Editorial

Sunday, May 19, 2024
కథనాలుఒక ఆత్మ హత్య /ఒక హత్య/ ఒక సామూహిక ఖననం - అంబటి సురేంద్రరాజు

ఒక ఆత్మ హత్య /ఒక హత్య/ ఒక సామూహిక ఖననం – అంబటి సురేంద్రరాజు

ambati

అంబటి సురేంద్రరాజు నిశితమైన కలం యోధులు. సీనియర్ పాత్రికేయులైన వీరు అసుర పేరుతో కవి గానూ పరిచితులు. తెలుగునాట గొప్ప సాహిత్య విమర్శకులు. తెలంగాణ సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకులలో ముఖ్యులు. హస్తవాసి మిన్నగా గల హోమియో వైద్యులు కూడా.

ఇరవై ఏళ్ల కిందనే వారు తెలంగాణా పాత్రికేయుల నిస్సహాయ స్థితిని ఒక ఆత్మహత్య, ఒక హత్యను  ఉదాహరణగా నిలిపి యాజమాన్యాలు, సంపాదకుల స్థితిని బట్టబయలు చేశారు. గులాం రసూల్ హత్యకు ఎవరు భాద్యత వహించాలో స్పష్టం చేశారు. 
నాటి స్థితికి కారణం కోస్తా యాజమాన్యాలే అనిపించవచ్చు గానీ అసలు కారణం అన్ని పత్రికల యాజమాన్యాలకు కేంద్ర బిందువైన ఎ.పి.యు.డబ్ల్యు.జె అంటూ ఎటువంటి శషబిషలు లేకుండా నిశితమైన విమర్శ చేశారు. ఆ స్థితి నుంచి తెలంగాణ పాత్రికేయులు ఇప్పటికైనా భయటపడ్డారా ? తమకు అన్ని విధాలా అండగా ఉండే యూనియన్ ను నిర్మించుకున్నారా? అటు ప్రభుత్వానికి ఇటు యాజమాన్యాలను తొత్తులుగా లేకుండా ఇరు వర్గాలను నిగ్గదీసి అడిగే స్థితి నెలకొన్నదా అన్నది కూడా ఈ వ్యాసం గుర్తు చేసి సమీక్షంచుకునేలా చేస్తుంది.

ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ మొదలై అప్పటికి ఏడాది దాటింది. సిటీ కోసం, జిల్లాల కోసం ప్రత్యేకంగా పేజీలు కేటాయిస్తున్న కాలమిది. హాప్ డమ్మీ స్పెషల్స్ ఇంకా అప్పటికి పుట్టలేదు. మేయిన్ ఎడిషన్లోనే ఒకట్రెండు పేజీలు సిటీ వార్తలతో నింపేస్తున్న రోజులవి.

సిటీలో ఒక నలభై యాభై మంది పార్ట్ టైమర్స్ ను (‘స్ట్రింగర్’ వారి ముద్దు పేరు) అపాయింట్ చేసుకొని (అపాయింట్మెంట్ కాగితం ఇవ్వకుండానే) దినసరి కూలీలకన్న హీనంగా వారితో వ్యవహరిస్తున్నారు. వీరి వద్ద నుండి వార్తలను దాదాపు దోపిడి చేస్తూ పత్రికా యాజమాన్యం జంటనగరాలలో ఎదురులేకుండా విస్తరిస్తున్న సమయం అది. ఈ స్ట్రింగర్ నామధ్యేయులందరికి కొందరు హైదరాబాద్ సిటీ నేటీవ్స్, వెనుకబడిన శూద్ర, అతి శూద్ర కులాలకు చెందినవారే కావడం గమనార్హం. వీరిలో ఒక పిలగాడు కాచిగూడ డేట్లైన్తో వార్తలు సంఖ్యాపరంగానే కాక ‘నాణ్యతగల’ వార్తలు రాసేవాడు. ప్రతిరోజు తలవంచుకొని వార్తలు వండేవాడు. అతని రచనా విన్యాసం అక్కడి న్యూస్ ఎడిటర్, డిప్యూటీ న్యూస్ ఎడిటర్లను తలదన్నే విధంగా ఉండేది. కుటుంబాన్ని పోషించేందుకు ‘జ్యోతి’ లో చేరిన కడు బీద బాలుడతను.

