Editorial

Monday, May 13, 2024
కాల‌మ్‌ఈ వారం మంచి పుస్తకం : మాధురి పురందరే 'ఒక వేసవి రోజు'

ఈ వారం మంచి పుస్తకం : మాధురి పురందరే ‘ఒక వేసవి రోజు’

‘కమింగ్ ఆఫ్ ఏజ్’ జానర్‌లో ‘ఒక వేసవి రోజు’ వంటి ఇంత చక్కటి భారతీయ కథ నా ఎరుకలో మరొకటి లేదు.

కొసరాజు సురేష్

1989లో బాల సాహితి ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి పిల్లల పుస్తకాలతో ప్రత్యేక అనుబంధం మొదలయ్యింది. అప్పట్లో బాల సాహితి ద్వారా సుమారు 40 పుస్తకాలు ప్రచురించాం. పిల్లల పుస్తకాలతో పనిని ‘మంచి పుస్తకం’ ట్రస్ట్ ద్వారా 2002 తిరిగి మొదలుపెట్టాం.

బాల సాహితి కోసం పుస్తకాలను నేను అనువాదం చెయ్యకూడదన్న నియమం పెట్టుకున్నాను. అందుకు విరుద్ధంగా మంచి పుస్తకం కోసం నేను చాలా అనువాదాలు చేశాను. నాకు అనువాదం చెయ్యాలనిపించి, ముందుగా దానికి ప్రచురణ కర్త ద్వారా అనుమతి తీసుకోవాల్సినప్పుడు మంచి పుస్తకం నుంచి ఆ పని చేశాను. ఆ రకంగా చేసిన అనువాదాల్లో ‘పరుసవేది’ కూడా ఉంది.

మంచి పుస్తకం కోసం నేను చేసిన పిల్లల పుస్తకాల అనువాదాలలో ఈ వారం మాధురి పురందరే రాసిన ‘On that Day’ కి అనువాదం అయిన ‘ఒక వేసవి రోజు’ గురించి ప్రస్తావిస్తాను.

మాధురి పురందరే చిత్రకళలో శిక్షణ పొందారు. ఆ విధంగా బొమ్మలు వెయ్యటమే కాకుండా పిల్లల కోసం రాస్తూ రచయిత్రిగా పేరుతో పాటు అనేక బహుమతులు పొందారు. ఈ పుస్తకానికి వేసిన నలుపు-తెలుపు స్కెచ్ బొమ్మలు చాలా బాగున్నాయి. మాధురి పురందరే గురించి మరిన్ని వివరాల కోసం ఈ లంకె చూడండి-

కాగా, ఈ పుస్తకంలో రెండు పెద్ద కథలు ఉన్నాయి – ఒక వేసవి రోజు, క్రియా కలాపం.

ఒక వేసవి రోజు

ఒక వేసవి రోజులో కథను మనకు పదమూడేళ్ల గౌతమ్ చెబుతుంటాడు. అతను 9వ తరగతి పూర్తి చేసి 10కి వచ్చాడు. తరవాత కుదరదని శలవల్లో మేనత్త ఇంటికి వెళ్లి రావాలని అనుకుంటారు. ఉద్యోగస్థులైన తల్లిదండ్రుల మధ్య గొడవలు, మనస్పర్థలు ఉంటాయి. వాళ్ల మధ్య మాటలు లేనప్పుడు గౌతమ్ వాళ్లకి వారధి. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులను గౌతమ్ ముందు ఉంచుతుంటారు. ఇదంతా గౌతమ్‌కి బాధగా, కోపంగా ఉంటుంది. శలవలకని అన్ని సర్దుకుని తీరా మేనత్త ఇంటికి బయలుదేరే ముందు ఆఫీసులో పని ఉందని తల్లి ఆగిపోతుంది.

వెనక సీట్లో ఉన్న గౌతమ్ తలని కిందకి నొక్కి పెట్టి, కత్తితో గౌతమ్ తండ్రిని బెదిరించి పోలీసులు తమ కారుని తనిఖీ చెయ్యకుండా ఒక బస్సు పక్క నుంచి కారుని చాకచక్యంగా తప్పించేలా చేస్తాడు నేరస్థుడు.

