Editorial

Saturday, April 27, 2024
కాల‌మ్‌మంచి పుస్తకం : కొసరాజు సురేష్

మంచి పుస్తకం : కొసరాజు సురేష్

మంచి పుస్తకం ఒక సంపద.

‘తెలుపు’ అందిస్తున్న సగౌరవ శీర్షిక

K Suresh

గడ్డి పరకతో విప్లవం

The One Straw Revolution: ఈ పుస్తకాన్ని అనువాదం చేసే అవకాశం లభించటం నా అదృష్టమే

One Starw Revolution  gaddiparakaluఅది 1990వ సంవత్సరం. నేను ఈనాడు దినపత్రికలోని రైతే రాజు కాలంకి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నాను. ఫిబ్రవరి నెలలో అనంతపురం జిల్లాలో పెనుగొండ మండలం, గుట్టూరులోని యంగ్ ఇండియా ప్రాజెక్టు (వైఇపి)లో భారత దేశంలో రెండవ పర్మాకల్చర్ డిజైనర్ సర్టిఫికెట్ కోర్స్ జరిగింది. అప్పటికి టింబక్టు కలెక్టివ్ కోసం భూమి కొన్నారు కానీ బబ్లూ, మేరీలు ఇంకా వైఐపి లోనే పని చేస్తున్నారు. ఆ కోర్స్‌కి అవసరమైన వాళ్లకి తెలుగు అనువాదం చేసే ఒప్పందం మీద నాకు కోర్స్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అదిగో, ఆ కోర్స్ లోనే Masanobu Fukuoka రాసిన The One Straw Revolution పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తే బాగుంటుంది అన్న ప్రతిపాదన వచ్చింది. అనువాద బాధ్యత నేను తీసుకోగా ప్రచురణ బాధ్యత టింబక్టు తీసుకుంది.

హైదరాబాదు తిరిగి వచ్చిన తరవాత పుస్తక అనువాదం మొదలుపెట్టాను. రైతే రాజు కాలంకి భాషాపరమైన ఎడిటింగ్, అవసరమైతే అనువాదాలు చెయ్యటం నా బాధ్యత. ఆ విధంగా అనువాద, భాషాపరమైన నైపుణ్యాలను నేను ఈనాడు లోనే నేర్చుకున్నాను. ఈనాడు లోని సబ్ ఎడిటర్లకి బూదరాజు రాధాకృష్ణ గారు అప్పుడు భాషకి సంబంధించి శిక్షణా తరగతులు తీసుకునే వారు. భాష అంశాలపై అంతర్గతంగా ఒక పత్రిక కూడా నిర్వహించేవారు. ఈ శిక్షణలో నేను ప్రత్యక్ష భాగస్వామిని కాకపోయినా పరోక్షంగా, ఏకలవ్యుని లాగా చాలా నేర్చుకున్నాను. బూదరాజు దగ్గర అప్పుడు పని చేస్తున్న సంపత్ మృదు భాషి, చాలా స్నేహంగా ఉండేవాడు. ఈ పుస్తక అనువాద విషయంలో చాలా సహాయం చేశాడు. అనువాదాన్ని మొత్తంగా సరిచూశాడు. అందుకే ఈ పుస్తకానికి అనువాదకులుగా మా ఇద్దరి పేర్లు ఉన్నాయి. అన్నట్టు, ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు రైతే రాజు కాలంలో ప్రచురితమయ్యాయి.

అప్పటికే నాకు హైదరాబాదులో సుబ్బయ్య మంచి స్నేహితుడయ్యాడు. అప్పటికీ, ఇప్పటికీ పుస్తక ముద్రణలో సుబ్బయ్యే నాకు వెన్ను దన్ను. కవర్ పేజీ డిజైన్ గంగాధర్ చేశారు. దానికి దొడ్డు కార్డు బోర్డు కోసం సిక్రింద్రాబాదులో సుబ్బయ్య, నేను చాలా దుకాణాలు తిరిగింది ఇంకా గుర్తు. అనుకున్నట్టుగానే పుస్తకం నవంబర్‌లో ప్రచురితమయ్యింది. దీనికి వెంకట్ ముందు మాట రాయటం, పస్తాపూర్‌లోని డెక్కన్ డెవలెప్‌మెంట్ సొసైటీలో బిల్ మోలిసన్ ఆవిష్కరించటం మరిచిపోలేని విషయాలు.

