“బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి” నినాదం ఇచ్చిన కేసీఆర్ ఈ పదేళ్ళలో గల్ఫ్ కార్మికులను ఎలా మభ్య పెట్టారో చదవాలి.
గల్ఫ్ కార్మికుల విషయం ఒక్కటే కాదు, ఈ పుస్తకంలో రమేష్ రాసినట్లు అనేక అంశాల్లోనూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు కేసీఆర్ సుదీర్ఘ పరిపాలన ఒక భంగపాటే. వారిది కర్కశ పాలన. ముఖ్యగా గల్ఫ్ కార్మికులకు సంబంధించి పదేళ్ల యానం ఒక దగా, ఒక మోసం, ఒక వంచన.
మంద భీంరెడ్డి
అధ్యక్షులు, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం
నాది జగిత్యాల, కందుకూరి రమేష్ బాబుది ఎల్లారెడ్డిపేట. మేమిద్దరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళం. కానీ మమ్మల్ని కలిపింది హైదరాబాద్. అందుకు వారధి మేమంతా ‘తలలో నాలిక’లా భావించే నిజాం వెంకటేశం గారే. వారి ద్వారా ఒకరి కొకరం పరిచయమై దాదాపు పదిహేనేళ్ళు.
రమేష్ బాబు తెలంగాణ ఉద్యమకాలంలో ‘నమస్తే తెలంగాణ’ సండే మేగజైన్ ‘బతుకమ్మ’ కు ఎడిటర్ గా ఉన్నప్పుడు మొట్ట మొదటిసారిగా నాతో రాయించిన వ్యాసం 2 ఫిబ్రవరి 2014 నాడు ప్రచురితమైంది. ప్రత్యేక రాష్ట్రం సాకారమైన తర్వాత స్వరాష్ట్రంలో వివిధ రంగాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే విషయం కేవలం కేసీఆర్ కి వదిలి పెట్టాల్సిన విషయం కాదని, అది ఉద్యమ కారులందరి కర్తవ్యం అని రమేష్ అప్పుడే నమ్మిండు. అందుకే వివిధ రంగాల నిపుణులు, ఉద్యమకారులతో వారం వారం వ్యాసాలు రాయించాడు. ఆ క్రమంలో గల్ఫ్ బాధితుల కోసం చేయవలసిన పనులేమిటో నా చేత పట్టుబట్టి రాపించిన ఆ వ్యాసం తెలంగాణ పునర్నిర్మాణ వ్యాస పరంపరలో 32వ వ్యాసంగా అచ్చయింది. అలా మా పరిచయం తెలంగాణ ప్రధాన సమస్యల్లో ఒకటైన గల్ఫ్ ఇతివృత్తంతో ఆ నాడు మొదలై ఆ సమస్యకు పరిష్కారం వెతికే త్రోవలో ముందుకు సాగింది. ఎన్నికల తరుణంలో ఈ ‘విను తెలంగాణ’ సిరీస్ వ్యాసాలు రాసే క్రమంలో గల్ఫ్ సమస్య లోతుపాతులను అర్థం చేసు కునేందుకు మరెన్నో సార్లు కలిసేలా చేసింది. ఈ రంగంలో పనిచేస్తున్న యాక్టివిస్టులను పరిచయం చేసేందుకు, వివిధ గ్రామాల్లో బాధితులను కలిసేందుకు, అలాగే అతడి క్షేత్ర పర్యటనకు నా వంతు సహకారం ఇచ్చేదాక అది అక్షరాలా విస్తరించింది. ఇదంతా కూడా స్నేహపూర్వకంగా, అభిమానంగా సాగింది. ఒకే ప్రాంతం వాళ్ళం కూడా అయి నందున ఎక్కువగా అభివృద్ధి చెందింది.
పాత్రికేయుడిగా పలు సామాజిక సమస్యలను పత్రికల ద్వార వెల్లడిస్తూనే ఒక రచయితగా సామాన్యుల జీవితాలను పుస్తకాలుగా వెలువరిస్తూ వచ్చిన రమేష్ బాబు ‘ఒక్క చిత్రం వేయి పదాల పెట్టు’ అన్న సత్యం తెలిసిన వాడిగా, కేవలం ఒక్క ఫొటోతో చిన్న కాప్షన్ తో హత్తుకునేలా పనిచేస్తూ వెళ్ళడం మరో ప్రత్యేకతగా గమనించాను. వాటిని చూసినప్పుడల్లా ఉదయం పత్రికలో చేసిన ఒక ప్రయోగం నాకు గుర్తుకు వస్తుంటుంది. 1986 నుంచి 1996 వరకు ఒక దశాబ్దంపాటు ‘ఉదయం’ దినపత్రికకు నేను జగిత్యాల విలేకరిగా పని చేశాను. ముఖ్యంగా ఫోటో కింద క్లుప్తంగా రాసి ‘ఫోటో వార్త’ అని అప్పట్లో జిల్లా పేజీలో వేసే ఒరవడి ఒకటుండేది. రమేష్ బాబు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే ఫోటోలను చూసినప్పుడు ఆ ఫోటో వార్తలు తరచూ గుర్తుకు వస్తుంటాయి. ఒక పేజీలో చెప్పే భావం ఒక ఫోటో ద్వారా ఎంతబాగా చెప్పవచ్చో రమేష్ బాగా సాధన చేశాడు. అంతేకాదు, ‘బతుకమ్మ’ మేగజైన్ ను వదిలిపెట్టి స్వతంత్ర జర్నలిస్టుగా మారిన తర్వాత కూడా తాను ‘తెలుపు’ వెబ్ సైట్ నిర్వహిస్తూ, రాయవలసిన వాళ్ళతో రాయించడం మానలేదు. గత రెండేళ్లుగా మేము పంపిన గల్ఫ్ కార్మికులకు సంబంధించిన విషయాలను తాను శ్రద్ధతో ప్రచురించడమే అందుకు నిదర్శనం.
