Editorial

Sunday, May 5, 2024
Pictureప్రకృతివైపు , స్వేచ్ఛ వైపు...: జయతి లోహితాక్షణ్

ప్రకృతివైపు , స్వేచ్ఛ వైపు…: జయతి లోహితాక్షణ్

కొన్ని చిత్రాలు చూస్తుంటే ఎన్నో చెబుతాయి. ఈ గోడమీది కోతి కూడా అంతే. గతమూ వర్తమానమూ తెలుపు.

బహుశా నేను తీసిన చిత్రాల్లో ఈ కోతి చిత్రం ముఖ్యమైందేమో అనిపిస్తుంది!

జయతి లోహితాక్షణ్

పుట్టింది నిజామాబాద్ జిల్లా బోధన్ లో. పెరిగింది కరీంనగర్ జిల్లా అమ్మమ్మ వాళ్ళ ఊరు శాంతీ నగర్ లో. హైస్కూలు అయ్యేసరికి కాలేజీలు దగ్గర్లో లేక, బయటికి పంపి చదివించే పరిస్థితులు ఇంట్లో లేక చదువు ఇంటర్ మొదటి సంవత్సరం మధ్యలోనే ఆగిపోయింది. పదేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి చదవడం మొదలు పెట్టాను. డిగ్రీ పూర్తి చేసి పీజీ చేశాను, స్కూలు టీచరుగా పని చేస్తూ చిన్నపిల్లల్తో గడిపాను. పటం నాకిష్టం. ఇష్టంగా స్కూలు టీచరుగా ఆ పన్నెండేళ్ళ అనుభవంలో ఆరేళ్ళు కడప జిల్లాలో ప్రైమరీ స్కూలు టీచరుగా పని చేశాను. లోహితో కలిసి మూడేళ్ళు అదే కడప జిల్లాలో రూరల్ పిల్లల కోసం సొంతగా స్కూలునీ నడిపాం. ఇప్పుడున్న పోటీ చదువుల్తో సర్దుకుపోలేక మధ్యలోనే ఆ స్కూలుని మూసేసాం. హైదరాబాద్ వచ్చాం.

ఉద్యోగాలు లేకుండా కొన్నాళ్ళు గడిపాం. హైపర్ ఆక్టివ్ (ADHD) అబ్బాయికి ట్యూటర్‌గా ఒక ఏడాది పని చేసాను. అక్కడే ఒక మలుపు నాకు…

ఎందుకో నాకు ఫోటో తియ్యాలనిపించేది. ఊహ తెలుస్తున్నప్పటి నుండీ అంతే.

ఎందుకో నాకు ఫోటో తియ్యాలనిపించేది. ఊహ తెలుస్తున్నప్పటి నుండీ అంతే. అయినా కెమెరా ఉంటే బాగుణ్ణు అని నాలో నేను అనుకుంటూనో, పైకే అనేస్తూనో ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. అలా ఒకసారి అంటున్నప్పుడు విన్న లోహీ నాకు కెమెరా కొనిచ్చారు 2010లో.

ఈ లోగా లోహికి ఛత్తీస్‌ఘడ్‌లో అవకాశం వచ్చింది. అదే పెద్ద మలుపు. అప్పటికే నా చేతికి కెమెరా వచ్చింది. తను స్కూలుకి వెళ్ళిన తరువాత రోజంతా నేను ఖాళీ, కిటికీలోనుండి చూస్తే చుట్టూ అనంతంగా విస్తరించిన ప్రకృతి…నన్ను పిలుస్తున్నట్టు ఉండేది. చేతిలో కెమెరా ఉంది. బయటికి వెళ్ళాలంటే భయం. భాష కూడా రాదు. లోహి ధైర్యం చెప్పారు. మిగతా అన్నిటినీ పక్కన పెట్టాను. రోజూ కొంత దూరం ముందుకి వెళ్ళాను. భయాలన్నీ ఒక్కొక్కటే పోయాయి. భాష సమస్య కాలేదు. పరిచయాలు అవే జరిగిపోయాయి, ప్రకృతితో పల్లె మనుషులతో. ఫొటోలు తీసాను. వాళ్ళకి చూపించాను. వాళ్ళతో కలిసి వారి పంట పొలాల్లో పనిచేసాను. వాళ్ళ పిల్లల్తో ఆడుకున్నాను. నాకేది నచ్చుతుందో అది చేశాను. నాకేది నచ్చుతుందో అది ఫొటోలు తీసాను. అవే నా ఫొటోలన్నీ. కెమెరా నా తోడు. ఫొటో నా భాష.

