Editorial

Saturday, April 27, 2024
కాల‌మ్‌పరుసవేది : ఈ వారం మంచి పుస్తకం

పరుసవేది : ఈ వారం మంచి పుస్తకం

‘మంచి పుస్తకం’ఒక సంపద.
కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో అత్యంత పాఠకాదరణ పొందిన ‘పరుసవేది’ పదకొండవది.

నా మొదటి అనువాదం ‘గడ్డిపరకతో విప్లవం’ ప్రచురితం అయిన 17 ఏళ్ల తరవాత ‘పరుసవేది’ వచ్చింది. ఇది Paulo Coelho రాసిన The Alchemist నవలకి నేను చేసిన తెలుగు అనువాదం. ఇన్నేళ్ళలో ఎవరో ఒకరు ‘మీ ఫలానా అనువాదం చదివాను, చాలా బాగుంది,’ అంటూ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఆ విధంగా నా అనువాదాలు అన్నీ నాకు తృప్తినిచ్చినవే. అయితే వాటిల్లో అత్యంత ఆదరణ పొందినవి ‘పరుసవేది’, ‘గడ్డిపరకతో విప్లవం’ పుస్తకాలు.

ది ఆల్కెమిస్ట్‌ని రచయిత పోర్చుగీసు భాషలో O Alquimista పేరుతో రాశాడు. దీనిని ఇంగ్లీషులోకి అలాన్ ఆర్. క్లార్క్ అనువదించారు.

కల వచ్చిన చోటే నిధి ఉంది

మత గురువుని చెయ్యాలని తల్లిదండ్రులు అనుకుంటే అందుకు విరుద్ధంగా గొర్రెల కాపరి అవుతాడు శాంటియాగో అనే యువకుడు. గొర్రెలతో మమేకమై అవే లోకంగా వాటి వెంట తిరుగుతూ, పుస్తకాలు చదువుకుంటూ గడిపే శాంటియాగోకి పిరమిడ్లు దగ్గర నిధి ఉన్నట్టు కల వేధిస్తుంటుంది. చివరికి అతడు తన గొర్రెలను అమ్మేసి ఆ నిధిని అన్వేషిస్తూ బయలుదేరతాడు. నిధిని కనుక్కునే వరకు అతనికి ఎదురైన అనుభవాలే ఈ నవల.

ఈ ప్రయాణంలో అతనికి మోసగాళ్లు, మార్గదర్శకులు కలుస్తారు. అతనికి ప్రేమ అంటే ఏమిటో తెలిసి వస్తుంది. ఉమిం, తురిం అని మహిమగల రాళ్లు దొరుకుతాయి. లోహాన్ని బంగారంగా మార్చటానికి సాధన చేస్తున్న వాళ్లల్లో వివిధ స్థాయిలలో ఉన్నవాళ్లని, దానిని సాధించిన పరుసవేదిని కలుస్తాడు. చివరికి, అతడికి కల వచ్చిన చోటే నిధి ఉందని తెలుసుకుని అక్కడికి తిరిగి వచ్చి నిధిని పొందుతాడు.

2005లో అనుకుంటాను, ఈ పుస్తకంలోని క్వోట్ ఒక పత్రికలో చదివాను. అది నచ్చి ఇంగ్లీషు పుస్తకం కొనుక్కుని చదివాను. నన్ను ఇది ఎంతగానో ఆకట్టుకుంది. అనువాదం చెయ్యాలనిపించింది.

అనేక విషయాలు ‘చెప్పటానికి’ వివిధ ఘటనలను గుదిగుచ్చిన పుస్తకం లాగా ఉందని కొంతమందికి అనిపించవచ్చు. కానీ, అందరినీ ఎంతో ఆసక్తిగా చదివిస్తుంది. మళ్లీ మళ్లీ చదివించే గుణం కూడా ఈ పుస్తకానికి ఉంది. దేని నుంచి అయినా ఎవరికి కావలసిఉంది వాళ్లు తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఇందులో ఏదో ఒకటి దొరకటమే దీని విశిష్టత అనుకుంటున్నాను. కొంతమందికి ఇది ట్రావెలాగ్ అనిపిస్తే, కొంతమందికి జీవితాన్ని మార్చివేసే పుస్తకంగా అనిపించింది.

