Editorial

Friday, May 2, 2025
Opinionముంబాయి నేపథ్యం : కాలపు చలనంలో విపరిణామం - ఎం. రాఘవాచారి ముందుమాట

ముంబాయి నేపథ్యం : కాలపు చలనంలో విపరిణామం – ఎం. రాఘవాచారి ముందుమాట

ఒక అవసరం అయిన తెలంగాణ అనుభవం తెలంగాణకు వినిపించిన పుస్తకం ఇది. ఇందులోని వ్యాసాలన్నీ పదేండ్ల కేసీఆర్ పాలన లో ఏం జరిగిందో విచ్చుకున్న పత్తికాయలుగా విప్పి చూపినవి.

-ఎం. రాఘవాచారి
పాలమూరు అధ్యయన వేదిక

అది 2023 అక్టోబర్ నెల. ఒకరోజు కందుకూరి రమేష్ బాబు ఫోన్ చేసి మా ఊరి స్థితిగతులు తెలుసుకునేందుకు పర్యటనకు వస్తానన్నాడు. సంతోషమైంది. నేనూ తోడుం టానన్నాను. నాకు మా ఊరంటే మహబూబునగర్ జిల్లా అంతా. తెరాస చేతిలో మా ఊరు అక్కసుతో పగలేసిన అద్దంలా ముక్కలు చెక్కలైంది. ఆ మా ఊరిని మీరిప్పుడు ఏడు జిల్లాలు తిరిగితేనే చూడగలుగుతారు. బలమైన రాజకీయ అధికార చక్రబంధంలో మా ఊరు గిజగిజలాడుతుండింది. ఆ మా ఊరిని చూడాలని మన రమేష్ కుతూహలం. వచ్చాడు. వచ్చి ఫోన్ చేస్తే నేను ఆసుపత్రిలో ఉన్నాను. ఎక్కడున్నావంటే మా ఊరి మీద నీడలు పరిచిన హైదరాబాదులో ఉన్నాననుకుని అదే చెప్పాను.

ఆయన ఈ జిల్లాలో ప్రధానంగా ఇద్దరు మంత్రుల నియోజకవర్గాలు తిరిగి తన పర్యటన అనుభవాలు రాస్తూ వెళ్ళిపోయాడు. అవి చదివి ఆయనతో చాలా చర్చించాను. మహబూబునగర్ లో మా పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రారంభంలోను, కొనసాగిన పోరాటంలోనూ మా పాత్ర, సాధించుకున్న తెలంగాణలో జరుగుతూ వచ్చిన అన్యాయాలు, అబద్ధపు ప్రచారాలు, అనుభవించిన తీవ్ర ఉక్కపోత – అన్నీ మాట్లాడాను. విద్య తదితర విషయాలలో ఆయనకుండిన ప్రశ్నలు, అనుమానాలు మాట్లాడాను. పాల మూరు అధ్యయన వేదికలో మా సహచరుడు కే.సీ.వెంకటేశ్వర్లు (ఉదయ్) ఆయన్ని కలిసి మాట్లాడాడు. ఆ తరువాత ఆయన తెలంగాణలో కీలక ప్రాంతాలు, నియోజక వర్గాలు తిరుగుతూ పొందిన అనుభవాలు, చూసిన, విన్న వాటికి తన అనుభవాలు, జ్ఞాపకాలు జోడించి రాసిన ఆగ్రహం, ఆవేదన, బాధ, హెచ్చరికలు సోషల్ మీడియాలో చదివాను. ఆయనకు చాలా దగ్గరగా, చాలా విషయాలలో ఏకాభిప్రాయంతో కనె క్టయ్యాను.

రమేష్ నాకు మూడు దశాబ్దాలుగా తెలుసు. వలస మృతుల ఘటనల నిజ నిర్ధారణలో కలుసుకున్నాం. ఆయన చాలా క్రియాశీలి. చేతిలో కెమెరా ఉంటుంది. మనసులో ఏదో ఒక ప్రణాళిక వుంటుంది. దగాపడిన జీవితాల ‘సామాన్యశాస్త్రం’ ఆయన వస్తువు. పత్రికలో, జర్నలిస్టుల సంఘాలలో, తెలంగాణ పోరాటంలో పనిచేసిన ఆయన లోలోపల రగులుతూ వుండే ఎజెండాతోనే ఉంటాడు. నేను ఆశ్చర్య పడుతుంటాను. తిరిగి తిరిగి వచ్చి ఏనాటి కానాడు రాసిన వ్యాసాలు మూడు భాగాలుగా ఒక పుస్తకంగా తేవాలనుకుని ఆ పనిలో నాకూ భాగం కల్పించాడు. రాసిన వ్యాసాలని ‘విను తెలంగాణ’ శీర్షికన రాశాడు. అన్నిటినీ ఒక చోటకు తెచ్చి, వలస ప్రాంతాల నుంచి ముందుమాటలు రాయటానికి ముగ్గురిని ఎంచుకుని నన్నూ రాయమన్నాడు. ‘విను తెలంగాణ’ అన్నాడు కనుక విన్నాను. అన్నీ ఒక దగ్గర చదివి ఈ పుస్తకం రావలసిందే అనుకున్నాను. తెలంగాణ సొంత రాష్ట్రంలో సొంత పాలకులతో ఎంత వంచనకు, ఎంత విధ్వంసానికి, ఎన్నెన్ని విషాద బీభత్సాలకు గురయిందో ఆలోచించినపుడు ఇలాంటి పుస్త కాలు పది వచ్చినా తెలంగాణను అలుముకున్న పదేండ్ల చీకట్లు తెల్లరిపోతాయా అని పించింది.

***

రమేష్ ఎంచుకున్న శీర్షిక బాగుంది. ‘విను తెలంగాణ’ అంటే అందరం వినాలని. తెలంగాణను తెలంగాణ వినాలని. రాసిన పద్ధతీ బాగుంది. ఫోటో చిత్రకారుడు కనుక సమస్యను దాని వివిధ పార్శ్వాలను చూసిన పద్ధతి, పద చిత్రికలు కట్టిన పద్ధతి చాలా బాగుంది. ఆయన తన కళ్ళతో, తన కెమెరా కళ్ళతో, తాను సంభాషించిన ప్రజల కళ్ళతో, ఆ హృదయాలతో చూసి సున్నితమైన విషయాలను సున్నితంగా, కఠినమైన విష యాలను సూటిగా ప్రకటించాడు. ఎదురైంది ఎంతటి మొనగాడి నామవాచకమైనా ప్రజ లకు నిబద్ధమై చెబుతున్నాడు గనుక అంతే సూటిగా చెప్పాడు. తాను అర్థం చేసుకున్న పద్ధతిలో, చూసిన పద్ధతిలో లోపాలు లేవా అంటే ఉండొచ్చు. ఉంటాయి. తనకు అర్థ మైంది అర్థమైనట్టుగా స్పష్టంగా చెప్పాడు. దేశమంతటా స్వతంత్ర జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్లు అనేక నిర్బంధాలకు, కేసులకు గురవుతున్న అసహన, నిరంకుశ, విద్రోహ కాలంలో తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న సవాళ్ళను చెప్పదలుచుకున్నాడు. స్పష్టంగా చెప్పాడు. జంకు బొంకూ లేకుండా చెప్పాడు. అధికార నామవాచకాల మీద, ఆ అధికార నామవాచకాలకు తమని తాము కట్టేసుకుని అదీ గొప్పదనమే అని ఎదుటి వాళ్ళను అనుమానంగా కినుకతో చూసే అనేక నామవాచకాల పట్ల నాకే కాదు తెలంగాణకంతటికీ ఏకీభావం ఉంది, అది నిరసన భావం. నిజానికి తెలంగాణ వల్ల పేర్లు గడించిన వాళ్ళు తెలంగాణకు ద్రోహం చేస్తే ఎట్లా? జరిగే ద్రోహాన్ని సహిస్తే ఎట్లా? ఇది రమేష్ ఆవేదన. చాలా మంది ఆవేదన. ఇది ఇంకోరకంగా అర్థమైతే ఫలితం ఇంకోరకంగానే అనుభవానికి రాగలదు.

