Editorial

Saturday, April 27, 2024
సంపాద‌కీయంఈ రోజు ఎవరిని గుర్తు చేసుకోవాలి? - కందుకూరి రమేష్ బాబు

ఈ రోజు ఎవరిని గుర్తు చేసుకోవాలి? – కందుకూరి రమేష్ బాబు

“నేను అడుగుతున్నాను: లెనిన్ ను గౌరవించినట్లు, సామాన్య వ్యక్తులను గౌరవించే గుణాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకున్నాం?” అని!

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh Babu

ఇప్పటికీ నేను విస్మయానికి గురవుతూనే ఉంటాను. చింగిజ్ ఐత్ మోతొవ్ రాసిన తొలి ఉపాధ్యాయుడు గురించి, అందులో ప్రధాన పాత్ర ఐన ద్యూయ్ షేన్ గురించి. ద్యూయ్ షేన్ ల వంటి లక్షలాది వ్యక్తుల గురించి. మీది మిక్కిలి ఆ పాత్ర చెప్పే సత్యం గురించి… అడిగే ప్రశ్న గురించి…

అసలు ద్యూయ్ షేన్ ఎవరో చెప్పడం కన్నా నిజానికి ఆయన్నొక అపురూప చిత్రంగా వేసి చూపాలి లేదా ఈ కింద చూపిన ఛాయాచిత్రాలనైనా అనేకం పరిచయం చేయాలి. అయినప్పటికీ అయన ఎవరో లీలగా కూడా మీరు గుర్తు పట్టకపోతే ఈ కాస్తంత ఉపోద్గాతం అవసరమే. ముఖ్యంగా లెనిన్ మహాశయుడి పుట్టినరోజు అవశ్యం కూడా.

ద్యూయ్ షేన్ : సామాన్యశాస్త్రం చిత్రం

1962లో చింగిజ్ ఐత్ మోతొవ్ రాసిన రాసిన తోలి ఉపాధ్యాయుడు అన్న పుస్తకం ఆంగ్ల అనువాదం పేరు First teacher. సోవియట్ సమాజ నిర్మాణం కోసం తరతరాలుగా వస్తోన్న సంప్రదాయ విలువలను కాదని, తొలినాళ్ళలో విప్లవాత్మకమైన ఎన్నో పనులకు పూనుకున్న ఒక తొలి తరం ఉపాధ్యాయుడి కథ ఇది. బయట ప్రపంచపు విజ్ఞానాన్ని, విద్యను ఒక కుగ్రామానికి తెచ్చి, ఒక్క ఉపాధ్యాయుడిగానే కాక భాహుముఖ పాత్రాలెన్నో పోషించి తమ గ్రామాన్ని మార్చిన తొట్ట తొలి గురువు ఆయన. ఆయన గురించిన పుస్తకం ఇది.

ఆ మహానుభావుడి గురించి ఈ పుస్తకం వస్తువు అనుకుంటే, ఆ గురువు కారణంగానే చదువుకుని, పట్నం వెళ్లి, ప్రఖ్యాతి వహించిన మహిళామణిగా ఎదిగిన మరొక వ్యక్తి ఈ పుస్తకానికి శిల్పం అనాలి. ఈ వస్తు శిల్పాలను రచయిత ఒక యువకుడు ఒక చిత్రాన్ని అపురూపంగా చిత్రించడానికి పూనుకోవడం ఆధారంగా కథ చెప్పడానికి పూనుకుంటాడు.

అన్నట్టు ఆ మహిలామణి లేదా ఆ విద్యార్ధి నేడు యూనివర్సిటీలో తత్వశాస్త్ర ప్రొఫెసర్. ఆ విభాగానికి అధిపతి అయ్యారు కూడా. ఆమె పేరు అల్తినాయ్ సులైమానోవ్న.

ఆమె తమ గ్రామ పాఠశాల వార్షికోత్సవానికి ఆహ్వానం అందుకుని స్వగ్రామానికి వెలుతుంది. సభ పూర్తయ్యే లోపల తన గురువుగారు ఇంకా బతికే ఉన్నారని, ఉత్తరాలు బడ్వాటా చేసే పనిలో ఇంతకుముందే ఈ బడికి వచ్చి వేల్లరనీ తెలుసుకుంటుంది. ఒక్క పరి ఆతడు యాదిలోకి రావడంతో ఆమె ఎంతగా ఉద్రేక పడుతుందో చదివితేగానీ మీకు అర్థం కాదు. ఆమెను తీవ్ర విచారం అలుముకుంటుంది. తానూ తన గురువు గారూ నాటిన పోప్ల్లర్ల చెట్ల వైపు ఆమె దీర్గంగా చూస్తుంది. అదేమిటో గానీ స్త్రీకి సహజమైన క్లేశెంతో చూస్తుంది. చూస్తుంటే, ఆమె ఆకడమీషన్ సులైమానోవ అనిపించదు. అట్లా కనపడదు. ఆమె ఒకలాంటి ఆనందాన్ని అనుభవించు తున్నట్టూ, దుఖాన్ని భరించుతున్నట్టూ ఉన్న ఒక సామాన్యురాలుగా కానరావడం ఒక విశేషం.

సులైమానోవ్న : చిత్రం సామాన్యశాస్త్రం

నిజమే. ఆమె ఒక మామూలు ఖిర్జీజ్ స్త్రీ గా అనిపిస్తుంది. ఉదాహరణకు ఈ తెలంగాణా పడుచులా ఉంటుంది.

