Editorial

Friday, May 10, 2024
కథనాలుఅమర వీరుల వి’స్మృతి వనం’ : అమరుల సంక్షేమ కమిటీ ఏర్పాటుకై డిమాండ్

అమర వీరుల వి’స్మృతి వనం’ : అమరుల సంక్షేమ కమిటీ ఏర్పాటుకై డిమాండ్

ఇవ్వాళ సాయంత్రం అమర వీరుల స్మృతి వనం ఆవిష్కరణ. ప్రభుత్వం ఈ రోజే అమరుల పేర్లను పొందుపరిచేందుకు, పేరుపేరునా వారిని స్మరించేందుకు, అందరి సంక్షేమం కోసం నడుం కట్టేందుకు వెంటనే ఒక కమిటీ వేయాలన్న డిమాండ్ ను సమాజంగా మనం తేవాలి.

సుమారు ఆరు వందల మంది అమరుల కుటుంబాలకు మాత్రమే పది లక్షలు, ఒక ఉద్యోగం ఇచ్చారు. వారికి ఇల్లు, జాగా, విద్య వైద్యం గురించి ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది. మిగిలిన అన్ని హామీలు నెరవేర్చాలని, మొత్తం అమరులను గుర్తించి వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం వెంటనే ఒక కాల పరిమితిలో పనిచేసేందుకు కమిటీ వేయాలను ఒత్తిడి చేయాలి.

ఎవరో ఒకరికి పదవి ఇచ్చి చేతులు దులుపుకునే అలోచనలో ఉన్న ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం నడుం కట్టాలని డిమాండ్ చేయడం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన కనీస బాధ్యత.

అమరుల కుటుంబాలకు ఇప్పటిదాకా జరిగిందేమిటో వివరించే కథనం ఈ సందర్భంగా తెలుపు ప్రత్యేకం.

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh Babu
Editor, Teluputv

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సుందరంగా, గొప్ప స్ఫూర్తి వంతంగా, భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలిచేలా ట్యాంక్ బ్యాండ్ వద్ద నిర్మించిన అమర వీరుల స్మృతి వనాన్ని ఈ సాయంత్రం అంటే జూన్ 22 న ప్రారంభించనుంది. కానీ దీని ప్రారంభోత్సవానికి మా కుటుంబాలకు ఇప్పటికీ ఆహ్వానం రాలేదని అమరుల కుటుంబాల వేదిక కన్వీనర్ కావలి మణ్యం అన్నారు. “మేం గత నెల 26 న, ఎక్కా యాదగిరి నిర్మించిన తొలి దశ అమర వీరుల స్మారక విగ్రహం ఉన్న- గన్ పార్క్ వద్ద మా విజ్ఞప్తిని ప్రభుత్వానికి తెలియ జెప్పటానికి వెళ్లాం. ప్రభుత్వాన్ని కలిసి అమరుల స్మృతి వనం ఆవిర్భావం సందర్భంగా మా పిల్లల చరిత్రను, వారి ఛాయా చిత్రాన్ని అందులో పెట్టాలని చెప్పేందుకు ప్రయత్నించాం. మొత్తం అమరులందరి వివరాలను నమోదు చేయకుండానే వారి పేరిట స్మృతి వనం ఆవిష్కారం కావొద్దని చెప్పాలన్నది మా తపన. కానీ కుదరలేదు. దాంతో పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశాం. అంతేకాదు, అమరుల కుటుంబాల చేతనే స్మృతి వనం ఆవిష్కరించాలని డిమాండ్ చేశాం. ఇప్పటికీ స్పందన లేదు” అని ఆయన చెప్పారు. “గత చరిత్రను విస్మరించేవారు నూతన చరిత్రను నిర్మించలేరు” అని ఈ సందర్భంగా వారు నొచ్చుకుంటూ అన్నారు.

celebrations logoముఖ్యమంత్రి గారు నిర్మిస్తున్న అమరుల స్మృతి వనం తొలి, మలి దశ అమరుల వీరులను పేరు పేరునా నమోదు చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర సాధనలో వేలాది త్యాగాలు విస్మరణకు గురవుతాయి. ‘స్ముతి’ వనం ‘విస్మృతి వనం’ అవుతుంది. అలా కాకూడదనే మా ఆవేదన”

