Editorial

Saturday, May 11, 2024
కాల‌మ్‌‘మనసు పొరల్లో…’ : ఆ మూమెంట్ గోదావరి లాంటిదే - పి. జ్యోతి తెలుపు

‘మనసు పొరల్లో…’ : ఆ మూమెంట్ గోదావరి లాంటిదే – పి. జ్యోతి తెలుపు

నేర్చుకున్న ప్రతి కొత్త విషయం నిరంతరం మనలను విభిన్నమైన సవాళ్లకు సన్నద్దం చేస్తుంది. మనిషి గట్టిపడడానికి, తనను తాను ఓ పటిష్టమైన మానవుడిగా మార్చుకోవడానికి కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూ ఉందాలి. అవి ఇచ్చే ఆత్మవిశ్వాసం చాలా భౌతిక సుఖాల కన్నా పై స్థాయిలో ఉంటుందని అనుభవించిన వారికే అర్ధం అవుతుంది. ఈ వారం ఈ కోణంలో నా మనసు పొరల్లో దాగిన కొన్ని అనుభవాలను పంచుకుంటాను. ముఖ్యంగా స్కౌటింగ్ అండ్ గైడింగ్ తీర్చిన వ్యక్తిగా నా ప్రయాణంలోని జ్ఞాపకాల తెలుపు ఈ వారం ప్రత్యేకం.

పి.జ్యోతి

స్కూలు, కాలెజీలలో నేను సంపాదించిన జ్ఞానం కన్నా, ఉద్యోగం వచ్చిన తరువాత వివిధ సందర్భాలలో పని చేస్తూ నేను నేర్చుకున్న విషయాలు నాకు వ్యక్తిగతంగా చాలా ఉపయోగపడ్డాయి. నా ఉద్యోగ నిర్వహణలో నేను చూసిన చాలా మంది గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉద్యోగం తరువాత నేర్చువడం అనే ప్రక్రియను తగ్గించుకున్నారనే అనిపిస్తుంది. తరువాత ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవలసిన అవసరం వస్తే ఇది మాకు అవసరమా, దీనికి ఇంక్రిమెంటు ఉందా అనో, లేదా దీని వలన మాకు లాభం ఏంటి అనే ప్రశ్నలే ఎక్కువ మంది వేయడం నాకు తెలుసు.

‘లాభం’ అంటే అన్నీ ఆర్ధికపరమైనవే ఉండవు అని ఒకప్పుడు అలాంటి వారితో వాదించేదాన్ని. కాని ఇప్పుడు ఆ పద్దతి పూర్తిగా మానుకున్నాను. ప్రభుత్వ ఉద్యోగస్తుల మైండ్ చాలా సందర్భాలలో మూసుకుపోతుంది. వారి అవసరార్ధం మాత్రమే అది పని చేస్తుందని చెప్పాలి. ఒక కంపర్ట్ జోన్ లోకి వెళ్ళిన తరువాత సాహసాలు ఇచ్చేఅనుభవాలు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ‘అనవసరం’ అనిపించడం విచారకరం.

ప్రత్యేకమైన యిష్టం ఏర్పడింది!

రైల్వే లో టీచర్ గా నేను 1996 మార్చ్ 30న జాయిన్ అయ్యాను. చేరిన రెండు నెలలకే ఏదో స్కౌట్ అండ్ గైడ్ ట్రేనింగ్ కి నన్ను మా హెడ్మాస్టర్ రమేష్ బాబు గారు పంపించారు.

