Editorial

Sunday, May 19, 2024
ఆనందంపండుగ ఛాయ : ఏరువాక పున్నమి తెలుపు

పండుగ ఛాయ : ఏరువాక పున్నమి తెలుపు

వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమ రోజున రైతులు జరుపుకునే పండుగే ఏరువాక పున్నమి.

కందుకూరి రమేష్ బాబు 

జ్యేష్ఠ పౌర్ణమి నాటికి వర్షం పడక మానదంటారు. భూమి మెత్తపడకా మానదు. నాగలితో సాగే వ్యవసాయానికి ఇది శుభారంభం. అందుకే ఈ రోజు దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. ఐతే, ఈ రోజు దాకా ఆగడం ఎందుకూ అని కొందరు ముందే పనులు మొదలెట్టవచ్చు. కానీ ఒకనాటి పద్ధతి వేరు. అత్యుత్సాహం ఉన్నవారైనా బద్దకస్తులైనా ఈ రోజే అందరూ సమిష్టిగా పనుల్లోకి దిగేవారు. నిజానికి ఈ రోజు నుంచి పనుల్లోకి దిగడానికి శాస్త్రీయ కారణమూ ఉన్నది. ప్రకృతికి అనుగుణంగా ఫలదీకరణకు తగిన రుతువులో రైతులు నేటి నుంచి వ్యవసాయ క్యాలెండర్ కి అనుగుణంగా పనికి నాంది పలుకుతారు. ఇది వారి విజ్ఞతకు, వివేకానికి, శాస్త్రీయ పరిజ్ఞానానికి నిదర్శనం.

ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం అంటారు. దానర్థం వ్యవసాయం మొదలుపెట్టడమే.

ఇప్పుడు వ్యవసాయం తీరుతెన్నులు పూర్తిగా మారిపొయినప్పటికే గతమంతా ఒక తడి తడి జ్ఞాపకమే. మట్టి పరిమళమే.

తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటం అన్నది ఒక గొప్ప సంబురం. పగలే పచ్చటి ఆనందానికి తావిచ్చే వెన్నెల వేడుక.

ఈ రోజున జరిగే తొలి దుక్కలో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడిచేవారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి, కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్నే కాదు, గౌరవాన్ని ప్రకటించే సంప్రదాయం ఇప్పటికీ ఉన్నది.

ఇక ఏరువాక సాగుతుండగా, అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ మనకూ తెలుసు. అందుకే ఏరువాక పాటలు, నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.

సాంప్రదాయికంగా రైతులు ఏరువాక పున్నమిని రోజున వ్యవసాయ పనిముట్లను కడిగి శుభ్రం చేసుకుంటారు. అలాగే, ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. భూతల్లికి పూజలు చేస్తారు. సామూహికంగా ఎద్దులను తోలుకుని పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు. అట్లే, ఈ పండుగనాటి మరో ముఖ్యమైన వేడుక ఎడ్ల పందేలు.

ఇప్పటి పరిస్థితి వేరుగానీ, గతంలో ఆ రోజున ఆడపడుచులు పుట్టింటికి వచ్చేవారు. ఇళ్ళలో పనిచేసే జీతగాళ్ళకు కూడా కొత్త ఉత్సాహం ఉండేది. వాళ్ళుకి కూడా కొత్త సంవత్సరం మొదలవుతుంది గనుక.

ఏరువాక పున్నమి సందర్భంగా  ‘దేశాల్ని ఏలినా… దిక్కుల్ని గెలిచినా బుక్కునా కనకము బువ్వ తప్ప’ అంటూ ఎంతో అపురూపంగా సేద్యగాడి చెమటతో పుట్టించే అన్నంపై, ఆరుగాలం శ్రమించే ఆ అన్నదాత ఔన్నత్యంపై శ్రీ గంటేడ గౌరునాయుడు రాసిన పద్యాన్ని విందాం. రైతన్నకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. గానం శ్రీ కోట పురుషోత్తం.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article