“ముఖ్యమంత్రి గారు స్మృతి వనం నిర్మించడం గొప్ప విషయమే. ఆహ్వానించ దగ్గదే. ఇది మా అమరుల కుటుంబాలకు ఆనందం కలిగించేదే. కానే తెలంగాణా విముక్తి కోసం మేం ఏ బిడ్డలనైతే ఇచ్చామో ఆ వీరుల కుటుంబ సభ్యులుగా మాకు గౌరవం దక్కాలని కోరుకోవడం తప్పు కాదు కదా. ఇంతవరకు అమరుల కుటుంబాలకు ఆహ్వానం లేదు. ఇది మాకు బాధ కలిగించే విషయం” అన్నారు కావలి మణ్యం.

అమరుల స్మృతి వనంలో క్యాంటిన్లు, బిర్యానీ సెంటర్లు నిర్మించి చూడ ముచ్చటగా మలిచి టూరిజానికి పెద్ద పీట వేయడమే కాదు, పేరుపేరునా అమరుల చరిత్ర లిఖించాలి. ఉద్యమ చరిత్రతో పాటు అమరుల చరిత్ర కూడా శాశ్వతంగా భావి తరాలకోసం లిఖిత పూర్వకంగా నమోదు చేయాలి. ఆ కర్తవ్యం ఇప్పుడు కాకుండా ఎప్పుడు నిర్వహిస్తారు. మరెప్పుడు మనం డిమాండ్ చేయగలం” అని వారు ప్రశ్నించారు.

“నేడు చరిత్రపై అనేక వక్రీకరణలు జరుగుతున్నాయి. మహత్తర తెలంగాణ సాయుధ పోరాటానికే వక్ర భాష్యాలు చెబుతున్నారు. నిజాం పాలనకు, వారికి అండగా నిలిచిన దొరలకు దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా మట్టి మనుషులు సాగించిన మహత్తర పోరాటాన్ని మత ఘర్షణగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు నిర్మిస్తున్న అమరుల స్మృతి వనం తొలి, మలి దశ అమరుల వీరులను పేరు పేరునా నమోదు చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర సాధనలో వేలాది త్యాగాలు విస్మరణకు గురవుతాయి. ‘స్ముతి’ వనం ‘విస్మృతి వనం’ అవుతుంది. అలా కాకూడదనే మా ఆవేదన” అని అన్నారాయన. ”ముఖ్యమంత్రి మా విజ్ఞప్తిని మన్నించి అమరుల కుటుంబాలను సమున్నతంగా గౌరవించుకోవాలని కోరుతున్నాం” అని వారు చెప్పారు.

ఎంతమందిని గుర్తించారు? ఎం చేశారు?

తెలంగాణా ఉద్యమానికి ఊపిరిలూది, రాష్ట్రం సాకారం కావడానికి ప్రాణాలిచ్చిన తొలి, మలి దశ ఉద్యమ అమరులను గొప్పగా స్మరించుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల స్మృతి వనాన్ని నిర్మించింది. ప్రముఖ చిత్రకారులు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులైన రమణా రెడ్డి గారు రూపొందించి తన పర్యవేక్షణలో పూర్తయిన ఈ నమూనా అందరి మన్ననలు అందుకున్నది. అమరుల స్పూర్తిని, వారి త్యాగ నిరతిని భావి తరాలు గుర్తుంచుకునేందుకు వీలుగా ‘ప్రజ్వలిస్తున్న జ్యోతి’ మాదిరిగా ఉండే ఈ స్మృతి వనం ఏడు అంతస్తుల్లో సుమారు 179 కోట్ల రూపాయలతో నిర్మాణమైంది. అనేక విశేషాలు గల ఈ నిర్మాణం గురించి చిత్ర సహితంగా అనేక పత్రికలూ, టెలివిజన్ చానల్స్ గొప్పగా కథనాలు ప్రచురించడం, న్యూస్ కవరీజీ ఇవ్వడం మనం చూస్తున్నాం. బాగుంది. కానీ స్మృతి వనం పేరిట కోట్లాది రూపాయలు వెచ్చించిన ప్రభుత్వం బలిదానం చేసుకున్న అమరుల కుటుంబాలకు ఇప్పటిదాకా ఎం చేసింది? తాము హామీ ఇచ్చినట్లు ఎంతమందిని ఆదుకున్నది? అన్నది పెద్దగా రిపోర్ట్ కావడం లేదు.