కొన్ని సార్లు టెంట్ కూడా లేకుండ అప్పటికప్పుడూ స్టేవ్స్ తో కట్టుకున్న నివాస స్థలం

ఈ భారత్ స్కౌట్ గైడ్ ఉద్యమం గురించి నాకు అంతకు ముందు ఎటువంటి అవగాహనా లేదు. కాని నీవు ఈ ట్రైనింగ్ చేస్తే స్కూలుకి ఉపయోగపడతావు అని హెడ్మాస్టర్ గారు స్వయంగా చెప్పడంతో నేను పది రోజుల బేసిక్ కోర్సుకు గుంతకల్ వెళ్ళవలసి వచ్చింది. అప్పటి నుంది పదిహేను సంవత్సరాలు నేను స్కౌటింగ్ మూమెంట్ లోనే ఉన్నాను. మా స్కూలులో పిల్లలకు ఇది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ గా ఉండేది. స్కౌట్ అండ్ గైడ్ మూమెంట్ లో కొన్నాళ్లు పని చేసి రాష్ట్రపతి సర్టిఫికేట్ ఉన్న వారికి రైల్వేలో ప్రత్యేకమైన కోటాలో ఉద్యోగాలుండేవి. వాటి కోసం చాలా మంది ఈ ఉద్యమంలో చేరేవారు. వీరికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒకరిద్దరు టీచర్లు ఉండేవాళ్లు. రాలీలనీ, జంబోరీలని కొన్ని కాంపులుండేవి. అయితే ఈ స్కౌట్ కాంపులకు టీచర్లు చాలా అయిష్టంగానే వెళ్ళేవాళ్ళు. కొంత మందికి ఇది బిలో డిగ్నిటీగా కూడా ఉండేది. యువకులు ఉద్యోగాల కోసం ఈ స్కౌట్ ని ఇష్టపడుతున్నట్లు నటించేవాళ్ళు. చాలా హిపోక్రసీ దీని చూట్టూ అప్పట్లోనే చేరిపోయింది. కొందరు ఈ స్కౌట్ పేరుతో వచ్చే టీయేలు, పాస్ లు, టూర్ల కోసం ఈ మూమెంట్ లో ఉండేవాళ్ళు. వ్యక్తిగత లాభం ప్రముఖ స్థానం వహించేది. కాని ఇవేవీ నాకు ప్రధానం కాలేదు. నేను వెళ్ళిన మొదటి కాంప్ నుండి కూడా ఈ మూమెంట్ పై నాకు ఒక ప్రత్యేకమైన యిష్టం ఏర్పడింది.

సమూహంగా జీవించడం, కలిసి కొత్త ప్రదేశాలు చూడడం, కలిసి నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు కల్పించేది ఈ స్కౌట్ మూమెంట్.

నిజానికి అక్కడ వాతావరణంలో చాలా భావ కాలుష్యం ఉండేది. కాని దాన్ని నేను పట్టించుకునే దాన్ని కాదు. ఆ కాంప్ వాతావరణంలో ఒక సామాజిక ఐక్యత ఉండేది. ఇది నాకు చాలా యిష్టంగా ఉండేది. సమూహంగా జీవించడం, కష్టమైన పరిసరాలను మనకనుకూలంగా మార్చుకోవడం, సమూహంగా భోజనాలు చేయడం, కలిసి కొత్త ప్రదేశాలు చూడడం, కలిసి నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు కల్పించేది ఈ స్కౌట్ మూమెంట్.

సామాజిక సాన్నిహిత్యానికి వేదిక

పిల్లలను కాంప్ లకు తీసుకెళ్ళిన తరువాత వారందరితో పాటు ఆరుబైట ఓ టెంట్ లో మేమూ ఉండేవాళ్ళం. అక్కడే సామానులు సర్ధుకుని ఆ కాస్త జాగాని శుభ్రంగా పెట్టుకోవడం నేర్చుకోవాలి. నేల మీద పాతిన ఆ టేంట్ లో రాత్రుల్లు పడుకోవాలి. అన్నీ మతస్తులూ, కులస్థులూ కలిసి పక్క పక్కన జీవించాలి. కలిసి భోంచేయాలి. ఆ ఆరుబైటే వండుకోవాలి. ఇది ఎంతటి సామాజిక దగ్గరితనాన్ని తీసుకొస్తుందో ఈ మూమెంట్ లో ఇన్వాల్వ్ అయినవాళ్లకే అర్ధం అవుతుంది.

(కేంప్ లో ఇలాంటి టెంట్ల లోనే ఉండవలసి వస్తుంది

ఈ మూమెంట్ ని ప్రేమించిన వాళ్ళు విలక్షణమైన వ్యక్తిత్వంతో బైటికి వస్తారు. నిజంగా ఈ మూమెంట్ లో ఏ భేషజాలు లేకుండా గడిపిన వాళ్ళు ‘నా’ అనే అహాన్ని చాలా వరకు వదిలించుకోగలుగుతారు. అలాగే ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా స్వీకరించడం నేర్చుకుంటారు కూడా. రకరకాల మనస్థత్వాలున్న వ్యక్తులతో పని చేసుకోవడం, చేయించుకోవడం నేర్చుకుంటారు.

ఈ స్కౌట్ మూమెంట్ కారణంగా ఇప్పుడు కొరవడుతున్న సార్వత్రిక ఆమోదాన్ని అర్ధం చేసుకోగలిగే స్థాయికి ఎదుగుతారని చెప్పగలను.

ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి టీం వర్క్ అండ్ మేనేజ్మెంట్ అంటూ సైకాలజీలో కోర్సులలో చెప్పే విషయాలను చిన్నతనంలోనే ఆకలింపు చెసుకునే అవకాశం ఈ స్కౌట్ మూమెంట్ ఇస్తుందని గట్టిగా నేను చెప్పగలను. ముఖ్యంగా ఇప్పుడు కొరవడుతున్న సార్వత్రిక ఆమోదాన్ని అర్ధం చేసుకోగలిగే స్థాయికి ఎదుగుతారని చెప్పగలను.

ఇప్పుడు మాత్రం అవే కదా!

తమ స్వార్ధం కోసం మాత్రమే ఈ మూమెంట్ ని ఉపయోగించికున్న వ్యక్తుల కారణంగా దీనికి అప్పట్లోనే ఒక చెడ్డపేరు ఊండేది. ముఖ్యంగా కొందరు పని గట్టుకుని తాము పని తప్పించుకుంటూ తమ చేతకాని తనాని కప్పిపుచ్చుకుంటూ అదే విధానాన్ని కొనసాగించాలనే స్వార్ధంతో ఈ విలక్షణమైన మూమెంట్ గురించి దుష్ప్రచారం చేసిన సంఘటనలూ అనేకం.

దీన్ని ప్లాగ్ మాస్ట్ అంటారు. జాతీయ పతాకం లేదా స్కౌట్ పతాకం ఎగురవేయడానికి టెంపరరీగా కట్టుకునే పోల్

పిల్లల క్రమశిక్షణ పట్ల జాగురూకత, భాద్యత లేని అద్యాపకుల కారణంగా కాంప్ లో పిల్లలు కొంత అతిగా ప్రవర్తించిన సంఘటనలూ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం కార్పరేట్ కాలేజీలలో పిల్లలు చేస్తున్నవి అవే కదా. అక్కడా అధ్యాపకులు వారిని ఏ మాత్రం కంట్రోల్ చేయగలుగుతున్నారు? అసలు ఆ దిశగా వారు ఏ మాత్రం ప్రయత్నిస్తున్నారో చెప్పండి?

క్రియేటివిని పెంచుకోవడానికి ముఖ్యంగా  భాషా పటిమను పటిష్టం చేసుకోవడానికి ఈ ఉద్యమం నాకు చాలా సహాయపడింది.

ఇన్నిటి మధ్య కూడా ఈ మూమెంట్ అంటే నాకు చాలా ప్రేమ ఉండేది. వ్యక్తిగతంగా నా ఉన్నతిలో దీనికీ ఒక భాగస్వామ్యం ఉందని నేను ఒప్పుకుంటాను. మనుషులను దగ్గరనుండి గమనించడానికి, క్రియేటివిని పెంచుకోవడానికి ముఖ్యంగా  భాషా పటిమను పటిష్టం చేసుకోవడానికి ఈ ఉద్యమం నాకు చాలా సహాయపడింది. అలాగే కొందరు విలక్షణమైన వ్యక్తులనూ పరిచయం చేసింది.

ఒక రకమైన బంజారా జీవితం పరిచయమౌతుంది!

చాలా సందర్భాలలో స్కౌట్ కాంపులు ప్రకృతి మధ్యలో జరుగుతాయి. పెద్ద మైదానాలలో అప్పటికప్పుడు టెంట్లు కట్టి ఈ కాంప్లు నిర్వహిస్తారు. అక్కడ ఏ విలాసవంతమైన సౌకర్యాలు ఉండవు. నాగరిక జీవితానికి అలవాటు పడిన వారికి ఒక రకమైన బంజారా జీవితాన్ని ఈ కాంప్లు పరిచయం చేస్తాయి. ఆరుబైట చలిలో, వానలో అన్ని కార్యక్రమాలు నిర్దేశించినట్లు జరగవలసినదే. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా అక్కడ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా మనం అనుకున్నట్లుగా ఏమీ ఉండవు. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మనలను మనం, మన కార్యక్రమాలను మనం నిముషంలో మార్చుకోగలగాలి. ఇది మొదట కొంత ఇబ్బందిగా ఉన్నా,  అ చాలెంజ్ నాకు భలేగా అనిపించేది. ఎంతగా నన్ను నేను సిద్దపరుచుకునే దాన్ని అంటే ఆడియన్స్ ని చూసి స్టేజి చూసి జనం మూడ్ చూసి పిల్లలను నిముషంలో ఆ వాతావరణానికి అనుకూలంగా తయారు చేసుకునేదాన్ని. ఇది ఆ తరువాత నాకు నా ఇతర కార్యక్రమాలకు, నా వ్యక్తిగత ఎదుగుదలకు చాలా ఉపయోగపడింది.

