Editorial

Friday, April 26, 2024
కాల‌మ్‌సింగారవ్వ : నిద్ర పట్టనీయని మంచి పుస్తకం

సింగారవ్వ : నిద్ర పట్టనీయని మంచి పుస్తకం

‘మంచి పుస్తకం’ఒక సంపద. తెలుపు అందిస్తున్న సగౌరవ శీర్షిక. ఈ పుస్తక పరిచయ పరంపరలో ‘సింగారవ్వ’ పద్నాలుగో పుస్తకం. “దీన్నిచదివాక నాలాగానే నిద్ర లేని రాత్రులకు మీరు కూడా లోనవుతారేమో” అంటున్నారు అనువాదకులు సురేష్ గారు.

అవి నేను వాసన్ సంస్థలో కొత్తగా చేరిన రోజులు, 2002 కావచ్చు. మా సంస్థలో చాలామందిమి సర్వేలో వారం రోజులపాటు శిక్షణ కోసం అనంతపురంలోని ఆర్‌డిటి సంస్థకి వాహనాలలో బయలుదేరాం. ఆ ప్రయాణంలో స్నేహితుడు రవీంద్రకి రాణి (హెల్డా గ్రేస్ కొయిలో) ఇచ్చిన ‘Singarevva and the Palace’ (రచయిత Chandrasekhar Kambar) అన్న పుస్తకం నా చేతిలో ఉంది. దానిని చదవటం మొదలుపెట్టిన తరవాత వదిలిపెట్టలేకపోయాను. ఆ ప్రయాణంలోనే ఆ పుస్తకం చదవటం పూర్తి చేశాను. అందులోని ప్రధాన పాత్ర అయిన సింగారవ్వ నన్ను ఎంతగానో వెంటాడింది.

ఉత్తర కన్నడ బెళగావి వర్షాధార ప్రాంతంలోని శివపుర గ్రామానికి చెందిన కథ ఇది. ప్రధాన పాత్ర సింగారవ్వ. ఆమె అందమైనది, సుకుమారమైనదే కాకుండా ఎంతో దయాళువు. ఆమె జీవితంతో ముగ్గురు మగాళ్లు ఆడుకున్నారు. అంతేకాదు, దేవుడు కూడా ఆమెను వంచించాడని సింగారవ్వ బాధపడుతుంది.

చంద్రశేఖర కంబార కన్నడలో రచించిన సింగారెవ్వ మత్తు అరమణి అన్న ఈ పుస్తకం 1982లో ప్రచురితం అయ్యింది. లక్ష్మి చంద్రశేఖర్ దీనిని ఇంగ్లీషులోకి అనువదించారు. 2002లో ఢిల్లీకి చెందిన కథ సంస్థ ద్వారా ఇది ఇంగ్లీషులో ప్రచురితం అయ్యింది.

2016లో ఈ పుస్తకం తెలుగులో కావ్య పబ్లిషింగ్ హౌస్ ద్వారా ప్రచురితం అయ్యింది. అంటే, నేను ఇంగ్లీషులో చదవటానికి, అనుమతులు పొంది, అనువాదం చెయ్యటానికి, ప్రచురణకర్త ముందుకు వచ్చి ప్రచురించటానికి మధ్య అన్ని సంవత్సరాలు గడిచిపోయాయి.

మిత్రుల ద్వారా కంబార చిరునామా పొంది ఆయనకి ఉత్తరం రాస్తే ఆయన వెంటనే ఒప్పుకుంటూ ఉత్తరం రాశారు. చాలాకాలం ఆ ఉత్తరం అలా ఉండిపోయింది. అనువాదం పూర్తి చేసి పుస్తకాన్ని ప్రచురించవలసిందిగా చిరకాల మిత్రుడు సుబ్బయ్యని అడిగాను. ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. కంబారతో మరొకసారి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి తెలుగు అనువాదానికి కావ్య పబ్లిషింగ్ హౌస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ క్రమంలో లక్ష్మి, శ్యామలల ద్వారా పరిచయం అయిన కన్నడ రచయిత ఎం ఎస్ శ్రీరామ్‌ని తెలుగు అనువాదం సరిచూడవలిసిందిగా కోరాను. బెంగుళూరు ఐఐఎంలో పని చేస్తున్న ఆయన ఎంతో ఓపికగా నా అనువాదాన్ని చదివి, ఎన్నో విలువైన సూచనలు చేశారు. అంతేకాకుండా కంబారని, ఆయన రచనలని పరిచయం చేస్తూ తెలుగు అనువాదానికి ముందుమాట రాశారు.

