న్యాయస్థానాల్లో న్యాయమూర్తిని సంబోధించి మాట్లాడాలి, చట్ట సభల్లో సభాపతిని ఉద్దేశించాలి. ప్రజాస్వామ్యంలో మన ఫిర్యాదులను, పరిష్కారాలను ప్రజలకే నివేదించాలి. ‘విను తెలంగాణ’ అంటూ రమేష్ ఈ వ్యాసపరంపర రాయడం, విషయాన్ని ప్రజాకోర్టులోకి తీసుకువెళ్లడమే.
కె. శ్రీనివాస్
పూర్వ సంపాదకులు, ఆంధ్రజ్యోతి దిన పత్రిక
ఈ పుస్తకంలోని చాలా వ్యాసాలు రాసినప్పటి విషయ సందర్భం ఇప్పట్లో కాలం చెల్లేది కాదు. కానీ, సమయ సందర్భం గడచిపోయి మాత్రం ఎనిమిది నెలలు కావస్తోంది. లోక్ సభ ఎన్నికలు కూడా అయిపోయాయి, కొనసాగింపు, భిన్నత కలగిన కొత్త ప్రభుత్వం దేశంలో ఏర్పడింది. తెలంగాణకు సంబంధించి ఈ ఎన్నికలు కొన్ని కీలక మయిన ఫలితాలను ఇచ్చాయి.
కందుకూరి రమేష్ బాబు, ఎన్నికల రాజకీయాలను ప్రధానం చేసుకుని తెలంగాణను చర్చించినవాడు కాదు. తెలంగాణ స్వయం సాధకులైన ప్రజల వైపు నుంచి అశేష ఆకాంక్షలను, ఆశాభంగాలను పరిశీలించాడు. తెలంగాణ రాష్ట్ర ప్రయాణాన్ని, ప్రజల జీవితాల్లో నుంచి చూసి, తిరిగి దాన్ని వారికే నివేదించాడు. తెలంగాణలోని వివిధ జీవనరంగాలలో, అనేక ప్రాంతాలలో కనిపిస్తున్న శిథిలత దృష్టాంతాలను కనుగొని, వాటిని ఒక రాష్ట్ర వ్యాప్త వాస్తవంగా ఆవిష్కరించాడు. అనేక గుండెల చప్పుడును ఒకే ఆర్తనాదంగా, ఆవేదనగా, రణన్నినాదంగా కూర్చి వినిపించాడు. ప్రధాన మీడియా అని చెప్పుకునేది కూడా ఈ రకమైన క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, పౌరబాధితులతో సంభాషించి, కథనాలు అందించలేదు. వీటిని 2023 ఎన్నికల ముందు తెలంగాణ సమాజానికి వినిపించడం ద్వారా, ప్రజలు ఎరుక కలిగి ఎంచుకుంటారని ఆశించాడు. ఆయన కోరిక నెరవేరిందనే అనుకోవాలి. ఫలితంలో రమేష్ ప్రయత్నానికి కూడా ఎంతో కొంత భాగస్వామ్యం ఉంది.
