Editorial

Tuesday, May 7, 2024
కాల‌మ్‌అనార్కో - ఈ వారం మంచి పుస్తకం

అనార్కో – ఈ వారం మంచి పుస్తకం

‘మంచి పుస్తకం’ఒక సంపద.
కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో  ‘అనార్కో’ ఆరవది.

మధ్య ప్రదేశ్ లోని కిశోర్ భారతిలో (1984-86) పని చేస్తుండగా పరిచయం అయిన వాళ్లలో చాలా మందితో ఈనాటికీ స్నేహం కొనసాగుతోంది. వాళ్లలో సత్యు అని అందరూ పిలిచే సతినాథ్ సరంగి ఒకరు. 1984 డిసెంబరు 3న జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులతో కిశోర్ భారతి నుంచి వెళ్లిన వాళ్లలో సత్యు కూడా ఉన్నాడు. అదే ఇప్పటికీ అతని కార్య రంగంగా ఉంది. గ్యాస్ వల్ల ప్రభావితులైన ప్రజల కోసం అన్ని రకాల వైద్యాలను అందించే ఒక చక్కని క్లినిక్‌ని సంభావన ట్రస్ట్ తరఫున నడుపుతున్నాడు. 1987లో అనార్కో అన్న పాత్రతో హిందీలో సత్యు రాసిన కథలు హిందీలో పిల్లల పత్రిక ‘చక్‌మక్’లో అచ్చు అయ్యాయి. ఇవి నా భార్య భాగ్యలక్ష్మికి, నాకు ఎంతో నచ్చాయి. వీటిని మేం ఇద్దరం తెలుగులోకి అనువదించాం. ఇద్దరి పేర్లలోని మొదటి అక్షరాలతో అనువాదకుని పేరుని ‘సురేల’ చేశాం. ఇలా మేమిద్దరం కలిసి అనువదించిన ఒకే ఒక్క పుస్తకం ఇది.


అమ్మా, నాన్న, బంధువులు, టీచర్లు, ప్రధాన మంత్రి, చివరికి దేవుడి ఆధిపత్యాన్ని కూడా అనార్కో ప్రశ్నిస్తుంది.

తెలుగులోని అనార్కో కథలు 1997లో ‘భూమిక’ స్త్రీవాద పత్రికలో మూడు సంచికలలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి. అప్పుడు సజయ ఆ పత్రికు సంపాదకురాలిగా ఉంది. ఈ కథలకు సజయ కొన్ని బొమ్మలు కూడా వేసింది.

ఈ ఏడు కథలను 2010లో మంచి పుస్తకం ద్వారా ‘అనార్కో’ పేరుతో పుస్తకంగా ప్రచురించాం. ఇది మూడవ ముద్రణగా ఇప్పటికీ అందుబాటులో ఉంది.

ఈ పుస్తకానికి ముఖ చిత్రంగా చక్‌మక్ కోసం విప్లవ్ శశి (ఇప్పుడు కనక్) వేసిన బొమ్మని ఉపయోగించాం. లోపలి పేజీలకు శ్రీకాంత్ బొమ్మలు వేశాడు. ఈ కథలతో అతను ఎంతగా ప్రభావితం అయ్యాడంటే ఆ తరవాత పుట్టిన కూతురికి దివి అనార్కో అని పేరు పెట్టాడు. అతని బొమ్మలు ఈ పుస్తకానికి ప్రాణం పోశాయి.

‘అనార్కీ’ అన్న ఇంగ్లీషు పదం నుంచి సత్యు ఈ పేరును తయారు చేశాడు. ఈ పదానికి ‘అరాచక వాదం’ అని తెలుగులో వాడుక అర్థం కావటం దురదృష్టకరం. అనార్కిస్టులు పద్ధతీ, క్రమశిక్షణ లేని వాళ్లు కాదు. వాళ్లు ఏ విధమైన ఆధిపత్యాన్ని సహించరు. దానిని క్లుప్తంగా ‘ఫ్రీ అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ పీపుల్’ అంటారు.

ఈ ఏడు కథలలో అనార్కో ప్రధాన పాత్ర. ‘అనార్కీ’ అన్న ఇంగ్లీషు పదం నుంచి సత్యు ఈ పేరును తయారు చేశాడు. ఈ పదానికి ‘అరాచక వాదం’ అని తెలుగులో వాడుక అర్థం కావటం దురదృష్టకరం. అనార్కిస్టులు పద్ధతీ, క్రమశిక్షణ లేని వాళ్లు కాదు. వాళ్లు ఏ విధమైన ఆధిపత్యాన్ని సహించరు. దానిని క్లుప్తంగా ‘ఫ్రీ అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ పీపుల్’ అంటారు. వీటిని తెలుగులో ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. అమ్మా, నాన్న, బంధువులు, టీచర్లు, ప్రధాన మంత్రి, చివరికి దేవుడి ఆధిపత్యాన్ని కూడా అనార్కో ప్రశ్నిస్తుంది.