ఉత్తర కన్నడ బెళగావి వర్షాధార ప్రాంతంలోని శివపుర గ్రామానికి చెందిన కథ ఇది. ఫ్యూడల్ వ్యవస్థ అంతరించిపోతున్న కాలం. ప్రధాన పాత్ర సింగారవ్వ. ఆమె అందమైనది, సుకుమారమైనదే కాకుండా ఎంతో దయాళువు. మనుషులే కాదు ఏ జీవి కష్టంలో ఉన్నా చలించిపోతుంది. ఆమె జీవితంలో ముగ్గురు మగాళ్లు – తండ్రి, భర్త, ప్రియుడిగా మారిన చిన్నప్పటి పనివాడు. ఈ ముగ్గురూ ఆమె జీవితంతో ఆడుకున్నారు. అంతేకాకుండా దేవుడు కూడా ఆమెను వంచించాడని సింగారవ్వ బాధపడుతుంది.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేక, భేషజాలకు పోయి చితికిపోయి, నలిగిపోయిన ఫ్యూడల్ స్వభావం ఉన్న అనేక కథలలో దేశాయిది ఒక కథ.

సింగారవ్వ పుట్టిన ఊరు నందగావి. తండ్రి పండరి గౌడ ఊరి మోతుబరి. డబ్బంటే అమితమైన వ్యామోహం. దాని కోసం ఏమైనా చేస్తాడు. సంతానం కోసం నలుగురిని పెళ్లాడాడు. చాలా కాలానికి రెండవ భార్యకి సింగారవ్వ పుట్టింది. నలుగురు అమ్మల మధ్య అల్లారుముద్దుగా పెరుగుతున్న సింగారవ్వని ఆస్తి కోసం చనిపోయిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడంటే తండ్రి ఎంతటి నికృష్టుడో అర్థమవుతుంది. శివపుర దేశాయి కూడా త్వరలో చనిపోతాడని, కూతురు విధవ అయితే ఆ ఆస్తి అంతా తనకి దక్కుతుందని ఆశపడి సింగారవ్వని దేశాయికి ఇచ్చి పెళ్లి చేసిన స్వభావం అతడిది. దేశాయి చనిపోడు. కానీ, సింగారవ్వకి పిల్లలు పుట్టరు. సింగారవ్వకి పెళ్లి అయిన తరవాత గౌడకి కొడుకు పుడతాడు. తన కొడుకుని పిల్లలు లేని దేశాయి దత్తత తీసుకుంటే ఆ ఆస్తి అంతా తనకే వస్తుందని గౌడ ఎత్తుగడ.

పోతే దేశాయి. ఇతను శివపుర మహారాజు. మైసూరు కోట అంత పెద్దది కాకపోయినా ఆ ఊరికి అది పెద్ద కోటే. ఒకప్పుడు పద్నాలుగు గ్రామాలలో ఇరవై రెండు వేల ఎకరాలు దేశాయిల కింద ఉండేది. యుద్ధాలు, వేటల వీర గాథల గత చరిత్ర ఉంది. అవన్నీ గతించిపోయి అర్భకుడైన సరిగమ దేశాయి మిగిలాడు. అతడికి నాటకాల (బయలాట) పిచ్చి. ఊరిలో పరంశెట్టి దగ్గర అప్పులు చేసే పరిస్థితికి వస్తాడు. అప్పు కింద మిగిలిన భూములు, కోటని ఎట్లా చేజిక్కించుకుందామా అని పరంశెట్టి చూస్తూ ఉంటాడు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేక, భేషజాలకు పోయి చితికిపోయి, నలిగిపోయిన ఫ్యూడల్ స్వభావం ఉన్న అనేక కథలలో దేశాయిది ఒక కథ. దేశాయి తల్లి చనిపోతే, ఆమె దినానికి ఎంతో కష్టపడి కొంత డబ్బు సమకూర్చుకుంటారు. ఆ సమయంలో ఊరిలో ఏటా జరిగే కార్యక్రమానికి మొదటి చందా కోసం ఊరి పెద్దలు వస్తారు. ఆ వచ్చిన వాళ్లు ఎంత ఇచ్చారని దేశాయి అడుగుతాడు. మీరు ఇచ్చినంత ఇస్తామని తమ మాటలతో దేశాయిని వాళ్లు రెచ్చగొడతారు. దాంతో తల్లి దినం కోసం ఉంచిన డబ్బునంతా చందాగా ఇచ్చేస్తాడు దేశాయి.