ఉద్యమం తీవ్రమై మలిదశగా రూపుదిద్దుకోవడమే ఒక విశేషం. 1969 నాటి ఉద్యమం, దాని విద్రోహం, వైఫల్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇక ముగిసిపోయిన ఆకాంక్షే అన్న నిరుత్సాహాన్ని కలిగించాయి. పట్టువదలకుండా, ఆ నాటి నిప్పును కాపాడుకుంటూ వచ్చినవారు లేకపోలేదు. తెలుగుజాతి భావన మీద ఏర్పడిన ప్రాంతీయ పార్టీని కూడా ఆదరించేంతగా తెలంగాణ సమాధానపడిపోయింది కాబట్టే, 1983 తరువాత తెలంగాణ వలసీకరణ ఉధృతం కాగలిగింది. 1990లలో ప్రవేశించిన ఆర్థిక సంస్కరణలు, వ్యవసాయంతో సహా తెలంగాణలోని సకల గ్రామీణ జీవికల విధ్వంసం జరగడం, అమానుషమైన పోలీసు నిర్బంధం, తీవ్రమైన దుర్భిక్షం, ఆకలిచావులు, ఆత్మహత్యలు – ఈ నేపథ్యంలో నివురుగప్పిన నిప్పు గుప్పుమంది. ప్రజాస్వామిక విప్లవ వాదులు, కళాకారులు, మేధావులు, రచయితలు ఆలోచనను, ఉద్వేగాన్ని రాజేసి రాజేసి అగ్గిమంటను చేస్తే, సమయం ఆసన్నమైందని పాలక రాజకీయవాదులు గుర్తించారు. మేధావులు, ప్రజాకార్యకర్తలు, పోరాటసంస్థలతో కూడిన తెలంగాణ ఉద్యమసమాజం, తమ ఆకాంక్షను కేవలం భౌగోళిక అస్తిత్వానికే పరిమితం చేయకుండా, విలువల ఆధారిత లక్ష్యాలను నిర్దేశించుకుంది. కేవలం, కోరుకోవడమే కాదు, అందుకు తగ్గ హోంవర్క్ చేయడం కూడా మొదలుపెట్టింది. లోపించిన మౌలిక సదుపాయాలను కల్పించుకోవడం దగ్గర నుంచి, తెలంగాణ సహజ వనరులను, మానవ వనరులను సార్థక వినియోగంలోకి తేవడానికి ఏమేమి చేయవచ్చునో ప్రతిపాదించింది. రాజకీయ నాయకత్వం మాత్రం మొదటి నుంచి భౌతికంగా తెలంగాణ రాష్ట్రం సాధన మీదనే వక్కాణిస్తూ వచ్చింది. మొత్తంగా ఉద్యమ ఆశయాలను నీళ్లు, నిధులు, నియామకాలు అనే క్లుప్తసంపుటి కిందికి కుదించివేసింది. ఉద్యమం పతాక స్థాయిలో సమకూరిన అసాధారణ సకలజన ఐక్యతలో, లక్ష్యసాధన సాధ్యమేనన్న ఆశ కలిగిన స్థితిలో భౌగోళిక తెలంగాణ సాధనే తక్షణ లక్ష్యమని, తక్కినవన్నీ తరువాయి ఆదర్శాలనీ అనుకోవలసిన వాతావరణం అనివార్యం అయింది. భౌగోళిక రాష్ట్రమే ప్రథమ లక్ష్యం అనుకున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి మొదటి ప్రభుత్వం ఏర్పడేనాటికి, తెలంగాణ సమాజం విజయోత్సాహంలోనూ, కోల్పోయినవన్నీ పొందగలిగే కొత్తజీవితాలు సమకూరుతాయన్న అమాయకపు ఆశలోనూ ఉండింది. ఈ అన్ని దశలలోనూ తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షల గురించి, విలువల గురించి, సాధ్యాసాధ్యాల గురించి, పాలకశ్రేణుల వాస్తవ స్వభావం గురించి పూర్తి ఎరుకతో ఉండిన వారు ఉద్యమ సమాజంలో భాగంగా ఉన్నారు.
తెలంగాణ వాదం ప్రాతిపదిక మీద నూతన అభివృద్ధి విధానాన్ని చేపట్టే సంకల్పం ఏదీ కెసిఆర్ ప్రభుత్వానికి లేదని తెలియడానికి ఎక్కువ కాలం పట్టలేదు. కానీ, ఉద్యమం తెలంగాణ సమాజానికి అందించిన ప్రజాస్వామిక శక్తిని నిర్వీర్యం చేసే క్రమం సత్వరమే మొదలైనట్టు గ్రహించలేకపోయింది.
మొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలను సంతృప్తి పరచడంతో పాలన మొదలుపెట్టింది. విస్పష్టంగా కనిపించే ప్రత్యేకతల మీద దృష్టి పెట్టింది. సాంస్కృతికమైన సంరంభం సృష్టించింది. అదే సమయంలో, ఆ తొలిరోజులలోనే పెదవి విరుపులు కలిగించే పరిణామాలూ మొదలయ్యాయి. ఉద్యమనాయకత్వమే ప్రభుత్వ నాయకత్వంగా మారినచోట, ప్రజలు ఓపికగా ఉండడం సహజం. ప్రతీకాత్మకమైన మార్పులు కనిపిస్తున్నప్పుడు, అది సానుకూలమైన సహనంగా ఉండడమూ సహజమే. సుదీర్ఘకాల ప్రత్యేక ఉద్యమం తరువాత, సమీప అర్థశతాబ్దం అంతా క్షతగాత్ర అనుభవాల తరువాత తెలంగాణ సమాజం అసంతృప్తులను పక్కనబెట్టి కొంత సేద తీరాలని అనుకోవడమూ అర్థం చేసుకోదగ్గదే. తెలంగాణ వాదం ప్రాతిపదిక మీద నూతన అభివృద్ధి విధానాన్ని చేపట్టే సంకల్పం ఏదీ కెసిఆర్ ప్రభుత్వానికి లేదని తెలియడానికి ఎక్కువ కాలం పట్టలేదు. మొత్తం ఆకాంక్షలను మూడు అంశాల నినాదంగా మార్చినప్పుడు, దాన్ని నిర్విమర్శగా అంగీకరించిన సమాజం, ఆ మూడు అంశాల విషయంలో ప్రభుత్వం పట్టింపు చూపుతున్నందుకు సంతోషించింది. కానీ, ఉద్యమం తెలంగాణ సమాజానికి అందించిన ప్రజాస్వామిక శక్తిని నిర్వీర్యం చేసే క్రమం సత్వరమే మొదలైనట్టు గ్రహించలేకపోయింది. ఉద్యమకాలం నుంచి రాజకీయ నాయకత్వం మీద ఉండిన ఒక విమర్శ భూస్వామ్య స్వభావం. ప్రభుత్వాధికారం ఆ స్వభావానికి నైతికత అద్దింది. తెలంగాణకు ఆవశ్యకమైన నాయకత్వ లక్షణంగా భావించి కొందరు, విశాల ప్రయోజనం ముందు పట్టించుకోనక్కరలేని వ్యక్తిగత సరళిగా మరికొందరు భావించి కెసిఆర్ వ్యవహార సరళిలో కనిపిస్తున్న అప్రజాస్వామికతతో సర్దుకున్నారు. తనతో పాటు రాష్ట్రసాధనలో నడచిన శక్తులను, సంస్థలను ఒక్కొక్కటిగా అధికారపార్టీ అప్రధానం చేయసాగింది. మానవహక్కులు, ప్రజాస్వామిక స్వేచ్ఛల విషయంలో తాను భిన్నంగా ఉండబోవడం లేదని, పైగా కొత్తరకం నిర్బంధాన్ని అమలుచేయబోతోందని త్వరలోనే తెలిసివచ్చింది. మూడు సంవత్సరాల పాలన ముగిసే సరికి, ప్రతిపక్షం బలహీన పడిపోయింది. ఉద్యమశక్తులు కొన్ని ప్రభుత్వంలో చేరిపోయాయి, మరికొన్ని చెల్లా చెదురు అయ్యాయి. రాజకీయ స్థిరతను ప్రభుత్వం అవినీతికర పద్ధతుల ద్వారా సంపా దించుకుంది. జలసాధన ప్రయత్నాలు కూడా ఏకపక్షంగా, ప్రజాభాగస్వామ్యం లేకుండా మొదలయ్యాయి. తెలంగాణ నైసర్గిక స్థితి గతులను, సహజవనరులకు, సాంస్కృతిక పద్ధతులకు అనుగుణ్యమైన వ్యవసాయ విధానాన్ని, ఇతర జీవనాధారాల ప్రణాళికను రూపొందించడం కానీ, శిథిలమైన తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నం కానీ, మానవ శక్తికి తగిన వికాస అవకాశాలను కల్పించడం కానీ ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వాల కాలంలో మొదలైన కొన్ని నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల కొన్ని ప్రాంతాలలో మేలు జరిగిన మాట వాస్తవమే. పాలమూరు వలసలు తగ్గు ముఖం పట్టినది కూడా నిజమే. సాంస్కృతికంగా తెలంగాణ పండుగలకు, కళలకు వేదికలు దొరికిన మాట కూడా సత్యమే. కానీ, పరిపాలన అంతా ఓటు రాజకీయాల దృష్టితో సాగింది. అవినీతి క్రమంగా విశ్వరూపం ధరించింది. తెలంగాణ సమాజంలోనే ధనకాలుష్యం పెరిగిపోసాగింది. రియల్ ఎస్టేట్ వృద్ధే అభివృద్ధి అయింది, స్థలాల పందేరమే పారిశ్రామిక విధానం అయింది.