***

రమేష్ తన పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించాడు. మొదటిది తొమ్మిదేండ్లకే పదేండ్లు ముగిసినట్టుగా జరిపిన ఉత్సవాల సందర్భం. రెండోది శాసనసభ ఎన్నికల సందర్భం. నాయకులు ప్రజల చుట్టూ తిరుగుతూ ఓట్ల బేరాలలో తలమునకలవుతుంటే తాను ప్రజల హృదయాల లోతులు చూస్తూ, తెలంగాణను తాను స్వయంగా చూస్తూ ఆ హృదయాల ఆర్తగీతాలు వింటూ ఎన్నికలకు అటూ ఇటూ రాసిన వ్యాసాలు. మూడో భాగం అంతకు మునుపు రాసినవి. ఈ పుస్తకంలో ఇమడవలసినవి అని చేర్చానన్నాడు. ఈ వ్యాసాలలో ‘ఆ ముగ్గురూ…’ వ్యాసం ముఖ్యమైనది. అందులో తన మమకారాన్ని, తన వ్యగ్రతను ప్రకటించి ఆ ముగ్గురిలో నేనూ ఒకరికి చెందిన వాణ్నని నన్ను రాయ మన్నాడు. ఆ ముగ్గురూ ఎవరంటే ముంబాయి, దుబాయి, బొగ్గుబాయి. లేక భూమి, ఆకాశం, పాతాళం. మరింత వివరంగా చెప్పాలంటే పాలమూరు, ఉత్తర తెలంగాణ, సింగరేణి గనులు. ఈ మూడు ప్రాంతాలు ఇరవై రోజుల పాటు తిరిగి ఆ ప్రాంతాల దు:ఖాన్ని, సవాళ్ళతో, విసుర్లతో ఆ ప్రాంతాలు చలనంలో ఉన్న తీరుని, కళ్ళకు కట్టినట్టు వివరించటమే కాక ప్రభుత్వం మారిపోతుందని ప్రకటించేశాడు. సోషల్ మీడియాలో కనిపించిన కామెంట్ల మేరకైతే నిందకూ, అవమానానికి, బెదిరింపులకు గురయ్యాడు. అంతకు అన్ని రెట్లు ప్రోత్సాహమూ ప్రశంస అందుకున్నాడు. తెలంగాణలో జర్న లిస్టులకు కొదువలేదు. ఎవరి పరిమితులు, ఎవరి బెర్తులు వాళ్ళు చూసుకుంటుండగా, రాబోయే బస్సులో ముందే కర్చీఫ్ వేసి నిశ్చింతగా వున్న వాళ్ళు కనిపిస్తుండగా రమేష్ తెలంగాణతో మాట్లాడాడు. తెలంగాణ చెప్పింది విన్నాడు. తాను విన్నది ఇలా మనని వినమంటున్నాడు. ఈ కారణాన రమేష్ ను అభినందిస్తున్నాను.

1

గత ఏడు జూన్ కి తెలంగాణ రాష్టం ఏర్పడి పదేండ్లు నిండాయి. కానీ నాటి తెలంగాణ సర్కారీ కోయిల ముందే కూసింది. ఏ అనుమానం వెంబడి పడిందో తొమ్మి దేండ్లకే పదేండ్ల సంబురాలు జరిపారు. ఏడాది కేడాది వెనుదిరిగి చూసుకుని ఏం చెప్పామో, ఏం చేశామో, ఏం చేయలేదో, తప్పొప్పులు సమీక్షించుకుని ముందడుగు వెయవలసింది వదిలి పదేండ్ల వంచనకు ముసుగు కప్పి స్కోత్కర్ష కోసం సంబురాలు జరిపారు. పార్టీ పెద్దలు, పార్టీ శ్రేణులు, పార్టీ బ్రోకర్లు తప్ప ప్రజలకు ఆ వేడుకల్లో పాత్రలేదు. భాగస్వామ్యం లేదు. కలిపేసుకున్న వాళ్ళ కవన వైదుష్యం తప్ప సాను కూలమైన దేదీ లేదు. తెలంగాణ అస్మితను వదిలేశారు. తెలంగాణ తల్లిని కాక తెలుగు తల్లిని ఎందుకు నిలబెట్టారని అడిగిన వాళ్లకు జవాబు లేదు. ఎందుకుంటుంది? అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కొన్ని మార్కులైనా పొందిన తెరాసయే లేనప్పుడు, ఆ సందర్భాన్ని అదే మే, జూన్ నెలలలో ఎనిమిది వ్యాసాలలో చర్చించాడు. అవి తెరాస/భారాస అమలు పరిచిన అన్ని అసంగతాలను తాకలేదు కానీ తెలంగాణకు, తెలంగాణ చైతన్యానికి అధికార పార్టీ చేసిన ఘాతుకాలను బలంగానే చర్చకు తెచ్చాయి. ఏం జరుగుతుందనుకుంటే ఏం జరిగింది? ఎక్కడ బయలుదేరిన తెలంగాణను ఎక్కడికి తెచ్చారు. ఎంత విలువల పతనంలోకి, ఎంత పాతాళంలోకి దిగజార్చారు. ముందుకు నడుపుతామని వెనక్కి నడిపారు. అబద్ధాల మీద పరుగులు పెట్టారు.
ఎంత ఘనమైన పోరాటాల చరిత్ర తెలంగాణది. ఆ పోరాట చరిత్రలోని మేలిమి ఆశయాలను తెలంగాణ ఉద్యమంలో భాగమైన హిందుత్వ శక్తులు దారి మళ్ళించాయి. భూస్వామ్య వ్యతిరేక పోరాట లక్ష్యాలను అధికారం చేజిక్కించుకున్న పాలకవర్గ శక్తులు దారి మళ్ళించాయి. తెలంగాణ తనను తాను పోగొట్టుకుని తనను తాను వెతుక్కునే పరి స్థితులు కల్పించాయి. విషాదం ఏమిటంటే ఇదే గొప్ప అని చేసిన ప్రచారం. తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచి ఆ ఉద్యమంతోనే పేరు ప్రతిష్ఠలు పొంది ప్రభుత్వంలో భాగమైన వారెవరూ చిన్నపాటి విమర్శ కూడా చేయకుండా తమలో తాము కూలి పోవడం, తప్పులను ఎత్తి చూపటానికి అనేక సందర్భాలు కలిసి వచ్చినప్పటికీ ప్రజల వైపు కదిలి రావాలనే మనసు కోల్పోవటం. ఈ వ్యాసాలు ఇలాంటి విషయాల్ని నిశితంగా చర్చించాయి.

***

తెలంగాణకు మద్యమే మేటి ఆదాయ వనరు ఎందుకైంది. తెలంగాణ మద్య నిషేధాన్ని పోరాడి సాధించుకున్న ప్రాంతం కదా! అప్పటి ఈనాడు యాజమాన్యానికి రామారావు అధికారం కోల్పోవడం నచ్చలేదు. అలాగే అప్పట్లో పీపుల్స్ వార్ పార్టీ బలంగా వున్న చోట్ల పెద్ద ఎత్తున సాగిన సారా వ్యతిరేక, మద్యనిషేధ సాధన పోరాటమూ నచ్చలేదు. కానయితే ఈ ఉద్యమాన్ని తిరిగి రామారావు అధికారానికి రావటానికి మార్గంగా ఈనాడు పత్రిక ఉపయోగించుకుంది. ఏమైతేనేం తెలుగు నేల మద్య నిషేధం సాధించుకుంది. అప్పుడు కే.సీ.ఆర్ ఆ ప్రభుత్వంలో భాగం. తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద మమకారంతో బాధ్యతతో మద్యం నిషేధించి ఉండవచ్చు. కానీ అలా చేయలేదు. తెలంగాణ బడ్జెట్ లో సింహభాగం మద్యం ద్వారా సమకూర్చుకున్నాడు. పాలమూరు అధ్యయన వేదిక మద్య నిషేధం కోసం పది రోజుల పాటు వరుసగా గ్రామాలు తిరిగి కరపత్ర ప్రచారం చేస్తుంటే ప్రజలు సానుకూలంగా స్పందించారు. తమ తమ గ్రామాలు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలతో పొందుతున్న దానికంటే కోల్పో తున్నదే ఎక్కువ అని అంకెలతో చెప్పారు. మనం పోరాడుదాం అని అంటే కే.సీ.ఆర్ కు తలకాయ లేదా అని అడిగారు. మద్యం విషయమై రమేష్ రాసిన వ్యాసంలో తాగి పడి పోయిన ఒక మనిషి ఫొటో ఉంది. ఆ ఫొటోలో తల కనిపించదు. తలలేని లేక తలపులు వుండని, చైతన్యం లేక పడి వుండే తెలంగాణ కేసీఆర్ కల కావచ్చు. అందుకు మద్యాన్ని సాధనం చేసుకున్నాడు.