అతడు పాలమూరు వెళ్లేముందు అడిగాడు. కామారెడ్డి మొదలు సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల వెళ్ళే ముందూ కలిశాడు. అన్నీ వలసలే. కానీ గల్ఫ్ బాధితులకు పాలమూరు బాధితులకూ తేడా ఏమిటో చెప్పమన్నాడు. అలాగే సింగరేణి వలస ఎలాంటిదో తెలుపమన్నాడు. గల్ఫ్ సమస్య విస్తృతిని బోధపరుచుకుంటూ పరిష్కరాల కోసం తపించి లోతుగా అధ్యయనం చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపించాడు. తెలంగాణలోని మూడు వలసలను ‘భూమి, పాతాళం, ఆకాశం’ (బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి) గా వర్ణిస్తూ ‘ఆ ముగ్గురి’ గురించి మరింత లోతుగా పనిచేసి రాయాలనే నిర్ణయాన్ని కూడా వ్యక్తం చేశాడు. అది మన అందరి కర్తవ్యం కావాలని ఆకాంక్షిస్తూ వాటన్నిటినీ గుర్తు చేసుకుని కొన్ని విషయాలు చెప్పాలి.
పరాయి దేశంలో చేసే సేవలు కూడా విలువైనవిగా ఆ ఎడారి దేశాలూ లెక్కించవు. సేవలకు కాదు, కనీసం ప్రాణాలకు గౌరవం ఇవ్వదు. వారి సంగతి సరే, ఇక మన దేశం? ముఖ్యంగా మన రాష్ట్రం, అందునా పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం. అది కూడా ఏ విధంగానూ భిన్నంగా వ్యవహరించలేదు.
పాలమూరు నుంచి కూలీలు భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు తొమ్మిది నెలలు వలస పోవడాన్ని ఒక సీజన్ గా లెక్కిస్తారు. అంటే వారు సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే స్వగ్రామంలో ఉంటారు. ఇలా 10 నుంచి 20 సీజన్లు వలస వెళ్లిన వారు కూడా ఉన్నారు. అల్పాదాయం అయినప్పటికీ కష్టమో సుఖమో ఆలుమగలు జంటగా వలస వెళతారు. నిజానికి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే ఉన్నత విద్యావంతులు, అధిక ఆదాయ వర్గాలు కూడా కుటుంబంతో సహా వలస వెళతారు. కానీ గల్ఫ్ వలసలో కార్మికుడు ‘ఒంటరి పక్షి’ అనే చెప్పాలి. గూడు వదిలి వెళ్ళే వలస పక్షి. అతడి విషాదం రమేష్ బాబు బాగా నివేదించాడు. ‘గల్ఫ్ వలసలు – అభివృద్ధి – విధ్వంసం’ పై ఈ పుస్తకంలో ఎనిమిది వ్యాసాలున్నాయి.
తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు సాగే వలసలో 99 శాతం పురుషులే. ఇందులో 90 శాతం ఒంటరి పురుషుల వలసలే. తక్కువ వేతనం వలన అక్కడికి కుటుంబాన్ని తీసికెళ్ళి ఖర్చులు భరించే స్థోమత వారికి ఉండదు. సరాసరిగా ఒక కార్మికుడు గల్ఫ్ దేశాలకు పదేళ్లు వలస వెళతాడు. అక్కడి కార్మిక చట్టాల ప్రకారం ఒక సంవత్సరం పని చేస్తే, ఒక నెల రోజులు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా రెండు మూడేళ్ళకు ఒకసారి ఇండియాకు వచ్చి, ఓ రెండు మూడు నెలలు కుటుంబంతో గడిపి వెళ్ళిపోతారు. అంటే ఒక దశాబ్దం గనుక గల్ఫ్ లో గడిపితే కేవలం ఒక సంవత్సరం మాత్రమే తమ కుటుంబంతో అది కూడా మూడు నాలుగు సార్లు వాయిదాల పద్ధతిలో గడిపే దురదృష్టకర స్థితి వారిది. ఈ ‘ఎడబాటు’ గురించి రమేష్ ఎంతో ఆవేదన చెందుతాడు. ఎడబాటుతో పాటు పలు సమస్యలు కూడా పేర్కొన్నాడు. ఆర్థిక స్థితిగతులే కాకుండా వారి శారీరక, మానసిక జీవితాల గురించి, పిల్లలు, స్త్రీల ఆరోగ్యం గురించి, వారి అనుబంధాల గురించి తలపోశాడు.
ఉపాధి కోసం సప్త సముద్రాలు దాటిన గల్ఫ్ కార్మికులు జీవితంలో తమ విలువైన కాలాన్ని ముఖ్యంగా తమ యవ్వనాన్ని ఎడారి పాలు చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున చెప్పవలసే ఉన్నది. పెళ్లయిన గల్ఫ్ కార్మికులు ‘ఫోర్సుడ్ బ్యాచిలర్స్’ అంటే ‘బలవంతపు బ్రహ్మచారులు’ గా ఎడారి దేశాల్లో ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఇలా తాము కోల్పోతున్న కాలం, బతుకు ఎంతమాత్రం వెలకట్టలేనిది. అక్కడ వాళ్ళు, ఇక్కడ ఇండియాలో వారి కుటుంబం. రోజు రోజుకూ తీవ్రమయ్యే ఎడబాటుతో ఇరువురూ కృంగిపోతు న్నారు. వారి పిల్లలు తండ్రి సంరక్షణకు దూరమై మానసిక ఎదుగుదలలో వెనుక బడుతున్నారు. తల్లులు ‘తండ్రి’ పాత్ర పోషించే భారానికి లోనై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మధ్యలో ఇద్దరి పరస్పర ‘సాహచర్యం’ గండి కొడుతున్నది. మొత్తంగా పూడ్చలేని ఈ నష్టాన్ని ‘సోషల్ కాస్ట్’ లేదా ‘సామాజిక ఖరీదు’ అంటారు. దీన్ని ఎవరు లెక్కించాలి? ఎవరు పరిహారం చెల్లించాలి? అసలు అది సాధ్యమా?