పిల్లలు పుట్టటానికి సింగారవ్వ మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు. అయితే భర్త నపుంసకుడైతే ఆమె మాత్రం ఏం చేయగలుగుతుంది.

కొడుకుని కంటే తన నడుముకి ఉన్న బంగారు వడ్డాణం ఇచ్చేస్తానని సింగారవ్వ అత్త తొందర పెడుతూ ఉంటుంది. పిల్లలు పుట్టటానికి సింగారవ్వ మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు. (కోట ఆచారానికి వ్యతిరేకంగా అర్థరాత్రి జంగమ దేవరని లోపలికి రానిచ్చి చిక్కుల్లో పడుతుంది కూడా.) అయితే భర్త నపుంసకుడైతే ఆమె మాత్రం ఏం చేయగలుగుతుంది. స్త్రీ తొడలు చూడాలని ఉండటం దేశాయి బలహీనత, కానీ వాటిని చూస్తేనే ఉద్రేకానికి లోనయ్యి మూర్ఛపోతాడు.

సింగారవ్వ జీవితంలో మూడవ మగవాడు మార్యా, ఆమె పుట్టిన ఊరు నందగావికి చెందినవాడు. గౌడ దగ్గర పని చేస్తూ ఉంటాడు. అందరితో మంచిగా ఉన్నట్టే అతడితో కూడా సింగారవ్వ మంచిగా ఉంటుంది. అతడు తినటానికి రొట్టెలు చాచి దొంగచాటుగా అతనికి చేరవేస్తుంది. అయితే మార్యాకి ఆమె మీద ఇష్టం లాంటిది ఉంటుంది. ఒకసారి ఆమె కోసమని మామిడికాయలు కోసుకుని వచ్చిన మార్యా వాటిని ఇస్తూ ఆమెను బుగ్గ మీద కొరికినట్టుగా ముద్దు పెట్టుకుంటాడు. దానికి భయపడిపోయిన సింగారవ్వకి జ్వరం వస్తుంది. సింగారవ్వ తండ్రికి, మార్యాకి మధ్య ఒకలాంటి వైరం ఉంటుంది. మార్యా కనపడితే చాలు అతడిని కొట్టటానికి గౌడ తయారవుతాడు. సింగారవ్వకి తెలియదు గానీ దానికి కారణం మార్యా తల్లికీ, గౌడకీ మధ్యనున్న అక్రమ సంబంధం. ఒకసారి వాళ్లిద్దరూ మార్యాకి దొరికిపోతారు. ఆ క్షణంలో మార్యా కత్తితో దాడి చెయ్యగా గౌడ తప్పించుకుంటాడు కానీ తల్లి చచ్చిపోతుంది. ఆ హత్యా నేరంతో మార్యా ఊళ్లోంచి మాయమైపోతాడు.