ఇప్పడు ఎంత పెద్ద కార్యక్రమమయినా, ఎందరు ఆడియన్సు ఉన్నా, ఒక్క సబ్జెక్ట్ మాత్రమే మనసులో పెట్టుకుని అప్పటికప్పుడు దాన్ని ఓ టాక్ గా మార్చుకోగలుగుతున్నానంటే దానికి నా స్కౌట్ అనుభవమే నన్ను సిద్దం చేసిందనాలి. లైవ్ గా దృశ్యమాధ్యమంలో ఎక్కడయినా, ఎప్పుడన్నా, మాట్లాడాలన్నా, విషయాన్ని ఒక ఐదు నిముషాల ముందు మాత్రమే చెప్పినా కూడా చాలా కూల్ గా ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఓ గంట కార్యక్రమంగా దాన్ని అప్పటికప్పుడు నిర్వహించగలను నేను. నాకున్న విషయ పరిజ్ఞానాన్ని అప్పటికప్పుడు ఆ ప్రత్యేక విషయానికి అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడే మెధడుకి పని చెప్పి ఓ కంక్లూషన్ తయారు చేసుకోగలను. ఈ శక్తి నాలో ఉన్నదని ఈ స్కౌట్ కాంప్లకు వెళ్ళేదాకా నాకు తెలీదు.

ముందస్తు స్క్రిప్ట్ ఎప్పుడూ తయారు చేసుకోవలసిన అవసరం నాకు కలుగలేదు. తయారు చేసి ఇచ్చిన్ స్క్రిప్ట్ ని అప్పటికప్పుడు ఆడియన్స్ ని అనుకూలంగా మార్చుకోగలను. దీనికి నా స్కౌట్ ట్రైనింగ్ కారణం అన్నది మాత్రం నిజం.

ప్రతికూల పరిస్థితులలో నేను చేసిన స్కౌట్ కార్యక్రమాలు నాలో ఈ శక్తిని వెలికి తీసుకొచ్చాయి. అదే నా వ్రాతలలోనూ మాటలలోనూ ఇప్పుడు కనిపిస్తుంది. దీని వలన పెద్ద తయారీ లేకుండా ఎటువంటి కార్యక్రమం అన్నా, భయం లేకుండా, బెరుకు లేకుండా అక్కడి స్థితిని చూసి నిర్వహించడం నాకు అలవాటయింది.

నేను చేసే ఏ కార్యక్రమానికి ఇస్తున్న స్పీచ్ కి రాస్తున్న ఏ వ్యాస్యానికి కూడా ముందస్తు స్క్రిప్ట్ ఎప్పుడూ తయారు చేసుకోవలసిన అవసరం నాకు కలుగలేదు. తయారు చేసి ఇచ్చిన్ స్క్రిప్ట్ ని అప్పటికప్పుడు ఆడియన్స్ ని అనుకూలంగా మార్చుకోగలను. దీనికి నా స్కౌట్ ట్రైనింగ్ కారణం అన్నది మాత్రం నిజం.

ఏ యూనివర్సిటీలు ఇవ్వలేని ట్రైనింగ్

అలాగే మూడు భాషలలోనూ కొద్దో గొప్పో పరిజ్ఞానం సంపాదించానంటే కారణం నేను కెరీర్ మొదట్లో చేసిన స్కౌట్ కార్యక్రమాలే. నేను చదివింది ఇంగ్లీషు మీడియంలో, ప్రధమ భాష తరువాత యూనివర్సిటీ స్థాయి విద్య అంతా కూడా హిందీలో, ఇప్పుడు రాస్తున్నది తెలుగులో, ఏ భాషలో మాట్లాడుతున్నా, రాస్తున్నా మెదడు ఆటొమెటిగ్గా అనువాదం చేసుకుంటూ పోతుంది. ఇద్ కాంప్ కార్యక్రమాల వలన నేను పొందిన స్కిల్. అందువలన ఆడియన్స్ స్థాయిని, ప్రాంతాన్ని బట్టి స్టీజీపై అప్పటికప్పుడు భాషను మార్చుకుని మాట్లాడగలిగే శక్తి వచ్చింది. తెలుగులో ప్రిపేర్ అయి ఓ కార్యక్రమాన్ని తయారు చేసుకుంటే, అప్పటికప్పుడు వచ్చిన వారిని చూసి భాష మార్చుకుని వ్యాఖ్యానాన్ని మార్చుకొన్న సందర్భాలు నన్ను చాలా రాటు దేల్చాయి. ఇది ఏ యూనివర్సిటీలు మనకివ్వలేని ట్రైనింగ్. స్కౌట్ అండ్ గైడ్స్ మూమెంట్ మాత్రమే ఇవ్వగలదు.