వీరిపై ఎవ్వరికీ సానుభూతి లేదు. వాస్తవానికి దేశ సరిహద్దుల్లో డ్యూటీ చేసే సైనికులు చేస్తున్నది ‘త్యాగం’ అని మనం భావిస్తాం. కానీ గల్ఫ్ కార్మికులవి త్యాగాలు కూడా కాకుండా పోతుండటం కళ్ళముందు కనిపించే కఠిన వాస్తవం, విషాదం. కనీస బతుకు దెరువుకు కూడా అవకాశాలు కల్పించలేని ప్రభుత్వాల అసమర్థత ఎవరి కంటా పడదు. పరాయి దేశంలో చేసే సేవలు కూడా విలువైనవిగా ఆ ఎడారి దేశాలూ లెక్కించవు. సేవలకు కాదు, కనీసం ప్రాణాలకు గౌరవం ఇవ్వదు. వారి సంగతి సరే, ఇక మన దేశం? ముఖ్యంగా మన రాష్ట్రం, అందునా పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం. అది కూడా ఏ విధంగానూ భిన్నంగా వ్యవహరించలేదు. కనీసం మానవీయంగా ప్రవర్తించలేదు. దశాబ్దం పాటు నిరీక్షణ ఒక మోసంగా మిగిలిపోవడం చెప్పరాని బాధ. అన్నిటిలోకి విచారకరం, గత పదేళ్లలో రెండు వేల మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో మరణించారు. కానీ వారిని ఏ విధంగానూ ఆదుకోవడానికి కనికరం చూపని కర్కశకుడు కేసీఆర్. ఈ మాట ఎంతో బాధతో అనవలసి వస్తోంది.
వ్యవసాయ నేపథ్యం ఉన్న వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి అయితే రైతాంగం సంతోషపడినట్లే పూర్వ ఆశ్రమంలో గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు ఇప్పించే వ్యవస్థలో పనిచేసిన వ్యక్తి ఉన్నత స్థానంలోకి వస్తే తమ సమస్యలు తీరుతాయని గల్ఫ్ కార్మికులు ఆశపడ్డారు. దానికి తోడు, ఆ వ్యక్తి ఉద్యమానికి నాయకత్వం వహించి ఏకంగా ముఖ్యమంత్రి అయితే తప్పకుండా తమకు మేలు చేస్తాడని ఆశిస్తారు. ఒకనాడు ఆయన ‘దుబాయి శేఖర్’ గా పేరొందారు. తర్వాత “బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి” అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుకు నడిపిన యోధుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని గల్ఫ్ కార్మికులు ఎంతగానో అభిమానించారు. కానీ, ఆయన ఈ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గల్ఫ్ కార్మికుల విషయం ఒక్కటే కాదు, ఈ పుస్తకంలో రమేష్ రాసినట్లు అనేక అంశాల్లోనూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు కేసీఆర్ సుదీర్ఘ పరి పాలన ఒక భంగపాటే. ఈ పదేళ్ల నిరీక్షణ ఒక దగా, ఒక మోసం, ఒక వంచననే.
గల్ఫ్ కార్మికుల పట్ల సానుకూలంగా ఉన్న కె.ఆర్.సురేష్ రెడ్డి, దాసోజు శ్రవణ్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ లో చేరినంక తమ మూతులకు ప్లాస్టర్లు వేసుకున్నారు. ఉద్యమ కాలంలో గల్ఫ్ దేశాల పర్యటనలు చేసినప్పుడు గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం, సంక్షే మం కోసం మాట్లాడిన ఈటల రాజేందర్, తన్నీరు హరీష్ రావులు టీఆర్ఎస్/బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రులుగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ గల్ఫ్ సంక్షేమానికి వారు ఎలాంటి నిధులు కేటాయించలేదు. మొత్తంగా రాష్ట్రం ఏర్పాటయ్యాక వరుసగా నాలుగు బడ్జెట్ లలో టీఆర్ ఎస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించలేదు. శాసన సభ ఎన్నికలకు వెళ్లేముందు 2018-19 ఆర్ధిక సంవత్సరానికి ఐదవ బడ్జెట్ ప్రకటిస్తూ ఎన్నారై సంక్షేమం పేరిట రూ.100 కోట్లు కేటాయించినట్లు మాటలు చెప్పింది. కానీ ఆచరణలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ విషయంలో కేసీఆర్ అయిష్టంగా ఉన్నాడని చెప్పి ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఉన్నప్పుడు తప్పించుకున్నాడు. తర్వాత పార్టీ మారి బీజేపీలో చేరాడు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచాడు కూడా. మరి ఏం చేస్తాడో చూడాలి!
గల్ఫ్ కుటుంబ సభ్యులు కనీసం ఒక ‘ఓటు బ్యాంకు’ గా మారడం వల్లనైనా ఈ బాధితుల అంశం రాజకీయాల్లో ప్రధానం అవుతుందని మేమంతా భావించినం. స్వయంగా మనమే ఎన్నికల్లో పోటీ చేసి, ఎలుగెత్తి మన సమస్య వినిపించాలని పోరుబాట పట్టినం. కానీ ఆ ప్రయోగం ఆశించిన ప్రయోజనం ఇవ్వలేదు. రమేష్ బాబు దీన్ని కూడా రికార్డు చేశాడు.
వీటన్నిటినీ రమేష్ బాబు చర్చించాడు. గల్ఫ్ కార్మికులే కాదు, పాలమూరు లేబర్ నుంచి సింగరేణి గని కార్మికుల దాకా, అలాగే బతుకమ్మ చీరల పేరిట కోట్లాది రూపాయల బడ్జెట్ ఖర్చు చేసి కూడా సిరిసిల్ల నేత కార్మికుల జీవితాల్లో మార్పురాని విషయాన్ని కూడా వివరంగా చర్చించాడు. ఆ వ్యాసాలను ఒకచోట కూర్చి పుస్తకంగా తేవడం భావితరాలకు ఉపయుక్తం. అది స్వరాష్ట్రం వచ్చినంక పదేళ్ళ పాటు జరిగిన నష్టాన్ని అక్షరాలా చరిత్ర వెలుగులో పెట్టడమే అని నేను భావిస్తున్నాను. ఇది అవసరం. మంచి కోసం, మార్పు కోసం, ఆత్మ విమర్శ కోసం.