మొదటి ప్రచురణ మూడు వేల కాపీలు అమ్ముడుపోటానికి పది సంవత్సరాలు పైనే పట్టింది. ఇప్పుడు, ప్రత్యామ్నాయ వ్యవసాయం గురించి ఎక్కువ మంది ఆసక్తి చూపటంతో, రెండవ ముద్రణ నుంచి హెచ్‌బిటి ప్రచురించటం వల్ల అది ఆదరణ తగ్గని పుస్తకంగానే ఉంది.

అనువాదకునిగా నా పాత్ర రసాయనిక చర్యలోని కేటలిస్టు లాంటిదేమోనని అనుకుంటూ ఉంటాను.

సమాచార వ్యవస్థ, సోషల్ మీడియా అంతగా లేని 1990లలో ఏ సమావేశంలో పాల్గొన్నా ‘గడ్డి పరకతో విప్లవం’ చదివాం, బాగుంది అని చెప్పేవాళ్లు కనీసం ఒక్కరైనా ఉండేవారు. అది నాకు దక్కిన గౌరవం, మిగిలిన సంతోషం.

అనువాదకుడిగా పుస్తక రచయిత భావాలను యధాతధంగా అందించటానికి నేను ప్రయత్నిస్తాను. అయితే, తెలుగు పాఠకులకు అవసరం అనుకున్న చోట పాద సూచికలు ఇవ్వటం ఈ మొదటి అనువాదంతోనే మొదలయ్యింది.

రచయిత, మధ్యలో అనువాదకుడు, పాఠకులు- వీళ్లల్లో నేను పాఠకులకు పెద్ద పీట వేస్తాను. రచయిత చూడని కోణాన్ని పాఠకులు చూడటం కద్దు. రచయిత, అనువాదకులు రాసిన, అనువదించిన పుస్తకాన్ని మళ్లీ, మళ్లీ చదివే సందర్భాలు అంతగా ఉండవు. కాని పాఠకులు అలా కాదు, వాళ్లకి నచ్చిన పుస్తకాన్ని అనేకసార్లు చదువుతారు. ఈ పుస్తకం గురించి గాఢానుభూతితో మాట్లాడే పాఠకులు కలిసినప్పుడు నాకు కొంచెం సిగ్గుగా అనిపించేది. అనువాదకునిగా నా పాత్ర రసాయనిక చర్యలోని కేటలిస్టు లాంటిదేమోనని అనుకుంటూ ఉంటాను.

Do Nothing

Masanobu Fukuvoka

గడ్డి పరకతో విప్లవం తాత్వికత లోకి వెళ్లే ముందు మరొక విషయం చెప్పాలి. ఇంగ్లీషు లేదా తెలుగు అనువాదాలు చదివి ప్రభావితులై, తమ ఉద్యోగాలు వదిలి పెట్టి, ప్రకృతి వ్యవసాయం చెయ్యబోయి నష్టపోయిన వాళ్లు కొంతమంది ఉన్నారు. ‘ఏమీ చెయ్యనవసరం లేని’ (Do Nothing) వ్యవసాయంతో వీళ్లు ఆకర్షితులయ్యారేమోనని నాకు అనిపిస్తుంటుంది. మసనోబు ఫుకుఓకా పేర్కొన్న తన విధానానికి చేరుకోటానికి అతనికి 25 ఏళ్లు పట్టిందని, ఆ దారిలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడని చాలా మంది తొందరగా గుర్తించరు. అదీ కాక జపానుకీ, భారత దేశానికీ మధ్య ఉన్న సామాజిక, వాతావరణ తేడాల వల్ల అతని విధానాలను ఇక్కడ యధాతధంగా అమలు చెయ్యలేం. మూల సూత్రాలను ఆకళింపు చేసుకుని, ఇక్కడి పరిస్థితులకు అనువైన పద్ధతులను రూపొందించుకోవాలి. అందుకు ప్రకృతితో మమేకమయ్యే రైతు కావటమే కాకుండా శాస్త్రజ్ఞులు కూడా అయి ఉండాలి.