ఇప్పటి తరం పిల్లలకి ఈ నేల మీద ఆ కాస్త జాగాలోనే పడుకుని, అక్కడే పనిచేసుకుని తమను తాము ఆ కఠిన పరిస్థితులకు సన్నద్దం చేసుకోవడం జీవితాన్ని ఎంత సుగమం చేస్తుందో తెలియదు.

స్టేజి ఎలా ఉంటుందొ తెలియకుండా కూడా కల్చరల్ ప్రోగ్రాములకి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఈ మూమెంట్ ను సరిగ్గా వాడుకున్న పిల్లలు ఇప్పటి కార్పరేట్ పిల్లలు ఊహించలేని స్కిల్స్ తో బైటికి వచ్చారు. చాలా మంది ఇవేం కూటికా గుడ్డకా అని కొట్టేస్తారు కాని జీవితాన్ని సౌకర్యంగా మరల్చుకోవడానికి ఈ మూమెంట్ పిల్లలని ఎలా రాటు దేలుస్తుందో ప్రత్యక్ష్యంగా అనుభవిస్తే కాని అర్ధం కాదు. విలాసాలను కనీస సౌకర్యాలుగా అలవర్చుకున్న ఇప్పటి తరం పిల్లలకి ఈ నేల మీద ఆ కాస్త జాగాలోనే పడుకుని, అక్కడే పనిచేసుకుని అక్కడే కొత్త విషయాలు నేర్చుకోవలసిన విధంగా తమను తాము ఆ కఠిన పరిస్థితులకు సన్నద్దం చేసుకోవడం జీవితాన్ని ఎంత సుగమం చేస్తుందో తెలియదు. ముఖ్యంగా ఏ.సీ క్లాస్ రూమ్ లలో చదువుకుంటున్న ఈ తరానికి ఇది జీవితంలో ఎప్పటికీ అందని స్కిల్.

బైట నాలుగు రాళ్ళు పెట్టి టీ కాచుకోవడం, అన్నం వండుకోవడం, ఒకోసారి పొయ్యి మీద వండలేనప్పుడు పచ్చి కూరగాయలతో కూర తయారు చేసుకోవడం ఇవి మనిషిని సంపాదనాపరుడిగా చెయకపోవచ్చు కాని జీవితంలో చిన్న చిన్నవాటికి బెదిరిపోయే లక్షణాలకు దూరంగా ఉంచుతాయి.

స్కౌట్ పతాకంతో స్కౌట్శ్ అండ్ గైడ్స్

ఈ ట్రైనింగ్ ఎటువంటి పరిస్థితులలో కూడా ఒకే రకంగా ఉండగలిగేలా నన్ను సంసిద్దం చేసింది. ఓ బకెట్ నీళ్ళతో స్నానం చేయవచ్చు. అరబకెట్ తో కూడా అంతే శుభ్రంగా స్నానం చేయవచ్చని ఏ కాలేజీలు నేర్పించవు కదా.

మనకు లేని వాటికోసం ఏడుస్తూ, ఉన్న వాటిని విస్మరిస్తున్న అధునిక తరానికి ఇది తప్పకుండా నేర్పించవలసిన విద్య అనిపిస్తూ ఉంటుంది. ప్లాట్ ఫారంల మీద, రిటైరింగ్ రూమ్ లలో నిద్రపోయి మరుసటి రోజు కార్యక్రమానికి సిద్దపడుతున్నప్పుడు విలాస యాత్రలలో కూడా, ఏ.సీ గది దొరకలేదని, నిద్రపట్టలేదని, మంచి తిండి లేదని అందుకని ఎంజాయ్ చేయలేకపోయాము అని లక్షలు పెట్టి టూర్లు అరెంజ్ చేసుకుని ఏడుపు మొహాలతో టూరంతా తిరిగే వాళ్ళని చూసినప్పుడు ఒక్క సారి స్కౌట్ కాంప్ కి తీసుకెళ్ళి చూపించాలని పిస్తుంది.

