Editorial

Sunday, May 19, 2024
Yours Sportingly'కోహ్లీ హటావో' కరెక్టేనా? - సి. వెంకటేష్ తెలుపు

‘కోహ్లీ హటావో’ కరెక్టేనా? – సి. వెంకటేష్ తెలుపు

c.venkatesh

తెలుగు జర్నలిజంలో క్రీడా విశ్లేషణకు గౌరవం, హుందా తెచ్చిన సీనియర్ క్రీడా పాత్రికేయులు సి.వెంకటేష్ తెలుపు కోసం అందించే క్రీడా స్ఫూర్తి. ‘YOURS SPORTINGLY’.

కోహ్లిపై ఎగురుతున్న కీబోర్డ్ వారియర్ల సంగతి ఎలా ఉన్నా  ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టె బంతి తాలూకు స్వింగ్ అండ్ సీమ్ కదా అసలు విషయం అంటున్నారు ఈ వారం.

కెప్టెన్‌గా కోహ్లీని తీసేయాలి…వేస్ట్ ఫెలో…మూడు మేజర్ టోర్నమెంట్లలో ఒక్కటంటే ఒక్క దాంట్లో కూడా ఇండియాను గెలిపించలేకపోయాడు. 2017 ఛాంపియన్స్ ట్రొఫీ ఫైనల్, 2019 ప్రపంచ కప్ సెమీ ఫైనల్, ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ – అన్నింటిలో ఓడిపోయాం. టీమిండీయా కెప్టెన్‌గానే కాదు, ఐపిఎల్‌లో బెంగళూరును కూడా ఎనిమిదేళ్ళలో ఒక్కసారి కూడా గెలిపించలేకపోయాడు. సో..బై బై కెప్టెన్ కోహ్లీ! – సోషల్ మీడియా రియాక్షన్లు ఇలానే ఉన్నాయి, ఇలానే ఉంటాయి కూడా. జీవితంలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలియదు గానీ ఇప్పటి యూత్‌లో కొంతమంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద మాత్రం యమా యాక్టివ్. సందు దొరికితే చాలు సెలెబ్రిటీల మీద విరుచుకు పడుతుంటారు. సెలెబ్రిటీల ఫెయిలూర్స్‌ను, చిన్న చిన్న పొరపాట్లను వీరు అస్సలు తట్టుకోలేరు. వారి కామెంట్స్‌కు పెడర్థాలు తీయడం వీరి ప్రత్యేకత. వీరి రాతలనిండా బూతులు చాలా కామన్. ఈ కీబోర్డ్ వారియర్ల హడావుడి క్రికెట్‌లో మరీ ఎక్కువ.

మూడు మెగా ఈవెంట్ల ఓటమికి అసలు కారణం వేరొక చోట ఉంది. ఈ మూడు ఓటముల వేదిక ఇంగ్లండ్ కావడం కాకతాళీయమైనదేమీ కాదు. ఇంగ్లండ్‌లో క్రికెట్ బంతి గాలిలోన, నేలపైన కూడా వయ్యారాలు పోతుంది. దీన్నే మనం స్వింగ్ అండ్ సీమ్ అని పిలుచుకుంటాం.

పైన మనం చెప్పుకొన్న మూడు మెగా ఈవెంట్ల ఓటమిలో జట్టు సారధి బాధ్యత బొత్తిగా లేదని కాదు. కానీ అసలు సమస్య వేరొక చోట ఉంది. ఈ మూడు ఓటముల వేదిక ఇంగ్లండ్ కావడం కాకతాళీయమైనదేమీ కాదు. ఇంగ్లండ్‌లో క్రికెట్ బంతి గాలిలోన, నేలపైన కూడా వయ్యారాలు పోతుంది. దీన్నే మనం స్వింగ్ అండ్ సీమ్ అని పిలుచుకుంటాం. మన బ్యాట్స్‌మెన్‌కు ఎంతటి వేగం అయినా ఇబ్బంది లేదు, బౌన్స్‌తో కూడా సమస్య లేదు. ఇక స్పిన్ ఆడడంలో మనవాళ్ళకి తిరుగేలేదు. ఎటొచ్చీ బంతి స్వింగ్ అవుతుందంటేనే మన బ్యాట్స్‌మెన్ ఖంగు తింటారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ కొత్త బంతిని స్వింగ్ చేసి రోహిత్, కోహ్లీ, ధవన్ వికెట్లు వెంటవెంటనే తీశాడు. 33 పరుగూలకే 3 వికెట్లు పోవడంతో 180 పరుగుల తేడాతో మన టీమ్ చిత్తయింది. 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్లో కూడా స్వింగ్ బౌలింగ్ మన కొంప ముంచింది. మబ్బులు కమ్మిన వాతావరణం ఉపయోగించుకుని న్యూజిలాండ్ పేస్ బౌలర్లు మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ 5 పరుగులకే 3 వికెట్లు (రోహిత్, రాహుల్, కోహ్లీ) తీసి చావు దెబ్బ కొట్టారు. ఇక మొన్నటి టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో మళ్ళీ అదే ఇంగ్లండ్, అవే మబ్బులు. కివీస్ పేసర్ల స్వింగ్ బౌలింగ్‌కు మన జట్టు చేతులెత్తేసింది.

సోషల్ మీడియా కోరుతున్నట్టుగా కెప్టెన్‌ను మార్చడం వల్లనో, పుజారా, రహానేను జట్టు నుంచి తీసేయడం వల్లనో అసలు సమస్య తీరదు. స్వింగింగ్ బంతులు ఆడడంలో మన బ్యాట్స్‌మెన్ తమ టెక్నిక్ మెరుగుపరుచుకోవాలి.

ఇంగ్లండ్‌లో స్వింగ్ బౌలింగ్ సమస్య మనకు మొదటి నుంచీ ఉన్నదే. అందుకే అక్కడ 18 టెస్ట్ సీరీస్‌లు ఆడితే వాటిలో ఇండియా నెగ్గినవి మూడంటే మూడు మాత్రమే. ఇంగ్లండ్ గడ్డ మీద ఆడిన 62 టెస్టుల్లో ఏడింటిలోనే మనం గెలవగలిగాం. న్యూజిలాండ్‌లో కూడా బంతి బాగా స్వింగ్ అవుతుంది. అందుకే అక్కడ ఆడిన 11 టెస్ట్ సీరీసుల్లో భారత జట్టు రెండింటిలోనే విజయం సాధించగలిగింది.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీని సమర్ధించడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. అయితే, సోషల్ మీడియా కోరుతున్నట్టుగా కెప్టెన్‌ను మార్చడం వల్లనో, పుజారా, రహానేను జట్టు నుంచి తీసేయడం వల్లనో అసలు సమస్య తీరదు. స్వింగింగ్ బంతులు ఆడడంలో మన బ్యాట్స్‌మెన్ తమ టెక్నిక్ మెరుగుపరుచుకోవాలి. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల, లాహ్లీ లాంటి చోట్ల ఇంగ్లండ్‌లో మాదిరిగా బంతి స్వింగ్ అవుతుంది. అక్కడ మన యువ ఆటగాళ్ళకు ప్రత్యేక శిక్షణ సదుపాయాలు కల్పించాలి. అలాగే మన బ్యాట్స్‌మెన్ తరచుగా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ఆడే వెసులుబాటు కల్పించాలి. స్వింగ్ బౌలింగ్ బలహీనత నుంచి బయట పడేవరకు అన్ని ఫార్మాట్లలో టీమిండియా విశ్వవిజేత కావడం కష్టమే అవుతుంది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article