‘Tell your heart that the fear of suffering is worse than the suffering itself. And that no heart has ever suffered when it goes in search of its dreams…’ అన్న ఈ పుస్తకంలోని క్వోట్ ఒక పత్రికలో (2005లో అనుకుంటా) చదివాను. అది నచ్చి ఇంగ్లీషు పుస్తకం కొనుక్కుని చదివాను. నన్ను ఇది ఎంతగానో ఆకట్టుకుంది. అనువాదం చెయ్యాలనిపించింది. అనుమతి కోసం రచయితకు ఈ-మేల్ చేస్తే, వారి ఏజెంటు నుంచి బదులు వచ్చింది. అనువాదకులతో కాకుండా ప్రచురణకర్తలతో ఒప్పందం కుదుర్చుకుంటామని వాళ్లు రాశారు. ఎంతో ఆలోచించి, చివరికి ‘మంచి పుస్తకం’ ద్వారా తెలుగు అనువాదానికి ఒప్పందం కుదుర్చుకున్నాం.

గడ్డిపరకతో విప్లవం’ నిలకడైన గుర్తింపుని ఇస్తే ‘పరుసవేది’ ఇన్‌స్టాంట్ సక్సెస్‌ని తెచ్చి నన్ను కొంత భయపెట్టింది కూడా.

2006లో వ్యవసాయ శాఖలో ఉద్యోగానికి రాజీనామా చెయ్యటం వల్ల జరిగిన మొట్టమొదటి మంచి పని The Alchemist అనువాదం. ‘పరుసవేది’ మొదటి ముద్రణ 2007 ఆగస్టులో వచ్చింది.

The Alchemist వందకి పైగా భాషలలోకి అనువాదం అయ్యింది. ఇంగ్లీషులో లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. తెలుగు అనువాదం 2017 నాటికి మొత్తం పది ముద్రణలలో 15,000 ప్రతులు అచ్చు అయ్యాయి. మొదటి ముద్రణ వచ్చిన కొన్ని సంవత్సరాలకి తెలుగులో దీనిని చదవాలని అనుకునేవాళ్లు అయిపోయి ఉంటారని, ఇక అంతగా అమ్ముడు పోకపోవచ్చని అనుకుంటూ ఉండేవాడిని. కానీ, తరవాత కూడా సంవత్సరానికి ఇంచుమించు వెయ్యి ప్రతులు అమ్ముడుపోతూ ఆశ్చర్యపరుస్తూ ఉండేది. ఈ సందర్భంగా ఈ పుస్తకానికి సోల్ డిస్ట్రిబ్యుటర్‌గా ఉన్న నవోదయ బుక్ హౌస్‌కి ధన్యవాదాలు చెప్పాలి.

‘గడ్డిపరకతో విప్లవం’ కూడా ఎంతో ఆదరణ పొందినప్పటికీ 1990ల నాటికీ, 2010ల నాటికీ చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ‘గడ్డిపరకతో విప్లవం’ నిలకడైన గుర్తింపుని ఇస్తే ‘పరుసవేది’ ఇన్‌స్టాంట్ సక్సెస్‌ని తెచ్చి నన్ను కొంత భయపెట్టింది కూడా. కొత్తగా వచ్చిన సెల్ ఫోన్లు కమ్యునికేషన్‌ని పెంచాయి. కొత్తగా ఏం అనువాదం చేస్తున్నారు అన్న పాఠకుల ఎక్స్‌పెక్టేషన్ నాకు ఒకింత ఒత్తిడి లాగా అనిపించేది.

అతని మిగిలిన పుస్తకాలలో ఒకదానిని ఎంచుకోవలసి ఉంటే నేను ‘The Winner Stands Alone’ అన్న పుస్తకాన్ని ఎంచుకుంటాను.