ఏ స్థితిలో కూడా భయపడకుండా ముందుకు దూసుకువెళూతూ పని చేస్తూ అదే రకమైన రిజల్ట్ ను రాబట్టుకోవడం నాకు స్కౌట్ ట్రైనింగ్ నేర్పించింది. ఎందుకంటే నేను కూడా ఉన్నంతలో అతి గారాబంగా పెరిగినదాన్నే. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులని ఇటువంటి కాంప్ లకు ముందు నేను అనుభవించలేదు. అవి ఆ తరువాత ఇచ్చిన అనుభవంతో ఇప్పుడు కనీస వసతులు లేని సందర్భాలలో కూడా అంతే సంతోషంగా ఉండగలిగే స్థితిలో నన్ను నేను సంసిద్దం చేసుకోగలను.

ఆయనకున్న నిబద్దత నేను ఎవరిలోనూ చూడలేదు!

ఈ స్కౌట్ మూమెంట్ లో నేను బాగా గౌరవించినది గణాతే సర్ ని. తొంభై ఏళ్ళు పైగా జీవించిన ఆయన దగ్గర నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి.

ఆయన దగ్గర విపరీతమైన ఓపిక ఉండేది. మనుష్యులను వారి బలహీనతలతో పాటూ స్వీకరించగల గుణం ఉండేది. అతి సింపుల్ గా చివరిదాక జీవించిన వ్యక్తి ఆయన. స్కౌటింగ్ మూమెంట్ తో తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకుని, కొంత సంపాదించుకుని కొందరు, ఉద్యోగం వచ్చాక ఇక మళ్ళి కాంపుల జోలికి రాని ఈ మూమెంట్ కు పనికి రాని డిగ్నిపైడ్ జనరేషన్ మధ్య ఈయన రిటైరైన ఇరవై సంవత్సరాల దాకా కాంపులకు వెళ్తూనే ఊండేవారు. అన్ని రకాల వాతావరణాలలో, అన్ని రకాల జనం మధ్య గడుపుతూ ఉండేవారు.

నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులలో గణాతే సర్ ఒకరు. జీవన విధానాన్ని పంచుకోవడంలోని ఆనందాన్ని వారిలో చూసాను.

నిజం చెప్పాలంటే సామాజిక జీవిన విధానంలో దగ్గరతనం అనుభవించిన వారు ఈ జీవితాన్ని ప్రేమిస్తారు. ఆ మూమెంట్ పట్ల ఆయనకున్న నిబద్దత నేను ఎవరిలోనూ చూడలేదు. ఆయన ఇన్పిరేషన్ తో ఈ మూమెంట్ ని సీరియస్ గా తీసుకుని మంచి పౌరులుగా తయారయిన వాళ్ళు అరకొరగా అక్కడొకరు ఇక్కడొకరుగా ఉన్నారు. ఇతరులకే ఇబ్బంది వచ్చినా వీరు నిస్వార్ధంగా పరుగెత్తుకుని వచ్చి సహయం అందించగలరు. ఆ లక్షణాలను యూనివర్సిటి విద్య మాత్రమే అందించలేదు. జీవన విధానాన్ని పంచుకోవడంలోని ఆనందాన్ని గణాతే సర్ గారిలో చూసాను. నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులలో ఆయన ఒకరు.

బురదలోంచి వికసించిన కమలాలు

నాకేంటి, నాకెందుకు, తిన్నామా, పడుకున్నామా తెల్లారిందా అన్న విధంగా బ్రతికే జీవితాలలో నిస్సారత గమనింపు కొచ్చాక ఈ మూమెంట్ పట్ల ప్రేమ ఇంకా పెరిగింది. ఈ స్కౌట్ లో రాజకీయాలను భరించలేక  కొన్ని రోజులు దూరంగా ఉన్నా మళ్ళీ స్కౌట్ గైడ్ ఫెలోషిప్ లో చేరి నా ఆనాటి స్కౌట్ జీవితాన్ని తిరిగి కొనసాగించడం ఇష్టంగా చేస్తున్నాను.

