Editorial

Friday, May 10, 2024
సంపాద‌కీయంతెలంగాణ, మే 31, 2001 - చారిత్రాత్మక పుస్తకం ముందుమాట

తెలంగాణ, మే 31, 2001 – చారిత్రాత్మక పుస్తకం ముందుమాట

 

book
Cover design by late Shekar, Cartoonist

నేటితో తెలంగాణ జర్నలిస్టుల ఫోరానికి రెండు దశాబ్దాలు నిండుతున్నాయి. ఈ సందర్భంగా నాడు ఒక సంచలనంగా తెచ్చిన ఈ పుస్తకం ఇప్పటికీ ఒక చరిత్ర.  సంపాదకత్వం అల్లం నారాయణ గారూ, నేనూ.  నాటి రోజుల్లో ఈ పుస్తకం తేవడం ఎంతో సాహసమో అంతటి అవశ్య కర్తవ్యం. అదేమిటో అల్లం నారాయణ గారి ముందు మాట తేటతెల్లం చేస్తుంది. చదవండి.

allam anna

మాట్లాడుకుందాం…

అయితే ఏం మాట్లాడుకోవడం అన్నదానికి ముందుమాట లాంటిది ఈ పుస్తకం.

ముందు వాళ్ళు పార, పలుగులతో వచ్చారు. నీటి పారకం ఎక్కడుందో? నల్లరేగడి నేలలు ఎక్కడున్నాయో? కాలువలు చిలువలు పలువలుగా ఎటు విస్తరిస్తున్నాయో ఆ దారులు వెతుక్కొని వచ్చారు. ఇప్పుడు ప్రొక్లెయిన్లతో తెలంగాణా చెరువుల్లో నీళ్ళింకే ఒండ్రుమట్టిని తవ్వి ఇంకుడు గుంతలు చేసి, ఉన్న చిన్న నీటి వనరులను ఇంకింపజేసే విధ్వంసకర కార్యక్రమాన్ని ‘అభివృద్ధి’ అనే దాకా ఎదిగారు. ఉన్న నేలల్ని ఆక్రమించుకొని, పొట్ట చేతబట్టుకొని వచ్చిన వాళ్ళు పొట్టలు కొట్టి పై నుంచి మాటలు మాట్లాడే స్థితికి ఎదిగారు. ఇళ్ళు కూల్చి రోడ్డేసుకుంటున్నారు. గుడిసెలు పీకి దారులు చేసుకుంటున్నారు. ఎన్.టి.రామారావు బొమ్మ చూపుడు వేలుగా తెలంగాణా అంతటా వేళ్ళూనుకొని దారితప్పొచ్చి దారి చూపుతూ కబుర్లు చెబుతున్నారు. వలసొచ్చి, ఒంటెలాగా ఆక్రమించి భూమిపుత్రులను మూలలకు నెట్టేసి, విస్తరించి వున్నారు. తెలంగాణా ఇప్పుడు కొస్తాంధ్రుల అంతర్గత వలస కావడం వెనక, ఉన్న నేల మీద గట్టిగా నిలబడ్డ వారి అణగారిన కేకల అణచివేతలున్నాయి. అదే ఇప్పటి అస్తిత్వ వేదన. అది జర్నలిస్టులకు మినహాయింపులేని వేదన. వృత్తి సమూహంగా జర్నలిస్టులు తెలంగాణాలో పుట్టి పెరిగి కొస్తాంధ్రుల పెత్తనాల కింద నలిగిన తీరుకు దర్పణం ఈ పుస్తకం. ఇది సమగ్రమూ కాదు… సంపూర్ణమూ కాదు కానీ ఒక ప్రయత్నం.

తిరిగి తిరిగొచ్చిన తెలంగాణాకు తనకు మరణమే లేదన్న తెలంగాణాకు, అస్థిత్వ ప్రధానంగా జరిగే ఇలాంటి ఉద్యమాల కాలానికి శణార్థి…

ఊపిరి సలపనివ్వని ఊరి పరిస్థితులు, భగ్నమైన కలలు, ఆకాంక్షల మీద ఆంక్షలు, తిండి పెట్టని అక్షరాలు, రాని ఉద్యోగాలు, ఏదో చేయాలన్న తపన, చదివిన సాహిత్యం, నిలవనివ్వని కూచోనివ్వని అల్లకల్లోల గ్రామాలు, ఏం చేయాలి?