పరుసవేదితో పాలో కొయిలో అభిమానిని అయిపోయాను. ఆయన అన్ని రచనలు చదివాను. అతని పుస్తకాలలో ఇంకేమి అనువాదం చేస్తున్నారు అన్న ప్రశ్న అప్పుడప్పుడు ఎదురవుతూ ఉండేది. అతని మిగిలిన రచనలు కూడా బాగున్నప్పటికీ పరుసవేది లాగా అందరినీ ఆకట్టుకునే మరొక రచన లేదనిపించింది. అతని మిగిలిన పుస్తకాలలో ఒకదానిని ఎంచుకోవలసి ఉంటే నేను ‘The Winner Stands Alone’ అన్న పుస్తకాన్ని ఎంచుకుంటాను.

కొన్ని కారణాల వల్ల The Alchemistని తెలుగులో ప్రచురించటానికి ఒప్పందాన్ని మంచి పుస్తకం కొనసాగించ లేకపోయింది. ఇది నాకు వ్యక్తిగతంగా చాలా బాధని కలిగించింది, ఆర్థికపరంగా కాకపోయినప్పటికీ సంస్థకి కూడా అఘాతమే. ఇప్పుడు మరొక ప్రచురణ సంస్థ ద్వారా, మరొక అనువాదం మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

‘ఏదైనా చెయ్యాలని గాఢంగా అనిపించినప్పుడు విశ్వమంతా నీకు అనుకూలంగా కుట్ర పన్నుతుంది’ అని శాంటియాగోతో వృద్ధ రాజు చెపుతాడు. పుస్తకంలో ఇది చాల ప్రసిద్ది పొందిన కోట్ ఇది.

మామూలుగా చిన్నవాళ్లకి చదవటానికి పుస్తకాలను పెద్దవాళ్లు సూచిస్తూ ఉంటారు. కానీ, ఈ పుస్తకాన్ని పెద్దవాళ్లకి చిన్నవాళ్లు సూచిస్తూ ఉంటారు. నీ హృదయం చెప్పేది విను, నీ కలలను అనుసరించు, నీ గమ్యాన్ని చేరుకోవటమే జీవితం అనే ఈ పుస్తకం యువతకి బాగా నచ్చిందని నాకు అనిపిస్తుంది.

ఏదైనా లోహాన్ని బంగారంగా మార్చే విద్యని పరుసవేదం (రసవాదం అని కూడా) అంటారు. లోహాన్ని శుద్ధి చేసుకుంటూ వెళితే అది బంగారం అవుతుందంట. మనలోని మలినాలను వదిలించుకుంటూ మెరుగుపరుచుకోవటం అసలైన పరుసవేదం అని నాకు అనిపిస్తుంది.

ప్రేమించటం అంటే మనల్ని మెరుగుపరుచుకుంటూ, పరిసరాలను కూడా మెరుగుపరచటం అని రచయిత చెబుతాడు. అదే విధంగా ‘నిధి’ అనేది బయట లేదని, అది మనలోనే ఉందని నాకు అనిపిస్తుంది. దానిని ఎవరికి వారు గుర్తించాలి, కనుగొనాలి.

‘ఏదైనా చెయ్యాలని గాఢంగా అనిపించినప్పుడు విశ్వమంతా నీకు అనుకూలంగా కుట్ర పన్నుతుంది’ అని శాంటియాగోతో వృద్ధ రాజు చెపుతాడు. ఈ వాక్యం కొంచెం అటూ, ఇటూగా పుస్తకంలో పలుమార్లు కనిపిస్తుంది. పుస్తకంలో ఇది చాల ప్రసిద్ది  పొందిన కోట్ కూడా.

ఆలోచింపజేసే ఆణిముత్యాలు

ఇలాంటివే ఆణిముత్యాలు అనిపించే మాటలు, సందర్భాలు పుస్తకం నుంచి మరికొన్ని ఇక్కడ ఉటంకిస్తాను.