ఎంతగా సాధన చేసుకున్నాడంటే సహజ వనరులలో, అధికారంలో వాటా అడుగుతున్న దళితులకు ముఖ్యమంత్రి పదవికి సున్నంబెట్టి, మూడెకరాల భూమి అనే మాటను దూరం కొట్టి ఎక్సైజ్ దుకాణాలలో కోటా కల్పించి అదే ఘనతగా ప్రచారం చేసుకున్నాడు. బెల్టు షాపులను ప్రోత్సహించి ఎవరి కులాలకు వాళ్ళు తనివి తీరా తాపి వ్యాపారం చేసుకునే మార్గాలు తెరిచాడు. మద్యంతో ఊరికి అందే మామూళ్ళు కూడా పెంచి ‘గ్రామ దేవతలకు’ సంతృప్తి ప్రసాదించాడు.

ఎవరు నొచ్చుకున్నా ఇక్కడొకమాట చెప్పాలి. కుటుంబాల గౌరవాలు, సామాజిక, ఆర్థిక స్థాయిలు పడిపోయి కుటుంబాలకు కుటుంబాలే ఆత్మహత్యలతో, రోగాలతో చస్తున్నా, పిల్లలు అనాథలుగా మిగులుతున్నా, ఇంత విధ్వంసం కళ్ళ ముందే జరుగుతున్నా- అనేక సమస్యలకు స్పందించే – ఎవ్వరినీ ఇవి కదిలించటంలేదు. నిత్యమూ తాగే, లేక అడపాదడపా తాగే ఎవ్వరూ మాట్లాడకపొవటం కేసీఆర్ కు, తెలం గాణ ప్రభుత్వానికి బహుమానంలాగా కలిసి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ మాఫియా చేతిలో కీలుబొమ్మ. వీళ్ళకి కేసీఆర్ అందివచ్చాడు. గ్రామ పంచాయతీలు తాగి పారేసిన సీసాలు అమ్ముకుని రోజువారీ ఖర్చులు తీర్చుకునే దుర్గతికి చేరినాయంటే అది కే.సీ.ఆర్ ఘనత.

***

‘తెలంగాణకు లేని తెలంగాణ జర్నలిస్టులు’ రమేష్ ఆవేదన, ఆగ్రహం కూడా. ఆయన జర్నలిస్టులతో కలిసి నడిపిన తెలంగాణ ఉద్యమంలో భాగం. యువత కలలను, నెత్తుటి త్యాగాలను చూసిన వాడు. రాసినవాడు. కనుకనే ప్రజలవైపు నిలవాల్సిన జర్నలిస్టులు అలా లేకపోవటానికి కారణాలను, బాధ్యులను మనసు గట్టి పరుచుకుని చర్చించాడు. తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ తెలంగాణలో ప్రతిక్రియను అణిచి వేయటానికి మూడు మార్గాలు ఎంచుకున్నాడు. వాటిల్లో ఒకటి కలిపేసుకోవటం, వివిధ పద్ధతులతో జర్నలిస్టులను కలిపేసుకున్నాడు. కళాకారులను కలిపేసుకున్నాడు. కవులను కలిపేసుకునే పనిని ప్రభుత్వ అనుయాయులందరూ మనసు పెట్టి నిర్వహించారు. కలిపేసిన వాళ్ళు, కలిసిపోయిన వాళ్ళు తాము ఏలిన వారికి దగ్గరి వాళ్ళమని మురిసి పోయారు. కానీ ఇది వాళ్ళలో చిగురించే లక్షణాన్ని, ప్రశ్నించే చేవని దెబ్బతీసే కుట్ర అని తెలుసుకోలేక పోయారు. నిజంగానే తెలంగాణ కోసం లేచి నిలిచిన ధూంధాం రాజకీ యానికి బలైంది. ఇరవై ఏండ్ల పాటు తమ తొలి యవ్వనం నుండి బతుకును ఉద్యమానికి ధారవోసిన కళాకారులు సాంస్కృతిక సారథిలో తమకూ అవకాశం రావాలని చాలా మంది చాలా చాలా ప్రయాత్నాలు చేశారు. అందులో చాలా మంది విఫలమయ్యారు. అడిగేవాళ్ళకి, అణిగి వుండని వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం లేదని తెలిసేలోపుగానే సాంస్కృతిక సారథి నిండిపోయింది. తెలంగాణ ప్రజలతో ఆ వేదిక పాత్ర కూడా ముగిసి పోయింది.

బహుళ అస్తిత్వాల తెలంగాణ, తెలంగాణ అస్తిత్వంలో తన క్రియాశీల భాగ స్వామ్యాన్ని రచించుకుని అనేక పోరాటాలు నిర్వహిస్తూ అనేక జాయింట్ యాక్షన్ కమిటీలుగా అది విరాజిల్లింది. పొలిటికల్ జాక్ ఏర్పడిన తరువాత అనేక కులాలు, వృత్తుల జాక్ లన్నీ ఆ జాక్ కార్యాచరణకు అనుగుణంగా తమ ఆచరణను మలుచు కున్నాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత టి.జాక్ సుప్తచేతనకు లోనైంది. సకాలంలో ప్రభుత్వ తప్పిదాలను, తప్పుడు ప్రయాణాన్ని తప్పుగా చర్చించలేకపోయింది. టి.జాక్ ల ఉనికిని నిర్వహణలో చలనంలో ఉంచాలనే సోయిని ఒక్క మాటలో చెప్పాలంటే వది లేసింది. ఆ ఫలితమే టి. జాక్ దశాభ్ది వైఫల్యం. దీన్ని రమేష్ బలంగా ఎత్తి చూపాడు. ఐతే, ఈ వైఫల్యం యాంత్రికం కాదు. అతుకులతో వుండిన టి.జాక్ రాజకీయ చైతన్యమే ఆ పరిమితులకు లోబడినది. విడిపోయి ఎవరి బెర్తులు వాళ్ళు చూసుకున్నారు. బహుశా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే మొదలయ్యాయని, ఆ ప్రభా వానికి కూడా టి.జాక్ చెదిరిపోయిందేమోనని అంటారు.

అడిగేవాళ్ళు లేరు. అడిగితే వినేవాళ్ళు లేరు. అనుకుంటే తప్ప చేయరు. అనుకోరు. లెక్కకు మిక్కిలి సలహాదారులున్నా అమరుల స్మారక చిహ్నం నిర్మాణానికి తొమ్మిదేండ్లు పట్టింది. ఆ చిహ్నం ఆవిష్కరణలో చాలా బాధిత కుటుంబాల భాగస్వామ్యం లేదు. అమరులందరికీ అది స్మారక చిహ్నం కాలేదు. తెలంగాణ ఎత్తి దించిన బిడ్డలు, తెలంగాణ రుణం తీర్చుకునే ఉద్యమానికి అసువులిచ్చి అగ్గి రాజేస్తున్నామనుకున్న బిడ్డలు, హైదరాబాద్ లో శ్రీకాంతాచారిలాగా అప్పటి మహబూబునగర్ జిల్లా అమ్రా బాద్ మండలం వంకేశ్వరంలో తనను తాను దహించుకుని ఫొటోకు కూడా అంద కుండా కాలిపోయి తల్లికి కడుపుకోత మిగిల్చిన నాగరాజు వంటి బిడ్డలు. వీరంతా అధికారం కైవసం చేసుకున్న వారికి అక్కరకు రాకుండా పోయారు. తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ఒక శూన్య పాత్రలాగా మిగలటం ఎంత దైన్యం. అంతకన్నా ఎంత దుర్మార్గం. రమేష్ ‘అమర వీరుల విస్మృతి వనం’లో ఇది చర్చించాడు.