అనార్కో పదేళ్ల పిల్ల. కిట్టూ ఆమె ప్రియ స్నేహితుడు. ఆమె పొట్ట నిండా ప్రశ్నలే. ఆమె ప్రశ్నలకి సమాధానం చెప్పలేనప్పుడు నాన్నని అడగమని అమ్మ అంటుంది. సహనం పోయినప్పుడు నాన్న విసుక్కుంటాడు. జవాబు చెప్పలేనప్పుడు అర్థం పర్థం లేని ప్రశ్నలు అడుగుతావని హూంకరిస్తాడు. ఆ మాటే అడిగితే ఎదురు ప్రశ్నలు వేసినందుకు దెబ్బలు కూడా పడతాయని ఊరుకుంటుంది అనార్కో.

ఇంట్లో వాళ్లు, బయట వాళ్లు అది చెయ్యి, ఇది చెయ్యి అని ఆజ్ఞాపించటం అనార్కోకి ఇష్టం ఉండదు. వాళ్లు చెప్పే పనులు చేయడానికే పుట్టామా అని అనార్కో బాధపడుతుంది. పిల్లలు బందీలుగా, ఇంకొకరు కాపలాలో ఉండటం అనార్కోకి అస్సలు నచ్చదు.

పిల్లల మీద పెద్ద వాళ్ల పెత్తనం కూడా అనార్కోకి నచ్చదు. ఇంట్లో వాళ్లు, బయట వాళ్లు అది చెయ్యి, ఇది చెయ్యి అని ఆజ్ఞాపించటం అనార్కోకి ఇష్టం ఉండదు. వాళ్లు చెప్పే పనులు చేయడానికే పుట్టామా అని అనార్కో బాధపడుతుంది. పిల్లలు బందీలుగా, ఇంకొకరు కాపలాలో ఉండటం అనార్కోకి అస్సలు నచ్చదు.

భయంలో రెండు రకాలు ఉంటాయని అనార్కో చెబుతుంది. ఒక రకం భయంలో ఉత్సాహం, ఆనందం ఉంటాయంట. రెండో రకం భయంలో అవి ఉండవంట. దెయ్యాలు ఉన్నాయని, అర్థ రాత్రి చెరువు గట్టున ఉన్న చింత చెట్టు దగ్గరకి వెళితే (ఆరో రోజు కథ) దెయ్యం కనపడుతందని బండాయ్ నమ్మ బలకటంతో అనార్కో ఒక్కతే వెళుతుంది. చీకటిలో బిక్కు బిక్కుమంటూ వెళ్లే అనార్కోకి మొదటి రకం భయం అనుభవంలోకి వస్తుంది. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తలుపు తెరుచుకుని బయటకు వస్తున్న నాన్న కాళ్లని చూసిన అనార్కోకి రెండవ రకం భయం అనుభవమవుంది.

చివరికి చేప పిల్లలకి కూడా బడి పెడుతున్నారని తిట్టుకుంటూ అనార్కో బడికి తిరిగి వెళుతుంది.

ఒక రోజు తరగతి గదిలో తన ఊహా లోకంలో విహరిస్తున్న అనార్కోని టీచరు బయటకు పంపించేస్తుంది (రెండో రోజు కథ). బయట వాగు వడ్డున కూర్చుని తిరిగి ఊహలలోకి వెళ్లిపోతుంది అనార్కో. అక్కడ పెద్ద చేపలు సమావేశంలో ఉన్నాయి. పిల్ల చేపలు ఇష్టం వచ్చినపుడు పాడుతూ, గంతులు వేస్తూ తల నొప్పి తెప్పిస్తాయని, మొక్కై వంగినది మానై వంగదంటూ బాల్యానికి అంటే బాల్యం నుంచే గుణపాఠాలు చెప్పాలని పెద్ద చేపలు అనుకుంటాయి. చేప పిల్లలు అటూ, ఇటూ పరిగెత్తకుండా ఒక గదిలో కూర్చో పెట్టాలని, అవి విసిగిపోకుండా మధ్య మధ్యలో విరామం ఇవ్వాలని నియమ నిబంధనలు రూపొందిస్తాయి. చివరికి చేప పిల్లలకి కూడా బడి పెడుతున్నారని తిట్టుకుంటూ అనార్కో బడికి తిరిగి వెళుతుంది.

ఏడో రోజు కథలో వంతెన ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాన మంత్రి గొప్పతనం ఏమిటని అడుగుతుంది అనార్కో. అతను వంతెన కట్టాడా? వంతెనకి డబ్బులు ఇచ్చాడా? ప్రధాన మంత్రి అయితే అందరి మనుషుల లాంటి వాడు కాదా? మాస్టారు లేనప్పుడు బోర్డు మీద బొమ్మలు గీసి ఆయన వస్తున్నాడని తెలిసి భయపడిన పిల్లలు తుడిపేసినట్టు బజారులోని గోడల మీద బొమ్మలను, రాతలను తుడిపేయటం చూసి ప్రధాని అంటే ఎవరికి భయం, ఎందుకు భయం అనుకుంటుంది అనార్కో.

