Editorial

Sunday, May 19, 2024
OpinionOne Hundred Years of Solitude - జామ పండు వాసన : అంబటి సురేంద్రరాజు

One Hundred Years of Solitude – జామ పండు వాసన : అంబటి సురేంద్రరాజు

జీవన సంక్షోభాలను దాటుకొని మనిషి జీవితాన్ని ఉత్సవ సంరంభంగా, సంబురంగా గడపడం ఎలాగో, అందుకు ఏంచేయాలో మార్క్వెజ్‌ను చదివి మనం తెలుసుకోవచ్చు.

రచయితగా అమూర్త భావనల జోలికి పోకుండా ఆయనను జర్నలిజమే కాపాడిందంటే అతిశయోక్తి కాదు. జామ పండు వాసనను మరిచి పోవడం వల్లే తాను తిరిగి తిరిగి స్వదేశానికి అంటే కరీబియన్‌కు వస్తుంటానని మార్క్వెజ్ చెప్పిన మాటను సాటి జర్నలిస్టులు జోక్ అనుకున్నారు. కానీ అది పచ్చి నిజం.

అంబటి సురేంద్రరాజు 

మార్క్వెజ్ కు ముందు నవల వేరు. మార్క్వెజ్ తరువాత వేరు.

గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ (మార్కెస్ అని పలకాలి నిజానికి. కానీ మనకు అలవాటైన ఆంగ్లోచ్ఛారణకే పరిమితమవుదాం) నవలా రచనకు కొత్త సొబగులు అద్ది నవలా పఠనాన్ని మహోద్వేగ భరితం చేసిన సామ్యవాద వాస్తవిక వాది మార్క్వెజ్. నవలా ప్రక్రియను పునరావలోకనం చేసిన విమర్శకులు నవలను ఆధునిక ఇతిహాసంగా నిర్వచించిన మాట నిజమే అయినా, నవలను అసలు సిసలు ఇతిహాసంగా మలిచిన జగజ్జెట్టి మాత్రం మార్క్వెజ్ అనే చెప్పాలి. వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ మార్క్వెజ్ రాసిన తొలి ఐతిహాసిక నవల. కన్నడిగ ఆంగ్ల కవి గోపాల్ హొన్నల్‌గెరే పుణ్యమా అని 1980లో సాలిట్యూడ్ చదివి ఆనందించే భాగ్యం నాకు కలిగింది. తరువాత రెండేండ్లకు 1982 డిసెంబర్ ప్రాంతంలో ఈనాడు పత్రికలో ఉపసంపాదక వృత్తి వెలగబెడుతున్న కాలంలో వచ్చిన నెల జీతం వెచ్చించి మార్కెట్‌లోకి తాజాగా వచ్చిన మార్క్వెజ్ ఆరు పుస్తకాలను ఒకేసారి కొనేసి జామపండ్లను ఎంత ఇష్టంగా తింటానో అంత ఇష్టంగా నమిలి మింగాను.

అదే నెలలో మార్క్వెజ్‌కు నోబెల్ బహుమతి రావడం వల్ల ఒక్కసారి ఆయన రచనలు హైదరాబాద్ మార్కెట్‌ను ముంచెత్తాయి. నేనే గాక నాతో పాటు పాత్రికేయ మిత్రులు వి.రాజగోపాల్, కె. కృష్ణమూర్తి, సాహితీ మిత్రులు ముళ్ళపూడి శ్రీనివాస్‌ ప్రసాద్, గుడిహాళం రఘునాథం, నందిగం కృష్ణారావు వంటివారు ఆ పుస్తకాలను చదివి లాటినోలుగా మారిపోయాం. మార్క్వెజ్ రచనలతో అమితంగా ప్రభావితమైన కె.ఎన్.వై. పతంజలి అప్పటికి మాకింకా దగ్గరి మిత్రుడు కాలేదు. మార్క్వెజ్ ప్రభావంతోనే తరువాతి కాలంలో బోర్హెస్, జూలియో కోర్తజర్, కార్లోస్ ఫ్యూంటెస్, మేరియో వర్గాస్ లోసా వంటి లాటిన్ అమెరికన్ రచయితల కథలు, నవలలు చదివే మహద్భాగ్యం మాకు కలిగింది.

మన ఆర్.కె.నారాయణ్ సృష్టించిన మాల్గుడి వంటిదే ఇది కూడా! రెంటికి నడుమ తేడా ఎక్కడంటే, మాల్గుడిలో ఉండేవాళ్ళంతా మంచివాళ్ళు, మకాండోలో అందుకు భిన్నం.

