Editorial

Tuesday, May 7, 2024
కాల‌మ్‌ఈ వారం మంచి పుస్తకం : సమ్మర్‌హిల్‌

ఈ వారం మంచి పుస్తకం : సమ్మర్‌హిల్‌

 

‘మంచి పుస్తకం’ఒక సంపద.
కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో  ‘సమ్మర్ హిల్’ అనువాద రచన గురించిన కథనం ఐదవది.

1975-77లో విజయవాడ లయోలా కళాశాలలో ఇంటర్‌మీడియట్ చదువుతుండగా నాకు హేతువాదాన్ని, మార్క్సిజాన్ని శశిభూషణ్ పరిచయం చేశాడు. అతని ద్వారా ఆ రోజుల్లోనే సిపిఎం విధానాలతో విభేదించిన తెనాలి, గుంటూరు, విజయవాడలకు చెందిన బృందం పరిచయం అయ్యింది. ఆ బృందంలో పాత్రికేయుడు, అనువాదకుడు అయిన, చంద్రం అని మేం పిలుచుకునే సుంకర రామచంద్రరావు ఒకరు.

1986లో శశిభూషణ్, ఇంకొంత మంది మిత్రులం కలసి ఒక ప్రత్యామ్నాయ బడిని మొదలు పెట్టాలని అనుకున్నాం. అది సాకారం కాలేదు కానీ ఆ క్రమంలో ఏర్పడిన పరిచయాలు, అనుభవాలు చాలా విలువైనవి. శశిభూషణ్, నా భార్య భాగ్యలక్ష్మి దక్షిణ భారతంలోని చాలా ప్రత్యామ్నాయ బడులను చూసి వచ్చారు. అప్పుడు చదివిన పుస్తకాలలో ఎ ఎస్ నీల్ రాసిన ‘సమ్మర్‌హిల్’ ఒకటి.

సమ్మర్‌హిల్ అన్నది 1921లో ఇంగ్లాండులో నీల్ స్థాపించి, నలభై ఏళ్లపాటు నడిపిన బడి. ఇది చదువులో జరిగిన అతి గొప్ప ప్రయోగం.

సమ్మర్‌హిల్ అన్నది 1921లో ఇంగ్లాండులో నీల్ స్థాపించి, నలభై ఏళ్లపాటు నడిపిన బడి. ఇది చదువులో జరిగిన అతి గొప్ప ప్రయోగం. సమ్మర్‌హిల్‌లో తరగతులు ఉండేవి, కానీ వయస్సును బట్టి కాకుండా సామర్ధ్యాన్ని బట్టి పిల్లలు ఆయా తరగతులకు వెళతారు. అక్కడి పిల్లలకు ఇష్టమయినది చదవటానికి, అసలు చదవకుండా ఉండటానికి స్వేచ్ఛ ఉండేది. తమకి ఏం కావాలో పిల్లలు తమకు తాము తెలుసుకున్న తరవాత చాలా వేగంగా నేర్చుకోగలుగుతారని నీల్ తన అనుభవంలో చూశాడు.

నేను అనువదించిన పిల్లల పెంపకం భాగాన్ని గీత రామస్వామికి చూపించగా, దానిని 1998లో హైదరాబాదు బుక్ ట్రస్ట్ ‘పిల్లల పెంపకం – సమ్మర్‌హిల్ అనుభవాలు’ అన్న పేరుతో ప్రచురించింది. అనువాదానికి పారితోషికం అందిన మొదటి పుస్తకం ఇది.

ఈ సమ్మర్‌హిల్ పుస్తకాన్ని తెలుగులోకి తీసుకుని రావాలని చంద్రం ప్రతిపాదించాడు. పుస్తకంలోని మొదటి భాగాన్ని గుంటూరుకి చెందిన వి. మురళి, రెండవ భాగాన్ని నేను, మూడవ భాగాన్ని చంద్రం అనువాద బాధ్యతలని తీసుకున్నాం.