పరీక్షలో కొంత మంది పాస్ కావాలని, కొంత మంది ఫెయిల్ కావాలని ఎవరు నిర్ణయిస్తారు అని అమ్మను అడుగుతుంది అనార్కో. ఎవరో ఉంటారు అని చెప్పిన అమ్మకి అనార్కో ఒక కథ చెపుతుంది.

అన్నిటిలోకి నాకు అయిదవ కథ ఇష్టం. పరీక్షలో కొంత మంది పాస్ కావాలని, కొంత మంది ఫెయిల్ కావాలని ఎవరు నిర్ణయిస్తారు అని అమ్మను అడుగుతుంది అనార్కో. ఎవరో ఉంటారు అని చెప్పిన అమ్మకి అనార్కో ఒక కథ చెపుతుంది. ఒక అడవిలోని జంతువులు ఎవరి గొప్ప వారిది అని సంతోషంగా ఉండటం చూసి ఒక మనిషి ముఖం మాడ్చుకుని నీలం పొగ వదిలి వికృత నవ్వుకుంటూ వెళ్లిపోతాడు. ఆ పొగ ఇంకిన తరవాత జంతువులలో ‘నేను గొప్ప’, అంటే నేను గొప్ప అని గొడవ పడటం మొదలుపెడతాయి. చివరికి తమలో ఎవరు గొప్పో నిర్ణయించటానికి ఒక కొంగని ఎంచుకుంటాయి. చాలాసేపు సోయగాలు పోయిన కొంగ చివరికి జింక, గేదె అన్నింటికంటే గొప్ప అని తేలుస్తుంది. ఎవరు గొప్ప అన్న ప్రశ్న లేనంతవరకు అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ ప్రశ్న వచ్చిన తరవాత ఇక గొడవలకి అంతు ఉండదు. ఎవరు గొప్పో తనని నిర్ణయించమన్నప్పుడు తన ఇష్ట ప్రకారం కొలమానాలను ఎంచుకుంటానని చెపుతుంది కొంగ. మంచు నాకి బతికే జింక (అందరూ అలా అనుకుంటున్నారని ఎంతో ఇబ్బంది పడుతూనే దాహం తీర్చుకుంటోంది) తాను ఏటిలో చేపలు పట్టేటప్పుడు వాటిని బెదరగొట్టదు కాబట్టి జింక గొప్పదంట. అలాగే గేదె మీద కూర్చుని చేపలను వేటాడుతుంది కాబట్టి గేదె గొప్పదంట. వేరే జంతువుల మీద కాకుండా గేదె మీద కూర్చుని ఎందుకు వేటాడావు అని అడిగితే కొంగ సిగ్గుపడుతూ నల్లని గేదె చర్మం మీద దాని తెల్లదనం బాగా కనపడుతుందని చెబుతుంది. కథ ముగించి, మొత్తానికి ఆ రోజు పరీక్ష కోసం చదివే బాధ తప్పిందని అనార్కో సంతోషిస్తుంది.

ఇలా ఈ కథలన్నీ నవ్విస్తూనే, ఆలోచింప చేస్తాయి.

అనార్కో కథలు పుస్తకంగా ముందుగా తెలుగులోనే వచ్చాయి. మొదటి కథ మొదలయిన తీరు (‘అనార్కో ఓ ఆడపిల్ల. ఇది తను వేసుకునే బట్టలను చూసి చెప్పవచ్చు. బట్టలు వేసుకోకపోయినా చెప్పొచ్చనుకోండి.’) నచ్చక దీనిని ఒక హిందీ ప్రచరుణకర్త తిరస్కరించాడు. ఈ కథలు ఇంగ్లీషులోకి అనువాదం అయ్యాయి కానీ ఇంకా పుస్తకంగా వెలువడ లేదు.

కాలమిస్టు పరిచయం

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. ‘నాకు నేను తెలిసే’ నాలుగవది. సమ్మర్‌హిల్‌ ఐదవది. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు మిగతా పుస్తకాలను కూడా వారానికి ఒకటి మీకు పరిచయం చేస్తారు. 

More articles

4 COMMENTS

  1. నమస్కారం అభినందనలు మంచి పుస్తకం..ఈ శీర్షిక చాలా బాగుంది అద్భుతమైన కృషి కి అభినందనలు చాలా బాగుంది. సురేష్ గారికి కందుకూరి గారికి. ధన్యవాదాలు

  2. మంచి పుస్తకం శీర్షిక వల్ల మంచి పుస్తకాల గురించి తెలుసు కునే అవకాశం ఇచ్చిన కందుకూరి రమేష్ బాబు గారికి ధన్యవాదములు
    మంచి పుస్తకాలు ని మా అందరికీ అర్ధం అయ్యే భాషలోకి అనువదించి మా అందరికీ అందుబాటులోకి తిసు కొస్తుందుకు సురేష్ గారు అభినందనీయులు
    వారి కృషి వల్ల చాలా మంది లో స్ఫూర్తి ని నింపి ఇలాంటి కథలు వెలుగు చూస్తున్నాయి
    వారి రచన పరుసవేది చదివాను
    వారికి ధన్యవాదములు

  3. అనార్కో పరిచయం బాగుంది.
    దానిని అనువదించిన
    సురేష్ గారి దంపతులకు అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article