ఇక్కడ ఇటీవల మేం చేసిన ఒక ప్రయోగం గురించి తప్పక చెప్పాలి. గల్ఫ్ కుటుంబ సభ్యులు కనీసం ఒక ‘ఓటు బ్యాంకు’ గా మారడం వల్లనైనా ఈ బాధితుల అంశం రాజకీయాల్లో ప్రధానం అవుతుందని మేమంతా భావించినం. స్వయంగా మనమే ఎన్నికల్లో పోటీ చేసి, ఎలుగెత్తి మన సమస్య వినిపించాలని పోరుబాట పట్టినం. కానీ ఆ ప్రయోగం ఆశించిన ప్రయోజనం ఇవ్వలేదు. రమేష్ బాబు దీన్ని కూడా రికార్డు చేశాడు. ‘ఆ ముగ్గురి వల్లే ఐదుగురి అవతరణ’ అన్న వ్యాసం ‘ఏరు దాటాక తెప్ప తగలేసిన’ వారికి చెంపదెబ్బ.
ఐతే, మా ఎన్నికల ప్రయోగానికి పూర్వరంగం ప్రస్తావన కొంచెం వివరించి చెప్పక తప్పదు. గల్ఫ్ బాధితులు ఒక నిరసన రూపంగా ఎన్నికలను ఎందుకు ఎంచుకున్నారో వివరించాలి.
సాధారణంగా వలసలకు గల కారణాలను రెండు రకాలుగా విశ్లేషిస్తుంటాం. మొదటిది పుష్ ఫ్యాక్టర్ (నెట్టివేసే కారకం), రెండవది పుల్ ఫ్యాక్టర్ (ఆకర్షించే కారకం). మొదటి దాని ప్రకారం ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడం, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, సామాజిక వివక్ష, నక్సలిజం సమయంలో కల్లోల పరిస్థితుల నుంచి రక్షించుకోవడం వంటి రకరకాల ‘పుష్ ఫ్యాక్టర్స్’ వలసలకు దోహదపడ్డాయి. ఇక, ఇతరులు బాగా సంపాదిస్తున్నారు కాబట్టి తాము కూడా వలస వెళ్ళాలి, మరింత మెరుగైన జీవనం కోసం అంటూ ఆశతో, ఆకర్షణతో వలస వెళ్లడం జరుగుతోంది. దీన్ని ‘పుల్ ఫ్యాక్టర్స్’ గా చెబుతాం. కానీ, మౌలికంగా సమైక్య పాలనలో మన తెలంగాణ ప్రాంతం వెనుకబాటుకు గురవడం అన్నది వలసలకు ప్రధాన భూమిక అని గుర్తించాలి. ఈ ‘గుర్తింపు’, ‘సోయి’ మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఇరుసుగా పని చేసిందనడంలో సందేహం లేదు. అందులో గల్ఫ్ కార్మికుల కుటుంబాలు కూడా ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకున్నాయి. సకలజనులతో కలిసి కదం తొక్కాయి. స్వరాష్ట్రం సిద్దించడంలో వారి పాత్ర కూడా ప్రముఖం.
ఉవ్వెత్తున ఎగిసిన ఈ ఉద్యమంలో కెసిఆర్ రగిల్చిన “బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి” నినాదం చాలా కీలకమైనది. అప్పటి ఉద్యమ స్ఫూర్తి, చైతన్యం, ఈ నినాదం గల్ఫ్ కార్మికులను ఉత్తేజితం చేసింది. తమ హక్కుల కోసం పోరాడేలా చేసింది. వారిని రాజకీయంగా సంఘటితమయ్యేలా చూసింది. ప్రత్యేక తెలంగాణ కోసమే ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారేలా చేసింది. మలిదశ ఉద్యమంలోనే మొదటి సారిగా గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఒక ‘ఓటు బ్యాంకు’ గా రూపు దిద్దుకోవటం జరిగింది. ఆ సమయంలో ఇతర రాజకీయ పార్టీలు సైతం గల్ఫ్ సమూహాన్ని గుర్తించడం కూడా మొదలైంది. కానీ రాష్ట్రం సిద్దించిన తర్వాత అందివచ్చిన ఆ చైతన్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వలస కార్మికులకోసం తెలంగాణ ప్రభుత్వం ఉద్యమంలో నినదించినట్లు ఏనాడూ మళ్ళీ నడుం కట్టలేదు.