ఫుకుఓకా ఏమంటారంటే సాధారణంగా మానవ మేధస్సు ‘ఇది చేస్తే ఎలా ఉంటుంది’, ‘అది చేస్తే ఎలా ఉంటుంది’ అన్న పద్ధతిలో పని చేస్తుంటుంది. ఇందుకు విరుద్ధంగా ‘ఇది చెయ్యక పోతే ఏమవుతుంది’, ‘అది చెయ్యకపోతే ఏమవుంది’ అన్న ఆలోచనతో ప్రకృతిని పరిశీలిస్తూ, కాలానుగుణంగా పంటలు ఎలా పండించాలో అర్థం చేసుకోవాలని అతను అంటాడు. ఈ క్రమంలో పొలం దున్ననవసరం లేదని, ఎరువులు వెయ్యనవసరం లేదని, కలుపు తియ్యనవసరం లేదని, పురుగు మందులు చల్లనవసరం లేదని ఫుకుఓకా అర్థం చేసుకున్నాడు. ఈ ఏమీ చెయ్యనవసరం లేని వ్యవసాయం వెనక ఫుకుఓకా ఇరవై అయిదు ఏళ్ల కృషి ఉందని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ‘నన్ను అనుకరించడానికి ప్రయత్నించవద్దనీ, ప్రకృతితో జీవించటం నేర్చుకోమనీ ఇక్కడకొచ్చే యువతీ యువకులతో పదే పదే చెబుతుంటాను,’ అని ఫుకుఓకా అంటాడు.

‘నేను వ్యక్తిగతంగా ఏ మతానికీ చెందను,’ అని ఫుకుఓకా అంటాడు కానీ మహాయానా బౌద్ధ ప్రభావం అతని మీద గాఢంగా ఉందనిపిస్తుంది. ‘సంకుచిత సేంద్రియ వ్యవసాయ విధానం కత్తి యుద్ధంలో ఒక వేటు సిద్ధాంతం వంటిదని, ఆధునిక వ్యాపార సరళి వ్యవసాయం రెండు వేట్ల సిద్ధాంతం వంటిదని, అసలయిన ప్రకృతి వ్యవసాయం కత్తి వేటునే ఉపయోగించని సిద్ధాంతం వంటిదని,’ ఫుకుఓకా అంటాడు. ఇంకొక చోట, ‘ప్రకృతి అనేది ఆయా వ్యక్తుల మెదడులో జనించే ఊహ మాత్రమే. నిజమయిన ప్రకృతిని పిల్లలొక్కరే చూడగలరు. వాళ్లు ఏమీ ఆలోచించకుండా హాయిగా, ఆనందంగా చూస్తారు. కనీసం చెట్ల పేర్లు తెలిసినా ప్రకృతి అసలు రూపాన్ని చూడలేరు,’ అంటాడు. ఒక ఉదయం నాటి అనుభవం అతని జీవితాన్నిమార్చివెయ్యటం, ‘ఈ ప్రపంచంలో ఏమీ లేదు…’ అని గుర్తించటం కూడా అతని తాత్వికతని సూచిస్తుంది.

ప్రకృతి పుస్తకం

Fukuvoka

మానవ విజయాలు అని చెప్పుకునే వాటి డొల్లతనం గురించి ఫుకుఓకా ఇలా అంటాడు: ‘మానవులు ముందు తమ చర్యల వల్ల ఏదో ఒక నష్టం కలుగ జేస్తారు. ఇది తీవ్ర రూపం దాల్చేదాకా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు. చివరకు తప్పును సరిచేయడానికి శాయశక్తులా కృషి చేస్తారు. ఇది మంచి ఫలితాలనిచ్చినప్పుడు ఏదో అద్భుతం సాధించామని జబ్బలు చరుచుకుంటారు. మళ్లీ మళ్లీ ఇదే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక మూర్ఖుడు ముందు ఇంటి పైకి ఎక్కి పెంకులు పగలగొట్టాడంట. వాన పడి ఇల్లంతా కారుతుంటే హడావుడిగా పైకి ఎక్కి, పెంకులు సరిచేసి ఏదో ఘనకార్యం సాధించినట్లు సంతోషించాడంట.’