దాంతో తండ్రీ, కొడుకులు ఇద్దరే కారులో బయలుదేరతారు. తండ్రి చాలా పరధ్యాసగా, ఆలోచనలో ఉంటాడు. నాస్తా కోసం రెస్టారెంట్ దగ్గర ఆగినప్పుడు పోలీసులు ఎవరి కోసమే వెదుకుతున్నారని గౌతమ్‌కి అర్థం అవుతుంది. ఎవో ఆలోచనల్లో ఉన్న గౌతమ్ తండ్రి ఇదేమీ పట్టించుకోడు. దారిలో కారు పంక్చర్ అయితే ఒక వ్యక్తి సహాయ పడతాడు. రహదారి మీద దగ్గరలో ఏమీ లేని ఆ ప్రదేశంలోకి అతను ఎందుకు ఉన్నాడో గౌతమ్‌కి అర్థం కాదు. నల్ల కళ్లద్దాలు ఉన్న ఆ వ్యక్తిని గౌతమ్ అనుమానంగా చూస్తుంటాడు. పోలీసులు ఇతని కోసమే వెదుకుతున్నారేమోనని గౌతమ్ సందేహం. పంక్చరు వేసిన తరవాత అతనిని వదిలించుకోగలిగితే బాగుంటుందని గౌతమ్ అనుకుంటుంటే తాము వెళ్లే దారిలోనే అతని వెళుతుంటే దింపుతానని గౌతమ్ తండ్రి అతనిని కారులోకి ఎక్కించుకుంటాడు. భార్యతో గొడవపడటం వల్ల అన్యమనస్కంగా ఉన్న తండ్రి ఏదీ పట్టించుకునే స్థితిలో లేడు. అలాగే,  గౌతమ్ ఆందోళనని గుర్తించే స్థితిలో కూడా లేడు.

అలా వాళ్లు వెళుతుండగా వాహనాలను ఆపి పోలీసులు తనిఖీ చేస్తున్నారని తెలుస్తుంది. అప్పుడు కారులో ఉన్న అపరిచితుడు తానెవరో చెప్పుకోవాల్సి వస్తుంది. గౌతమ్ అనుమానమే నిజమయ్యి అతను జైలు నుంచి తప్పించుకున్న నేరస్థుడని, అతని పేరు విద్యాధర్ అనీ తెలుస్తుంది. వెనక సీట్లో ఉన్న గౌతమ్ తలని కిందకి నొక్కి పెట్టి, కత్తితో గౌతమ్ తండ్రిని బెదిరించి పోలీసులు తమ కారుని తనిఖీ చెయ్యకుండా ఒక బస్సు పక్క నుంచి కారుని చాకచక్యంగా తప్పించేలా చేస్తాడు నేరస్థుడు. ఆ తరవాత తనని ముంబయిలో దింపమంటాడు. గౌతమ్ తండ్రికి మరో గత్యంతరం లేని పరిస్థితి.

నేను రావటం ఆలస్యం అవుతుందని మా చెల్లికి ఫోన్ చేసి చెపుతానని అంటాడు గౌతమ్ తండ్రి. బాగా గుర్తు చేశావు, తప్పించుకుందామనో, ఈ విషయం చెపుదామనో అనుకుంటున్నావేమో, నీ ఫోను నాకు ఇవ్వు అంటాడు విద్యాధర్. ఫోన్ కోసం చూస్తే అది అతని దగ్గర లేదని గౌతమ్ తండ్రికి తెలుస్తుంది. నాస్తా కోసం ఆగినప్పుడు తండ్రి మొబైల్ గౌతమ్‌ చేతికి వచ్చింది. అయితే ఫోన్‌ని రెస్టారెంట్ దగ్గర మరిచిపోయినట్టున్నావు అని సమయస్ఫూర్తితో గౌతమ్ అంటాడు. ఆ విధంగా నేరస్థుడి చేతికి ఫోన్ వెళ్ల కుండా చేస్తాడు గౌతమ్.