రెండు వేదికలు – సామూహిక వేదన

అమరుల కుటుంబాలకు చెందిన వారు రెండు వేదికల పేరిట ఇప్పటిదాకా ఆర్గనైజ్ అయ్యారు. అందులో మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతా చారి తండ్రి వెంకటాచారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక వేదిక పేరు – అమర వీరుల కుటుంబాల వేదిక. రెండవది, తెలంగాణా అమరుల కుటుంబాల వేదిక. దీనికి కావలి మణ్యం కన్వీనర్. వీరు ఉపాధ్యాయులే కాక పాలమూరు బిడ్డ, కొత్తపేటలో డిగ్రీ చదువుతూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని అమరులైన కావలి సువర్ణకు స్వయానా సోదరులు. వీటితో మాట్లాడి క్లుప్తంగానైనా అసలు అమరుల కుటుంబాలకు జరిగిన న్యాయం ఏమిటో తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. ఆ దిశలో దశాబ్ది ఉత్సవాల్లో అమరుల కుటుంబాల వేదన తెలుపే సంక్షిప్త ప్రయత్నం ఇది.

పన్నెండు వందలకు పైగా అమరులు – సగానికే సహాయం

మలిదశ ఉద్యమంలో సుమారు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చెబుతారు. వారి సంఖ్య 1350 దాకా ఉంటుందని ఉద్యమ కారులు అంటున్నారు. ఒక దశలో వారి సంఖ్య పదిహేను వందల దాకా ఉంటుందని స్వయంగా కేసిఆర్ గారే అసెంబ్లీలో ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 638 మందినే ఇప్పటిదాకా గుర్తించి, వారికి సహకారం అందించినట్లు తెలుస్తోంది.

తొలి విడతలో 442 మందికి, మిగతా వారికి ఆ తర్వాత మొత్తంగా సహాయం చేసిన వారి సంఖ్య 650 మించ లేదని తెలిసింది.

ఇంతకీ ఆ అందిన సహకారం ఏమిటీ అంటే, ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్ధిక సహాయం, కుటుంబ సభ్యులొకరికి ఒక ఉద్యోగం ఇవ్వడం.

విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వం 23 మె 2016లో ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం (GO. Ms .No. 80 ) ఈ రెండు హామీలను మాత్రమే నెరవేర్చింది. కానీ, ఉత్తర్వులో పేర్కొన్న మరి నాలుగు హామీలను విస్మరించింది. అందులో ఒకటి, వ్యవసాయదారులైతే సాగు భూమిని ఇస్తామని పేర్కొంది. కానీ ఇవ్వలేదు. అవసరమైన వారికి ఇంటి వసతి కల్పిస్తానని హామీ ఇచ్చింది. ఇవ్వలేదు. కుటుంబ సభ్యులకు ఉచిత విద్య, వైద్య సహాయాన్ని కూడా ప్రకటించింది. కానీ అవేమీ నెరవేర్చలేదు.

తొలిదశ అమరులకూ మలిదశలోనూ అన్యాయం

ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. కెసిఆర్ గారు 2 జూన్ 2014 న తెలంగాణ తొలి రాష్ట్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పై హామీలను ప్రకటిస్తూ అమరుల కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులో ఎంత భూమి ఇవ్వాలన్నది స్పష్టం చేయకపోవడం గమనార్హం.