ఆ ఇద్దరు దళిత బంధువులు అలా తేలిపోవటం రమేష్ కు జీర్ణం కాలేదు. ఆయన వారిని అట్లా అనుకోలేదు. ఏకంగా ‘థ్యాంక్స్ టు కేసీఆర్’ అన్నాడు. సాంస్కృతిక సారథిలోని మరో ఇద్దరు కళాకారులను, రెండో భాగంలో తెలంగాణకు లేని జర్న లిస్టులలో ఒక సీనియర్ జర్నలిస్టును చర్చించాడు. తెలంగాణ అంతటా మాట్లాడుకున్న విషయాన్నే రమేష్ పత్రికా రచయితగా కాగితానికి ఎక్కించి తన బాధ్యతని నిలబెట్టు కున్నాడు. వీళ్ళందరూ రమేష్ వ్యగ్రతను, బాధ్యతను గుర్తించవలసిందే కానీ ఆయన మీద ఆగ్రహం చూపకూడదు. అది అధికార వ్యవస్థ స్వభావమైపోతుంది. ఇక్కడే ఇంకో మాటకూడా చర్చకు తేవాలేమో. సుఖాలకో, అవసరాలకో, అధికారాలకో, అనేకానేక భ్రమలకో లొంగిన వాళ్ళు సరే. అసలు సమాజమైనా ఎవరమైనా చూడవలసింది వలపన్నిన, లొంగదీసుకున్న నేరగాణ్ణి కదా అని. మునుపెన్నటి కన్నా పాలకుడు నేర గాడైనాడు. నవ తెలంగాణ పాలకుడు దీనిని మరింత దిగజార్చాడు. కాలపు చలనంలో ఇలాంటి విపరిణామం వేగం పుంజుకుంది. కారణాలను మరింత లోతుగా చూడాలి.

మొదటి భాగంలోని ఈ ఎనిమిది వ్యాసాల్లోకి ప్రత్యేకమైన వ్యాసం ‘భూస్వాముల స్వీట్ రివెంజ్ : రైతుబంధు’. ఈ వ్యాసం భూమిని, భూస్వాములను, తెలంగాణ సాయుధ పోరాటం, విప్లవోద్యమం సాధించిన ఫలితాలను చర్చించింది. ఆ నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పల్లెలు వదిలిన భూస్వాములు తిరిగి కాంగ్రెస్ పాలనలో పాలకులై భూముల మీదికి వచ్చినట్టు విప్లవోద్యమ ప్రభావంతో పల్లెలు వదిలిన దొరలూ, పెత్తం దార్లు తెలంగాణ ఉద్యమంలో దూరి రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం ద్వారా భూములు తమ చేతుల్లోకి తీసుకున్నారు. అందుకు కేసీఆర్ ధరణి, రైతుబంధు ద్వారా తోడ్పడ్డాడు. భూస్వాములు దున్నటానికి భూమి మీదికి రాకపోయినా ధరణి వల్ల, రైతు బంధు వల్ల వారికి అందవలసినవి అందాయి. భూపోరాటాలు, తెలంగాణ పోరాటం చేసిన వారి బిడ్డలు, నిర్వాసితుల బిడ్డలు, కౌలు రైతులుగా విలవిలలాడుతుంటే తెలంగాణ ప్రభుత్వం చలికాచుకుంది. ఇక్కడే రమేష్ రైతు బంధును లోతుగా చర్చించాడు. ఆ పథకాన్ని సిసలైన రైతుల పాలిట అపహాస్యంగా మిగిల్చిన కేసీఆర్ నైజాన్ని గాఢంగా చర్చకు తెచ్చాడు.

ఒకానొక తేదీన కే.సీ.ఆర్ దళిత బంధు రూపకల్పన కోసం తన అనుంగు మిత్రులతో, దళిత మేధావులతో సమావేశమయ్యాడు. మూడు విషయాలు తేల్చేశాడు. అన్నీ వాళ్ళతోనే అనిపించాడు. తెలంగాణలో భూవికేంద్రీకరణ జరిగిపోయింది. స్మశాన వాటికలకు, రైతు వేదికలకు, అభివృద్ధికీ అసైన్డ్ భూములను తిరిగి తీసుకోవలసి వస్తున్నది. గ్రామీణ క్రీడా ప్రాంగణాల బోర్డులు పాఠశాల ప్రాంగణాల ముందు నిలబెట్ట వలసి వచ్చింది. అభివృద్ధికి నిర్వాసితత్వం తప్పటం లేదు. అంటే పంచటానికి భూమి లేదు. మూడెకరాలు ముగిసిన ముచ్చట. ఇక ఉద్యోగాలు ఇవ్వగలమా? లేము. మరి మిగిలిందేమిటి కాసిన్ని డబ్బులు ఇవ్వగలం అన్నాడు. అందరూ అరకొరగా సూచిస్తే అదేం మాట… మీ కంటికి దళితులు ఎలా కనిపిస్తున్నారని గద్దించినంత పని చేసి పది లక్షల ‘దళిత బంధు’ ప్రకటించాడు. ఆ సమావేశంలో పాల్గొన్న మిత్రులు తెగ మురిసి పోయారు. తెల్లారి రోడ్ల మీద అభిషేకాల పాలు ప్రవహించాయి. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఇలా ముగిసిపోయింది. దొరతనం ఇట్లా ప్రతీకారం తీర్చు కుంటుందని మార్పు కోరుకునే ఎవ్వరూ ఊహించి ఉండరు. రమేష్ ఈ వైపరీత్యాన్ని కలుగులోనే పట్టుకుని ‘స్వీట్ రివెంజ్’ అన్నాడు.

రమేష్ ప్రస్తావించిన ఈ విషయాలే కాక అన్ని విధాన పరమైన నిర్ణయాల మీద ప్రజల కోణంలో స్కానింగ్ జరగవలసే వుంది. తనకు తాను చెప్పుకోవటానికైనా తెలంగాణ ఆ పనికి పూనుకోవాలి. రేపటికి పాఠం కోసం కూడా.

2

ఈ పుస్తకం రెండోభాగంలో వ్యాఖ్యలు, ఇంటర్వ్యూలు, సంభాషణలుగా రాసిన 49 వ్యాసాలున్నాయి. ఇవన్నీ దేనికవే ప్రత్యేకమైనవి. అవన్నీ తెలంగాణలో తొమ్మిదిన్నర ఏండ్ల పాటు ఏం జరిగిందో విచ్చుకున్న పత్తికాయలుగా విప్పి చూపినవి. ఆయన కామా రెడ్డి, గజ్వేల్, సిరిసిల్ల, సింగరేణి అంతా తిరిగి ఫలితం ముందే చెప్పేశాడు. ఈ వ్యాసాలలో ప్రజా సమస్యలు, వాటి మీద పరుచుకున్న అధికార రాజకీయ నీడలు, అధికార రాజకీయాలు ప్రజలతో ప్రత్యేకించి బొగ్గుబాయిల, నేత మగ్గాల కార్మికులతో ఆడుకున్న క్రీడలు జరుగుతూ వచ్చిన జీవన విధ్వంసాన్ని దగ్గరగా పరిశీలించాడు. ఎంతో తెగించిన తెలంగాణ ఎందుకింత నిశ్శబ్ధంలోకి పోయిందని అన్వేషించాడు. బతుకులు మారలేదు కానీ బాటలు తారుబాటలైన తీరు, గుట్టలు నేలమట్టమైన తీరు, నిశ్శబ్దం వెనుక నీడలా పరుచుకున్న నిర్బంధం, బతుకు వ్యాపారమైన వైనం, ఈ అలజడిలోనే పెనుగాలికి అల్లాడే చిరుదివ్వెల లాంటి చిన్న చిన్న జీవితాలు ఎంత అల్లాడిపోతున్నాయో అన్నీ చూశాడు, రాశాడు.

ఈ రాతలు చదువుతూ స్థూలంగా కొన్ని విషయాలు ప్రస్తావించాలనుకున్నాను. ప్రజలు నిశ్శబ్దంగా వున్నారు కానీ ఊరికే లేరు. ప్రత్యమ్నాయాల రచనలో ఆచరణలో వున్నారు. వారు అనేక బృందాలు బృందాలుగా సంఘటితమవుతున్నారు. పోరాడు తున్నారు. నాయకులు అనే వాళ్ళను నమ్మటం లేదు. అనుమానిస్తున్నారు. తిరస్క రిస్తున్నారు. వ్యక్తులుగా ఓడిపోతున్నారు. పడి పోతున్నారు అనిపించవచ్చు కానీ సమూ హాలుగా ప్రశ్నిస్తున్నారు. నిజానికి ప్రజలంటే పాలకులు భయపడి పోతున్నారు. పాలకులు ముందుకు తెచ్చిన అభివృద్ధి నమూనాను ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇక తప్పదు అనుకున్న చోట్ల తామే అభ్యర్థులుగా ముందుకు వచ్చి తమ వాదనల్ని ముందుకు తీసుకుపోతున్నారు. శబ్దం అర్థమైనంత సులభంగా నిశ్శబ్దం అర్థం కాదు. ఏకంగా ఫలితం అనుభవానికే వస్తుంది.