రేంజర్లతో కెంప్ లో కట్టుకున్న హైదరాబాద్ గేట్ దగ్గర గణాతే సర్

ఏ ఉద్యమం తప్పు ఉద్దేశంతో మొదలవదు. మనుషులే దాన్ని కలుషితం చేస్తారు. బురదలోనించే కమలాలు పుట్టినట్లు ఈ స్కౌట్ ఉద్యమంలో కొన్ని కమలాలు ఉదయించాయి. అవి పరిపూర్ణంగా జీవించాయి. ఇతరులకు ఆ స్వచ్చతను పంచాయి. అందులో గణాతే సర్ ఒకరు.

వాలంటీరింగ్ లాంటి పెద్ద పెద్ద కార్పరేట్ పదాలను వాడుతూ ఇప్పుడు పర్సనాలిటీ డెవలెప్మెంట్ క్లాసుల రూపంలో అవి నేర్పిస్తున్నప్పుడు ఈ లక్షణాన్ని చిన్న వయసులోనే మనసులోకి ఎక్కించే స్కౌట్ మూమెంట్ పట్ల తిరిగి ప్రేమ కలుగుతుంది. ఈ మూమెంట్ ని తమ స్వార్దం కోసం ఉపయోగించుకున్న వారు వారి జీవితాలలో మానవతావాదంతో ఎదగకపోవడం చూసినప్పుడు ఒకప్పుడు వారిమీద కోపం వచ్చేది, ఆ కోపంతోనే ఈ మూమెంట్ కి కొంత కాలం దూరంగా ఉన్నా నాలో ఈ మూమెంట్ వెలికి తీసుకుని వచ్చిన స్కిల్స్ కారణంగా గౌరవం పొందుతున్న ప్రతి సారి ఈ ఉద్యమం పట్ల ప్రేమ పెరుగుతూనే ఉంది. ఏ ఉద్యమం తప్పు ఉద్దేశంతో మొదలవదు. మనుషులే దాన్ని కలుషితం చేస్తారు. బురదలోనించే కమలాలు పుట్టినట్లు ఈ స్కౌట్ ఉద్యమంలో కొన్ని కమలాలు ఉదయించాయి. అవి పరిపూర్ణంగా జీవించాయి. ఇతరులకు ఆ స్వచ్చతను పంచాయి. అందులో గణాతే సర్ ఒకరు.

గణాతే సర్ తర్వాత వారికే నా సెల్యూట్ !

పిల్లలతో రమేష్ చందర్ సర్

రమేష్ చందర్ అనే మరో సర్ యాభై సంవత్సరాల నుండి మహాత్మగాంధి ఓపెన్ యూనిట్ అని ఓ చిన్న స్కౌట్ యూనిట్ ని సికింద్రాబాదులో నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆ మూమెంట్ పట్ల ఆదరణ తగ్గినా, రైల్వేలో ఉద్యోగాల నియామకం మందగించినా అన్నిటికి అతీతంగా ఆయన ఇంకా ఈ ఉద్యమంలో పని చేస్తూనే ఉన్నారు. ఎనభైలకు చేరువ అవుతున్నా ఆ మూమెంట్ పై ఆయనకున్న ప్రేమ తగ్గలేదు.

ఈయనకు పెద్ద భాషా పటిమ లేదు. కొందరు ఆయన వెనుక నవ్వుకుంటారు కూడా. కాని నాలాంటి కొందరికి చిన్న పిల్లలను ఒక యీనిట్ గా తీసుకుని వారికి ఇంకా ఈ ఉద్యమ ఆత్మను పరిచయం చేయాలనుకునే వీరి నిబద్దతకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది.

డాంబికమైన మనుషులందరినీ గమనించి వారి మారిన బుద్దులను, మాటలను చూసిన తరువాత నా లాంటి వారికి వాళ్ళు పిపీలికలుగానే కనిపిస్తారు. నిజమైన హీరోలు ఈ రమేష్ చందర్ సార్ లాంటి వారే…

స్కౌట్లో కొన్నాళ్ళూ పని చేసి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిప్పించి, ఆ ఉద్యమం వలన పొందగలిగిన లాభాలు పొంది ఇప్పుడు మేము వీటన్నిటికీ అతీతం అంటూ హిపొక్రిటికల్ గా బ్రతుకున్న గొప్పవారి మధ్య ఆయన ఇప్పటికీ చిన్న పిల్లల మధ్య ఒక స్కౌట్ మాస్టర్ గా వాలంటరీగా పని చేస్తూ కోడి తన పిల్లలను చుట్టు పెట్టుకుని తిండి ఏరుకోవడం నేర్పిస్తున్నట్లు యాభై సంవత్సరాలుగా నిరంతరం పిల్లలతో కలిసి స్కౌట్ మూమెంట్ ని బ్రతికిస్తున్నారంటే ఆయన పట్ల చాలా గౌరవం కలుగుతుంది. ఎందరో ఆయనను దాటుకుని వెళ్ళిపోయారు. కాని ఆయన, ఆయన పిల్లలు, ఆయన మహాత్మా గాంధి యూనిట్ అంతే ఒద్దికగా, అంతే నిరాడంబరంగా ఇప్పటికీ నిలిచిఉన్నాయి.