ఇధిలా ఉండగా, తొలి దశ ఉద్యమంలో అమరులైన 369 కుటుంబాలకు కూడా మలి దశ అమరుల కుటుంబాల మాదిరిగానే అన్ని రకాలుగా సహాయం సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హోదాలో నాడు కెసిఆర్ ప్రకటించారు. కానీ, ఎనిమిది మంది కుటుంబాలకే పైన పేర్కొన్న రెండు హామీలు నేరవేర్చినట్టు తెలుస్తోంది తప్పా వందలాది మందిని ఇప్పటికీ పట్టించుకోక పోవడం విషాదం.

‘ఎఫ్ ఐ ఆర్’ ప్రాతిపదిక కాకూడదు…

ముందే చెప్పినట్టు అమలు చేసిన ఆ రెండు హమీలైనా అమరుల కుటుంబ సభ్యుల్లో సగం మందికే అని గమనించాలి. ఐతే, వీరిని గుర్తించడానికి ఎంచుకున్న ప్రాతిపదిక ఏమిటీ అంటే అది ఎఫ్ ఐ ఆర్ అని తెలిసింది. ‘ఎఫ్ ఐ ఆర్’ ప్రాతిపదికగా గుర్తించిన ఆరు వందలకు పైగా అమరుల కుటుంబానికి మాత్రమే ప్రభుత్వం సహాయం చేసి మిగతా ఆరొందల కుటుంబాల సంగతిని విస్మరించడం నిజంగా ఆందోళన కలిగించే విషయం.

రేపు స్మృతి వనం ఆవిష్కరణ సందర్భంలో ముఖ్యమంత్రి అమరుల సంక్షేమానికి ఇప్పటిదాకా చేసిందేమిటో గణాంకాలతో సహా వివరించాలి.

జూన్ 22న స్మృతి వనం ఆవిష్కరణ సందర్భంలో ముఖ్యమంత్రి అమరుల సంక్షేమానికి ఇప్పటిదాకా చేసిందేమిటో గణాంకాలతో సహా వివరించాలి. ఒక్క ఎల్బీనగర్ చౌరస్తాకి శ్రీకాంతా చారి పేరు పెట్టడం, సగం మంది కుటుంబ సభ్యులకు కొంత సహాయం చేయడం తప్పా మిగతా హామీలు ఎందుకు నెరవేర్చలేదో కూడా సంజాయిషీ ఇవ్వాలి. అమరుల కుటుంబాల సమక్షంలో ఈ ఆవిష్కరణ చేయడానికి అవరోధం ఏమిటో వెల్లడించాలి.

ఒక విధానాన్ని అవలంభించలేదు

ప్రభుత్వం నిర్దిష్టంగా ఒక పద్ధతి ప్రకారం ఎవరెవరు అమరులో గుర్తించేందుకు అధికారులు, ఉద్యమకారులు, పాత్రికేయులతో ఒక కమిటీ వేయవలసి ఉండింది. అలా క్షేత్ర స్థాయిలో ఒక బృందం వెళ్లి వారిచ్చే నివేదిక ఆధారంగా కార్యాచరణ తీసుకోవలసింది. అందుకోసం ఎంతో బాధ్యతతో, ఉదారంగా, అమరుల సంక్షేమం ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యతగా చేసుకొని వ్యవహరించ వలసినది. కానీ ముఖ్యమంత్రి అమరుల స్మృతి వనంపై పెట్టిన శ్రద్ధ, చేసిన విజిట్లు, పర్యవేక్షణలో ఒక శాతమైనా అమరుల కుటుంబాలకు అందే సహాయం గురించి పెట్టలేదని చెప్పక తప్పదు. కెసిఆర్ గారికి అమరుల ‘స్మరణ’ ఎక్కువైంది తప్ప ఆచరణాత్మకంగా వారి వారి కుటుంబాల ‘సంక్షేమం’ ముఖ్యం కాలేదు. ఈ వైఖరి విచారకరం. ఉద్యమం నుంచి ఎదిగిన రాష్ట్రానికి ఈ ధోరణి అభ్యంతరకరం కూడా.