ఛత్తీస్‌ఘడ్ రూరల్ ఫొటోలు ఒక ఐయ్యేయస్ అధికారి చూశారు. పేదల జీవితాల్లో వస్తున్న మార్పులు, విజయగాధలూ డాక్యుమెంట్ చెయ్యమని కోరారు. అలా నేను 2014లో ఒక నెల రోజులూ, 2015లో మరో నెల రోజలూ తెలంగాణ పల్లెలు తిరిగి ఫొటోలు తీసాను.

తూర్పు గోదావరి జిల్లా భీమవరపు కోటలో కూలిపోయిన గోడ మీద ఈ కోతిని చూశాను. క్లిక్ మనిపించాను. చూస్తే చాలా కథ చెబుతున్నట్లుందీ బొమ్మ. ఈ గోడమీద కోతి సిమెంటు కొమ్మ మీద నుండి చెట్టు కొమ్మల మీదకు దూకబోతూ క్షణమాగి చూస్తున్నట్టు అనిపించింది.

ఒక వైపు సముద్రమూ, మరోవైపు పచ్చని కొండలూ ఉన్న విశాఖపట్నంలో ఉండాలన్నది నా కోరిక. ఉద్యోగం సాకుతో 2013లో విశాఖపట్నం వచ్చి ఖాలీ సమయాల్లో అక్కడి చుట్టుపక్కలా ఫొటోగ్రఫీ చేశాను, నా తృప్తి కోసమే. నడవటం నా కిష్టం. ఎంత దూరమైనా నడిచే వెళ్ళేదాన్ని. అప్పుడే నేను తూర్పు గోదావరి జిల్లా భీమవరపు కోటకు వెళ్ళాను. బీహెచ్ కోట అని పిలిచే ఆ ఊళ్ళో పాడుబడిన కోట ఒకటుంది. అదే భీమవరపుకోట. అందులో ఆ కాలంలో బాగా డబ్బున్న వాళ్ళు నివసించేవారని కోటను చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడ కలిసిన వాళ్లు చెప్పారు! అప్పుడే కూలిపోయిన గోడ మీద ఈ కోతిని చూశాను.
క్లిక్ మనిపించాను. చూస్తే చాలా కథ చెబుతున్నట్లుందీ బొమ్మ.

పల్లెలు పట్టణాలను కోరుకున్నాయి. కోటలు పడిపోయాయి. మట్టి గోడలు కూలిపోయాయి. పెంకులు రాలిపోయాయి. మనిషి మట్టికీ చెట్టుకీ దూరమయ్యాడు. ఇప్పుడు పట్టణాల్లోని కొందరు తిరిగి పల్లెవైపు చూస్తున్నారు. ఇదంతా ఈ గోడమీద కోతి సిమెంటు కొమ్మ మీద నుండి చెట్టు కొమ్మల మీదకు దూకబోతూ క్షణమాగి చూస్తున్నట్టు అనిపించింది. ఈ కోతిలో నాకు జీవం కనబడింది…

మరో క్షణం ఈ కోతిలో నాకు నేను కనబడ్డాను. గోడమీద చిత్రితమైన నేను ఆ కోతినీ, ఆ తీగెను….

ప్రకృతివైపు , స్వేచ్ఛ వైపు… నడవబోతున్నట్టు… నన్నెవరైనా ఆపుతారేమోనని ఆగి చూస్తున్నట్టు …
బహుశా నేను తీసిన చిత్రాల్లో ఈ కోతి చిత్రం ముఖ్యమైందేమో అనిపిస్తుంది!

జయతి లోహితాక్షణ్  చాయా చిత్రకారిణి మాత్రమే కాదు, జీవిత రచయిత. ‘అడవి నుంచి అడవికి’, ‘అడవి పుస్తకం’ తాను వెలువరించిన అక్షర కృతులు.  

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article