ఎప్పుడో ఢిల్లీలో గల్ఫ్ రిక్రూటింగ్ విషయంలో జరిగిన అవమానం, చేదు జ్ఞాపకాలను గుర్తు పెట్టుకుని గల్ఫ్ కార్మికులపై ప్రతీకార ధోరణితో వ్యవహరించాడని, అందుకే ఇచ్చిన హామీలను కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా విస్మరించాడని గల్ఫ్ కార్మికులు నమ్ముతున్నారు. అది నిజం కాదన్న విశ్వాసం ఇచ్చేలా ఆయన తనయుడు కేటీఆర్ కూడా వ్యవహరించలేదు. నాడు ఎన్నారై మంత్రి హోదాలో అనేక సార్లు మాట ఇచ్చిన కేటీఆర్ కూడా నిస్సిగ్గుగా తన వైఖరిని మార్చుకున్నాడు. దాంతో ఉద్యమంలో భాగస్వాములైన వారితో పాటు సామాన్య జనంలోనూ నిరసన పెరిగింది. రమేష్ అన్నట్టు, అది ప్రభుత్వాన్ని దించేందుకు ఓటును ‘నిశ్శబ్ద ఆయుధం’ చేసుకునేలా చేసింది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విశేష పాత్ర వహించిన గల్ఫ్ కుటుంబాలతో సహా ప్రవాస తెలంగాణీయులు అందరూ దాదాపు అసంతృప్తికి గురయ్యారు. వారిని ఏనాడు ప్రభుత్వం మాతృభూమికి ఆహ్వానించలేదు. తగిన గుర్తింపు ఇవ్వలేదు. వారు ఒక అభినందనకు, గౌరవానికి కూడా నోచుకోలేదు. గల్ఫ్ కార్మికులు, వారి బాగోగులు చూసిన సంఘాలను మాత్రమే కాదు, ఉద్యమంలో ఉపయోగపడ్డ ఎన్నారైలు ఎవ్వరినీ తెలంగాణ ప్రభుత్వం గౌరవించలేదు. ప్రపంచ తెలుగు మహాసభలకు మాత్రం టీఆర్ఎస్, తెలంగాణ జాగృతిలకు అనుబంధంగా ఉన్న ప్రవాసీలను, మరి కొందరిని విదేశాల నుంచి ప్రభుత్వ ఖర్చుతో ఆహ్వానించారు తప్ప వీరందరూ ఆశించినట్టు, డిమాండ్ చేసినట్టు విధాన పరమైన నిర్ణయం ఒక్కటీ తీసుకోలేదు.
తెలంగాణ జాగృతి అన్ని శాఖలను రద్దు చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత అంతకు ముందే ప్రకటించారు. నిజాయితీ, నిబద్ధత, సరైన సంస్థాగత నిర్మాణం, బలమైన పునాదులు లేకపోవడంతో అవి తమ ఉనికిని కోల్పోయాయి. ఇదంతా చకచకా జరిగినట్లు అనిపిస్తుంది గానీ వైఫల్యాలన్నిటికీ బీజాలు ఉన్నాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నారైలు ‘ప్రవాసి తెలంగాణ దివస్’ లను ప్రతి ఏటా డిసెంబర్ లో స్వతంత్రంగా నిర్వహించే వారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ వేడుకలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తుందని మేమందరం భావించాం. కానీ అది కూడా జరగలేదు.
“బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి” నినాదం ఇచ్చిన కేసీఆర్ తో పాటు ఎన్నో హామీలు ఇచ్చిన కేటీఆర్, కవితలు కూడా మాట ఇచ్చి తప్పుకున్నారు. ఒక్క మాటలో వీళ్ళు గల్ఫ్ కార్మికులను నమ్మించి గొంతు కోశారు. వారి బతుకులతో ఆడుకున్నారు. పదేళ్ళలో ఈ నేతల ముసుగులు తొలిగిపోయాయి. పెట్టుకున్న భ్రమలు పటా పంచలయ్యాయి. పూడ్చలేని నష్టం చేసిన ఆ ముగ్గురూ ‘గల్ఫ్ ద్రోహులు’ గా చరిత్రలో నిలిచి పోయారు. అంతేకాదు, ఆఖరికి ఏమైంది? 2023 నవంబర్ శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్నే కోల్పోయింది. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిది ఎంపీ స్థానాల నుంచి జీరోకు పడిపోవడంతో బీఆర్ఎస్ బలహీనమైంది. క్యాడర్ నిరుత్సాహంలో ఉంది. ఆ ప్రభావంతో విదేశాలలో విస్తరించిన బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కూడా నిర్వీర్యం అయింది. తెలంగాణ జాగృతి అన్ని శాఖలను రద్దు చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత అంతకు ముందే ప్రకటించారు. జాగృతి ప్రవాసి విభాగాలు కూడా రద్దయ్యాయి. నిజాయితీ, నిబద్ధత, సరైన సంస్థాగత నిర్మాణం, బలమైన పునాదులు లేకపోవడంతో అవి తమ ఉనికిని కోల్పోయాయి. ఇదంతా చకచకా జరిగినట్లు అనిపిస్తుంది గానీ వైఫల్యాలన్నిటికీ బీజాలు ఉన్నాయి. మేం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు.
ఈ పరిణామాలను ముందుగానే భేరీజు వేసుకుంటూ, కేసీఆర్ పాలనా వైఫల్యాలను గమనిస్తూ గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గాల్లో మనమే ఎందుకు పోటీ చేయకూడదని మేమే ఒక ప్రయోగానికి నడుంకట్టాం. శాసన సభ ఎన్నికల అంకాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుందాం అని గల్ఫ్ కార్మిక సంఘాలు కలిసి కట్టుగా నిలబడటంతో ‘గల్ఫ్ జెఏసి’ గా ఏర్పాటయ్యాం. 2023 నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేశాం. కానీ ఎన్నికల రాజకీయాల్లో కులం, డబ్బు, మద్యం వంటి వాటిని తట్టుకుని ఒక సమస్యను ఎజెండా మీదికి తేవడం ఎంత దుస్సాహసమో అనుభవం మీద తెలుసుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల ప్రయోగం అంత తేలిక కాదని గుర్తించాం. మేము నిలిపిన ఐదుగురిలో ఏ అభ్యర్థి కూడా వేయి ఓట్లను మించి సాధించక పోవడం మమ్మల్ని తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ అభ్యర్థులు, వారు పోటీ పడిన క్రమం గురించి రమేష్ బాబు రాసిన వ్యాసం మా ప్రయత్నాన్ని వివరంగా తెలియజేసింది.
సారూప్యం లేకపోయినా మా ప్రాంతంలోని ఎన్నికల ప్రయోగం మరొకటి ఇక్కడ ప్రస్తావించాలి. అక్కడే… పాత సిరిసిల్ల తాలూకా (నేటి సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలు ఈ పరిధిలోనివే) మొదలు అటవీ ప్రాతం అధికంగా ఉన్న నిజామాబాద్ వరకూ వలసలు పెరగడానికి మరో నేపథ్యం ‘పుష్ ఫ్యాక్టర్’ కూడా ఉందని చెప్పుకోవచ్చు.