నేను తీసుకున్న పిల్లల పెంపకం భాగాన్ని ముందుగా పూర్తి చేశాను. అయితే, నా అనువాదం చంద్రంకి నచ్చలేదు. ఇంగ్లీషులోని ‘ఎంఫసిస్’ తెలుగులో రాలేదని అతను అన్నాడు. ఇంగ్లీషులోని పెద్ద వాక్యాలను చిన్నవిగా చేసి అనువదించటం వల్ల అలా జరిగి ఉండవచ్చని నేను అనుకున్నాను. చంద్రం తన భాగం అనువదించిన తరవాత దాంట్లో చెప్పుకోదగిన లోపాలే ఉన్నాయని నాకు అనిపించింది. దాంతో ఉమ్మడి ప్రాజెక్టుకి స్వస్తి పలికి, చంద్రం పుస్తకం మొత్తాన్ని అనువదించి సొంతంగా ప్రచురించాడు. అనేక పట్టణాలలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరింప చేసి, దాని పై చర్చా కార్యక్రమాలు పెట్టి సమ్మర్‌హిల్‌కి విస్తృత ఆదరణ వచ్చేలా చేశాడు.

బడి అన్న పదం కంటే స్కూల్ అంటేనే అర్థం అవుతుందని చంద్రం ఆనాడు అన్న మాటలతో అప్పుడు ఏకీభవించ లేదు కానీ ఈ రోజు ఒప్పుకోక తప్పటం లేదు. అదీ తెలుగు పరిస్థితి.

బడి అన్న పదం కంటే స్కూల్ అంటేనే అర్థం అవుతుందని చంద్రం ఆనాడు అన్న మాటలతో అప్పుడు ఏకీభవించ లేదు కానీ ఈ రోజు ఒప్పుకోక తప్పటం లేదు. అదీ తెలుగు పరిస్థితి.

నేను అనువదించిన పిల్లల పెంపకం భాగాన్ని గీత రామస్వామికి చూపించగా, దానిని 1998లో హైదరాబాదు బుక్ ట్రస్ట్ ‘పిల్లల పెంపకం – సమ్మర్‌హిల్ అనుభవాలు’ అన్న పేరుతో ప్రచురించింది. అనువాదానికి పారితోషికం అందిన మొదటి పుస్తకం ఇది. ఈ పుస్తకం మూడవ ముద్రణలో ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఈ మొత్తం క్రమంలో మురళి చేసిన అనువాద భాగం మరుగున పడిపోయింది.

‘స్వేచ్ఛ’ అంటే ఏమిటో అర్థం చేసుకుని ఆచరించటం కష్టమే. సోఫాలు ఎక్కి దూకుతున్న పిల్లలను చూపిస్తూ మీ ఆలోచనలతో ప్రభావితం అయ్యి పిల్లలను స్వేచ్ఛగా పెంచామని చెప్పే తల్లిదండ్రులను చూసి తలపట్టుకోవటం నీల్ వంతు అవుతుంది.

ఈ పుస్తకంలో పందొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. పిల్లలని స్వేచ్ఛగా పెంచాలన్నది నీల్ అభిమతం. మొదటి రెండు అధ్యాయాలలో స్వేచ్ఛ లేని శిశువు, స్వేచ్ఛా శిశువు గురించి చర్చించాడు. అయితే ‘స్వేచ్ఛ’ అంటే ఏమిటో అర్థం చేసుకుని ఆచరించటం కష్టమే. సోఫాలు ఎక్కి దూకుతున్న పిల్లలను చూపిస్తూ మీ ఆలోచనలతో ప్రభావితం అయ్యి పిల్లలను స్వేచ్ఛగా పెంచామని చెప్పే తల్లిదండ్రులను చూసి తలపట్టుకోవటం నీల్ వంతు అవుతుంది.

పిల్లలు జీవ వ్యతిరేక వాతావరణంలో పెరుగుతున్నారని నీల్ అంటాడు. ‘కుక్కకు చిన్నప్పుడు ఇచ్చే శిక్షణ, నర్సరీలో చిన్న పిల్లల శిక్షణ ఒక లాంటివే. దెబ్బలు తిన్న కుక్క లాగా దెబ్బలు తిన్న పిల్లవాడు కూడా అణకువ గల వ్యక్తిగా ఎదుగుతాడు,’ అంటాడు నీల్.