అలా మాయమైన మార్యా శివపురలో ప్రత్యక్షమౌతాడు. సింగారవ్వ జంగముడిని అర్థరాత్రి కోటలోకి రానిచ్చినప్పుడు అనుమానం వచ్చిన దేశాయి తుపాకీతో హడావిడి చేస్తాడు. చాపలో చుట్టి ఉంచిన జంగమ గుండె ఆగి చస్తాడు. ఆ శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా మాయం చెయ్యటానికి మాల పల్లి నుంచి ఒక వ్యక్తిని పిలవగా అతను మార్యాగా తేలతాడు. ఆమె బలహీనతని ఆసరాగా చేసుకుని తన కోరికని తీర్చమంటాడు మార్యా. తరవాత దేశాయి దగ్గర పనివాడిగా, నమ్మకస్తుడిగా ఉంటూ సింగారవ్వని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అయితే ఒకసారి ఆమెకి బాగా జ్వరం వచ్చినప్పుడు మార్యా పశ్చాత్తాపానికి లోనై ఏడుస్తాడు, ఆమెను ఇక బాధ పెట్టనని మాట ఇస్తాడు.

తన బాధలన్నిటినీ మరిచి భర్తతో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తుంది సింగారవ్వ. బయలాట రిహార్సల్స్‌కి వెళ్లినా ఇంటికి త్వరగా వచ్చేయమని, తాగే సారా ఏదో ఇంటి దగ్గరే ఏర్పాటు చేస్తానని అంటుంది. మొదటి రోజు దేశాయి అలాగే చేస్తాడు కానీ రెండవ రోజు కుక్క తోక వంకర లాగా ప్రవర్తిస్తాడు. తాగో, తొడలు చూసో మూర్ఛపోయిన దేశాయిని మార్యా ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ సమయంలో విసిగిపోయి తెగించిన సింగారవ్వ మూర్ఛపోయిన దేశాయిని మంచం మీద నుంచి కిందకి తన్ని మార్యా చేయి అందుకుంటుంది.

సింగారవ్వ ప్రేమను చూసిన తరవాత మార్యాలో ఎంతో మార్పు వస్తుంది. వాగు ప్రవాహానికి రాయి కాస్తా గులకరాయిగా మారి నునుపు తేలినట్టు మొరటుగా ఉండే మార్యా ఆమె ప్రేమలో సున్నితుడౌతాడు.

సింగారవ్వ ప్రేమను చూసిన తరవాత మార్యాలో ఎంతో మార్పు వస్తుంది. వాగు ప్రవాహానికి రాయి కాస్తా గులకరాయిగా మారి నునుపు తేలినట్టు మొరటుగా ఉండే మార్యా ఆమె ప్రేమలో సున్నితుడౌతాడు. ఆమె మర్యాదకి భంగం కలగకుండా చూసుకుంటాడు, ఆమె పెదవి విప్పకుండానే ఆమెకి ఏం కావాలో తెలుసుకుని తీరుస్తాడు. తల్లితో అక్రమ సంబంధం కారణంగా గౌడ అంటే మార్యాకి కోపం ఉన్నా దానికి బదులుగా సింగారవ్వ మీద ప్రతీకారం తీర్చుకోవాలని అతడు ఎన్నడూ అనుకోలేదు. అతడిది ఆకర్షణతో కూడుకున్న ఒకవైపు మొరటు ప్రేమ. కానీ, సింగారవ్వ వైపు నుంచి కూడా ప్రేమ అందేసరికి అతడు పూర్తిగా మారిపోయాడు. అతడి ప్రేమలో కొద్ది రోజులు మాత్రమే సింగారవ్వ సంతోషంగా ఉంది.

సింగారవ్వ గర్భవతి అవుతుంది, దానికి కారణం తాను కాదని దేశాయికి తెలుసు. అతడు ఎన్ని మాటలు అన్నా ఓపికగా భరించినా ఒక రోజు అగ్ని పర్వతం లాగా బద్దలవుతుంది. ఆ తరవాత ఉత్తరం రాసి దేశాయి అత్మహత్య చేసుకోవటం, జైలులో పిల్లవాడిని కని సింగారవ్వ చనిపోవటం, పాముతో కరిపించుకుని మార్యా చనిపోవటం నాటకీయంగా జరిగిపోతాయి.