స్పానిష్ నవలా ప్రపంచంలో సెర్వాంటిస్ డాన్ క్విక్సాట్ (డాన్ కికోటీ) తరువాత తిరిగి అంతటి నవల అని పాబ్లో నెరుడా ప్రస్తుతించిన సాలిట్యూడ్ కార్యరంగం మకాండో అనే ఊహాజనిత జనావాసం. మన ఆర్.కె.నారాయణ్ సృష్టించిన మాల్గుడి వంటిదే ఇది కూడా! రెంటికి నడుమ తేడా ఎక్కడంటే, మాల్గుడిలో ఉండేవాళ్ళంతా మంచివాళ్ళు, మకాండోలో అందుకు భిన్నం. ఇంతా చేసి మకాండో సృష్టికి మార్క్వెజ్‌కు స్ఫూర్తి నిచ్చింది తన చిన్ననాటి ఊరు అరకటకానే! తన బాల్యం, బాల్యంలో అమ్మమ్మ చెప్పిన కథలు- గాథలు అందుకు తోడయ్యాయి. తన బాల్యంలో జరిగిన సంఘటనలకు సాహిత్య విలువ ఉందని, బాల్యం గురించి తను రాసిన ప్రతి మాట తన దేశ రాజకీయ వాస్తవికతకు అద్దం పట్టడం గమనించానని మార్క్వెజ్ స్వయంగా చెప్పుకున్నాడు. కథ చెప్పడం వేరు, చెబుతున్న కథను నమ్మి చెప్పడం వేరు అని కనుగొనడం వల్లే మార్క్వెజ్ విశ్వసనీయత కు పెద్ద పీట వేశాడు. కరీబియన్ వాస్తవికత అనూహ్యమైన కల్పనను పోలి ఉంటుందని కూడా ఒక ఇంటర్వ్యూలో మార్క్వెజ్ చెప్పుకున్నాడు.

ఏ రచయితకూ శైలీ శిల్పాలను ఎంచుకునే స్వతంత్రం ఉండదని, వస్తువు, కాలం శైలిని నిర్ణయిస్తాయని మార్క్వెజ్ నమ్మాడు.

నవలా వ్యాసంగాన్ని మార్క్వెజ్ వండ్రంగం వృత్తితో పోల్చాడు. ఏ రచయితకూ శైలీ శిల్పాలను ఎంచుకునే స్వతంత్రం ఉండదని, వస్తువు, కాలం శైలిని నిర్ణయిస్తాయని మార్క్వెజ్ నమ్మాడు. విప్లవ రచయిత విధి బాగా రాయడమేనని కూడా ఆయన ఎన్నోమార్లు చెప్పాడు. ఉద్దేశాలతో కూడిన సాహిత్య సృజన కూడదని, ముందే ఒక అంచనాకు వచ్చి ఆ మేరకు రచనలు చేయడం రచన ప్రయోజనాన్ని భగ్నం చేస్తుందని కూడా ఆయన అనేవారు.

సెర్వాంటిస్ ఆనాడు రినయజాన్స్ (సాంస్కతిక పునరుజ్జీవనం) కాలంలో చేసిన పనినే, మార్క్వెజ్ రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో అంతే సమర్థంగా చేశాడు.

తన స్వదేశం కొలంబియా గతం, గతించని గతం సాలిట్యూడ్ పూర్వరంగం. కొలంబియాను చిరకాలం పాలించిన కులీన భూస్వామ్య వర్గం ఉత్థాన పతనాలను ఈ నవల కళ్ళకు కడుతుంది. జోస్ ఆర్కేడియో బ్యుండి యా నవలలోని ఏడు తరాలకు ఆద్యుడు. పితృస్వామి. ఈ జోస్ మహాశయుడే మారుమూల కొలంబియాలోని ఓ నది ఒడ్డున మకాండో గ్రామాన్ని పొందుపరుస్తాడు. అతని కొడుకు కల్నల్ జోస్ అరీలియానో బ్యుండియా ఈ నవలలో ప్రధాన పాత్ర. ఉర్సులా, రెబెకా, రెమిడియోస్ అమరాంత… ఈ నవలలోని ముఖ్యమైన స్త్రీ పాత్రలు. తన దేశంతో పాటు లాటిన్ (దక్షిణ) అమెరికాలోని చిలీ, ఎల్‌సాల్వడార్, ఉరుగ్వే, పరాగ్వే, నికరాగువా,బొలీవియా, క్యూబా వంటి ఎన్నెన్నో చిన్న చిన్న దేశాలను ఆయా దేశాల ప్రజా శ్రేణులను భౌతికంగా , సాంస్కతికంగా దుంప నాశనం చేయజూసిన పాలకవర్గాలను అపహాస్యం పాలు చేయడం, బట్టలూడదీసి నవ్వుకునేలా చేయడం ధ్వేయంగా మార్క్వెజ్ ఈ నవలా రచనకు పూనుకున్నాడు. ఆ విధంగా సెర్వాంటిస్ ఆనాడు రినయజాన్స్ (సాంస్కతిక పునరుజ్జీవనం) కాలంలో చేసిన పనినే, మార్క్వెజ్ రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో అంతే సమర్థంగా చేశాడు.