ఒక్కడా కాదు. ఒక్క తెలంగాణా జర్నలిస్టు భద్రంగా ఈ బరికి రాలేదు. ఈ బలివి తర్దిమీదకు బి.సి.జెలో ఎం.సి.జే.లో చేసి రాలేదు. ఈ మాయలాంతరు మోహంలోకి రావడం వెనక నేపథ్యం లేని జర్నలిస్టు ఉండరు. వచ్చి పడ్డారు. ఇక మునగానాం తేలానాం, కోస్తాంధ్ర లౌక్యం, వ్యాపారమూ లాభనష్టాల లెక్కలు, మానవ, ఉద్యోగ సంబంధాల్లో ప్రయోజనం ఆశించి మెసలం…. లాంటివి పుణికి పుచ్చుకున్నవారు కొంత నిలబడినా చివరి మునకలేసి ఎక్కువ మంది తెలంగాణా జర్నలిస్టులు కలం బలం వుండి, శుద్ధంగా నాలుగు మంచి అక్షరాలు రాయగలిగి ఉండీ జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ దృక్కోణాలను ఆవిష్కరించే సత్తా ఉండీ పత్రికల బయట రోడ్ల మీద శకలాలై పడివున్న మాట వాస్తవం. ఎందుకిలా జరిగింది? ఎందుకిలా జరుగుతున్నది.

60వ దశకం తర్వాత వచ్చిన కోస్తాంధ్ర పత్రికలు నలభై సంవత్సరాలలో బొమ్మన బ్రదర్స్, చందన బ్రదర్స్, ఇడ్లీ సాంబార్, దోస, వడలు, మెస్ల లాగే ఏడెనిమిది సంపన్న కమ్మ కుటుంబాలు హైదరాబాద్ను ఆక్రమించి నట్టుగానే, ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో గుంటూరు పల్లె, ఆ పల్లెనుంచి అటు గుంటూరుకు, ఇటు హైదరాబాద్కూ ఎక్స్ప్రెస్ బస్సులు నడిచినంత సుళువుగా పత్రికలూ పాతుకు పోయాయి. పచ్చళ్ళ వ్యాపారమంత సుళువుగా వచ్చి చేరిన ఈ పత్రికలు చిట్ ఫండ్లు, రియల్ ఎస్టేట్లు, హోటళ్ళుగా విస్తరించి చివరకు ‘మీ భాష ఏంటో అర్థంగాదు’ అనే స్థాయికి ఉల్టాబనాయించే స్థాయికి చేరాయి. భూముల కోసం, వ్యవసాయం కోసం వచ్చి చేరినవారు, సినిమాలుగా, హోటళ్ళుగా, కాలేజీలు, పత్రికలు, ప్రెస్సులుగా విస్తరించిన క్రమం ఒక పెద్ద పుస్తకం.

కానీ, ఇవ్వాల్టి పరిస్థితి ఏమిటి? తెలంగాణా మళ్ళోసారి చర్చల్లోకి వచ్చి ఎడాపెడా ఉద్యమాలు జరుగుతున్నవేళ, స్రృహ వున్న ప్రతీ పార్టీ, ప్రతి పౌరుడు తెలంగాణా సంగతులు మాట్లాడ్తున్న వేళ అంతో ఇంతో అక్షరాలుండి, నాలుగు ముక్కలు రాయగలిగిన జర్నలిస్టులుగా మనమేం చేయాలి? అన్న ప్రశ్నలకు అంత సులభంగా జవాబులు దొరికే పరిస్థితి లేదు.

ఒక సమూహంగానో, ఒక వేదికగానో, ఒక సంఘటనలాగానో జమకూడి పుట్టిన పుట్టకను సార్థకం చేసుకునేందుకు ఏమైనా చేద్దామా? అనుకున్నప్పుడు సవాలక్ష సందేహాలు. పత్రికలన్నీ కొస్తా వారివి. ఉద్యోగాలన్నీ వారివి…. అధికారం వారిది. ఒకప్పుడు వారికి డొక్క శుద్ధి వుండి ప్రపంచాన్ని వేళ్ళకొనలమీద ఆవిష్కరించే వామపక్ష భావాలుగా గల పొల్లగాండ్ల అవసరం పడింది. తెలంగాణాలో అట్లాంటి పోలగాండ్లకు కొదవలేదు. కోస్తా పత్రికలే అయినా ఈ మెరికల్లాంటి సాహిత్య వాసనలున్న, జరిగిన, జరుగుతున్న విషయాలమీద అవగాహన ఉన్న చాలామందిని పత్రికలు స్వీకరించాయి. తెలంగాణాలో వేళ్ళూనుకొని సర్క్యూలేషన్ పెంచుకుని, స్థిర పడే దాకా పత్రికలు రాడికల్గా వ్యవహరించాయి. ఎన్కౌంటర్లు, నక్సలైట్లు, మానవ హక్కులు, వరకట్నపు హత్యలు, లాకప్ హత్యలు, కుంభకోణాలు, సారా ఉద్యమాలు, సహజంగానే అధికారానికి, ప్రభుత్వాలకు, రాజ్యానికి వ్యతిరేకంగా వుంటే తెలంగాణా యువ జర్నలిస్టులు కోస్తాంధ్ర పత్రికల్లో ఒక మేరకు కీలక భాధ్యతల దాకా ఎదిగారు.