తండ్రి పక్కన ఉంటే పిల్లలకి భద్రంగా అనిపించాలి, ఈ రోజు గౌతమ్ తండ్రి స్థానాన్ని తీసుకుని తనకు రక్షగా ఉన్నాడని మెచ్చుకుని, తాను బాధ్యతారహితంగా ఉన్నందుకు క్షమించమని కొడుకుని అడుగుతాడు.

ఆ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో ఉండటం గౌతమ్ అదృష్టం. ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న గౌతమ్‌కి దారిలో అతను చూసిన పోలీసుల ప్రకటన గుర్తుకు వస్తుంది. పోలీసులు వెదుకుతున్న నేరస్థుడు తమ కారులో ఉన్నాడని ఆ నంబరుకి సందేశం పంపిస్తాడు గౌతమ్. పోలీసులు తనను నమ్ముతారా అన్న అనుమానం అతనికి ఉంటుంది. కానీ పోలీసులు ఫోన్ చేస్తారు. మాట్లాడటానికి వీలు లేదు కాబట్టి ఫోన్ కట్ చేసి ఎస్ఎంఎస్‌ల ద్వారా మొత్తం విషయం తెలియ చేస్తాడు. పోలీసుల సూచనలతో పెట్రోలు పోయించుకోవాలని నాన్నకి గుర్తు చేసి దారిలోని పెట్రోలు బంకులోకి వెళ్లేలా చేస్తాడు గౌతమ్.
మారు వేషంలో ఉన్న పోలీసులు గౌతమ్ తండ్రితో గొడవ పెట్టుకుని అతనిని కారులోంచి బయటకు లాగుతారు. అదే సమయంలో గౌతమ్ కారు వెనక తలుపు తీసుకుని బయటకు దూకుతాడు. అప్పుడు నేరస్థుడిని పోలీసులు బంధిస్తారు. పెట్రోలు బంకులోకి ప్రవేశించినపుడు తాను ఊహించుకున్నట్లు అక్కడ పోలీసులు లేకపోవటంతో గౌతమ్ తమ ప్రణాళిక వృధా అయ్యిందని అనుకుంటాడు. తప్పనిసరి పరిస్థితులలో నేరస్థుడు ఎంతకైనా తెగిస్తాడని తెలిసిన గౌతమ్‌కి, అతని తండ్రికి ఎలాంటి హాని జరగకుండా పోలీసులు పకడ్బందీ వ్యూహంతో అతనిని పట్టుకుంటారు. మొత్తం మీద గౌతమ్ తండ్రి అవినాష్‌తో జరిగినదానిని రాయించుకుని, గౌతమ్‌ని అభినందించి పంపించేస్తారు పోలీసులు.

తిరుగు ప్రయాణమవుతూ అత్త వాళ్ల ఇంటికి కాకుండా తమ ఇంటికే వెళ్లిపోదామంటాడు తండ్రి. తండ్రి పక్కన ఉంటే పిల్లలకి భద్రంగా అనిపించాలి, ఈ రోజు గౌతమ్ తండ్రి స్థానాన్ని తీసుకుని తనకు రక్షగా ఉన్నాడని మెచ్చుకుంటాడు అవినాష్, తాను బాధ్యతారహితంగా ఉన్నందుకు క్షమించమని కొడుకుని అడుగుతాడు.

తల్లిదండ్రులమైన మన మాటలు గౌతమ్ వినటం కాదు ఇప్పుడు అతని మాటలు మనం వినాల్సినంత పెద్దవాడు అయిపోయాడు అని తల్లి అంటుంది.

వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి ఒక సూట్‌కేసు సర్దుకుని ఇంటి నుంచి వెళ్లిపోటానికి సిద్ధంగా ఉంటుంది. తండ్రీ, కొడుకులు అలా అనుకోకుండా తిరిగి రావటంతో తల్లి తన నిర్ణయాన్ని మార్చుకుందని మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులమైన మన మాటలు గౌతమ్ వినటం కాదు ఇప్పుడు అతని మాటలు మనం వినాల్సినంత పెద్దవాడు అయిపోయాడు అని తల్లి అంటుంది.