చిలీ నియంత పినోచెట్ అధికారం లో ఉన్నకాలంలోనే మార్క్వెజ్ నియంతల పతనాన్ని చిత్రీకరిస్తూ ఆటమ్ ఆఫ్ ది పాట్రియార్క్ (1975) రాశాడు. వెనిజులా నియంత మార్కోస్ పెరెజ్ జిమినెజ్ పదవీచ్యుతుడైన సందర్భంగా ఆయన ఈ నవలా రచనకు పూనుకున్నాడు. దక్షిణ అమెరికా దేశాలను పట్టి పీడించిన నియంతల పాలనను ఎండగడుతూ ఆయన ఈ నవల రాశాడు. ఆ తరువాత రాసిన రెండు నవలలు క్రానికల్ ఆఫ్ ఎ డెత్ ఫోర్‌టోల్డ్ (1981), లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా (1985) కూడా లాటిన్ అమెరికా దేశాల సాంఘిక జీవన స్థితిగతులను ప్రాతిపదికగా చేసుకొని రాసినవే. ఆయన రాసిన ఇతర నవలల్లో నో వన్ రైట్స్ టు ది కల్నల్, ఆఫ్ లవ్ అండ్ అదర్ డెమన్స్ ముఖ్యమైనవి.

జర్నలిజం వల్లే తన కథలు, నవలలు వాస్తవికతతో సంబంధం కోల్పోలేదని, ఆలాగే తన పత్రికా రచనలో సాహిత్య విలువను సంతరించుకున్నాయని మార్క్వెజ్ ప్యారిస్ రివ్యూ ఇంటర్వ్యూలో చెప్పారు.

మార్క్వెజ్ తన ఇరవై ఎనిమిదవ ఏట నుంచి విలేకరిగా స్థానిక పత్రికల్లో పనిచేస్తూనే, రచనా వ్యాసంగాన్ని సాగించడం ఒక విశేషం. జర్నలిస్టు వృత్తిని చేపట్టడం తన రచనా ప్రవత్తికి సానబెట్టింది. జర్నలిజం వల్లే తన కథలు, నవలలు వాస్తవికతతో సంబంధం కోల్పోలేదని, ఆలాగే తన పత్రికా రచనలో సాహిత్య విలువను సంతరించుకున్నాయని మార్క్వెజ్ ప్యారిస్ రివ్యూ ఇంటర్వ్యూలో చెప్పారు. పత్రికా రచనకు సాహిత్యానికి నడుమ విడదీయరాని సంబంధం ఉందని ఆయన భావించాడు. టైమ్‌వీక్లీకి ఇరవయేండ్ల పాటు వారం వారం రచనలు చేసిన మార్క్వెజ్ పాత్రికేయ వృత్తి రచయితగా తనకు కఠోరమైన క్రమశిక్షణను అలవరచిందని చెప్పాడు. రచయితగా అమూర్త భావనల జోలికి పోకుండా ఆయనను జర్నలిజమే కాపాడిందంటే అతిశయోక్తి కాదు. జామ పండు వాసనను మరిచి పోవడం వల్లే తాను తిరిగి తిరిగి స్వదేశానికి అంటే కరీబియన్‌కు వస్తుంటానని మార్క్వెజ్ చెప్పిన మాటను సాటి జర్నలిస్టులు జోక్ అనుకున్నారు. కానీ అది పచ్చి నిజం. రచయితను ఒంటరితనం నుంచి రక్షించే శక్తి పాత్రికేయ వృత్తికి ఉండటం వల్లే మార్కెజ్ జర్నలిస్టు వృత్తిని చివరి దాకా కొనసాగించాడని చెప్పవచ్చు.

నవలా వ్యాసంగాన్ని మార్క్వెజ్ వండ్రంగం వృత్తితో పోల్చాడు. ఏ రచయితకూ శైలీ శిల్పాలను ఎంచుకునే స్వతంత్రం ఉండదని, వస్తువు, కాలం శైలిని నిర్ణయిస్తాయని మార్క్వెజ్ నమ్మాడు.