తెలంగాణా జర్నలిస్టుల ఫోరం ( TJF) ఇరవై ఏళ్ల క్రితం తెచ్చిన ‘తెలంగాణ, మే 31, 2001’ పుస్తకంలోని నాలుగో వ్యాసం ఇది. మిగతా వ్యాసాలను కూడా ధారావాహికంగా ‘తెలుపు’ ప్రచురిస్తుంది. గమనించగలరు. అచ్చైన వ్యాసాలు ఇవి… శీర్షికలను క్లిక్క్ చేసి చదువుకోగలరు. తెలంగాణ, మే 31, 2001 – చారిత్రాత్మక సంపాద‌కీయం .మన ప్రతాపరెడ్డికి వందనాలు- కె. శ్రీనివాస్ వ్యాసం. ‘తెలంగాణ’ కార్టునిస్టుల ఖజానా –టి. ఏడుకొండలు.

అతను, అతనితో పాటు మిగిలిన స్ట్రింగర్లు పనిచేస్తున్న క్రమంలో హఠాత్తుగా ఒక సాయంత్రం అప్పటికి ఏడాది కాలంగా పనిచేస్తున్న స్ట్రింగర్లందరినీ ఏరి వేయబోతున్నారన్న చావు కబురు చల్లగా న్యూస్ డెస్క్‌ కి చేరింది. కాచిగూడ కుర్రవాడు ఈ వార్త చెవిన పడీ పడగానే గజగజా వణికి పోయాడు. అప్పటికి అక్కడ డెస్క్ ఇంచార్జీగా వెలగబెడుతున్న నా వద్దకు ఆ బాబు వచ్చి భయోద్విగ్నంగా మాటలు తడబడుతుండగా బేలగా నా కళ్ళళ్ళోకి చూశాడు. గొంతు పెగిలి మాట బైటకు రావడం లేదు. ఏమైందని ఒకటికి పదిసార్లు అడిగింతర్వాత…

‘మమ్మల్ని తీసేస్తరట గద సార్’ అన్నాడు.

అటువంటిదేమీ లేదని నేను భరోసా ఇచ్చేందుకు యథాశక్తి చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు.
‘అందరి ఉద్యోగాలేంబోవు. రాయనోల్లయే పోతయ్. నువ్ మంచిగనే రాస్తవ్ కదా! నీ దెందుకు పోతది!’ అని నేనన్న.

ఆ మాట ఆ పిలగాడు నమ్మలేదని అతని కళ్ళు చెప్పకనే చెప్పాయి. ఇది జరిగిన మూడు రోజుల్లో, నైట్ డ్యూటీలో ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్న వార్త తెలిసింది. ఈ వార్తతో, వాడితో ఉన్న సాన్నిహిత్యం కొద్ది నేను తీవ్రంగా చలించి పోయాను. మనసంతా వికలమైంది. ‘జ్యోతి’లో తను ఉద్యోగం పోతుందనే భయంతోనే ఆ కుర్రవాడు కాచిగూడ – విద్యానగర్ స్టేషన్ల మధ్య రైలు కింద తల పెట్టి ప్రాణం తీసుకున్నాడు. వాడి అమ్మ నాన్నల గోస కళ్ళారా చూస్తేగానీ, వింటే గానీ తెల్వదు.

నగరానికి నాలుగు దిక్కులా ఫామ్ హౌజ్ల పేరిట వందల, వేల ఎకరాలను కోస్తా కమ్మ వలసదారులు ‘కజ్జా’ చేస్తున్న వైనాన్ని గులాం రసూల్ కనిపెట్టాడు. కనిపెట్టడంతో ఆగక దాన్ని పత్రికలకు ఎక్కించాడు.

1991 డిసెంబర్ 28.