గౌతమ్‌తో వాళ్ల తాతయ్య అన్న మాటలను గుర్తు తెచ్చుకోవటంతో ఈ కథ మొదలవుతుంది. పెద్దవ్వటం పిల్లల్ని మోసం చేస్తుందని… “నీకు పదమూడో, పద్నాలుగో సంవత్సరాలు వస్తాయి. నువ్వు పెద్దవాడివి అయిపోయావని అకస్మాత్తుగా గుర్తిస్తావు. అప్పుడు నీకు ప్రతిదీ వేరేగా అనిపిస్తుంది. ప్రతిదానిని వేరేగా అర్థం చేసుకుంటావు. నువ్వు తెలుసుకుంటావు…” అంటాడు తాతయ్య.

ఇదంతా జరిగిన రోజున తాతయ్య మాటలను గౌతమ్ మళ్లీ గుర్తు చేసుకుంటాడు. తనలో మార్పు అంతకు ముందునుంచే మొదలు అయ్యిందేమో కాని ఆ రోజు తన గమనికలోకి వచ్చిందని గౌతమ్ అనుకుంటాడు. అదీ అతనిని ద్వైదీభావంలో పడవేస్తుంది.

‘కమింగ్ ఆఫ్ ఏజ్’ జానర్‌లో ఇంత చక్కటి భారతీయ కథ నా ఎరుకలో మరొకటి లేదు.

క్రియా కలాపం

ఇప్పుడు ఇదే పుస్తకంలోని ‘క్రియా కలాపం’ (When I Met a Verb) అనే మరొక కథ కూడా మీరు తప్పక చదవాలి.

క్రియని కలుసుకున్నప్పుడు… అన్న వ్యాసం రాసుకుని రమ్మని ఏడవ తరగతి చదువుతున్న చిన్మయికి తెలుగు టీచర్ చెపుతారు. ఇలాంటి పిచ్చి వ్యాసం ఇచ్చినందుకు చిన్మయికి చాలా కోపంగా ఉంటుంది. కానీ తప్పనిసరి అయి ఆ వ్యాసం రాస్తుంది.

ఈ రెండు కథలలో దృశ్య వివరణ, సంభాషణలు, ఘటనలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. బాల సాహిత్యంలో మాధురి పురందరే చేసిన కృషికి ఎన్నో బహుమతులు అందుకున్నారు.

చిన్మయి అనుభవాలను ఒకొటొకటిగా గుది గుచ్చిన తీరుకి రచయిత్రిని ఎంతగానో అభినందించాలి. అయితే ఈ కథను నేను చెప్పను.

ఈ రెండు కథలలో దృశ్య వివరణ, సంభాషణలు, ఘటనలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. బాల సాహిత్యంలో మాధురి పురందరే చేసిన కృషికి ఎన్నో బహుమతులు అందుకున్నారు. ఆమె పలు పుస్తకాలు మరాఠీ (ఆమె మాతృ భాష)లో, ఇంగ్లీషులో ప్రచురితం అయ్యాయి కూడా.

2015లో తెలుగులో మొదట ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పుడు మూడవ ముద్రణకు వెళుతోంది. 88 పేజీల ఈ పుస్తకం వెల 50 రూపాయలు. కావాలనుకున్న వాళ్లు ఈ లింకు ద్వారా కొనుక్కోవచ్చు-

కాలమిస్టు పరిచయం

కొసరాజు సురేష్ పాత్రికేయులు, అనువాదకులు. ప్రభుత్వం ప్రభుత్వేతర  స్వచ్ఛంద సేవా సంస్థలో దశాబ్దాలు కృషి చేశారు. ప్రచురణా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. వారి అనువాదాల్లో ‘గడ్డిపరకతో విప్లవం’ మొదటిదైతే ఇప్పటిదాకా వారు చిన్న పెద్ద పుస్తకాలను వంద దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అందించారు. అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే.

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. తెలుపు కోసం వారు ఇప్పటిదాకా పరిచయం చేసిన పద్దెనిమిది పుస్తకాల కోసం ఈ లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. అక్కడి నుంచి ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకంలోకి వెళ్లి చదవొచ్చు. అందుబాటులో ఉన్న వాటిన్హి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు మెయిల్ చేయొచ్చు లేదా కింది వెబ్సైట్ చూడండి.

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article