అది 1980-1990ల మధ్య కాలం. ఇక్కడ భూస్వామ్యాన్ని ఎదిరిస్తూ రెండు విప్లవ పార్టీలు – పీపుల్స్ వార్, జనశక్తిలు ఉధృతంగా పనిచేశాయి. వెట్టి చాకిరి, కూలీ రెట్లు మొదలు కుల వివక్ష, అణచివేతలని ప్రతిఘటిస్తూ ఆత్మగౌరవం కోసం ఆ రెండు పార్టీల సమరశీల పోరాటాలు నిర్వహించాయి. ఆ పార్టీల పోరాటాలు, సాయుధ దళ చర్యల ఫలితంగా ప్రభుత్వ నిర్భంధం తీవ్రమైంది. పోలీసు బలగాలు పెరిగి పోయాయి. క్రమంగా వర్గ పోరాటానికి తోడు కొత్తగా ఇరుపార్టీల ఆధిపత్య సవాళ్ళు కూడా మొదలయ్యాయి. దాంతో అంతకు ముందరి ఆ ‘కల్లోలిత ప్రాంతం’ మరోసారి అట్టుడుకి పోయింది. ప్రజా జీవనం తీవ్రమైన అభద్రతకు గురైంది. వీటి మధ్య వలసలు ముమ్మరం కావడం ఒక వాస్తవం. స్థానిక విప్లవ చరిత్రలో ఒక విషాద ఘట్టం ఇది.
ఒక విప్లవ పార్టీ ఆంధ్రా ప్రాంతం నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్వీ క్రిష్ణయ్యను తెలంగాణలో పోటీ చేయించడం, అతను గెలవడం ఇక్కడి ప్రజల విశాల హృదయానికి, విప్లవ చైతన్యానికి నిదర్శనం. అయితే అది గతం. ఇప్పుడు ఆ రెండు విప్లవ పార్టీలు క్షీణించాయి. అక్కడే కాదు, అంతటా రాజకీయాల్లో విలువలు లోపించాయి.
అటు రాజ్యం, ఇటు రెండు విప్లవ పార్టీల మధ్య ఘర్షణ కారణంగా వేలాది మంది వలస వెళ్ళ వలసి వచ్చింది. ఆఖరికి బొంబాయి, దుబాయి (గల్ఫ్) వంటి ప్రాంతాలు షెల్టర్ జోన్లుగా మారాయి అంటే ఈ పరిణామాల మధ్య వలస పోవడమే ‘బతుకు జీవుడా’ అన్నట్టుగా మారిందని చెప్పాలి. ఇది విడిగా అధ్యయనం చేయాల్సిన విషయం. జనశక్తి అగ్రనేత రాజన్నను ఈ అంశంపై రమేష్ సూటిగా ప్రశ్నించినప్పటికీ అతడి నుంచి సరైన సమాధానం రాలేదనే నేను భావిస్తున్నాను. చరిత్రలో ఈ అధ్యాయం విడిగా చర్చించవలసి ఉంటుంది. ఏమైనా ఈ కల్లోల పరిస్థితుల మధ్య ‘బతకడం’ ఒక పోరాటం అయింది. సరిగ్గా ఈ కాలంలోనే జనశక్తి ‘ఎన్నికల ప్రయోగం’ ఒకటి జరిగింది.
ఆ కాలంలో ఎన్నికల బహిష్కరణకు విప్లవ సంస్థ పీపుల్స్ వార్ పిలుపు ఇస్తోంది. ఆ పార్టీ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనే నినాదం ఇచ్చింది. అదే సమయంలో జనశక్తి (సిపిఎంఎల్ సీపీ గ్రూప్) ‘ఎన్నికలు – ఎత్తుగడ’ అనే విధానాన్ని పాటించి స్వేచ్ఛ కోసం ఒక వెసులుబాటును ఉపయోగించుకున్నది. నిర్బంధ కాలంలో స్వేచ్ఛగా ప్రచారం చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా చట్ట బద్దంగా ప్రచారం చేసుకునే అవకాశాన్ని ఆ పార్టీ వాడుకున్నది. ఆ క్రమంలో 1989లో సిరిసిల్ల నుంచి ఎన్.వి. క్రిష్ణయ్య ఎమ్మెల్యేగా కూడా గెలిచిండు. ఒక విప్లవ పార్టీ ఆంధ్రా ప్రాంతం నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్వీ క్రిష్ణయ్యను తెలంగాణలో పోటీ చేయించడం, అతను గెలవడం ఇక్కడి ప్రజల విశాల హృదయానికి, విప్లవ చైతన్యానికి నిదర్శనం. అయితే అది గతం. ఇప్పుడు ఆ రెండు విప్లవ పార్టీలు క్షీణించాయి. అక్కడే కాదు, అంతటా రాజకీయాల్లో విలువలు లోపించాయి. ఎన్నికలు మరింత ఖరీదుగా మారాయి. దీనికి తోడు మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం, ఆయన పార్టీ ఎక్కడికక్కడ అన్ని చైతన్యాలను నిస్తేజం చేసింది. మరోవైపు ఎన్నికలను అత్యంత ఖరీదైన రాజకీయ క్రీడగా మార్చివేసింది. అంతేకాదు, సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ని తమ అభ్యర్థిగా నిలబెడుతూ ఆ స్థానంపై అన్ని విధాలా పట్టు సంపాదించుకుంది. వీటన్నిటి మూలంగా ఇక్కడే కాదు, మేం పోటీ చేసిన మిగతా నాలుగు నియోజక వర్గాల్లోనూ గల్ఫ్ కుటుంబాలను ఒక ‘ఓటు బ్యాంకు’గా కూడగట్ట లేకపోవడం మాకొక చేదు అనుభవాన్ని మిగిల్చింది.