సింగారవ్వ కొడుకు రవి చంద్ర కోటను అమ్మాలనుకుంటున్నాడని, ఆలోగా శీనింగవ్వ నుంచి వివరాలు తెలుసుకుని నవల రాయమని అదే ఊరికి చెందిన రచయితను అతని మిత్రుడు ప్రోత్సహించటంతో ఊరికి వస్తాడు. ఫ్లాష్‌బాక్‌లో నడిచే ఈ కథని ప్రధానంగా శీనింగవ్వ మాటలలో రచయిత చెబుతాడు. మధ్య మధ్యలో ఆనాటి ఘటనలకు సంబంధించి తన జ్ఞాపకాలను ప్రస్తావిస్తూ ఉంటాడు.

జానపద శైలిలో రచనలు చేయటం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన చంద్రశేఖర ప్రత్యేకత. ఈ నవల చదివితే ఆ విషయం బాగా తెలుస్తుంది.

సింగారవ్వ ఈడుదే అయిన శీనింగవ్వ ఆమె పుట్టింటిలో పని మనిషి. దేశాయితో పెళ్లి తరవాత సింగారవ్వ తోపాటు శివపుర వచ్చి ఆమెకు అన్ని విధాలుగా తోడు నీడగా ఉంటుంది. ఆమెది మరొక విషాద గాథ.

కోటని అమ్ముదామని అనుకున్న రవి చంద్ర, ఊరి వాళ్ల విజ్ఞప్తి మేరకు దానిలో ఏ మార్పులూ చెయ్యకుండా బడి కోసం వాడుకోటానికి అనుమతిస్తాడు. పిల్లల కోసం పరితపించిన సింగారవ్వ, ఒక్కొక్క స్తంభానికి పది మంది పిల్లల నవ్వులు, అరుపుల, అల్లరిని చూసి సంతోషిస్తుందని, ఆమె ఆత్మ వాళ్లను దీవిస్తుందని రచయిత చెపుతాడు.

ఈ నవలని సినిమా కోసం రాసినట్టు ఉంది అని ప్రచురణకర్త అయిన సుబ్బయ్య అంటాడు. కవి, నాటక కర్త, నవలాకారుడు, జానపద వాగ్గేయకారుడు అయిన చంద్రశేఖర కంబార స్క్రీన్ ప్లే రచయిత కూడా అయినందువల్ల ఆ నైపుణ్యం ఇక్కడ కూడా కనపడుతూ ఉండవచ్చు (ఈ నవలని కన్నడలో సినిమాగా తీశారు). జానపద శైలిలో రచనలు చేయటం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన చంద్రశేఖర ప్రత్యేకత. ఈ నవల చదివితే ఆ విషయం బాగా తెలుస్తుంది.

ఈ నవలని తెలుగు పాఠకులు బాగా ఆదరించారు. దీని ముఖచిత్రం కూడా చాలామందికి నచ్చింది.

సింగారవ్వ ప్రపంచం లోకి తొంగి చూడాలనుకునే వాళ్లు 176 పేజీలు ఆ పుస్తకాన్ని (110 రూపాయలు) ఇక్కడ క్లిక్ చేసి నుక్కోవచ్చు, నాలాగానే నిద్ర లేని రాత్రులకు మీరు కూడా లోనవుతారేమో …

కాలమిస్టు పరిచయం

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. ‘నాకు నేను తెలిసే’ నాలుగవది. సమ్మర్‌హిల్‌ ఐదవది. ఆరవది ‘అనార్కో’. ఏడవది ‘జీవన గీతం’ . ఎనిమిదవది ‘యుద్ధోన్మాది అమెరికా’. తొమ్మిదవది ‘బార్బియానా బడి పిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం’. పదవది ‘ప్రకృతి నేర్పిన పాఠాలు’. పదకొండవది పరుసవేది. పన్నెండవది ‘శివమెత్తిన నది’. పదమూడవది ఒక రోజా కోసం. చిన్నవి పెద్దవి కలిపి వారు వంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు ఆయా పుస్తకాలను ఇలా వారానికి ఒకటి చొప్పున మీకు పరిచయం చేస్తారు. 

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article