‘హైదరాబాద్ పాత్రికేయులకు ముందుగా కబురైనా లేకుండా ఒక వర్కింగ్ జర్నలిస్టును పోలీసులు ఎగరేసుకుపోయారు. తెల్లవారి పత్రికల్లో ఆ జర్నలిస్టు మృత ముఖచిత్రం అచ్చయింది. పేరు గులాం రసూల్. పని చేసే పత్రిక ఉదయం. చేసే పని సోకాల్డ్ సిటీ ఎడిషన్ కు వార్తలు అందించడం. ఈ రసూల్ తోటి జర్నలిస్టుల్లా మొక్కుబడి వార్తలు రాయకుండా జర్నలిస్టు వృత్తిని చిత్తశుద్ధితో బాధ్యతాయుతుడైన ఒక పౌరుడిగా నిర్వర్తిస్తున్నాడు. అది పోలీసులకు గిట్టలేదు.

రసూల్ ‘ఉదయం’లో చేరకముందు ఆంధ్ర పత్రికలో (ఫుల్ టైం- రెగ్యులర్/మేయిన్ స్ట్రీం) రిపోర్టర్గా రెండేళ్ళు పని చేశాడు. అంతకు ముందు ‘ఈనాడు’లో’ శాస్త్ర ప్రకారం శిక్షణకు ఎంపికై సబ్-ఎడిటర్ గా ఏడాదికి పైబడి మఫ్ సిల్ పేజీలను నిర్వహించాడు. ‘ఈనాడు’లో చేరక పూర్వమే ఆలేరు అంచున, శారాజీపేట్ లో పుట్టిన ఊరు ఎల్లలు దాటకుండానే ఒక మంచి పాత్రికేయుడు చేయదగిన పనులు చేస్తూ వస్తున్నాడు.

కోస్తా పారిశ్రామిక వాణిజ్య వర్గాలు హైదరాబాద్ నగరాన్ని నూతనోత్సహంతో కబళిస్తున్న కాలమది. రియల్ ఎస్టేట్ ‘దందా’ జూలు విదిలించింది అప్పుడే. పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నేటివ్స్ భూములను కొల్లగొడుతున్న సందర్భమది. నగరానికి నాలుగు దిక్కులా ఫామ్ హౌజ్ల పేరిట వందల, వేల ఎకరాలను కోస్తా కమ్మ వలసదారులు ‘కజ్జా’ చేస్తున్న వైనాన్ని గులాం రసూల్ కనిపెట్టాడు. కనిపెట్టడంతో ఆగక దాన్ని పత్రికలకు ఎక్కించాడు.

తమ పబ్బం గడుపుకొనేందుకే యాజమాన్యాలు, వాటి తొత్తులైన సోకాల్డ్ ఎడిటర్లు ఈ ఉదార వైఖరిని అవలంభిస్తున్నాయనే సంగతి తెలియక మెరికల్లాంటి తెలంగాణ రిపోర్టర్లు ముందు వెనుకా చూడకుండ వార్తలు రాశారు.

సిటీ ఎడిషన్లను సజీవమైన వార్తలతో పాఠకులను చేరువచేస్తూ పత్రికా సర్కులేషన్ ను అన్ని పత్రికల యాజమాన్యాలు పెంచుకుంటున్నది అప్పుడే. అందుకే ఆ కాలంలో (1984-1992) యాజమాన్యాలు చాలా తెలివిగా పథకం ప్రకారం వార్తల ప్రచురణ విషయంలో ‘ఉదార’ వైఖరిని అవలంభించాయి. తమ పబ్బం గడుపుకొనేందుకే యాజమాన్యాలు, వాటి తొత్తులైన సోకాల్డ్ ఎడిటర్లు ఈ ఉదార వైఖరిని అవలంభిస్తున్నాయనే సంగతి తెలియక మెరికల్లాంటి తెలంగాణ రిపోర్టర్లు ముందు వెనుకా చూడకుండ వార్తలు రాశారు. గులాం రసూల్ వారిలో అతి ముఖ్యుడు. పి.వి. హయాంలో లిబరలైజేషన్ రంగ ప్రవేశం చేస్తున్న ఆనవాళ్ళు ఇవి.