డాంబికమైన మనుషులందరినీ గమనించి వారి మారిన బుద్దులను, మాటలను చూసిన తరువాత వారెంత పై స్థాయిలో ఉన్నామని భ్రమసినా నా లాంటి వారికి వాళ్ళు పిపీలికలుగానే కనిపిస్తారు. నిజమైన హీరోలు ఈ రమేష్ చందర్ సార్ లాంటి వారే, ఆ గణాతే సార్ లాంటి నిస్వార్ధ జీవులే.

అది గోదావరి తప్పు కాదు కదా!

వయసు ఇచ్చిన మెచ్యూరిటితో మనుష్యులను గమనించినప్పుడు ఇలాంటి వారి మధ్య కొంత కాలం గడిపినందుకు, కొంత నేర్చుకున్నందుకు ఆనందంగా ఉంటుంది.

స్కౌటింగ్ మూమెంట్ ఆ గోదావరిలాంటిదే, మీరేం తెచ్చుకున్నారు, దేనికి తెచ్చుకున్నారు, ఆ నీటిని ఎలా వాడుకున్నారు అన్నది మీ వ్యక్తిత్వాలను బట్టి ఉంటుంది.

కన్నడ రచయిత బైరప్ప రాసిన్ ‘వంశ వృక్ష’ నవలను సినిమాగా తీసిన బాపు గారు ఒక డైలాగ్ సోమయాజులుగారితో ఇదే అర్ధంతో చెప్పిస్తారు. గోదావరిలో నీళ్ళెప్పుడూ ఉంటాయి. చెంబుతో వచ్చిన వారికి చెంబుడు, బిందెతో వచ్చిన వారికి బిందె నీళ్ళూ తీసుకోవచ్చు. ఏమీ లేకుండా వచ్చి నాకేమీ దొరకలేదంటే అది గోదావరి తప్పు కాదు కదా! స్కౌటింగ్ మూమెంట్ ఆ గోదావరిలాంటిదే.

అమె ఒక నిరంతర ప్రవాహం. నదిగా ఆ తల్లి నిరంతరం పారుతూనే ఉంటుంది. ఆమె స్వచ్చతలో ఎటువంటి కల్మషం లేదు. కల్మషం మనుషులదే… వారి మనసులదే.

రచయిత్రి పి. జ్యోతి హిందీ ఉపన్యాసకులు. చక్కటి సమీక్షకురాలు. హైదరాబాద్ లో పుస్తకాల పట్ల అభిరుచి పెంచడంలో విశేషంగా కృషి చేస్తున్న spreading Lights నిర్వాహకురాలు కూడా. పుస్తకం, సినిమా తనకు రెండు కళ్ళు. ప్రపంచానికి గవాక్షాలు. తెలుపు కోసం రాస్తున్న ఈ శీర్షికలో తాను మొదటిసారిగా అంతర్ముఖంలోకి చూసుకుంటున్నారు. జీవితాన్నే పుస్తకంగా అనుభవాలనే చలన చిత్రంగా ఎంచి సరళమూ, నిరాడంబరమూ, సామాన్యమూ ఐన జ్ఞాపకాలను ఆత్మీయంగా పంచుకుంటున్నారు. ఈ శీర్షికలో మొదటి వ్యాసం మనసు పొరల్లో. రెండో వారం చిన్ననాటి చిరుతిళ్లు. మూడో వారం చిన్ననాటి సంగతులు. నాలుగో వారం పంచుకోవడంలో అనందం. ఐదో వారం ఒంగోలు గిత్తలు ….మా తాత. ఆరో వారం ‘చందమామ’తో మొదలు.  ఏడో వారం ఎవరు రౌడీలు? ఎవరు మర్యాదస్తులు??. ఎనిమీదో వారం నాకు తెలిసిన స్త్రీ వాది – My First Feminist. మీరు చదువుతున్నది తొమ్మిదో వారం జ్ఞాపకాలు.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article