అడిగిన వెంటనే రాయడానికి అంగీకరించిన వారి పెద్ద మనసు కారణంగానే ఈ పుస్తకం బయటకు వచ్చింది. నాది ఉత్త పెత్తనమే. అంతా రమేష్ తిరిగి చేసిన పనే. తెలంగాణలోని జర్నలిస్టుల దుస్థితిని బయటి ప్రపంచానికి తెలియపర్చాలనే ఉద్దేశ్యంతో ఒక పుస్తకాన్ని తీసుకురావలనే ఆలోచనకు అంకుర్పారణ చేసిన శ్రీశైలం, క్రాంతి, రాజేశ్ తదితర మిత్రుల కృషిని నిర్మాణాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇక ఆ తర్వాత ఒకసారి పత్రికలు సర్కులేషన్లు, ఊరూరా ఆస్తులు పెంచుకున్నాక, ప్రభుత్వాలను తామే నడిపే స్థాయికి చేరుకున్నాక ఇలాంటి జర్నలిస్టుల అవసరం కలుగలేదు? కరీంనగర్ అంటేనో, నల్లగొండ అంటేవో డెస్కుల్లో వుద్యోగాలు రాని పరిస్థితి. ఫలితం రోడ్ల మీద తెలంగాణా జర్నలిస్టులు. ఉన్నవాళ్ళైనా పట్టుమని గట్టిగా రెండువాక్యాలు రాయలేని ఆంక్షలు. కనబడేవి, కనబడనివి. తెలంగాణా పదం నిషేధం ఉన్నదున్నట్లుగా రాస్తే వార్తలు రావు. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణా అని కెలికి ఉద్యోగాలు చేసుకుంటున్న తెలంగాణా జర్నలిస్టులను రోడ్డు మీద పడేయడం కాదా? సందేహం.. ఇప్పటికే పత్రికలన్నింటిలోనూ ఒకటి రెండు మినహాయింపులు తప్పితే తెలంగాణా జిల్లా ఎడిషన్లు ఏ కోస్తాంధ్రులో ఇన్ చార్జీలు. తెలంగాణా విలేకరులు దినబత్తెపు (దయతలచి ఇస్తే) జీతం గాళ్ళు. ఇన్ని సందేహాల మధ్య, భయాల మధ్య ఏమైనా సరే తెలంగాణా కోసం వృత్తి సమూహంగా మాట్లాడుకుందాం అని అనుకోవడం సాహసమే?

అయితే ఏం మాట్లాడుకోవడం అన్నదానికి ముందుమాట లాంటిది ఈ పుస్తకం.

అంబటి సురేంద్రరాజు స్వయంగా పత్రికల్లో గాయపడిన యోధుడు. ఆయానిట్లా అంటున్నారు. ఏమున్నది.. అంతటా విస్తరిస్తున్న స్మశానం. గుట్టలు గుట్టలుగా పేరుకున్న జీవచ్ఛవాలు. నోటి మాట రాక, చూపు కోల్పోయి దృక్కోణం మటుమాయమై, ఎవరికీ చెందక విశ్చేష్టులై, బీరిపోయి దిక్కులు చూస్తున్న పాత్రికేయులు అచ్చం తోటి తెలంగాణా నాడి మాదిరే నిస్సహాయ స్థితిలో శక్తులుడిగి…

తెలంగాణా జర్నలిస్టులు ఏదైనా పత్రికలో వున్నా, రోడ్డు మీద ఉన్నా స్థితి ఇదే… ఇదొక్కటేనా? కల్లోలిత విలేకరులు.. తెలంగాణాలో విలేకరిగిరి కత్తి మీద సాము. గులాం రసూల్ హత్య చాలదా? నరేందర్ చావు చాలదా? ఎస్.కె. జకీర్ ఎట్లాంటి పని పరిస్థితుల్లో తెలంగాణా విలేకరులు పనిచేస్తున్నారో చెబుతున్నారు. నా భాష, యాసలో నేనెందుకు రాస్తున్నానో? మాండలికం మట్టి పూల పరిమళం తెలిదేవర భానుమూర్తి అంటున్నారు. నీళ్ళు రాకముందే గనుము కట్టినట్లు నియామకాలప్పుడే తెలంగాణా వారిని బీసీలను ఫిల్టర్ చేసి పారేస్తున్నారు. ఆంధ్ర పత్రికల పరమోద్దేశ్యం లాభాలు గడించడమే. లాభాల కాంక్షతో ఆంధ్ర దురహంకారంతో నడుస్తున్న పత్రికల్లో తెలంగాణ ఉద్యమ వార్తలు యధాతథంగా రావలనుకోవడం అత్యాశ అవుతుందని దుర్గం రవీందర్ వివరించారు.