రసూల్ రాసిన వార్తలు ఏలిన వారికి సయించేవి కాకపోతే వాటిని ఆపడానికి వివిధ దశలలో ఎందరో ‘బాస్’ లు ఉండనే ఉన్నారు. యజామాన్యం ‘ఉదార’ వైఖరినిలోని కపటత్వం ఎరిగిన వారు కాబట్టే ఈ ‘బాస్’ లంతా రసూల్ వార్తలను నిర్నిరోదంగా కాకుండా అచ్చుకు పంపించారని అనుకోవాల్సి వస్తుంది. వార్త రాసినవాడు సంపాదకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అందుకు బాధ్యత స్వీకరించాలనేది కామన్సెన్స్. ఆ ఫలానా వార్త రాసిన రసూల్ ను కాకుండా రాజ్యం, దాని యంత్రాంగం ఆ వార్త అచ్చువేసిన సంపాదకుడిని, ఎం.డి.ని నిలదీయాల్సింది. దమ్ముంటే రసూల్ విషయంలో చేసిందే వారిపై చేయవలసింది. వార్త రాయడనునేది పత్రికా నిర్వహణకు సంబంధించి తొట్టతొలి దశ. ఆ దశలో దానిని తోక్కేయడానికి, బుట్ట దాఖలు చేయడానికి, ఆ రాసిన వాడి పైన కూచోనే సిటీ డెస్క్ ఇంచార్జి, లేదంటే చీఫ్ రిపోర్టర్ ఉన్నాడు. కానీ వారాపని చేయలేదు. చేయక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అచ్చుకు న్యూస్ ఎడిటర్ సముఖానికి పంపారు. పోనీ ఆ న్యూస్ ఎడిటరైనా ఆపాడా? అదీ లేదు. అంటే ఏమిటి?

అందరికందరు ఆ వార్త ప్రచురణకు బాధ్యులు. రాసిన రసూల్ కన్న ఎన్నో రెట్లు బాధ్యులు. కానీ రాజ్యం మాత్రం వార్తా ప్రచురణతో ప్రమేయంలేని రిపోర్టర్ (స్ట్రింగర్) మాత్రుడైన రసూలను బలిగొంది.

అందరికందరు ఆ వార్త ప్రచురణకు బాధ్యులు. రాసిన రసూల్ కన్న ఎన్నో రెట్లు బాధ్యులు. కానీ రాజ్యం మాత్రం వార్తా ప్రచురణతో ప్రమేయంలేని రిపోర్టర్ (స్ట్రింగర్) మాత్రుడైన రసూలను బలిగొంది. నిష్ఠూచిగ, రసూల్ హత్య విషయంలో యాజమాన్యం అవలంభించిన ఉదాసీన వైఖరిని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించవలసిన జర్నలిస్టుల సంఘం నాయకత్వం ఆ పని చేయలేదు. (పరోక్షంగా ప్రత్యక్షంగా కూడ) పత్రికా యాజమాన్యం, ప్రభుత్వ వైఖరికి మౌనంగా వత్తాసు పలికారు. జర్నలిస్టుల హక్కులు (ఇవి పౌరుల ప్రాథమిక హక్కుల కన్న మిన్నవేమి కావు) కాల రాయకుండా చూడాల్సిన జర్నలిస్టుల సంఘం రసూల్ విషయంలో మిన్నకున్నందువల్లే తర్వాతి కాలంలో అనేక సందర్భాల్లో గ్రామీణ విలేకరుల మీద దాడులు జరిగాయి, జరుగుతున్నాయి.

జర్నలిస్టుల వర్తమాన స్థితిగతులను ఒకసారి అవలోకిస్తే లోన ఉన్న వారి కన్నా బయటే ఎక్కువ మంది కనిపిస్తారు.