‘ఎదుటి వాళ్లు వాళ్ల జీవితాలను ఎలా జీవించాలో ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుస్తుంది. కానీ తమ జీవితాలకి వచ్చేసరికే ఎవరికీ ఎటువంటి ఆలోచనా ఉండదు.’

‘అందరికీ అర్థమయ్యే విశ్వ భాష ఒకటి ఉంటుంది.’

‘బాల్యంలో అందరికీ తమ జీవిత గమ్యం ఏమిటో తెలుస్తుంది. ఆ వయస్సులో అంతా స్పష్టంగా ఉంటుంది. అన్నీ సాధ్యమే అనిపిస్తాయి. వాళ్లు కలలు కనటానికి భయపడరు… కానీ కాలం గడుస్తున్నకొద్దీ తమ జీవిత గమ్యాన్ని సాధించుకోవటం అసాధ్యమని వాళ్లు నమ్మేలా ఒక వింత శక్తి ఏదో చేస్తుంది.’

‘అందరికీ అర్థమయ్యే విశ్వ భాష ఒకటి ఉంటుంది.’

‘నిర్ణయం తీసుకోవటమన్నది ఆరంభం మాత్రమే. ఎవరైనా నిర్ణయం తీసుకున్నారంటే అది ఉధృతమైన ప్రవాహంలోకి దూకటం లాంటిది, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఊహించనైనా ఊహించని ప్రదేశాలకు ఆ ప్రవాహం వారిని తీసుకెళుతుంది.’

‘విషయాలు తెలుసుకోటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దారి ఉంటుంది.’

‘ప్రేమంటే ఎడారి మాదిరి కదలకుండా ఉండటం కాదు. ప్రేమ అంటే గాలిలా ప్రపంచమంతా చుట్టి రావటమూ కాదు. ప్రేమ అంటే సూర్యుడిలా దూరం నుంచి చూస్తూ ఉండటమూ కాదు. ప్రేమ అనేది ఒక శక్తి. అది విశ్వాత్మను మార్చి, మెరుగుపరుస్తుంది… ప్రేమలో ఉన్నప్పుడు నిరంతరం మెరుగుపడటానికి మనం ప్రయత్నిస్తుంటాం.’

నవలకు మూలం మూడు పేజీల గాథ

ఇంతకీ చెప్పుకోవాలంటే పరుసవేది నవలకి ‘పేదవాడి కల’ అని మూడు పేజీలు కూడా లేని జానపద కథ మూలం.

ఈ కథ ఉన్న ‘వింత దృశ్యం’ పుస్తకం కూడా 2007 ఆగస్టులోనే ప్రచురితం కావటం ఒక యాదృచ్ఛికం.

38 చిన్న కథలతో ‘వింత దృశ్యం’ అన్న పుస్తకంలో తెలుగు అనువాదంలో ఈ కథ కనపడుతుంది. జాస్తి శ్రీకృష్ణ వరప్రసాద్ సొంత రచనలతోపాటు ఆంగ్ల, జానపద కథల తెలుగు అనువాదాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘పేదవాడి కల’ అన్న ఈ కథలో బాగ్దాద్‌లో అడుక్కునే వ్యక్తికి కైరోలో సంపద దొరుకుతుందని కల వస్తుంది. కైరో చేరుకున్న తరవాత చేతిలో డబ్బు అయిపోవటంతో అక్కడ అడుక్కుంటూ ఉంటాడు. అలా అడుక్కోవటం కైరోలో చట్ట విరుద్ధం కాబట్టి న్యాయాధికారి ముందు అతనిని నిలబెడతారు. అతను కైరో ఎందుకు వచ్చాడో తెలుసుకుని కలలను నమ్మకూడదని న్యాయాధికారి నవ్వుతాడు. బాగ్దాద్‌లో మసీదు పక్క వీధిలో వేప చెట్టు కింద సంపద ఉందని అతనికి కల వస్తుందని, తాను మూర్ఖుడు కాదు కాబట్టి దానిని నమ్మలేదని న్యాయాధికారి చెపుతాడు. బాగ్దాద్ తిరిగి వచ్చిన పేదవాడికి నిజంగానే అక్కడ నిధి దొరుకుతుంది. ఈ కథ ఉన్న ‘వింత దృశ్యం’ పుస్తకం కూడా 2007 ఆగస్టులోనే ప్రచురితం కావటం ఒక యాదృచ్ఛికం.