‘డాక్టర్ రోగులకు సేవ చేస్తారు. ఆరోగ్యవంతులకు ప్రకృతి సేవ చేస్తుంది,’ అనే ఫుకుఓకా ఏకంగా ఒక భాగం మొత్తంలో (అందులో అయిదు అధ్యాయాలు ఉన్నాయి) ఆహారం గురించి చర్చించాడు. అతని తాత్వికత ఇందులో బాగా వెల్లడవుతుంది. ఉదాహరణకి, ‘రుచికరమైన రొట్టె చెయ్యాలని పూనుకోవటంతో రుచికరమైన రొట్టె మాయమైపోయింది,’ అంటాడు. అంతేకాకుండా, మరొక చోట, ‘మెదడుతో తినవద్దు… తనకి కావలసిన ఆహారాన్ని ఎన్నుకునే స్థితికి శరీరాన్ని ఎదగనివ్వడమే ముఖ్యం,’ అంటాడు.

‘వ్వవసాయం అంతిమ లక్ష్యం పంటలు పండించటం కాదు. పరిపూర్ణ వ్యక్తిని తయారు చేయటం,’ అనే ఫుకుఓకా తాత్వికత మనం మరింత లోతుగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది.

సేంద్రియ ఉత్పత్తులకి ఇప్పుడు గిరాకీ పెరుగుతూ ఉంది. వాటి ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కానీ, వీటి ధరలు ఎందుకు ఎక్కువ ఉండాలని ప్రశ్నించింది ఫుకుఓకా ఒక్కడే. ‘ప్రకృతి ఆహారం అన్నింటికంటే చవకగా లభ్యం కావాలన్నదే నా అభిప్రాయం,’ అని అతను అంటాడు.

అలాగే, ‘యూరపు, అమెరికాలో పది శాతం ప్రజలే వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఈ దేశాల స్థాయికి చేరుకోవాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి తాపత్రయం,’ అంటూ, ‘నూటికి నూరు శాతం వ్యవసాయం చెయ్యటం బాగుంటుందని నా అభిప్రాయం,’ అని చాటిన వ్యక్తి ఫుకుఓకా.

‘వ్వవసాయం అంతిమ లక్ష్యం పంటలు పండించటం కాదు. పరిపూర్ణ వ్యక్తిని తయారు చేయటం,’ అనే ఫుకుఓకా తాత్వికత మనం మరింత లోతుగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది.

ఈ పుస్తకం అనువాదం చేసే అవకాశం లభించటం నా అదృష్టమే.

వ్యాసకర్త పాత్రికేయులు, అనువాదకులు. ప్రభుత్వం ప్రభుత్వేతర  స్వచ్ఛంద సేవా సంస్థలో దశాబ్దాలు కృషి చేశారు. ప్రచురణా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. వారి అనువాదాల్లో పైన పేర్కొన్న ‘గడ్డిపరకతో విప్లవం’ మొదటిదైతే ఇప్పటిదాకా వారు చిన్న పెద్ద పుస్తకాలను వంద దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అందించారు. అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే.

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు.

కొసరాజు సురేష్ గారు ‘తెలుపు’ కోసం ‘మంచి పుస్తకం’ పేరుతోనే తన సారస్వత అనుభవాన్ని అనువాద పరంపర నుంచి మొదలెట్టి సరళంగా వారం వారం మనతో పంచుకునేందుకు అంగీకరించినందుకు ధన్యవాదాలు.

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

More articles

3 COMMENTS

  1. The Intriguing thoughts, nailed a lot of myths and practices around agriculture, is an interesting facet of the column. Your insights just not introduces us to the back ground of your efforts in brining the book, but takes us beyond.

    ‘Agriculture is not about Produce, but shaping People’, is a lighting statement that shall lasts with me.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article