ఈ వ్యాసాలలో ఏలికలు చర్చకు వచ్చారు. ప్రజలకు వారి మీద వున్న తీవ్ర నిరసన స్థాయిలో చర్చకు వచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయనకు సమాంతరంగా ప్రభుత్వం మీద అదుపు వున్న, ప్రజల మీద పెత్తనం చలాయించిన అంతుచిక్కని దోపిడీకి పాల్పడిన కేటీఆర్, కవిత కూడా చర్చకు వచ్చారు. వారి స్వభావాలు తెలంగాణకు తెలిసిపోయినవే అయినా ఇక్కడ రికార్డైనవి. ప్రజలు ఎంత తెలివిగా నిలబడ్డారంటే ఇంతగా ఇట్లా బళ్ళున తెల్లారుతుందని పాలకులు ఎంతమాత్రమూ పసిగట్టలేకపోయారు. మేం ప్రజలకు కుక్క బిస్కట్లు పడేస్తున్నాం ఎల్లకాలమూ నాకుతూ పడి వుంటారనుకున్నారు. కానీ భిన్నంగా జరిగింది. ప్రజలకు కావల్సింది వేరు. వీళ్ళు చేసింది వేరు. అందుకే ఏలికలను తీసి అవతల పడేయాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారని, ఇంతటి ఆగ్రహానికి కారణాలు న్నాయని, తెలంగాణ స్తబ్ధంగా లేదు మౌనంగా ఉందని కూర రాజన్న ఇంటర్వ్యూ ద్వారా రమేష్ ప్రకటించాడు.

తెలంగాణ పాలకవర్గాల మీద ప్రజలకున్న మేరకైనా స్పష్టత ప్రజల మీద పాలక వర్గాలకు లేదని మరింత స్పష్టంగా తెలిసింది ఇవి చదువుతుంటే. తెలంగాణ పరాధీన మైందని చర్చించిన కాలంలో మాత్రమే కాదు. దేశం స్వతంత్రమైందని అనుకున్న ఈ ఏడు దశాబ్దాల కాలంలో కూడా పాలకులు తమకు ఏమీ చేయలేదని అందినకాడికి దోచుకుంటున్నారని వారికి అర్థమైంది. కేవలం నిర్బంధంతో, డబ్బుతో, అహంకారంతో ప్రజల స్వాభిమానాన్ని అణిచిపెట్టటం కుదిరేపని కాదని, ప్రజలు సమయానికి తగు సమాధానం చెప్పగలరని ప్రజల ద్వారానే రమేష్ గ్రహించాడు. అదే రాశాడు.

వీటిల్లో ‘ఒక సహజ మరణం ముందు’ వ్యాసం ప్రత్యేకమైంది. గాంధారి మండలం నేరెల్ తండాలో ఒక నిండు జీవితం గడిపిన తల్లి మృత్యువులోకి నిష్క్రమిస్తున్న సందర్భం. ఆమె చుట్టూ ఆమె సంతానం. జనన మరణాల మర్మం తెలిసిన అనుభవంతో పెద్దవాళ్ళు కొందరు. ఏమీ తెలియని అమాయకత్వంతో పిల్లలు కొందరు. జీవితానికి చివరి వీడ్కోలు పలుకుతూ ‘నిర్వ్యాపారంగా’ ఉన్న సందర్భం. ఈ ప్రవాహంలో జీవితాలు ఎక్కడో ఒక చోట ఆగిపోతాయి. “అవును, రాజకీయాలు ఎపుడూ ఉంటాయి. జీవితాలే ఉండవు.” ఈ సత్యం బోధపరుచుకుంటే, ముఖ్యంగా అధికార రాజకీయాలకు ఈ సత్యం బోధపడితే జీవితాలతో అడుకోవు. పొరుగువాళ్ళ జీవితాలకి కాసింత సమయమిచ్చి సానుకూలంగా ఆలోచించి తోడ్పడగలిగితే జీవితాలు ఇంతగా ఒంటరి కావు. కునారిల్లవు.

***

ఈ రెండో భాగంలోని వ్యాసాలలో మహబూబునగర్ అనుభవం కనీసం పన్నెండు వ్యాసాలలో చర్చకు వచ్చింది. అన్ని వ్యాసాలకు ప్రధాన పరిశీలనాంశం ‘అభివృద్ధి విపరి ణామం’ అనే చెప్పాలి. బ్యూరోక్రాట్లు, పాలకులు, పాలక పార్టీల నోట అభివృద్ధి అనేమాట వింటే ప్రజలు భయపడిపోతున్నారు. అభివృద్ధి విధాన రచనలో అభివృద్ధి కారణంగా విధ్వంసానికి గురయ్యే, నిర్వాసితత్వం పాలయ్యే పేదలు, నిరుపేదలు మరింత మెరుగైన జీవితం అనుభవించ గలిగితే దానిని సమ్మిళిత అభివృద్ధి అనుకోవచ్చు. అపుడు అభివృద్ధి భయపెట్టదు. భూస్వామ్యంతో వ్యవస్థ పెనుగులాటలో బ్యూరోక్రాట్లు కొంతమేరకు భూస్వామ్యాన్ని నిలువరించటానికి అనేక విషయాలలో మార్పుకు అనుకూలంగా ఆలోచనకు, ఆచరణకు తమను జోడించుకున్నారు. కానీ, పెట్టుబడి ప్రమేయం, సామ్రాజ్యవాద ప్రమేయం పెరుగుతూ విధాన రచనలో ‘అభివృద్ధి’ కేంద్రస్థానంలోకి చేరుతూ వచ్చిన దశలో బ్యూరోక్రాట్లు పెట్టుబడి దాసులైపోయారు. పాలకులు, పాలక పార్టీలు ఆ ఫ్రేం వర్క్ లో భాగం అయిపోయారు. ఇది ఎంత దాకా పోయిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను తాను ఏకంగా ప్రజా ప్రతినిధిని అని కాకుండా ఒక బ్యూరోక్రాట్ గా సిఇఓను అని ప్రకటించుకున్నాడు. పాలక పార్టీలు సైతం ఎన్నికల దాకా రాజకీయాలు, తరువాత అభివృద్ధి అని ప్రకటిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకోవటమే అనుకుంటున్నాయి. ఫలితం గా అభివృద్ధి పాలకవర్గాలకు, విధ్వంసం సామాన్య ప్రజలకు అన్నట్టుగా పరిస్థితి మారి పోయింది. తెలంగాణ ఏర్పాటు సాధన పోరాటంలో ఈ వైపరీత్యం – సామాన్య ప్రజల జీవన దైన్యం, వలస – చాలా చర్చకు వచ్చింది. కానీ, తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ వైపరీత్యం మారకపోగా పాలన మరింత క్రూరమైంది. ఆ వైపరీత్యాన్ని తెలంగాణ, వెనుకకు నెట్టిన ప్రాంతంగా మహబూబునగర్ అనుభవిస్తున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబునగర్ వలస పట్ల, ప్రజల దైన్యం పట్ల బయట ప్రాంతాలకు ఒక సహానుభూతి, మద్దతు, ఈ వలస దుస్థితి మారాలి అనే ఒక ఆకాంక్ష వుండేవి. వాటిని తెరాస పాలన తన అబద్ధపు ప్రచారాలతో చెరిపి వేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు స్థానిక తెరాస శ్రేణుల దాకా మహబూబునగర్ వలస ఆగి పోయిందని, తిరుగు వలసలు మొదలైనాయని అదేపనిగా ప్రచారం చేశారు. వలస నివారణకు స్థానికంగా జీవన వికాసానికి సాగునీటి కల్పన అవసరం అని మేం పోరాడిన దాన్ని ఆసరా చేసుకుని సాగునీరు అందించామని ప్రచారం చేశారు. నమస్తే తెలంగాణ పత్రికను, టి న్యూస్ ఛానల్ ను అందుకు సాధనం చేసుకున్నారు. అధికార వాక్కుకి ఆ పత్రిక కరపత్రమే అయింది. ఉచితంగా పంచేవారు. రమేష్ కి ఈ వాస్తవం అనుభవ మైంది. గడిచిన పదేండ్ల పాటు తెరాస అబద్ధాల మీద బాధిత తెలంగాణ పోరాడ వలసి వచ్చింది. వలస బాధితులు, నిర్వాసితులు, నిరుద్యోగులు బలంగా ఒక ప్రశ్న ముందుకు తెచ్చారు. మనం తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నట్టు? ఇదే ప్రశ్న యురేనియం దాడిని ఎదుర్కొంటూ చెంచులూ అడిగారు. పట్టించుకోనిదీ, అబద్ధాలు ప్రచారం చేసిందీ, విధానాలతోనే తీవ్రమైన దోపిడీకి పాల్పడిందీ పాలకవర్గమే. తెలంగాణ ప్రభుత్వమే. నిజం ఏమిటంటే వలస కొనసాగుతూనే వుంది. హాస్యాస్పదమైన విషయం ఏమంటే ముంబాయికి వెళ్ళే ఆర్టీసీ బస్సులను తగ్గించి ‘ముంబాయి’ పరిష్కారం అయి పోయింది అన్నారు. ప్రైవేట్ బస్సులకు ఊతమిచ్చారు. వలస తగ్గిపోయిందని చెప్ప డానికి, గణాంకాలు మార్చేపనికి సెస్ వంటి సంస్థలను, అందివచ్చిన ఆర్థిక వేత్త లను, విశ్వ విద్యాలయాలను పురమాయించారు. ఏమీ చేయకుండానే చేసినట్టు మహ బూబునగర్ పట్ల ఈ విద్వేషం అవసరమా?