ఒక ఆత్మ ‘హత్య’ను, ఒక ‘హత్య’ను ఇప్పటి దాక మనం ప్రస్తావించుకొన్నాం. రసూల్ హత్యానంతర దశాబ్ద కాలంలో జరిగిన, జరుగుతున్న పరిణామాలను ఇప్పుడు చూద్దాం. ఒక అనామక స్ట్రింగర్ సోదరుడిని ఆత్మహత్యకు పురికొల్పిన ఆంధ్రజ్యోతి నేడు స్వయానా ఆత్మహత్య చేసుకొంది. అందులో పని చేసే వందలాది సిబ్బంది ప్రాణాలను పొట్టన బెట్టుకొంది. ఆంధ్రజ్యోతి ఉద్యోగులు ఈ రోజున రోడ్డునపడి దిక్కులేని వారైనారు.

మరో పత్రిక. కేవలం బ్రాహ్మణ పత్రిక. పాఠకులకు ‘కైవల్యం’ సాధించి పెట్టే ఆంధ్రప్రభ అనే పత్రిక ఈ రోజు చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. మెజారిటీ సిబ్బందిని ముఖ్యంగా జిల్లాలలో గ్రామాలలో పనిచేస్తున్న విలేకరులను ఏక పక్షంగా, న్యాయసూత్రాలను తుంగలో తొక్కి వదిలించుకొని బల హీనంగా ఉంటూ, ఉండీ లేని సమానంగా వస్తున్న ఈ పత్రిక మొదటి నుంచి పాత్రికేయ సిబ్బందితో వ్యవహరించిన తీరు పరమ వికృతమైనదని చెప్పినా తక్కువే. సిబ్బంది ఆణచివేతకు ఈ పత్రిక పెట్టింది పేరు. జర్నలిస్టుల ఉసురు తగిలే ఈ పత్రిక ఇవ్వాళ ఈ దుస్థితికి చేరుకొంది. చావుదల కొచ్చింది. మిగిలిన పత్రికలు చాప్లిన్ ‘మోడరన్ టైమ్స్’ సినిమాలోని భారీ కార్మాగారాలుగా మారిపోయాయి. (నెహ్రూ కలగన్న కర్మగాల మిదే) యంత్ర భూతాల కోరలు తోమే కంప్యూటర్ కార్మికులుగా తెలుగు పాత్రికేయులు మారిపోయారు. వారిలో కొందరిని అదృష్టం వరించి ఇంటర్నెట్లో ఆజ్ఞాత జర్నలిస్టు కూలీలుగా ఉత్థానం చెందారు.

జర్నలిస్టుల వర్తమాన స్థితిగతులను ఒకసారి అవలోకిస్తే లోన ఉన్న వారి కన్నా బయటే ఎక్కువ మంది కనిపిస్తారు. ఈ స్థితికి కారణం కోస్తా యాజమాన్యాలే అనిపించవచ్చు. కానీ అసలు కారణం అన్ని పత్రికల యాజమాన్యాలకు కేంద్ర బిందువైన ఎ.పి.యు.డబ్ల్యు.జె. (ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్).

ఎన్నికల రంగంలో ప్రజలచే తన్నులు తిని ప్రజల ఓట్లకు నోచుకోక తోక ముడిచిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు – ఇవీ ఉభయచరాల్లాంటివే – ఇవి రెండూ ఏక కాలంలో రెండు చోట్ల చలిస్తూ వ్యభిచరిస్తుంటాయి. ఆ రెండు చోట్లు ఏమిటనేది సందర్భాన్నిబట్టి ఉంటాయి. నిజానికి ఎల్లవేళలా వారుండేది ఒక్క చోటే. ఆ చోటు జర్నలిస్టులకే కాదు. ప్రజానీకానికి కూడా పూర్తి వ్యతిరేకమైనది. అది ఒకచోట యాజమాన్యాలు కావచ్చు. కొండకచో నేరుగా ప్రభుత్వాలే కావచ్చు.