నమస్తే తెలంగాణ – ఒక ఉదాహరణ

ఇదివరకు నమస్తే తెలంగాణ ఒక గొప్ప ఒరవడిని ప్రవేశ పెట్టింది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు అ దిన పత్రిక ఆధ్వర్యంలో అమరుల కుటుంబాలను స్వచ్చందంగా ఆదుకున్నది. ఆ సందర్భంలో ఆ పత్రిక అవలంభించిన విధానాన్ని నిజానికి తర్వాత ప్రభుత్వం అనుసరించి ఉండవచ్చు.

‘నమస్తే తెలంగాణ’ కెసిఆర్ మానస పుత్రిక అని అందరికీ తెలిసిందే. పారిశ్రామిక వేత్త సి ఎల్ రాజం గారి ద్వార ఆ పత్రికను వారు పెట్టించిన విషయం అందరికీ తెలుసు. అల్లం నారాయణ గారు సంపాదకులుగా ఉన్న ఆ సమయంలో ఇప్పుడు దిశ ఎడిటర్, అప్పుటి నెట్ వర్క్ ఇంజార్జీ ఐన మార్కండేయ గారి ద్వార ఉమ్మడి పది జిల్లాల నుంచి పేరు పేరునా విలేకరుల ద్వారా అమరుల కుటుంబాలను గుర్తించి, వారిని భాగ్య నగరం తీసుకు వచ్చి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ వ్యాసకర్త పత్రిక ఆదివారం అనుభందం ‘బతుకమ్మ’ ఎడిటర్. అమరుల చరిత్ర విస్మరణకు గురికాకూడనే భావంతో ‘బతికిన మనుషులు’ పేరిట ఒక్కో వారం ఒక అమరుల ప్రోఫైల్స్ ని ఫోటోతో సహా ప్రచురిస్తూ ఉన్న విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది.

కాగా, నాటి సమావేశంలో అమరుల కుటుంబాలకు మేమంతా అండగా ఉన్నామన్న ధైర్యాన్ని ఇచ్చి పత్రికా యాజమాన్యం తరపున వారికి కుటుంబానికి ఇరవై ఇదు వేల ఆర్థిక మొత్తం చేతికి అందించడం జరిగింది. ఉద్దండులైన ఉద్యమ కారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ‘అమర వీరుల సహాయ నిధి పంపిణీ సభ’ పేరిట జరపడం  విశేషం. ఇలా మొత్తం మూడు దఫాలుగా మొత్తం పదకొండు కోట్ల రూపాయలకు పైగా 384 కుటుంబాలకు ఇచ్చినట్లు గుర్తు.

ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వం కేవలం 21 కుటుంబాలను గుర్తించి ఆర్థిక సహాయం, ఉద్యోగం కల్పిస్తే నమస్తే తెలంగాణా అప్పుడే 35 అమరుల కుటుంబాలకు సహాయం చేయడం విశేషం.

నాడు నమస్తే తెలంగాణ ఒక దారి చూపినట్లు ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమరుల కుటుంబాలను ఒక్క చోట చేర్చే వారందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని విధాలుగా సహాయం ప్రకటించే అవకాశం ఉండింది. కానీ ఆ దిశలో ప్రభుత్వం యోచన చేయలేదు. జిల్లా కలక్టర్ల ఆధ్వర్యంలో అమరులకు సహాయం అందించాలని ఉత్తర్వు వెలువరించి ఊరుకుంది. అది కూడా అందరికీ సహాయం అందించేందుకు గాను ఒక డెడ్ లైన పెట్టలేదు. నిరంతరం సమీక్షలు జరపలేదు. ‘టైం టు టైం’ సహాయం అందిస్తామని చెప్పి, ఆందోళన వచ్చినప్పుడు ‘చూసుకుందాం లే’ అన్నట్లు వ్యవహరించింది.

ఇట్లా తమ ఇష్టానుసారంగా, ఒక పద్దతి విధానం లేకుండా అమరుల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యహరించిందనే చెప్పాలి. ఇది నిజానికి ఉదాసీనత కాదు. ఒక చరిత్రను వాంఛితంగా విస్మృతిలోకి నెట్టే ప్రయత్నమే అని చెప్పాలి. కానీ కెసిఆర్ అమరుల స్మృతి వనం నిర్మాణం పట్ల మాత్రం ఎంతో శ్రద్దాసక్తులు కనబరచారు. దాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించి రేపు ఘనంగా ఆవిష్కరణకు సిద్దం చేశారు.