వాస్తవానికి మహబూబునగర్ మీద లోతైన చర్చను మొదట విప్లవ రచయితల సంఘం ప్రారంభించింది. పాలమూరు అధ్యయన వేదిక కార్యవర్గ సభ్యుడు తన కలలు కన్నీళ్లు మహబూబునగర్ కోసమే అన్నట్టుగా మహబూబునగర్ ను శ్వాసించిన అమ రుడు సి. రామ్మోహన్ గద్వాలలో విరసం వేదిక మీద మహబూబునగర్ వలస మూలా లను, రాజకీయార్థిక నేపథ్యాన్ని వివరించాడు. ప్రొ.రుక్నొద్దీన్ కొనసాగించాడు. గంగా పురం హనుమచ్ఛర్మ ఈ వలస కూలీలను ‘పరార్థశ్రమైక జీవనుల్ ‘ అన్నాడు తన దుందుభి కావ్యంలో. కరువు వ్యతిరేక పోరాట కమిటీ పన్నెండేండ్ల పాటు మహ బూబునగర్ వలసను, ఆ దైన్యాన్ని పాలమూరుకే కాదు, ప్రపంచానికీ చెప్పింది. తెలంగాణ ఉద్యమానికి వస్తువుగా అందించింది. ఈ కృషిని పాలమూరు అధ్యయన వేదిక ఏ మేరకైనా కొనసాగిస్తోంది. మేం నీళ్ళు, నిధులు, నిరుద్యోగిత, విద్య, ఆరోగ్యం, ఉపాధి, స్థానిక వ్యాపారాలు, కాలుష్యం – ఇలా ఏ విషయం మాట్లాడినా పునాదిలో మా చైతన్యానికి మహబూబునగర్ వలస దైన్యం, వలస వ్యవస్థీకృతమై కొనసాగుతున్న తీరు తెన్నులు, దానిని సొమ్ము చేసుకుంటున్న రాజకీయార్థిక శక్తులే కీలకం. అందువల్ల మేం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తెరాస/భారాసా ప్రభుత్వానికి ప్రత్యర్థులం అయి పోయాం. మా మీద అక్కసును రాశారు. తమ వేదికల మీద ఆ అక్కసును వెళ్లగక్కారు. ఈ వాస్తవం నమోదు కావాలనే ఇక్కడ రాయటం.

అసలు మహబూబునగర్ వలస ఎప్పుడు మొదలైంది? అది హైదరాబాదు రాజ్య అభివృద్ధితో ముడివడింది. దానిది ఉమ్మడి మద్రాసు, మైసూరు, హైదరాబాదు రాజ్యాల మధ్య జరిగిన ఒప్పందాల అమలుతో ముడివడిన చరిత్ర. బ్రిటీష్ సామ్రాజ్యవాదంతో చెలిమి చేసి హైదరాబాద్ రాజ్యం చేపట్టిన, ఆ నాటికి భారీగా గుర్తించదగిన నిర్మాణాలతో ముడివడింది. కె.సి కాలువ నిర్మాణంతో ముడివడింది. స్థూలంగా ఇది గడిచిన వంద డెబ్బై ఐదు ఏండ్లుగా కొనసాగుతున్న సమస్యగా చెప్పవచ్చు. నిర్దిష్టంగా చెప్పాలంటే నాగర్ కర్నూలు నుంచి జిల్లా కేంద్రం మహబూబునగర్ కి మారిన తరువాత అంటే దరిదాపు వంద నలభై ఏండ్లు. రమేష్ ఈ జిల్లా వలసను స్వతంత్ర భారత వయసుతో సమాంతరంగా గుర్తించాడు. కానీ ఇది ముంబాయి, దుబాయి, బొగ్గుబాయి వరుసలో సీనియర్. అయినా దోపిడీకి అందివచ్చిందే కానీ బొగ్గుబాయిలో పుట్టిన సికాస లాగా పాలకవర్గాలకు సింహ స్వప్నమైంది కాదు కనుకనే పాలకులు ఈ జిల్లా వలసతో చెల గాటమాడారు.

తొలుత జనాన్ని పనుల కోసం నిజాం రాజ్య అధికార యంత్రాంగం తరలించేది. ఊరికి ఓ పట్టిక ఇచ్చేది. గుత్తేదార్ల పుట్టుక గుంపు కట్టే విధానాన్ని ముందుకు తెచ్చింది. కాంట్రాక్టర్లు -పని పంచుకున్న కాంట్రాక్టర్లు – గ్రూపు మేస్త్రీలు – గుంపు మేస్త్రీలు – పని స్థలంలో పంపు పెద్దలు పాలమూరు లేబరు రక్త మాంసాలు పీల్చుకున్నారు. కోట్లకు లక్షలకు ఎదుగుతూ మహబూబునగర్ రాజకీయాలలో ప్రబల స్థానం ఆక్రమించారు. పనులు పెరిగినట్టల్లా వలస పెరిగింది. ఒక దశలో సగం జనాభా వలస బాట పట్టింది. ఇప్పుడైతే 25 శాతం వలస కొనసాగుతున్నట్టు రమేష్ గుర్తించాడు. అభివృద్ధి క్రమంలో వచ్చిన పరిణామం, యంత్రాల వాడకం, నగరీకరణ మహబూబునగర్ వలసను చాలా వరకు స్వతంత్ర వలసగా నిలబెట్టాయి. పెద్ద సంఖ్యలో వలస వెళ్ళిన చోటల్లా మహ బూబునగర్ కూలీలు కొందరైనా స్థిరపడ్డారు. ఇక్కడ ప్రజలకు వలస పోవడం అంటే దేశం పోవడమే. పరాయి దేశం పోవడమే. ఏ పల్లె నుంచి ఎవరెవరు వలస పోతున్నారో, ఎటు పోతున్నారో, తిరిగి వస్తున్నారో లేదో, ఎందరు ఎక్కడెక్కడ ఖననమయ్యరో ఒక్క లెక్కకూడా లేదు. ఏ ప్రభుత్వమూ వలసలు నమోదు చేసే చర్యలు చేపట్టలేదు. ఇప్పుడైతే దేశం నలుమూలలకు వలసలు ముమ్మరమయ్యాయి. ఇది ఆసరాగా కేసీఅర్ ప్రభుత్వం వలసల పరిణామాన్ని మరుగుపరిచి తిరుగు వలసలు మొదలైనాయని తప్పుడు ప్రచా రానికి లంకించుకుంది. ఇంకోవైపు మధ్యతరగతి ప్రజల పరాయీకరణ, వారిలో శ్రామి కుల పట్ల, వలస ప్రజల పట్ల హృదయ సంబంధాన్ని, ఆలోచనానుబంధాన్ని చెరిపి వేస్తోంది. ఈ సందర్భంలో రమేష్ వలస ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేయటం గుర్తించ వలసిన విషయం. ఏమైనా, ప్రభుత్వాలకి పాలకవర్గాలకి దేశమంతటా రగులుతున్న వలస ఒక సవాలుగానే పరిణమించింది. స్వీకరించి బాధ్యత పడుతాయా లేక వలస జీవులను దోపిడీ నోటికీ వదిలేస్తాయా అని సమాజం అడగాలి. పోరాడాలి.

‘వలస కూలీల గునుగు కూర…’ నుంచి ఎనిమిది వ్యాసాలు మహబూబునగర్ జీవితానుభవాలు చర్చించాయి. కరువు కాలాలలో ప్రజలు దేవదారు కూర ఉడికించుకు తిని బతికారు. అది గునుగు కూర కాదు. గునుగాకు బతికే వానలేని కాలాలు. కరువు పనులు కల్పించాలనే సోయిలేని కాలాలు.