ప్రజలకు దూరమై మనుగడ కోల్పోయి కుళ్ళి కంపుగొడుతున్న ఈ రెండు కమ్యూనిస్టు పార్టీలు జర్నలిస్టులకు మాత్రం ఇంకా దూరం కాకపోవడం, దిన దినం దగ్గర కావడం ఘోర విషాదం. ఉభయ కమ్యూనిస్టులు చరిత్ర చేతిలో బుట్ట దాఖలా అయిన తదనంతర కాలంలో ముందుకొచ్చిన రాడికల్ లెఫ్ట్ (ఎం.ఎల్.) ఉద్యమాల ఫలితంగా తెలంగాణ జిల్లాల నుంచి రంగం మీదికి వచ్చిన యువ పాత్రికేయులు వృత్తి పరంగా దాదాపు అన్ని కొత్త పత్రికలను ఎంత సమర్థవంతంగా నిర్వహించారో అంతే అసమర్థంగ అప్పటికే ఉనికిలో ఉన్న పాత నాయకత్వానికి తలొగ్గారు. కొత్త నాయకత్వాన్ని సృష్టించాల్సిన అవసరాన్ని, అందుకు అవసరమైన కల్చరు వృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఈ కొత్త తరం తెలంగాణ జర్నలిస్టులు గుర్తించలేదు. గత ఇరవై ఏళ్ళ వైఫల్యాల పరంపర ఫలితమే నేటి మన ఐదేళ్ళ దుస్తితికి మూలకారణమని ఇప్పటికైనా గ్రహించాలి.

దీనికి ఈ స్థితికి పరాయివాడెంత భాద్యుడో మనమూ అంతే బాధ్యులం. ముందు మనం ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవాలి. అప్పుడే మనం మన శత్రువు పై గురి పెట్టవచ్చు.

మనమిప్పుడు నిలుచున్న చోటు నుంచి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కనిపించేది విస్తరిస్తున్న స్మశానం. గుట్టలు గుట్టులుగా పేరుకొన్న జీవచ్చవాలు. నోటి మాట రాక, చూపు కోల్పోయి దృక్కోణం మటుమాయమై ఎవరికీ చెందక నిశ్చేష్టులై, బీరిపోయి దిక్కులు చూస్తున్న అసంఖ్యాక పాత్రికేయులు. అచ్చం తోటి తెలంగాణావాడి మాదిరే నిస్సహాయ స్థితిలో శక్తులుడిగి… సామూహిక ఖననం తరువాత కనిపించే స్థితి ఇది.

దీనికి ఈ స్థితికి పరాయివాడెంత భాద్యుడో మనమూ అంతే బాధ్యులం. ముందు మనం ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవాలి. అప్పుడే మనం మన శత్రువు పై గురి పెట్టవచ్చు.

సుమారు పాతికేళ్ళ చరిత్ర ఇది. ఈనాడు, ఉదయం, ఆంధ్రజ్యోతి (హైదరాబాద్), వార్త పత్రికల నిర్మాణంలో కీలక పాత్ర మనది. రాళ్ళెత్తిన కూలీలం మనం. సంపాదక (కీలుబొమ్మ) భాద్యత మినహా అన్ని ఇతర బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి ఈ అన్ని పత్రికలను బ్రతికించింది మనం. బతుకునిచ్చింది మనం. చివరాఖరికి బయటకు పంపబడి అంచుల్లోకి నెట్టబడింది మనం.
కోస్తా పత్రికల యాజమాన్యం చేతుల్లో లెక్కకు మిక్కిలి ఘోరమైన అవమానాల పాలైంది మనమే. ఆదుకోనే అండ లేక, ఆసరాగా నిలిచే తోడు లేక వ్యక్తిత్వాలను కోల్పోయి, తెలంగాణ తనాన్ని అసలుకే కోల్పోయి రిక్త హస్తాలతో ఈ రోజు బరిబాతల నిలుచున్నదీ మనమే.

ఇక్కడ నుంచి మనమిప్పుడు ఉన్నచోటు నుంచి సమిష్టిగా, ఒక్క ఉదుటున లేవాల్సింది మనమే.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article