అతను మాట్లాడిన ప్రతి సభలో, ‘మా నాన్న నన్ను కొట్టేవాడు. దీనికి నేనేమీ బాధపడటం లేదు. నన్ను కొట్టి ఉండకపోతే ఇవ్వాళ నేను ఇంతటి వాడినయ్యేవాడిని కాదు,’ అని చెప్పేవాళ్లు ఒకరైనా ఉండేవాళ్లంట. ఇంతకీ నువ్వు ఎంతటి వాడివయ్యావని అడగటానికి ఎన్నడూ ధైర్యం చాలలేదని నీల్ చెపుతాడు. దండనకు గురయిన పిల్లలు రాను రాను మరింత చెడ్డవారవుతారని, దండించే తల్లిదండ్రులుగా మారతారని, ఆ విధంగా ద్వేష విష వలయం తరాలపాటు కొనసాగుతుందని నీల్ అంటాడు.

మట్టిలో ఆడుకున్న పిల్లల సంతోషాన్ని చూడకుండా వాళ్ల బట్టలకు అంటిన మట్టిని చూసి ఇతరులు ఏమంటారోనని ఆందోళన చెందే అమ్మా నాన్నలను చూసి నీల్ జాలిపడతాడు.

బయట వాళ్ల ముందు పిల్లవాడిని చక్కగా ప్రవర్తింప చెయ్యటానికి తల్లిదండ్రులు తాపత్రయ పడటాన్ని నీల్ తప్పు పడతాడు. మట్టిలో ఆడుకున్న పిల్లల సంతోషాన్ని చూడకుండా వాళ్ల బట్టలకు అంటిన మట్టిని చూసి ఇతరులు ఏమంటారోనని ఆందోళన చెందే అమ్మా నాన్నలను చూసి నీల్ జాలిపడతాడు.

నీతిని, అధికారాన్ని తీసుకుని రాకుండా పిల్లలను సమానులుగా చూడాలని నీల్ అంటాడు. ఇందుకు ఒక ఉదాహరణ నీల్ చెపుతాడు. తాను దారిన పోతుంటే ఒక పిల్లవాడు అతని టోపీని ఎగరగొడితే అతడిని పట్టుకని గూబ గుయ్యిమనిపిస్తే ఆ ప్రతిచర్య సహజమైనదిగా పిల్లవాడు భావిస్తాడు. దెబ్బకు దెబ్బ చెల్లు అన్నట్టవుతుంది. ఎవరినైనా కొడితే వాళ్లు తిరిగి కొడతారని కూడా పిల్లవాడికి అర్థమవుతుంది. అలా కాకుండా పిల్లవాడిని స్కూల్ ప్రిన్సిపాలు దగ్గరకు తీసుకుని వెళ్లి, అతడిని దండించమని అడిగితే అతడు భయపడతాడు, అపరాధ భావనకు లోనవుతాడు.

‘సమ్మర్‌హిల్‌లో పిల్లలను పెద్దవాళ్లతో సమానులుగా చూస్తాం. పిల్లలను పెద్దవాళ్లు కాదని గుర్తించినప్పటికీ పెద్దవాళ్ల స్వతంత్రతనీ, వ్యక్తిత్వాన్నీ గౌరవించినట్లే పిల్లల స్వతంత్రతనీ, వ్యక్తిత్వాన్నీ గౌరవిస్తాం,’ అని నీల్ అంటాడు. పిల్లల పెంపకంలో ఇది అందరం అనుసరించదగ్గ విధానం.

కాలమిస్టు పరిచయం

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. ‘నాకు నేను తెలిసే’ నాలుగవది. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు మిగతా పుస్తకాలను కూడా వారానికి ఒకటి మీకు పరిచయం చేస్తారు. 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article