ఈ వ్యాసాలు లేక వ్యాఖ్యలు చర్చకు తెచ్చిన విషయాలలో ఒకటి రెండు విషయాలపై స్పందన అవసరం. మహబూబునగర్ ను విద్యలో వెనుకబడేశారు. స్థానిక సంస్థానాలైనా, హైదరాబాదు రాజ్యమైనా, ఈ 75 ఎండ్ల ప్రభుత్వాలైనా. రమేష్ ఈ అందరి మీద విమర్శతో పాటు విప్లవోద్యమం కూడా విద్యను, అందునా వలస జీవుల కుటుంబాల బిడ్డల విద్యను పట్టించుకోవలసినంతగా పట్టించుకోలేదు అంటాడు. అలాగే జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాలు కూడా. ఆ దిశగా డిమాండ్లు రూపొందించలేదని రమేష్ ఆరోపణ. అది ఆయన కన్సర్న్ కూడా. నిజానికి భూస్వామ్య బంధనాల మీద విప్ల వోద్యమం ఎక్కుపెట్టిన పోరాటమే ఏ మేరకైనా విద్యారంగం విస్తృతికి కారణమైంది. ఇక్కడ భూస్వామ్య అణిచివేత, వలస తీవ్రత విప్లవోద్యమానికి అర్థమయినంతగా మరొక్క రెవ్వరికీ అర్థమే కాలేదు. స్థానిక సంస్థాన రాజ్యాలు, జాగీర్లు, ఇక్కడి ప్రజల్ని తారు రోడ్డు కింద అణగార్చిన కంకర రాళ్ళుగా అణిచివేశాయి. ఇక్కడి వలస భూస్వామ్యంతో తెగ దెంపులుగా ప్రజలకు అనిపించింది . మేధావులు ఇక్కడ భూస్వామ్య హింస తక్కువ అను కున్నారు. విద్య విషయంలో ఇతరులను చెప్పాల్సి వస్తే వీధి బడులు నడిపిన వృద్ధులను, క్రైస్తవ మిషనరీలను, ఆసక్తి పరులైన వ్యక్తులను, ప్రజలతో కలిసి పాఠశాల స్థాయి పెంపుదలకోసం పని చేసిన ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ ఉద్యమాన్ని చెప్పాలి. ఎన్జీవోలు ఈ రంగంలో కొంత జోక్యం కల్పించుకున్నాయి. ఆ తరువాత అంతా విద్యా వ్యాపారమే సాగుతోంది. ప్రభుత్వమే పనిగట్టుకుని విద్యను వ్యాపారానికి వదిలేసింది. ఇక్కడ సమాన పాఠశాలల కోసం ప్రైవేటీకరణ రద్దుకోసం జరుగుతున్న పోరాటాలు ఎవరికీ పట్టడం లేదు.

ఇక్కడి కరువు, వలస, వ్యవసాయ సంక్షోభం, జాతీయ రహదారి ప్రమాదాలు, మద్యం, కల్తీ మద్యం తల్లిదండ్రుల ఉసురు తీసుకోగా మిగిలిన బిడ్డలు అనాథ బిడ్డలుగానే బళ్ళలో దు:ఖం ఒడిలో బతుకుతున్నారు. ఈ పదేండ్ల తెలంగాణ ప్రభుత్వం నిర్దిష్టంగా ఇక్కడ చేసిందేమీ లేదు. విద్యా సంస్థల ఏర్పాటులో, నిర్వహణలో ఎంత అసమానత వుందో తెలియాలంటే ఒక్క మోడల్ సూల్స్ ఏర్పాటు చూస్తే చాలు. అవి ఇతర జిల్లాలలో మండలానికి ఒక్కటి చొప్పున ఏర్పరచి ఈ జిల్లాలో 64 మండలాలకు గాను ఆరంటే ఆరే ఏర్పరచారు. ఈ దుర్మార్గాన్ని సరిదిద్దే ప్రయత్నం జరగనే లేదు. పాలమూరును, బడి పిల్లలను, ప్రభుత్వాలు తమ ఎజెండాలోకే తీసుకోలేదు. అనేక అనుభవాల తరువాత ఇక మాకు దేశదిమ్మరి జీవితాలు కాదు, ఉచితాల పేరిట అవమానాలు కాదు, ఉద్యోగాలు, సహజ సంపదలో వాటాలు కావాలని అడుగుతున్నారు. మేం ఉద్యోగ హక్కు చట్టాన్ని, పనిగంటల తగ్గింపును అడుగుతున్నామంటే ఈ చైతన్యం వల్లనే.

ఎంత చెప్పుకున్నా తరగని వలస విషయంలో మరో విషయం పాఠకుల దృష్టికి తేవడం అసందర్భం కాదనుకుంటున్నాను. అదేమంటే ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందే ఆ పదవిని ఒక ‘గుంపు మేస్త్రీ’గా ప్రస్తా వించాడు. పాలమూరు లేబర్ను, దేశావ్యాపితంగా లేబర్ను తరలిస్తున్న గుంపు మేస్త్రీలు కూలీల రక్తమాంసాలు హరించారు. రేవంత్ రెడ్డి స్వయంగా తనను గుంపు మేస్త్రీగా ప్రకటించడం ఆందోళన కలిగించింది. రాజకీయాలతో జీవితాలను గౌరవప్రదంగా మారుస్తామని వచ్చి అధికారం చేపట్టి తమను తాము సి.ఇ.ఓ.లము, గుంపు మేస్త్రీలము అని ప్రకటించుకుని పని చేసే నేతల వల్ల కాంట్రాక్టర్లకు మేలు జరగవచ్చు కానీ ప్రజల కేమి మేలు. రాబోయే రోజులు ప్రపంచ దేశాల మీద తెగబడి దోపిడీ చేస్తున్న కార్పొరేట్లకు చవక లేబర్ను సప్లై చేసే దేశంగా భారత్ అభివృద్ధి చెందుతుందా? ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి గుంపు మేస్త్రీలుగా దేశ ప్రజలను తరలిస్తారా? ‘స్కిల్ డెవలప్ మెంట్’ విధాన రచన ఈ ప్రకియలో భాగమేనా? ఇక ఇండియా లేబర్ సప్లై దేశమా? ఎవరు సిగ్గుపడాలి?

ఇదే భాగంలోని ‘ఒక ఆక్రమణ…శనివారం – ఓయూ విద్యార్థి సంఘాలకు అభినందనలు’ వంటి అనేక వ్యాసాలు అందివచ్చిన అధికారంతో పరమ నైచ్యానికి పాల్పడిన పాలక పార్టీ నేతలను బయట పెట్టాయి. పాఠకులు ప్రత్యేకంగా చదవాల్సిన వ్యాసాలివి. అసలు తెలంగాణ పాలక పార్టీలో చేరి పదవులు పొందీ పొందక కూడా తెగబడి దోచుకున్నవారు పోగేసుకున్న సంపదలు తక్కువేమీ కాదు. ఇలాంటి వారి వల్ల తెలంగాణ చైతన్యం, త్యాగశీలత చాలా అవమానాల పాలయ్యాయి. పై వ్యాసంలో చర్చకు వచ్చిన వారితో పాటు రానివారు ప్రధానంగా మహబూబునగర్ వారు కావటం ఇక్కడి కష్టజీవులకు ఎంత అవమానకరం. ఎంత దుర్మార్గం.

3

ఈ పుస్తకం మూడో భాగంలోని నాలుగు వ్యాసాలు ఒక దూరం చేసిన పాటని, చేజేతులా చేటు తెచ్చుకున్న ఇద్దరు ‘ప్రముఖుల్ని’, కాలం కలిసి వచ్చి అవకాశాలు అందుకున్న మరో ‘ప్రముఖుడిని’ చర్చించాయి. ఒకరు డాక్టర్ ఫాస్టస్ లాంటి కేసీఆర్. క్రిస్టఫర్ మార్లో రాసిన డాక్టర్ ఫాస్టస్ అనే నాటకంలోని పాత్ర. ‘మెగలో మానియా’ అనే మాటకు సార్థక రూపంగా చిత్రితమైన పాత్ర. తెలంగాణ ఫాస్టస్ కెసీఆర్ అని రమేష్ చాలా బాగా వర్ణించాడు.