‘సందిగ్ధ’ పరిచయం చేస్తున్నప్పుడు ఒక చిన్న కథని విజయ్ దాన్ దేథా ఎంతో గొప్పగా మలిచాడో పంచుకున్నాను. అలాగే ‘పార్’, ‘మండి’ అన్న చిన్న కథలను ఆయా దర్శకులు చక్కని సినిమాలుగా మలిచారు. పైన చెప్పుకున్న చిన్న కథని మళ్లీ, మళ్లీ చదివింప చేసే తాత్విక నవలగా మలచటంలో పాలో కొయిలో ప్రతిభ కనపడుతుంది.

ప్రతి ఒక్కరికి నచ్చే అంశం

పరుసవేది ‘మాజిక్ రియలిజం’కి చెందిన నవల అని అంటారు. శకునాలు, విశ్వాత్మ, విశ్వ భాష, ‘destiny’ వంటివి ఈ పుస్తకంలో కనపడతాయి. నా హేతువాద మిత్రులకు ఇవి అభ్యంతరకరంగా అనిపిస్తాయేమోనని ముందే చెప్పాను. నేను కూడా వీటిని నమ్మను. ఇవన్నీ సింబాలిక్‌గా ఉన్నాయని, ఆ పొరలు అన్నీ తొలగిస్తే ఇందులో ప్రతి ఒక్కరికీ నచ్చే అంశం ఒకటైనా ఉంటుందని నాకు అనిపిస్తుంది.

ఈ పుస్తకం వల్ల నాకు అనేక మందిలోని పలు కోణాలు తెలిశాయి. అందుకు కూడా ఈ పుస్తకానికి రుణపడి ఉంటాను.

ఈ పుస్తకం మొదటి ముద్రణ సమయంలో నా మిత్ర బృందం, పరిచయస్తులు అందరినీ అడిగినప్పుడు పది పుస్తకాలకు తక్కువ కాకుండా కొని ఎంతో ప్రోత్సహించారు. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన వికాస భారతి రామచంద్రరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి.

ఈ పుస్తకంలో కొత్తగా ఏముంది అన్న వాళ్లు ఉన్నారు. తమని ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పిన వాళ్లు ఉన్నారు. దీంట్లోని అంశాలపై వాద, ప్రతివాదాలు జరిగాయి. ఈ పుస్తకం వల్ల నాకు అనేక మందిలోని పలు కోణాలు తెలిశాయి. అందుకు కూడా ఈ పుస్తకానికి రుణపడి ఉంటాను.

ఆ తరవాత నేను చేసిన అనువాదాలలో పిల్లలకు, పెద్దవాళ్లకు చెందిన ఫిక్షన్ ఎక్కువ ఉండటం యాదృచ్ఛికమేనా?!

కాలమిస్టు పరిచయం

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. ‘నాకు నేను తెలిసే’ నాలుగవది. సమ్మర్‌హిల్‌ ఐదవది. ఆరవది ‘అనార్కో’. ఏడవది ‘జీవన గీతం’ . ఎనిమిదవది ‘యుద్ధోన్మాది అమెరికా’. తొమ్మిదవది ‘బార్బియానా బడి పిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం’. పదవది ‘ప్రకృతి నేర్పిన పాఠాలు’. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ గురించి ఇప్పుడే చదివారు కదా. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వీరు అనువదించినదే. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు మిగతా పుస్తకాలను కూడా వారానికి ఒకటి మీకు ఇలాగే పరిచయం చేస్తారు. 

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article