తెలంగాణ వాదం దాని సైద్ధాంతికతతో సహా అధికారపీఠం మీద కూర్చోగలిగితే, పౌర సమాజానికి, ప్రజలకు పాలనలో భాగస్వామ్యం, పాలకులపై అదుపు ఉండేది. గద్దె మీద వాదాన్ని కాకుండా, వ్యక్తిపూజను కోరుకునే ఒక నాయకుడు అధిష్ఠించాడు.
కానీ, రాష్ట్ర అవతరణకు ముందున్న మౌలికమయిన మనుగడల సంక్షోభం కొనసాగుతూనే ఉండింది. రైతు ఆత్మహత్యలు ఆగలేదు. నిర్వాసితుల గోడు అరణ్యరోదనగా మారింది. సమస్యలు చెప్పుకోవడానికి గుమిగూడడం నేరమైంది. రొటీన్ గా జరిగిపోవలసిన అనేక చర్యలు, నిర్ణయాలు కూడా దీర్ఘకాల నిద్రలో పడిపోయాయి. ఏలినవారికి కరుణ కలిగితే వరాలు, లేకపోతే, నిర్బంధాలు తరహాలో ప్రజాసమస్యలకు స్పందనలు ఉండేవి. రాజకీయ ప్రత్యర్థులను గృహనిర్బంధంలో ఉంచి, పాలకులు పర్యటనలు చేయడం, అర్థరాత్రుళ్లు ఇళ్లమీద పడి తలుపులు పగులగొట్టి అదుపులోకి తీసుకోవడం రాజకీయ పోలీసింగ్ కు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు.
నూతన రాష్ట్ర అవతరణ అంటే, కేవలం ఒక భౌగోళిక పరిణామం మాత్రమేనని, సామాజిక, ఆర్థిక, రాజకీయపరిస్థితులు మునుపటి వలెనే కొనసాగుతాయని కెసిఆర్ కు ముందే తెలుసు. అట్లాగే, పెద్దగా వ్యవస్థ తలకిందులయ్యేమార్పులేవీ రావని ఉద్యమ శక్తుల్లోనే కొందరికైనా బాగా తెలుసు. కాకపోతే, అభివృద్ధిలో, ప్రాతినిధ్యంలో వికేంద్రీ కరణ ఒక సానుకూల, ప్రజాస్వామిక విలువ కాబట్టి, ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ సమాజానికి కొన్ని అదనపు ప్రయోజనాలుంటాయని చాలా మంది ఆశించారు. ఉన్న పరిమితులలోనే, ఉనికిలో ఉన్న చట్రంలోనే కొంత విధానపరమైన చొరవ తీసుకోవచ్చు. తెలంగాణ వాదం దాని సైద్ధాంతికతతో సహా అధికారపీఠం మీద కూర్చోగలిగితే, పౌర సమాజానికి, ప్రజలకు పాలనలో భాగస్వామ్యం, పాలకులపై అదుపు ఉండేది. గద్దె మీద వాదాన్ని కాకుండా, వ్యక్తిపూజను కోరుకునే ఒక నాయకుడు అధిష్ఠించాడు. నాయక కేంద్రిత ప్రాంతీయ పార్టీగా, సాధారణ ఓట్ల ఎత్తుగడలను అనుసరించే ఫక్తు రాజకీయ పార్టీగా మారిన తరువాత, ఉద్యమ విలువలకు జవాబుదారీ వహించేవారెవరూ లేక పోయారు. అడిగినవారందరూ అస్మదీయులు కాకుండా పోయారు. ప్రజలతో నాయకుడి సంబంధం దాత, గ్రహీత సంబంధంగా మారిపోయింది.