ఆమె మెల్లగా యాది తెచ్చుకుంటుంది. ఆ విద్వాంసురాలు తన యవ్వనాన్ని, పాటల్లో ఉన్నట్టుగా ఎంతటి ఉన్నత పర్వత శిఖరంపై నిలబడి పిల్చినా తిరిగి రానట్టి ఒకానొక పూర్వ యవనాన్ని ఆమె జ్ఞప్తికి తెచ్చుకుంటున్నదేమో అనిపిస్తుంది. ఆమె పోప్లార్ల కేసి చూస్తూ ఏదో చెప్పాలనుకుంటుంది. కానీ వెళ్ళిపోతుంది. “నామీద నాకే కోపం వస్తుంది” అనుకుంటూ వెళ్ళిపోతుంది. నేరుగా రైలెక్కి మస్కోకి వెళుతుంది. వెళ్లినాక ఒక ఉత్తరం రాస్తుంది. మరచిపోయిన తన స్పూర్తిదాతను యాది చేసుకుంటూ ఎంతో ప్రయాసతో తన మనసును తిరిగి అక్షరాల్లో పెట్టి తన గ్రామానికి చెందిన ఆ అబ్బాయికి ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరమే ఈ నవలలోని ముఖ్య భాగం. “అది అందరికీ చదివి వినిపించాలి” అంటుంది. అంటూ ఆమె తనను అయన క్షమించవలసిందని వినయంగా మనవి చేసుకుంటుంది.

లెనిన్ వంటి మహానేతల ఆదర్శాలను కొనియాడుతున్నాం. కానీ వాటిని సఫలం చేసిన సామాన్య వ్యక్తులను గౌరవించడం లేదు.

ఆ ఉత్తరం మొత్తం ఒక విశాలమైన గాథ.

ద్యూయ్ షేన్ ఎలా తన గ్రామంలో ఒక గుర్రపు శాలను బడిగా మార్చినదీ, తాము బడికి వెళ్లేందుకు ఎట్లా కుటుంబాలను ఒప్పించిందీ, ఆ క్రమంలో అయన పడ్డ కష్టాలను విస్తారమైన కాన్వాసుతో కళ్ళకు కడుతుంది. ఆయన చావును సైతం దిక్కరించి ఎలా ఈ బాలికను ఇంతంటి విద్వంసురాలిగా మర్చినాడో, తనవంటి ఎందరినో ఉన్నతులుగా ఎలా మలిచినాడో అక్షరాలా వివరిస్తుందామే.

ఇంతకూ ఆ ఉత్తరంలో చివరగా ఆమె ఏం రాసిందో చెప్పాలి. అదే ఈ వ్యాసానికి కీలకం.

చాలా సుదీర్గమైన ఆ ఉత్తరంలో చివరి పేరాల్లో ఉటంకించిన పాదాలు ఇవి :

“…ఇది ఇక్కడ ఒక్కచోటనే జరిగిన సంగతి కాదు. ఇతర చోట్ల కూడా ఇలాంటివి జరగడం చూశాను. అందుకనే నేను అడుగుతున్నాను: లెనిన్ ను గౌరవించినట్లు, సామాన్య వ్యక్తులను గౌరవించే గుణాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకున్నాం?”

ఈ రోజు లెనిన్ పుట్టినరోజు. తమ మానాన తాము పని చేసిన ద్యూయ్ షేన్ లను గుర్తు చేసుకోవడమే లెనిన్ కు అసలైన నివాళి అని మనం గుర్తు చేసుకోవాలనే ఈ తెలుపు సంపాదకీయం.

ఇదీ ఆ ప్రశ్న.  లెనిన్ ను గౌరవించినట్లు మనం సామాన్య వ్యక్తులను గౌరవించే గుణాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నామని ఆమె ఎంతో ఆవేదనతో అడుగుతుంది.

“మనం లెనిన్ ని, మార్క్స్ ని లేదా గొప్ప గొప్ప నేతలను మాత్రమే గౌరవిస్తున్నాం. ఆ దీపం కింది నీడను చూడ నిరాకరిస్తున్నాం.”

“లెనిన్ వంటి మహానేతల ఆదర్శాలను కొనియాడుతున్నాం. కానీ వాటిని సఫలం చేసిన సామాన్య వ్యక్తులను గౌరవించడం లేదు.”

“లెనిన్ ను గౌరవించినట్లు, సామాన్య వ్యక్తులను గౌరవించే గుణాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకున్నాం?”

ఇవీ ఆ ప్రశ్నలు. ఆ ఉత్తరం సారాంశం. పుస్తకం ఇతివృత్తం.

ఈ రోజు లెనిన్ పుట్టినరోజు. తమ మానాన తాము పని చేసిన ద్యూయ్ షేన్ లను గుర్తు చేసుకోవడమే లెనిన్ కు అసలైన నివాళి అని మనం గుర్తు చేసుకోవాలనే ఈ తెలుపు సంపాదకీయం.

 

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన తొలి ఉపాధ్యాడుడు పుస్తకం కోసం ఈ లింక్ చూడవచ్చు

More articles

1 COMMENT

  1. ఆర్టికల్ చాలాబాగుంది సరియైన సమయంలో రావడం అవసరం కూడ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article