‘ఎన్నికలు – ఎత్తుగడ’ అన్న విషయంలో మన రాష్ట్రానికి సంబంధించి మరో రెండు అనుభవాలు కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఫ్లోరోసిస్ అంశం దేశవ్యాప్తంగా తెలిసి రావడానికి 1996లో నల్గొండ ఎంపీ స్థానానికి 480 నామినేషన్లు వేసిన విషయం ఒకటి. అలాగే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ లోకసభకు 2019లో 180 మంది పసుపు రైతులు పోటీ చేయడం రెండవది.
ఒకటి మాత్రం మరోసారి స్పష్టమైంది. గల్ఫ్ కార్మికులు సుదూర తీరాల నుంచి రారు. ఓటు వేయరు. తమ కుటుంబ సభ్యుల ద్వారా మాత్రమే ప్రభావితం చేస్తారనేది స్పష్టం. కానీ, అనేక అంశాల ఆధారంగా ఇక్కడి ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు తప్ప కేవలం గల్ఫ్ సంక్షేమం, స్థితిగతుల ఆధారంగానే వారు ఓటు చేయరు. వీటి కన్నా ఇతర అంశాలకే వారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఐటీవలి అసెంబ్లీ, లోకసభ ఎన్నికల సరళి తెలుపుతున్నది.
భారతదేశం 140 కోట్ల జనాభా కలిగి ఉండగా ఇందులో 1 కోటి 50 లక్షల మంది ఎన్నారైలు ఉన్నారు. మరో కోటిన్నర మంది విదేశీ పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన పిఐఓలు ఉన్నారు. దేశ జనాభాలో భారత ప్రవాసులు (ఎన్నారైలు మరియు పిఐఓలు) కేవలం 2.15 శాతం మాత్రమే. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్లు (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారత్ కు పంపారు. ఇందులో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. వీరంతా ఆర్థికంగా దేశాన్ని బతికించగలరే గానీ తమ బతుకులకు తాము నిర్దేశించుకునే రాజకీయ లక్ష్యంలో మటుకు అసంఘటితం అని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి చాటి చెప్పాయి.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో స్కాట్టర్డ్ (చెల్లాచెదురుగా) ఉన్న ప్రవాసులు భౌతికంగా ఒకచోట కలుసుకోవడం అసాధ్యం. భౌతికంగా వారిని యూనియనైజ్, ఆర్గనైజ్ (సంఘటితం, ఐక్యం) చేయడం కష్టం. కానీ, వర్చువల్ (ఆన్ లైన్) లో వారిని ఒకతాటి పైకి తేవడం కష్టమేమి కాదు. ఆన్ లైన్ ఓటింగ్ పద్ధతి అమలులోకి వస్తే ఇది మరింత సులువు అవుతుందేమో చూడాలి.
ఈ పుస్తకం చివరి భాగంలో రమేష్ అభివర్ణించినట్లు కేసీఆర్ ఒక ‘డాక్టర్ ఫాస్టస్.’ ఉద్యమ నేతగా, రాష్ట సాధకుడిగా, ప్రజల్లో గొప్ప ఆరాధ్యుడిగా ఒక వెలుగు వెలిగిన కేసీఆర్ పదేళ్ళ పరిపాలన అనంతరం అధముడుగా, గల్ఫ్ కుటుంబాల దృష్టిలో విలన్ గా దిగజారిపోయాడు. ఇది ఖచ్చితంగా స్వయంకృతం.
ఐతే, మా ప్రయోగంలో భాగంగా గల్ఫ్ జేఏసి అభ్యర్థులు కేటీఆర్ పోటీ చేసిన సిరిసిల్లతో సహా ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గల్ఫ్ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారుతున్న విషయాన్ని గమనించిన కేసీఆర్, కేటీఆర్ లు ఎన్నికలకు వారం రోజుల ముందు నష్టనివారణ చర్యలకు దిగారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తామని, అందులో గల్ఫ్ కార్మి కులను కూడా చేరుస్తామని కామారెడ్డి సభలో కేసీఆర్ అన్నారు. ఎల్లారెడ్డిపేట రోడ్ షో లో మాట్లాడిన కేటీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి నుంచి రైతు బీమా మాదిరిగా గల్ఫ్ బీమాను అమలు చేస్తామని అన్నారు. ఐతే, ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ అంశం ప్రస్తావించకుండా సభల్లో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన మాటలను ప్రజలు పెద్దగా విశ్వసించలేదు గానీ చివరికి తమ వైఖరి మార్చుకునే స్థితిలోకి నెట్టబడ్డారు.
మొత్తానికి గల్ఫ్ ఓటు బ్యాంకు అనేది ఒక చిన్న సమూహం, దాని ప్రభావం పరిమితమైనదనే తండ్రీ కొడుకులు నమ్మారు. ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకులాగా అది ఒక్కతాటిపై ఉండదనే వీరనుకున్నారు. గల్ఫ్ ఓటర్లు పార్టీలుగా విడిపోయి ఉన్నారనే అభిప్రాయం కలిగిన కేసీఆర్, కేటీఆర్ లు గల్ఫ్ అంశాన్ని మొదట లైట్ గా తీసుకున్నారు. మా బలగం ఐదుగురు పోటీ చేయడం, నిరంతరం గల్ఫ్ సమస్యలపై వివిధ పార్టీల వైఖరిని చాటి చెబుతూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నప్పటికీ వారు లెక్కచేయలేదు. ఎప్పుడైతే తమ గెలుపు ప్రశ్నార్థకం అవుతున్నదన్న ఒత్తిడికి, ఓటమి భయానికి గురయ్యారో అప్పుడు గల్ఫ్ అంశంపై కేసీఆర్, కేటీఆర్ లు తప్పని పరిస్థితిలో స్పందించారు. ఇది గల్ఫ్ కుటుంబాల ఓటు నిర్ణయాత్మకం అవుతుందన్న మా విశ్వాసానికి, ప్రయోగానికి చివరి నిమిషంలో కొంత నైతిక బలాన్ని ఇచ్చింది. ఐతే, అంతకుముందు వారు చేసిన వాదన కూడా అసంబద్ధం. వలసలు తగ్గాయని, తిరుగు వలసలు మొదలయ్యాయని వాదించారు. అలాగే హైదరాబాద్ లో నిర్మాణ రంగంలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. ఇక్కడే ఉపాధి ఉంది కాబట్టి గల్ఫ్ దేశాలకు వెళ్లడం అవసరం లేదనే కొత్త వాదన కూడా కేసీఆర్ తెరమీదికి తెచ్చాడు. వ్యవసాయానికి నీళ్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వలస వెళ్లడం ఎందుకనే ధోరణి కూడా కనబర్చాడు. టెలిఫోన్ సంభాషణల్లో గల్ఫ్ కార్మికులను తిట్టిపోశాడు. కరోనా సమయంలో క్వారంటైన్ కు డబ్బులు వసూలు చేశాడు. పునరావాసం, పునరేకీకరణ సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించలేదు. ఇలాంటివి ఎన్నో కలిసి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని చవి చూసింది.