పెద్ద మార్పును మనస్ఫూర్తిగా ఆశించినవారు ఈ స్థితిలో ఉక్కపోతను మొదటగా అనుభవించినవారు. ఇంత తొందరగా ఆశాభంగమా కొందరు ఆశ్చర్యపోయారు. కొందరు స్వానుభవాల తరువాత విముఖత పెంచుకున్నారు. కొందరు కొద్దిపాటి సంప్ర దింపులకు, భాగస్వామ్యానికి సంతుష్టులయ్యారు. పూర్వపు ప్రభుత్వాల కంటె మెరుగే కదా, తెలంగాణ తనం కనిపిస్తోంది కదా అని కొందరు అల్పసంతోషులయ్యారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని చిత్తశుద్ధితో ప్రయత్నించినవారూ ఉన్నారు. ఎంతో కొంత చేసినవారూ ఉన్నారు. అంతా ఒకే రీతిగా లేదు. సాము దాయికంగా ఒకే అనుభవమని, ఒకే స్పందన అనీ చెప్పలేము. విముఖత, విరక్తి కూడా అందరికీ ఒకే సమయంలో, ఒకే సహిష్ణుత స్థాయిలో కలగాలని లేదు. రమేష్ బాబు సహిష్ణుత స్థాయి ఇతరుల కంటె భిన్నమైనది కాబట్టి, ఆయన స్పందనలలోని తీవ్రత కూడా వేరువేరుగా ఉన్నది. కొందరిని, కొన్నిటిని కటువుగా విమర్శించారు. కొందరి మీద, కొన్నిటి మీద మెతకగా ఉన్నారు. దృఢంగా వ్యక్తం చేయడానికి, దురుసుగా చెప్పడానికి కొన్నిచోట్ల తేడా పాటించలేదు. అట్లాగే కొన్ని సానుకూలతలను కూడా మితిమీరి చెప్పారు.
రమేష్ బాబు తెలంగాణ ఆశాభంగాలను కొన్ని కేస్ స్టడీల ద్వారా, కొన్ని జీవనరంగాల ద్వారా చూశారు కాబట్టి, ఆ ఆశాభంగాల కారణాలను కూడా కొందరు వ్యక్తుల ప్రస్తావనతో చూసే ప్రయత్నం చేశారు. విషయాలను అవగతం చేయించడంలో పాత్రికేయులే కాదు, సామాజిక క్షేత్రపరిశీలకులు అనుసరించే విధానం ఇది. కేవలం అన్నం ఉడుకును కొన్ని మెతుకులు చిదిమి తెలుసుకోవడం మాత్రమే కాదిది. మూల కారణాలు, అవి వ్యక్తమయిన తీరు రెండూ ఈ పద్ధతిలో తెలుస్తాయి. పాలమూరు వలసలు, సింగరేణి సమస్యలు, మల్లన్నసాగర్ నిర్వాసితులు, సంక్షేమ లబ్ధి అందుబాటు వంటి కీలక నేపథ్యాల నుంచి ఈ ప్రత్యేక కథనాలు రూపొందాయి. తెలంగాణ వ్యాప్త క్షేత్ర స్థాయి స్థితిగతులన్నిటినీ తెలుసుకోవడానికి రమేష్ బాబు తీసుకున్న ఉదాహరణల సైజు కానీ, స్వభావం కానీ సరిపోకపోవచ్చు. కానీ, తప్పనిసరిగా అవి తెలంగాణలో గత పదేళ్లలో ఏమి జరిగిందో, జరగలేదో తెలుసుకోవడానికి కావలసిన కీలక అనుభవాలను అందించాయి.
చూపు తొడిగిన లెన్స్, దృశ్యీ కరించగలిగిన కలం, చక్రాలు తొడిగిన ఉత్సాహం కలిస్తే రమేష్ బాబు. సరైన సమయంలో ఈ కథనాలను సంధించారు, అందుకే కొన్ని ఆగ్రహాలను కూడా రుచిచూశారు.