కనీసం ఒక్కసారి కూడా రికార్డర్ ఉపయోగించకుండా విలేకరి వృత్తిని నిర్వహించిన ఘనాపాటీ మార్క్వెజ్.
నవలా వ్యాసంగాన్ని మార్క్వెజ్ వండ్రంగం వృత్తితో పోల్చాడు. ఏ రచయితకూ శైలీ శిల్పాలను ఎంచుకునే స్వతంత్రం ఉండదని, వస్తువు, కాలం శైలిని నిర్ణయిస్తాయని మార్క్వెజ్ నమ్మాడు. విప్లవ రచయిత విధి బాగా రాయడమేనని కూడా ఆయన ఎన్నోమార్లు చెప్పాడు. ఉద్దేశాలతో కూడిన సాహిత్య సృజన కూడదని, ముందే ఒక అంచనాకు వచ్చి ఆ మేరకు రచనలు చేయడం రచన ప్రయోజనాన్ని భగ్నం చేస్తుందని కూడా ఆయన అనేవారు. ఇటువంటి సాహిత్యానికి ఆయన క్యాలుక్యూలెటెడ్ లిటరేచర్ అని పేరు పెట్టారు. అనుభవం, తక్షణ జ్ఞానం రచనకు ముడిసరుకుగా ఉన్నప్పుడే ఉత్తమమైన సాహిత్యం వెలువడుతుందని, రచయితల వైఫల్యం వల్లే సాహితీ విమర్శకులు రంగప్రవేశం చేశారని, పాఠకుడిని నేరుగా చేరుకునే రచనకు విమర్శకుని పైత్యం అవసరం ఉండదని మార్క్వెజ్ విశ్వసించాడు.

మార్క్వెజ్ చేసిన తీర్మానంతో ఏకీభవించనంత కాలం తెలుగులో, మరీ ముఖ్యంగా తెలంగాణ తెలుగు భాషలో గొప్ప నవల వచ్చే అవకాశం లేనట్టే!

ముఖ్యంగా తన రచనలు విమర్శకుల ప్రమేయం లేకుండానే పాఠకులను చేరుకున్నాయని, వృత్తి విమర్శక జాతి ప్రదర్శించే మేధోవాదం పాఠక ప్రపంచానికి తీరని అన్యాయం చేస్తున్నదని ఆయన వేదన చెందేవారు. సాధారణ, రోజువారీ జీవితంలోనే అసాధారణత్వం దాగి ఉంటుందని, నిత్య జీవితంలోనే అధిప్రాకృతికత ఇమిడి ఉంటుందని, తన రచనలే అందుకు సాక్ష్యమని, ఈ సూక్ష్మం తెలియని, తెలుసుకోజాలని సాహితీ విమర్శకులు తన కథా కథన శిల్పానికి మ్యాజిక్ రియలిజం అని పేరు పెట్టి సంతోషించారని అన్నాడు. కానీ అది వాస్తవ దూరమైన అవగాహన అని మార్క్వెజ్ తేల్చిచెప్పాడు. జీవన సంక్షోభాలను దాటుకొని మనిషి జీవితాన్ని ఉత్సవ సంరంభంగా, సంబురంగా గడపడం ఎలాగో, అందుకు ఏంచేయాలో మార్క్వెజ్‌ను చదివి మనం తెలుసుకోవచ్చు.

పౌరాణికత, చరిత్ర కలగలిసిప్పుడే ఇతిహాసాన్ని పోలిన నవల ఉద్భవిస్తుందని మార్క్వెజ్ చేసిన తీర్మానంతో ఏకీభవించనంత కాలం తెలుగులో, మరీ ముఖ్యంగా తెలంగాణ తెలుగు భాషలో గొప్ప నవల వచ్చే అవకాశం లేనట్టే!

అసుర పేరుతో తెలుగు సాహిత్య ప్రపంచానికి చిరపరిచితులైన అంబటి సురేంద్రరాజు కవి, విమర్శకులే కాదు, సీనియర్ పాత్రికేయులు, హోమియోపతీ వైద్యులు. వారి రచనా విమర్శా హస్తవాసి ఆనందం ఆరోగ్యం సంపదలకు సహజమైన CURE. తెలుపు ప్రచురించిన వారి ఇతర వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు.

మహాశ్వేతా దేవి : చాల పెద్దమ్మ!

ఒక ఆత్మ హత్య /ఒక హత్య/ ఒక సామూహిక ఖననం 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article