ప్రభుత్వంపైనే కాదు, వ్యక్తిగతంగా కేసీఆర్ కుటుంబ పాలనపై కూడా నిరసన వ్యక్తమైంది. దుబాయిలో నిజమైన బతుకమ్మ వేడుకల నుంచి బుర్జ్ ఖలీఫాపై కోటి రూపాయలు ఖర్చు చేసి లేజర్ బతుకమ్మ ప్రదర్శన చేయడం దాకా ‘ఎదిగిన’ కవిత కూడా ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయింది. బతుకమ్మ ఉత్సవాల నుంచి మొదలై సింగరేణి గనుల్లో అక్రమాలు చేసేదాక ఎదిగిన కవితపై రమేష్ ‘ఇచ్కపోయిన బతుకమ్మ’ పేరిట రాసిన వ్యాసమే అందుకు నిదర్శనం.
ఈ పుస్తకం చివరి భాగంలో రమేష్ అభివర్ణించినట్లు కేసీఆర్ ఒక ‘డాక్టర్ ఫాస్టస్.’ ఉద్యమ నేతగా, రాష్ట సాధకుడిగా, ప్రజల్లో గొప్ప ఆరాధ్యుడిగా ఒక వెలుగు వెలిగిన కేసీఆర్ పదేళ్ళ పరిపాలన అనంతరం అధముడుగా, గల్ఫ్ కుటుంబాల దృష్టిలో విలన్ గా దిగజారిపోయాడు. ఇది ఖచ్చితంగా స్వయంకృతం. నాయకులు శాశ్వతం కాదు. ప్రజలే అజేయులు, వారే చరిత్ర నిర్మాతలని మరోసారి నిరూపించిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా జేజేలు తెలుపుకుంటున్నాను. అదే సమయంలో ఇన్ని అనుభవాల నేపథ్యంలో నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు బాధ్యతతో నడుచుకుంటారని ఆశిస్తున్నాను.
ముందుమాట రాసే క్రమంలో ఈ అనుభవాన్ని ఒక ఆత్మ విమర్శగా పంచుకుంటూ మూడు వలస ప్రాంతాలపై చూపు నిలిపిన రమేష్ బాబును అభినందిస్తున్నాను. మొత్తం తెలంగాణ వినవలసిన విషయాలను పుస్తకంగా తెస్తు న్నందుకు సంతోషిస్తున్నాను.
నాడైనా నేడైనా మా ఉద్దేశ్యం ఒక్కటే. గల్ఫ్ కార్మికుల అంశాన్ని, అందులోని మంచి చెడులను, చేయవలసిన పనులను ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు విన్నవిస్తూ, హెచ్చరిస్తూ పరిష్కారాలు వెతకాలనే. అవసరం ఐనప్పుడు ఎన్నికలలో పాల్గొనాలనే. అందుకోసం గల్ఫ్ కార్మికుల సమస్య ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే చెందినదిగా కాకుండా వారికి సమిష్టిగా మద్దతు కూడగట్టడం అవసరం అని మేం నమ్ముతున్నాం.
కష్టాల్లో ఉన్న వర్గాలవారు తమ హక్కుల కోసం పోరాడుతూ సమాజంలోని ఇతర వర్గాలవారి మద్దతు తీసుకోవాల్సిందే. ఉదాహరణకు బాలలకు ఓటుహక్కు ఉండదు. తమ ఇబ్బందులను తమంతట తాము చెప్పలేరు. వారి పక్షాన సమాజం పోరాడుతుంది. ఇదే విధంగా గల్ఫ్ కార్మికుల సమస్యలపై మొత్తం సమాజం స్పందించేలా పోరాటాలకు రూపకల్పన చేయాలన్నది మా అభిమతం. ఇది ఎన్నికల ప్రయోగానంతరం కలిగిన ఏకాభిప్రాయం.
ముందుమాట రాసే క్రమంలో ఈ అనుభవాన్ని ఒక ఆత్మ విమర్శగా పంచుకుంటూ మూడు వలస ప్రాంతాలపై చూపు నిలిపిన రమేష్ బాబును అభినందిస్తున్నాను. మొత్తం తెలంగాణ వినవలసిన విషయాలను పుస్తకంగా తెస్తు న్నందుకు సంతోషిస్తున్నాను. ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల అందరి తరఫునా, వారి సమస్యలను పుస్తకంలో ప్రముఖంగా చర్చించినందుకు కందుకూరి రమేష్ బాబుకు కృతజ్ఞతలు, హృదయపూర్వక శుభాకాంక్షలు.
23.06. 2024
పుస్తకం వెల నాలుగు వందలు, కొరియర్ చార్జెస్ కలిపి ఐదు వందలు. పుస్తకం కావాలంటే రచయిత మొబైల్ కు – 9948077893 కి గూగుల్ పే లేదా ఫోన్ పే చేయగలరు. పూర్తి చిరునామా, పిన్ కోడ్, మొబైల్ నంబర్ పంపడం మరచిపోవద్దు.