్ కే వస్తారు. హైస్కూల్ చదువు కోసం కూడా ఆ ఊర్ల పిల్లలు బోథ్ కే వచ్చేవారు. ఇప్పుడు చాలా గ్రామాల్లో హై స్కూళ్ళు ఏర్పాటు అయినందున విద్యార్థులు రావడం లేదు.

తూర్పున కౌఠ, సోనాల, పొచ్చెర, కూచులాపూర్; పశ్చిమాన కర్తారం, మర్లపెల్లి, పట్నాపూర్; ఉత్తరాన కన్గుట్ట, పార్డి, చింతల్ బోరి; దక్షిణాన ధన్నూర్, తేజాపూర్, పిప్పల్ ధరి .. ఇవి కాక ఇంకా అనేక గోండు, కోలాం, మథురల గూడాలు, పల్లెలు ఉన్నాయి. వాతావరణ మార్పులు భూగోళాన్ని ఎట్లా అతలాకుతలం చేస్తున్నదో ప్రస్తుతం అదే పరిస్థితి బోథ్ లో కూడా ఉన్నది.

బోథ్ దారిలో బోడుగు పూల వనం

హైదరాబాద్ – నాగ్ పూర్ జాతీయ రహదారిపై నిర్మల్ దాటినాక సహ్యాద్రి పర్వత శ్రేణిలో భాగంగా ఉన్న మహబూబ్ ఘాట్లు ఎక్కిన తర్వాత ఉన్న ప్రాంతం కనుక బోథ్ ప్రాంతం వారిని “గట్టు మీదోల్లు” అంటారు. నిర్మల్ వాళ్ళు “గట్టు కిందోళ్ళు”. జాతీయ రహదారిలో నేరేడిగొండ దాటిన తర్వాత ఎడమవైపున బోథ్ మోడ్ (మలుపు) వస్తుంది. అక్కడి నుంచి 11 కిమీ మోదుగు పూల ఎరుపును పులుముకున్న అడవిని (ఇప్పుడు ఈ అడవి కూడా మాయమయ్యింది), పొచ్చెర గుండాన్ని దాటుకొని ప్రయాణిస్తే బోథ్ చేరుకుంటాము.

ఇంతటి ప్రాకృతిక అందాలకు నిలయమైన జాగాలో బోథ్ / బొంతల అనే ఊరును పొందిచ్చిన మా ఊరి పూర్వీకులకు, వారి సౌందర్య దృష్టికి వందనాలు.

నేరేడిగొండ వద్ద జాతీయ రహదారికి కుడి వైపు తిరిగి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే కుంటాల జలపాతాన్ని చేరుకుంటాము. ఇప్పుడు కొత్త జాతీయ రహదారి నిర్మించడం వలన ప్రయాణికులు మహబూబ్ ఘాట్ రోడ్ లో ప్రయాణించవలసిన అవసరం తీరిపోయింది. అయితే వారు సహ్యాద్రి పర్వత శ్రేణుల అందాలను, షేక్ సాబ్ లొద్ధి, మహబూబ్ ఘాట్ అందాలను వీక్షించే అవకాశాన్ని కోల్పోయినారు. ఆర్టీసీ ఎర్ర బస్సులో ప్రయాణించే వారికి మాత్రం ఆ అదృష్టం ఇంకా ఉంది.

ఇటువంటి ప్రాకృతిక అందాలకు నిలయమైన జాగాలో బోథ్ / బొంతల అనే ఊరును పొందిచ్చిన మా ఊరి పూర్వీకులకు, వారి సౌందర్య దృష్టికి వందనాలు. అంటువంటి ఊరిలో పుట్టినందుకు నేను గర్వ పడుతున్నాను.

చలం, జమున నటించిన “మట్టిలో మాణిక్యం” సినిమాలో సినారె రాసిన “రింజిం రింజిం హైదరబాద్ – రిక్షా వాలా జిందాబాద్” బాణీలో ఆ పాట పాడేవాడు.

బోథ్ అందాలను వర్ణిస్తూ మా చిన్నప్పటి దోస్తు నమిలికొండ చంద్రమోహన్ ఒక పాట రాసి అనేక వేదికల మీద పాడేవాడు. చలం, జమున నటించిన “మట్టిలో మాణిక్యం” సినిమాలో సినారె రాసిన “రింజిం రింజిం హైదరబాద్ – రిక్షా వాలా జిందాబాద్” బాణీలో ఆ పాట పాడేవాడు. ఆ పాటను వాడు భద్రపరచక పోవడంతో నా చిన్ననాటి మరో దోస్తు వైద్య సురేష్ యాదికి ఉన్నంత వరకు రాసి పంపినాడు. వాడికి కృతజ్ఞతలు.