ఇక తెలంగాణా జర్నలిస్టులపట్ల వివక్ష పత్రికల్లో ఎట్లావుంటుందో? పత్రికల్లో వున్నవారందరికీ ఎరికే. ఎవరూ ఎడిటర్ కాకపోవడం సంగతెట్లావుంచి, రెండొద్దుల్లో ఎడిటర్ కాబోయి, పూర్తిగా ఉద్యోగం కోల్పోయిన జర్నలిస్టు మిత్రుడన్న మాట అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణా జర్నలిస్టుల మూల పురుషుడు సురవరం ప్రతాపరెడ్డి ‘దేశోద్ధారక’ కన్నా ఎందుకు గొప్పో! తెలంగాణా ఆస్థిత్వపు పోకడలు పోతే తప్ప, ఆలోచనలు చేస్తే తప్ప అర్థంకాదు. తెలంగాణా మీద మాత్రమే శ్రద్ధాసక్తులు ఖర్చుచేస్తున్న మరో గాయపడిన యోధుడు కె.శ్రీనివాస్ వ్యాసం.

తెలంగాణా జర్నలిస్టులు ఏంచేయలి? ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల జర్నలిస్టులకు మరింత బాధ్యత ఎందుకుంటుందో సీనియర్ ఎడిటర్ టంకశాల అశోక్, పత్రికారంగం వివక్షలూ, ఆధిపత్య ప్రాంతం ప్రయోజనాలకోసం బలపడున్న ప్రాంతాలు, వాటి ములాల సవివిర చర్చ చేసిన కాసుల ప్రతాపరెడ్డి, తెలంగాణా ప్రాంతంలో మమేకం కాకుండా, తెలంగాణాను భూతంగా చిత్రీకరిస్తున్న సహోదర జర్నలిస్టుల బండారం బయట పెట్టిన రామకృష్ణ, తానెట్లో జర్నలిస్టుగా వివక్ష ఎదుర్కొన్నదీ వివరించిన వెంకటేశ్వర్లు, తెలంగాణా కార్టూనిస్టుల సంగతి చెప్పి మనకు తెలియని ఈయన కార్టూనిస్టులకు పరిచయం చేసిన ఏడుకొండలు, ప్రజలే వార్తలు మలిచే ఉత్థాన పరిస్థితులుగల తెలంగాణా పరిణామాలే వార్తల శీర్శికలు, ప్రజల మనుషులే వార్తల ప్రాధాన్యతను నిర్ధారించే తెలంగాణా సంగతులు రాసిన రమేష్ వ్యాసం ఇట్లా తెలంగాణా జర్నలిస్టుల అభిప్రాయాలు, భావాల తొలి సంకలనం ఇది.

అయితే ముందే చెప్పినట్లు వారం రోజుల్లో రూపొందిన ఈ పుస్తకం సమగ్రం కాబోదు… అన్ని చర్చలూ, అన్ని అభిప్రాయాలూ వచ్చినట్టు కాదు. అడిగిన వెంటనే రాయడానికి అంగీకరించిన వారి పెద్ద మనసు కారణంగానే ఈ పుస్తకం బయటకు వచ్చింది. నాది ఉత్త పెత్తనమే. అంతా రమేష్ తిరిగి చేసిన పనే. తెలంగాణలోని జర్నలిస్టుల దుస్థితిని బయటి ప్రపంచానికి తెలియపర్చాలనే ఉద్దేశ్యంతో ఒక పుస్తకాన్ని తీసుకురావలనే ఆలోచనకు అంకుర్పారణ చేసిన శ్రీశైలం, క్రాంతి, రాజేశ్ తదితర మిత్రుల కృషిని నిర్మాణాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముద్రణలో సహకరించిన బండ్రు భాస్కర్ గారికి కృతజ్ఞతలు.

తిరిగి తిరిగొచ్చిన తెలంగాణాకు తనకు మరణమే లేదన్న తెలంగాణాకు, అస్థిత్వ ప్రధానంగా జరిగే ఇలాంటి ఉద్యమాల కాలానికి శణార్థి…

గులాం రసూల్ జ్ఞాపకాలకు శణార్థి…

అల్లం నారాయణ
తెలంగాణ 31 మే, 2001

 

 

 

రేపటి నుంచి ఈ పుస్తకంలోని పదమూడు వ్యాసాల  ధారావాహిక తెలుపు  ప్రచురిస్తుంది. గమనించగలరు.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article