Editorial

Wednesday, May 8, 2024
కాల‌మ్‌ఆ రెండు పదాలు : ఈ వారం వెలుతురు కిటికీ

ఆ రెండు పదాలు : ఈ వారం వెలుతురు కిటికీ

THANK YOU. SORRY.

క్షమించు.. ధన్యవాదాలు.

భాష ఏదైనా ఈ రెండు పదాలకు ఉన్న శక్తిని చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అవి ఎంత తరచుగా వాడినా వాడిపోవు. సజీవమైన మానవసంబంధాల నడకకి ఈ రెండు పదాలు చాలా అవసరం.

సిఎస్ సలీమ్ బాషా

సంబంధం అనే బండి చక్రానికి ఈ రెండు పదాలు కందెన లాంటివి. మానవ సంబంధాలు నిరంతరం మృదువుగా ఉండడానికి పనికొచ్చే లూబ్రికెంట్ లాంటివి. సమాజంలో ఎక్కువ నిర్లక్ష్యం చేయబడిన లేదా అరుదుగా వాడబడే పదాలు ఇవి. మనిషి సామాజిక జీవితంలో ఈ పదాలు చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి. చాలామందికి క్షమించు అని చెప్పడం తామేదో తప్పు చేశామన్న భావన లాంటిది. చాలా వరకు అహం కూడా దీనికి అడ్డుపడుతుంది. తప్పు చేసి కూడా సారీ చెప్పకపోవడం ఒక ఎత్తయితే, అవతలివాళ్ళు సారీ చెప్పాలి అని కోరుకోవడం అహానికి పరాకాష్ట.

మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలో థాంక్యూ అనే పదానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేసిన సన్నివేశం ఒకటి ఉంది. మెడికల్ కాలేజీలో స్వీపర్ కారిడార్ లో తుడుస్తుంటే మున్నాభాయ్ వెళ్లి అతనికి “థాంక్యూ” చెప్తాడు. ముందు కొంచెం మొరటుగా స్పందించిన స్వీపర్ తర్వాత ఎలా మారిపోతాడు అన్నది ఇది. చాలా చక్కగా తెలియజేసిన సన్నివేశం ఇది. ఒక చిన్న మాట ఆ స్వీపర్ కి ఎంత గొప్పగా అనిపించిందో, అతని ఎంతగా ప్రభావితం చేసిందో సినిమాలో మనం చూడవచ్చు. కొంచెం అతిశయోక్తిగా అనిపించినా థాంక్యూ ప్రభావం చాలా గొప్పది.

కాలమిస్టు సలీం భాషా సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. ఉద్యోగ నైపుణ్యాల భోదకులు కూడా. వారి మొబైల్ నంబర్ 93937 37937

అయితే ఎవరు కూడా అవతలి వాళ్ల నుంచి థాంక్యూ ఆశించకూడదు. కృతజ్ఞత అన్నది మనం చేసిన సహాయానికి బదులుగా చెప్పేదికాదు.

“చూడు… ఇంత చేసినా కనీసం థాంక్స్ కూడా చెప్పలేదు” అన్నమాట మనం చాలాసార్లు వింటుంటాం. అది కరెక్ట్ కాదు. మనకు థాంక్స్ చెప్పాలా లేదా అన్నది ఎదుటివాళ్ళు అనుకోవాలి. మనం కూడా అంతే.

కృతజ్ఞతలు తెలపడానికి చాలా పెద్ద సహాయం చేసి ఉండాల్సిన అవసరం లేదు. చిన్న సహాయం అయినా చిన్న పని అయినా ఓకే. అయితే అది ” పెదాల మీద పప్పులు ఉడికించినట్లు కాకుండా”, మనసులో నుంచి రావాలి. యాంత్రికంగా చెప్పే థాంక్స్ కు పెద్దగా ప్రభావం ఉండదు. పైగా అది మరింత ఇబ్బంది కలిగించవచ్చు.

‘సారీ’ గురించి, క్షమించడం గురించి ఒక పుస్తకమే రాయొచ్చు.

ఇక ” సారీ ” గురించి, క్షమించడం గురించి ఒక పుస్తకమే రాయొచ్చు .ఇంగ్లీషులో బాగా పాపులరైనా ఒక కొటేషన్ చూస్తే అర్థం అవుతుంది..

“The first to apologize is the bravest.
The first to forgive is the strongest.
The first to forget is the happiest.”

సారీ చెప్పడం అనేది మనం చేసిన తప్పును మనం గుర్తించినట్లే కాదు, దాన్ని ఒప్పుకున్నట్లు కూడా. అది చాలా ముఖ్యమైన విషయం. అందుకే చేసిన తప్పును ఒప్పుకోవడం కాకుండా సారీ చెప్పడం అన్నది మన క్యారెక్టర్ ను కూడా అవతలి వాళ్లకు తెలియపరుస్తుంది. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. అవతలి వాళ్ళు తప్పు చేసి మనదే తప్పని చెబుతున్నప్పుడు కూడా సారీ అన్న పదం ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనల్ని సహాయం కానీ, చిన్న పని గాని చేసిపెట్టమని అడిగినప్పుడు, మనం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా “సారీ” చెప్పడం కూడా కొంచెం హుందాగా ఉంటుంది. ఏది ఏమైనా “సారీ” చెప్పడానికి కొంచెం ధైర్యం ఉండాలి.

తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయల తో “ఒక్కోసారి చేసిన తప్పు కన్నా క్షమాపణ ఎక్కువ అవమానకరంగా ఉంటుంది” అన్నాడు. కృష్ణదేవరాయలు “ఎలా?” అని అడిగితే మరోసారి చెప్తా అన్నాడు
ఒకసారి రాజు తన తోటలో వంగి పూలు పరిశీలిస్తుంటే తెనాలి రామలింగడు, రాజు వెనుక భాగం మీద చేత్తో తట్టాడు. రాజు వెనక్కి తిరిగి కోపంతో “ఏంటయ్యా ఇది?” అని అడిగితే, తెనాలి రామలింగడు “క్షమించండి మహారాజా, రాణి అనుకున్నాను!” అన్నాడు. సరదాగా చెప్పినప్పటికీ దీంట్లో చాలా అర్థం ఉంది. చాలామంది క్షమాపణ చెప్పే పద్ధతి చేసిన తప్పు కన్నా ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది.

చాలాసార్లు సారీ కన్నా, థాంక్స్ అని చెప్పడం ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది.

చాలామంది మానసిక శాస్త్రవేత్తల ప్రకారం మనుషులు మూడు రకాలు ఉంటారు. Passive, (ఉదాసీనంగా ఉంటారు) Aggressive (దౌర్జన్య కారులు), Assertive (సంయమనంతో ఉండేవాళ్ళు)

ఉదాసీనంగా ఉండేవాళ్ళు ప్రతిదానికి క్షమించమని అడుగుతారు, ప్రతి దానికి థాంక్స్ చెప్తూ ఉంటారు
దౌర్జన్య కారులు తాము చెప్పిందే కరెక్ట్ అని దబాయిస్తారు. ఇతరులను చాలా తక్కువ గా చూస్తారు. ఇతరులే తమకు థాంక్స్ చెప్పాలని కోరుకుంటారు . క్షమించండి అనే మాట వీరి నోటి నుంచి నుంచి రాదు. సంయమనంతో ఉండేవాళ్ళు బ్యాలెన్స్ గా ఉంటారు. నిజమే మాట్లాడతారు కానీ ఎవరినీ నొప్పించకుండా చెప్తారు. ఎప్పుడు సారీ చెప్పాలి, ఎప్పుడు థాంక్స్ చెప్పాలి వీరికి బాగా తెలుసు

ఇక్కడ ఒక తమాషా అయిన విషయం ఉంది. సారీ కానీ, థాంక్స్ కానీ పర్యాయపదాలుగా వాడవచ్చు. ఉదాహరణకు మన కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే “సారీ మిమ్మల్ని బాగా వెయిట్ చేయించాను” అని చెప్పడం కన్నా “ఎంతో ఓపిగ్గా వెయిట్ చేసినందుకు చాలా థాంక్స్” అని చెప్పడం హుందాగానూ మరింత మర్యాదగా నూ ఉండొచ్చు. అయితే అది ఎదుటి వ్యక్తి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది అని గమనించాలి. చాలాసార్లు సారీ కన్నా, థాంక్స్ అని చెప్పడం ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది. “నేను మిమ్మల్ని ఇంతసేపు కూర్చో పెట్టాను, సారీ”, అని చెప్పడం కన్నా “ఎంతో ఓపిగ్గా ఇంతసేపు కూర్చున్నందుకు థాంక్స్” అని చెప్పటం బావుంటుందేమో!

సారీ చెప్పడం చేసిన తప్పు నుంచి మనల్ని మనం విముక్తులు చేసుకోవడం. థాంక్స్ చెప్పడం అవతల వారి క్యారెక్టర్ ను ప్రశంసించడం.

ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి సారీ చెప్పడం చేసిన తప్పు నుంచి మనల్ని మనం విముక్తులు చేసుకోవడం. థాంక్స్ చెప్పడం అవతల వారి క్యారెక్టర్ ను ప్రశంసించడం. అవతలి వారిని ప్రశంసిస్తూ మనల్ని క్షమించమని అడగడం లాంటిది. రెండిట్లో ఏది ఎక్కువ ఎఫెక్టివ్ అనేది, సమయం, సందర్భాన్ని, అవతలి వారితో మనకు ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది.

ఎప్పుడు థాంక్స్ చెప్పాలి, ఎప్పుడు సారీ చెప్పాలి అన్నది ఎదుటి వ్యక్తి లేదా వ్యక్తుల మీద, సందర్భం మీద, ఎక్కడున్నాము అనేదానిమీద కూడా ఆధారపడుతుంది. మనకు దగ్గర వాళ్లకి సారీ గానీ థాంక్స్ గానీ చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. చాలా అరుదుగా చెప్పాల్సి రావచ్చు. పదే పదే చెబుతున్నాము అంటే వాళ్లని దూరం పెడుతున్నట్లు వాళ్లు భావించే అవకాశం ఉంది. అప్పుడు థాంక్స్ గానీ సారి గానీ వికటించవచ్చు.

అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు. చీటికిమాటికి సారీ చెప్పడం ఒకసారి చిరాకు కలిగించవచ్చు, అవతలి వాళ్ళని ఇరిటేట్ కూడా చేయవచ్చు. అదేవిధంగా పదే పదే చెప్పే ధన్యవాదాలు కూడా ఇబ్బందికరంగా కూడా ఉండొచ్చు. క్షమించమని అడిగినా, ధన్యవాదాలు చెప్పినా అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు.

ఆ రెండు పదాలు అవతలి వారికి కాసింత ఊరట, లేదా స్వాంతన కలిగించాలి. వాళ్లు మనల్ని అర్థం చేసుకోగలగాలి. వారితో సంబంధం మరింత పటిష్టం కావడానికి ఉపయోగపడాలి తప్ప, ఏదో క్యాజువల్ గా అలా చెప్పినట్లు ఉండకూడదు. అప్పుడే ఆ పదాలకి గౌరవం ఉంటుంది.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article