ఎవరి చేత ఆవిష్కరణ?

ఏమైనా, రాష్ట్ర సాధనలో అమరులైన వారి లెక్కలు నమోదు కావలి. అందరినీ ఒక చోటకి ఆహ్వానించి వారికి అధికారికంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు, ఉద్యోగం, ఆర్ధిక సహాయంతో పాటు ఉచిత విద్య, విద్యం సహకారంతో పాటు వారికి సాగు గృహ వసతి, సాగు భూమి కూడా దక్కాలి.
ఒక్కరి నష్టం జరగకుండా సంక్షేమ శాఖ అధ్వర్యంలో గానీ లేక ప్రత్యేక పర్యవేక్షణలో గానే పోలీసు రికార్డులకు ఎక్కని మిగతా ఆరోందలకు పైగా ఉన్న కుటుంబ సభ్యులందరికీ సహాయ సహకారాలు దక్కాలి.

ఎంతో ప్రేమతో వారికి ఈ గౌరవం దక్కాలి. అది మన బాధ్యత. కానీ ఆచరణలో ఎం జరుగుతున్నదీ మనం చూస్తున్నాం.

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జరగవలసింది ఇది. వీటితో పాటు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్మృతి వనం అమరుల కుటుంబ సభ్యుల సమక్షంలో అపూర్వంగా జరగవలసి ఉండే. కానీ ఆచరణలో ఎం జరుగుతున్నదీ మనం చూస్తున్నాం.

‘జ్యోతి’లో చూసుకోమంటున్న మంత్రి వర్యులు

కాగా, అమర వీరుల కుటుంబాల వేదిక తరపున అధ్యక్షులు జరూపుల నరేష్ నాయక్ ఈ ఉదయం మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని కలిసి అమరుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ స్మృతి వనాన్ని ప్రారంభించాలని, అలాగే అమరుల పేర్లను తప్పక పొందుపరచాలని కోరారు. కానీ మంత్రి గారు అది సాధ్యం కాదని, ఆ ”జ్యోతి’లోనే అందరిని చూసుకోవాలని అన్నారట.

కనీసం అక్క్కడ ఒక్క ఫోటో తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదట. దాంతో చేసేదేం లేక ఒక వినతి పత్రం రాసి ఇచ్చి, విచారంతో సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమ విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికే కాక ప్రజల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఆ వినతి పత్రం ఇక్కడ చూడవచ్చు.

జరూపుల నరేష్ నాయక్ ఎస్వీ యూనివర్సిటీ లో బి టెక్ విద్యార్థి ఐన సురేష్ నాయక్ అన్నయ్య. తమ్ముడు ఉద్యమం ఉధృతికోసం విషం సేవించి బలిదానానికి పాల్పడ్డాడు. తన తమ్ముడి మరణం ఒక్కటే కాక వేలాది బలిదానాలు వృధా కారాదని అన్నయ్యగా ఇతడు అమర వీరుల సంక్షేమం కోసం నడుం కట్టాడు.

అమరుల కుటుంబాలే కదలాలి…

ఇదిలా ఉంటే, సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో రవీంద్ర భారతి నుంచి కొంతమంది కళాకారుల బృందం ఊరేగింపుగా స్మృతి వనం చేరుతుందట. బహుశా సాంస్కృతిక సారథి సభ్యలు కూడా అందులో ఉంటారేమో! స్మృతి వనం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణా తల్లి ప్రతిమ మేడలో పూలహారం వేస్తారట. కానీ వేలాది బిడ్డలను కోల్పోయిన తల్లులు వందలాది మంది కళ్ళ ముందే ఉండగా శిలా విగ్రహానికి దండలెందుకు?

నిజంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పన్నెండు వందల మంది అమరుల కుటుంభ సభ్యులు, ఉద్యమ కారులు – వీళ్ళు కదా ఒక గొప్ప జులూస్ తీయవలసింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇట్లా ప్రజలంతా తమ రాష్ట్ర పండుగగా కదా అన్నట్లు ఆనందోత్సవాలతో గొప్ప ఉద్విగ్నంగా మిలియన్ మార్చ్ ని మించిన మార్చ్ ని… సంబురానికి సాక్షిగా జరుపుకోవాల్సింది అమరుల త్యాగాల సాక్షిగా వారిని సమున్నతంగా స్మరించుకుంటూ పునర్ నిర్మాణానికి ప్రతిన బూనాలి. కానీ ఎం జరుగుతోంది? ప్రభుత్వం ఒక ప్రదర్శన చేస్తోంది. ఒక నిర్మాణాన్ని ప్రారంభిస్తోంది. అసలు స్పిరిట్ ని వదిలేసి దశాబ్ది ఉత్సవం జరుపుతోంది. ఇదే విషాదం.

ముగింపు – చరిత్ర క్షమించదు

ఘనమైన ఉత్సవాల సందడి ముందు, సాంస్కృతిక శాఖ ఆడంబరంగా చేసే ప్రదర్శనల ముందు నిరుపేద అమరుల తల్లులు, తండ్రులు, భార్యలు, చెల్లెండ్లను ఎవరు పట్టించుకుంటారు.

‘మా కుటుంబాల ఆధ్వర్యంలో దీని ప్రారంభోత్సవం జరుగుతుందా?’, ‘మా పిల్లల అందరి చరిత్రను స్మృతి వనం పొందు పరుస్తుందా?’, ‘ మొత్తం అమరుల కుటుంబాలకు సహాయం ఇచ్చేలా ప్రభుత్వం అధికారులను ఆదేశిస్తుందా? మీరేమైనా ఈ విషయాలు రాయగలరా?’ అని అమరుల కుటుంబ సభ్యుల అడుగుతుంటే వారి మాటలు అమాయకంగా అనిపించవచ్చు. వారి గొంతులు నిస్సహాయంగా వినిపించవచ్చు. కానీ అవి రేపు రేపు శాపనార్థాలుగా మారకముందే ప్రభుత్వం మేలుకోవాలి.

ప్రజ్వలిస్తున్న అమర జ్యోతి సాక్షిగా ముఖ్యమంత్రి రేపు రేపు తప్పక జవాబివ్వాలి.

ప్రభుత్వం ఒక్కటే కాదు, అమరుల శవాల ముందు ప్రతిజ్ఞ చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళే కాదు, ప్రతిపక్షంగా ఉన్నవారు, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ అలోచించాలి.

రాష్ట్ర ఏర్పాటుకు ఆధారమైన ‘అమరత్వం కదా మొదట కీర్తించవలసినది. అమరుల కుటుంబాలకు కదా మొదట సహాయం అందించవలసింది. అది తొమ్మిదేళ్ళు అయినా పూర్తిగా జరగలేదంటే ఏమిటీ అర్థం!

ప్రజ్వలిస్తున్న అమర జ్యోతి సాక్షిగా ముఖ్యమంత్రి రేపు రేపు తప్పక జవాబివ్వాలి.

లేకపోతే చరిత్ర క్షమించదు.

కందుకూరి రమేష్ బాబు దశాబ్ది ఉత్సవాలపై రాసిన ఇతర వ్యాసాలు…

ఉత్సవ తెలంగాణ – వాస్తవ తెలంగాణ

ఖాళీ సీసాలు – ఉత్సవ తెలంగాణ

‘తెలంగాణా’కు లేని తెలంగాణ జర్నలిస్టులు!

భూస్వాముల స్వీట్ రివెంజ్ : రైతు బంధు

ఫక్తు రాజకీయానికి బలైన ‘ధూం ధాం’

‘ఆ ఇద్దరు’ దళిత బంధువులు – థాంక్స్ టు కెసిఆర్

దశాబ్ది వైఫల్యం ‘టీ–జాక్‌’

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article