Editorial

Friday, May 3, 2024
క‌రోనా మ‌హ‌మ్మారిదేశం కన్నీరు కారుస్తోంది - పరిటాల మూర్తి

దేశం కన్నీరు కారుస్తోంది – పరిటాల మూర్తి

Illustration
చిత్రం : బీర శ్రీనివాస్

ఉప్పు నీటి కంటనీరు ఉప్పెనలా మారుతోంది..!

భారతదేశం అంతా ఇప్పుడు కన్నీరు కారుస్తోంది. ఊరి చివర కాష్టం నిత్యం కాలుతూనే ఉంది. ప్రతి గడపకి కష్టం… ప్రతి ఒక్కరికీ మనోవేదన, ప్రతి ఇంటికి సమస్య, ఊరు చివర శ్మశానం నిశిని చూడటం లేదు… గుండెల్లో కన్నీరు ఆగటం లేదు. ఓ..నా.. భారతదేశమా నీకేమైంది..? ఎందుకిలా గుండెలు పగిలేలా.. దిక్కులు దిక్కటిల్లేలా.. మనోరోదన చేయిస్తూ మరణమృదంగం వాయిస్తున్నావు..? ఎప్పుడు దీనికి అంతం.. ఎవ్వరు దీనికి కారణం..?

కష్టం వస్తేనే కద.. గుండెబలం తెలిసేది అంటారు.. కానీ ఆ కష్టం ఇప్పుడు గుండెని పగిలేలా చేస్తోంది. మద్యతరగతి కుటుంబాలని ఆర్ధికంగా, మానసికంగా, శారీరకంగా కృంగదీసేస్తోంది. ప్రతి గడప కన్నీటితో తడిసి ముద్దైపోతోంది. ప్రతి ఇల్లు కష్టంతో కుంగిపోతోంది. ఈ సమయంలో గుండె నిబ్బరం చేసుకునే శక్తి ఎవరికి ఉంది..?

గుంటూరులో దేవిక భర్త చనిపోతే తన ఇద్దరు పిల్లలని చూసే దిక్కులేక రోధిస్తోంది. భార్య భర్తలిద్దరికీ పాజిటివ్ వచ్చింది. భర్త చనిపోయాడు.. దహన సంస్కారాలు కూడా చేయలేని పరిస్థితి. చుట్టాలు వచ్చి పలకరించలేని దుస్థితి. అందరూ ఉండి కూడా అనాధలాగా జీవిస్తోంది. ఇద్దరు పిల్లల ఆకలని తీర్చేందుకు తానే స్వయంగా నడుం బిగించి బయలుదేరుతోంది. ఇంతటి కష్టం ఎవరికీ రావద్దని కోరుకుంటోంది.

అదే వీధిలో ఉండే రాజమ్మ గారి పెద్ద కొడుకు కోవిడ్ తో చనిపోయాడు. కోడలు ఈ విషయాన్ని తల్లికి చెప్పడం లేదు. ఎందుకంటే తల్లి ఆక్సిజన్ ఊపిరి తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొడుకు కోవిడ్ కి బలైపోయాడన్న మరుక్షణం ఊపిరి వదిలేస్తుందేమో అని, అత్తగారి ముందు నటిస్తూ ఆవిడకి సేవలు చేస్తోంది కోడలు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ, ముఖంపై చిరునవ్వుతో జీవిస్తున్న ఆవిడ కష్టం ఎవరికి చెప్పుకోవాలి…?

విజయవాడలో ఉండే పూర్ణ తన తండ్రిని కోల్పోయింది. తల్లికి ఈవిషయం ఇంకా చెప్పలేదు. ఎందుకంటే, తల్లి ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి కోలుకుంటోంది. తండ్రి చనిపోతే కనీసం ఆఖరి ప్రయాణం చేయించేందుకు, కొరివి పెట్టేందుకు కొడుకులు రాలేని పరిస్థితి. తండ్రి అంతిమయాత్రని తానే చేసి ఇంటికి వచ్చి , ఏమీ జరగని దానిలా అన్ని పనులు చేసుకోవడం మనసుకి ఎంత కష్టం.. కుటుంబానికి ఎంతటి తీరని నష్టం?

కష్టాల తిమిరాన్ని చీల్చి, అగ్నిరేఖల్లాంటి కాంతి కిరణాలు ప్రసరింపజేసేందుకు భగభగ మండే సూర్యుడు  ఉదయించాల్సిన తరుణం ఇది..! ప్రజల ఆర్తనాదాలని విని కాలరుద్రుడు ఉద్భవించే సమయం ఇది..!

కోవిడ్ ఉదృతి ఎంత తీవ్రంగా ఉంది అని చెప్పేందుకు ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.., అన్నయ్య, అక్క, తమ్ముడు, తోడల్లుడు, పిన్ని, బాబాయ్, పెద్దనాన్న, పెద్దమ్మ, అమ్మమ్మ, తాతయ్య, వదిన, చెల్లి, మావయ్య, అత్తయ్య, ఇలా ఎన్నో బందాలతో ముడిపడిన భారతీయులు ఇప్పుడు ఆత్మీయులని కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చావులేని ఇల్లు లేదు అంటే అది అతిశయోక్తికాదమో అన్నట్లుగా భారతదేశం అంతా కన్నీరు కారుస్తోంది. ఈ ఉప్పునీటి కంటనీరు ఉప్పనలా మారి అయినా ఈ కరోనాని అంతం చేస్తే బాగుండు అనిపిస్తోంది. దశావతారం సినిమాలో వైరస్ ని చంపేందుకు త్సునామీ వచ్చి ఈ సోడియంతో వైరస్ చనిపోయినట్లుగానే , మన భారతీయుడు కంటినీటి సోడియం శక్తితో ఈ వైరస్ చచ్చిపోతే బాగుండు అని రోధిస్తున్నారు.

దేశానికి వెన్నుముక లాగా ఉండే మద్యతరగతి ఆర్ధిక వ్వవస్థ ఇప్పుడు ఛిన్నాభిన్నం అయిపోయింది. కరోనా కారణంగా ఎన్నో సమస్యలతో బాధపడుతూ దాచుకున్న డబ్బులని సైతం ఖర్చుపెడుతూ మూగగా రోధిస్తున్నారు. ఇంతటి సమస్యలని తెచ్చిపెట్టిన ఈ కరోనా అంతం అయ్యేది ఎప్పుడు..? ఎన్ని వేల యాగాలు చేయాలి..? ఎన్నో కోట్ల మంత్రాలు చదవాలి..? ఇంకా ఎంతమంది దీని బారిన పడి చావాలి..? దేవుడనే వాడు ఉంటే.., నిజంగా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు భువిపైకి దిగి వస్తే.. దేవుడు ఉద్భవించే సమయం ఇదే..! ఇప్పుడు కూడా కనికరం లేకపోతే.. దేశం అంతా శవాల దిబ్బలుగా, శ్మశానంగా మారక తప్పదు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article