న్యాయస్థానాల్లో న్యాయమూర్తిని సంబోధించి మాట్లాడాలి, చట్టసభల్లో సభాపతిని ఉద్దేశించాలి. ప్రజాస్వామ్యంలో మన ఫిర్యాదులను, పరిష్కారాలను ప్రజలకే నివే దించాలి. ‘విను తెలంగాణ’ అంటూ రమేష్ ఈ వ్యాసపరంపర రాయడం, విషయాన్ని ప్రజాకోర్టులోకి తీసుకువెళ్లడమే. పౌరసమాజానికి, ప్రజలకు మధ్య సంభాషణను సాధ్యమైనంత నియంత్రించడానికి ప్రయత్నించే ప్రభుత్వాలు, ప్రజలకు సమాచారం, అవగాహన అందకూడదని, తమ చెప్పుచేతల్లో లేని విధానాల ద్వారా వారు నిర్ణయాధి కారం పొందకూడదని అనుకుంటాయి. ప్రజలకు చెప్పవలసినవి సకాలంలో, బాధ్యతగా చెప్పడమే పాత్రికేయులైనా, రచయితలైనా చేయవలసింది. చూపు తొడిగిన లెన్స్, దృశ్యీ కరించగలిగిన కలం, చక్రాలు తొడిగిన ఉత్సాహం కలిస్తే రమేష్ బాబు. సరైన సమయంలో ఈ కథనాలను సంధించారు, అందుకే కొన్ని ఆగ్రహాలను కూడా రుచిచూశారు.
మొదటి పదేళ్ల తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలను, దుర్మార్గాలను, నిరాశలను ఇంత వివరంగా చర్చించిన ఈ వ్యాసాలు పుస్తకరూపంలోకి వచ్చేసరికి, ప్రత్యేక రాష్ట్ర మూడో ప్రభుత్వం బోనులో కాకపోయినా, కనీసం తరాజులో నిలబడింది. దాని వల్ల కలిగే ఆశాభంగాలు కూడా మొదలయ్యాయి. తెలంగాణ భావోద్వేగాలు, వ్యక్తి పూజల సహాయంతో ప్రజలను రంజింపజేయడానికి మొదటి రెండు దఫాల ప్రభుత్వం ప్రయ త్నిస్తే, తెలంగాణ తనమే కనిపించని రీతిలో మూడో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆరు గ్యారంటీలకే పూర్తి గ్యారంటీ లేనప్పుడు, ఏడో గ్యారంటీ గురించి ఇంకేమి మాట్లాడతాము? ప్రొబేషన్ కాలం ఇంకా మిగిలే ఉంది కాబట్టి, ప్రజల సహన సూచిక ఇంకా సరిహద్దులలోనే ఉన్నది.
సంక్షేమాల మత్తులోనో, జనాకర్షణల మాయలోనో సమాజం జాగ్రదవస్థ నుంచి తొలగవచ్చు. వినడాన్ని, చదవడాన్ని, తర్కించుకుని అర్థం చేసుకోవడాన్ని మరచి పోవచ్చు. కానీ, మనం చెబుతూనే ఉండాలి. రాస్తూనే ఉండాలి. అభివృద్ధో, జీవన ప్రమాణాల మెరుగుదలో నష్టపోయినంత నష్టపోయాము. కానీ, తెలంగాణ ఉద్యమం ముందుకు తెచ్చిన విలువలు, వనరుల మీద స్థానికుల హక్కు, వికేంద్రీకరణ, మానవ, ప్రాకృతిక వనరుల ఆధారిత అభివృద్ధి విధానం, ఆత్మగౌరవం, భాగస్వామ్య నిర్ణయా ధికారం – వీటిని వదులుకోకూడదు. ఆ విలువలు తెలంగాణకు రాజ్యాంగ విలువల వంటివి.
27.07.2024
పుస్తకం వెల నాలుగు వందలు, కొరియర్ చార్జెస్ కలిపి ఐదు వందలు. పుస్తకం కావాలంటే రచయిత మొబైల్ కు – 9948077893 కి గూగుల్ పే లేదా ఫోన్ పే చేయగలరు. పూర్తి చిరునామా, పిన్ కోడ్, మొబైల్ నంబర్ పంపడం మరచిపోవద్దు.