రింజిం రింజిం ఆదిలాబాద్
బోథ్ వాలా జిందాబాద్
మూడు రస్తాలు కలిసే చోట
బోథ్ రస్తా బలాదూర్ ..

రింజిం రింజిం ఆదిలాబాద్
బోథ్ వాలా జిందాబాద్

అటు చూస్తే పెద్దార్ల గుట్ట
ఇటు చూస్తే ధన్నూరు గుట్ట

తళతళ మెరిసే పంచాయతి సమితి
దాటితే నల్లా టాకీ..

రింజిం రింజిం ఆదిలాబాద్
బోథ్ వాలా జిందాబాద్

పాట అసంపూర్ణం. జ్ఞాపకాలు పదిలం.
మరి, వచ్చేవారం ‘బొంతల ముచ్చట్ల’తో మళ్ళీ కలుద్దాం…

శ్రీధర్ రావు దేశ్ పాండే ఇ -మెయిల్ : irrigationosd@gmail.com

 

More articles

8 COMMENTS

  1. అభినందనలు సర్.
    ఇప్పటి తరానికి మీ విలువైన జ్ఞాపకాలు చాలా అవసరం. ఆ చూపుతో బొంతలను అర్థం చేసుకుంటే పరిశోధించవలసిన అంశాలు చాలానే ఉంటాయి.

  2. బోథ్..బొంతల.. గురించి చదువుతుంటే చాలా సంతోషంగా ఉంది… చాలా రోజులుగా నా మనసు లో మెదులుతుంది. బోథ్ గురించి ఏదైనా రాయాలి అని..ఒక రచయిత్రి తో చెప్పాను కూడా… మా ఊరి గురించి రాయాలని ఉంది అని. ఆవిడ తప్పకుండా రాయండి అని సలహా ఇచ్చింది.. నేనింకా అదే ఆలోచన లో ఉన్న. ఇప్పుడు ఇది చదివిన తర్వాత కొత్త టాపిక్ వెతుకుత.😁👍

  3. అభినందనలు. మీ విలువైన జ్ఞాపకాలు ఇప్పటి తరానికి చాలా అవసరం. కావున ఇంకా మీరు చెప్పే విషయాలను లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉన్నది.

  4. అభినందనలు సర్, బొంతల ముచ్చట్లు వినక చాలా రోజులైంది సర్, మీ పదాల వర్ణన చాలా బాగుంది, రోజు మనం మాట్లాడుకొను వ్యవహార భాష/యాస లాగా పొందుపరచి ఇలాంటి వ్యాసాన్ని మునుముందు కొనసాగించి మన బొంతల ప్రాంతానికి ప్రాచుర్యం కల్పించాల్సిందిగా సవినయంగా కోరుచున్నాము సర్, మరియు మీరు మన బొంతాల ప్రాంతాన్ని ప్రభుత్వ సహాయంతో అభివృద్ధి దిశగా నీటి పారుదల రంగంలో కుప్టి ప్రాజెక్ట్ ని పూర్తి చేసి రివర్స్ వాటర్ తో సస్య సామలం చేయించ గలరని మన ప్రాంత ప్రజల ప్రగాఢ నమ్మకం సర్, ధన్యవాదాలు సర్. కె. సాయన్న, కనుగుట్ట.

  5. అభినందన సర్ మన బొంతల గురించి మీరు రాసిన అందమైన వాక్యాలు కళ్ళ ముందు ఉన్నట్టే కనబడుతున్నాయి సార్ ( మామిడితోపులు– మోదుగపూలు )

  6. బొంతలు ముచ్చట్లు శీర్షికతో మాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. థాంక్యూ

  7. స్పందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ శీర్షిక మీకు నచ్చుతున్నందుకు సంతోషం.

  8. మీ బొంతల వర్షాకాలం లో చూడ తరమా
    ఎన్నెన్నో అందాలు మై మరిపించే అడవి అందం
    మీ మాటల్లో చదివాం అభినందనలు రావు గారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article