తన అబద్దాలని, తన అంతర్గత ఒప్పందాలని, భాజపాతో లోలోపలి చెలిమిని బయటికి చెప్పుకోలేని స్థితిలో డాంబికాలకు పోతూ ప్రజలనే తప్పు పడుతూ తిరుగుతున్న దుస్థితి కెసీఆర్ ది. ఆయన భాజపా కోసమే తమ పార్టీని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఊహలకు భిన్నంగా భారాసగా మార్చాడు. రాష్ట్రంలో బీ.ఎస్.పీకి నాయకత్వం సమ కూర్చి చురుకెత్తించాడు. అధికార ముసుగులోని ‘ఎలుకలన్నీ’ అక్రమార్జనతో ‘పంది కొక్కులై’ అక్రమ తిండితో బలసిపోయి చిన్నమాట కూడ అడ్డు చెప్పకపోతే అదంతా తన ఘనతగా చాటుకున్నాడు. ప్రజలకు ఏదీ అర్థం కాదనుకున్నాడు. కానీ ఇవాళ ఆ బీ.ఎస్.పీ నాయకత్వం ఎక్కడికి చేరిందో ప్రజలకి తెలియదా? ఎన్నికలను, రాజకీయాలను, రాజ కీయ పార్టీలను ఇంత నైతిక పతనానికి దిగజార్చిన మనుషులను తెలంగాణ చరిత్రలో లెక్కించవలసి వస్తే మొదట లెక్కకు వచ్చేది కే.సీ.ఆరే నని తెలంగాణకు విడమరచి చెప్పే పనిలేదు.

ఈటల రాజేందర్ కేసీఆర్ పాలిట ‘ఈటెల’గా ముందుకు రాగలడనుకున్నారు అస్తిత్వ భ్రమలో ఉన్న కొందరు. ఆయన చాలా లౌక్యంగా మొత్తం తెలంగాణ తన చర్మ రక్షణకు నిలవాలని కోరుకున్నాడు. సమాజం మనుషుల్ని అంచనా వేయడంలో ఒక్కో సారి తలకిందులవుతుంది అనడానికి ఈటల రాజేందర్ ఒక ఉదాహరణ. ఎరుపు రంగు గులాబీ రంగై క్రమంగా కాషాయ రంగులోకి ఎలా ఒదిగిపోయిందో, ఎందుకు ఒదిగి పోయిందో ఈ ఉదాహరణ ఒక పాఠం. ఆశ్చర్యం ఇట్లా మారినందుకు కాదు. తెరాస లేక భారాసకి వనరులు సమకూర్చి పెట్టటంలో తనూ పాత్రయిన ఆయన ఎదిరించే పాత్ర లోకి రాగలడని ఎలా అనుకోగలిగారని. ఈ రెండు పాత్రలు విలోమంగా తీవ్రస్థాయిలో రూపవిక్రయ పొందాయి. సీతాకోక చిలుకలు అని భ్రమసినవి గొంగళి పురుగులుగా తమను తాము ప్రదర్శించుకున్నాయి. మరో పాత్ర రేవంత్ రెడ్డి. అయన ‘రవ్వంత’ కాదని, తెలంగాణకు ముఖ్యమంత్రి కాగలిగేటంత అని. భారాసను ముగించేటంత అని రమేష్ సుదీర్ఘ వ్యాసం రాశాడు. మరొకటి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతం. ఆ పాటకు, ఆ కవికి కేసీఆర్ చేతుల మీద జరిగిన అన్యాయం. ఇవి రెండువేల ఇరవై ఒకటి జూలై మొదటి వారం నాటికే రాసిన వ్యాసాలు. రమేష్ అంచనాలు ఆయన అంచనాకు అనుగుణంగా వాస్తవ రూపు తీసుకున్నాయి. పాఠకులు ఆసక్తిగా చదవగల వ్యాసాలివి.

ఐతే, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఇంకొక రెండు మాటలు చెప్పాలి.
రేవంత్ ప్రవేశించిన సందర్భం వల్ల, అధికారం కోసం ప్రదర్శించిన దూకుడు వల్ల అతడు తన లక్ష్యాన్ని చేరుకోగలడని సరిగానే రమేష్ అంచనా వేశాడు. ఈ ముగ్గురినీ రమేష్ శ్రామిక వర్గ చింతనతో కన్నా సందర్భోచితంగా పరిశీలించాడు అంటేనే దగ్గరగా ఉంటుంది.

‘విను తెలంగాణ’కు స్పందన రాస్తున్న ఈ నాటికి రేవంత్ పాత్ర అధికారంలోకి మారింది. పాత ముఖ్యమంత్రులు అధికారం చేపట్టి ఎవరికీ కట్టుబడి ఎవరిని అణిచి వేశారో తెలంగాణకు వంటి నిండా గాయాల అనుభావాలున్నాయి. ఆధిపత్యాలు, అస మానతల హింస, నిర్బంధం లేని స్వీయగౌరవ తెలంగాణే తెలంగాణకు కావాలి. ఉద్యమ పార్టీ పేరున తొలి అధికారం చేపట్టిన ‘తెరాస’ తన హృదయంలో క్రమంగా తెలంగాణ అస్మితను చెరిపేసుకుంటూ వచ్చి ‘భారాస’ ఏర్పాటుతో తన చరిత్రను తాను ముగించుకుంది.ఇటువంటి స్థితిలో తెలంగాణ ఆకాంక్షలకు ధీటుగా రేవంత్ నిలబడతాడా లేదా అనేది ముందున్న పెద్ద పరీక్ష.

రేవంత్ తనకు బలం ఇవ్వమని మహాబూబునగర్ ను ప్రత్యేకంగా కోరాడు. బలం పొందాడు. బలం ఇచ్చిన ప్రజల గౌరవం నిలబెట్టుకునే పనులే చేస్తాడా లేదా అన్నది కాలం కఠినంగా పరీక్షిస్తుంది.
తెలంగాణ ముందుకు భాజపా ఒక చేత ‘హిందుత్వ’ ను మరొక చేత కాలుష్య కారక ఇథనాల్ పాలసీని, తెలంగాణకు తీవ్ర నష్టం చేసే గోదావరి- కృష్ణ- కావేరీ అను సంధానం ప్రతిపాదనను దూకుడుగా తెస్తున్నది. కృష్ణానది నీటిలో తెలంగాణ వాటా మాత్రం తేల్చటం లేదు. ఈ నష్టాలను రేవంత్ నిలువరిస్తాడా?

తెరాసా/భారసా పార్టీ ఫార్మాసిటీ, మూసీ శుద్ధి, ట్రిపుల్ ఆర్ రోడ్డు పేరున మరో రింగు రోడ్డు ప్రతిపాదించింది. ప్రజల నించి నిరసనకు గురయింది. ఇప్పుడు రేవంత్ వీటినే ఫార్మా విలేజెస్, మూసీ సుందరీకరణ/పునరుజ్జీవనం, ట్రిపుల్ ఆర్ అని కొన్ని మార్పులతో ప్రకటిస్తున్నాడు. అభివృద్ధి పాలసీ అన్ని పార్టీలది ఒకటే అయినప్పుడు నష్టపోయే, నిర్వాసితులు కాబోయే ప్రజలకు ఏ ప్రయోజనాలు కల్పిస్తాడు. ముఖ్యంగా భూమి పంచుతాడా? బాధితులు పోరాడితే గౌరవిస్తాడా?

రేవంత్ తానుగా ప్రకటించిన ఏడో హామీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ. తెలం గాణలో ఎన్ కౌంటర్ మరణాలు జరగకుండా చూడటం ఇందులోనిదే. మరి ఇందుకు అధికార వ్యవస్థలు, సంస్థలు కృషి చేస్తాయా? భారాసా అంతకు ముందటి తెరాస పదేండ్ల పాటు బనాయించిన అక్రమ కేసులు రద్దు చేస్తాడా? ఇవి ఆయనను తొలి అడుగులలోనే నిలువరించి అడగవలసిన ప్రశ్నలు. ఇలాంటి అనేక పరీక్షలలో రేవంత్ ప్రజల వైపు నిలబడాలని కోరుకుందాం.

రమేష్ ‘విను తెలంగాణ’ అనటం కూడా ఏలికలు ప్రజలను వినాలనే.

05.09.2024

పుస్తకం వెల నాలుగు వందలు, కొరియర్ చార్జెస్ కలిపి ఐదు వందలు. పుస్తకం కావాలంటే రచయిత మొబైల్ కు – 9948077893 కి గూగుల్ పే లేదా ఫోన్ పే చేయగలరు. పూర్తి చిరునామా, పిన్ కోడ్, మొబైల్ నంబర్ పంపడం మరచిపోవద్దు. 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article