Editorial

Sunday, May 5, 2024
ఆటలుIPL అప్పుడే....ఎందుకంటే?

IPL అప్పుడే….ఎందుకంటే?

IPL

పటిష్టమైన బయో బబుల్ లో కూడా కరోనా ప్రవేశించింది. ఆ తర్వాత ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్థారణ అవ్వడంతో క్యాష్ రీచ్ లీగ్ ను బీసీసీఐ అర్థాంతరంగా నిలిపివేసింది. అయితే, వాయిదా పడిన ధనాధన్ లీగ్ ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే చర్చ నడుస్తోంది. ఆ వివరాలు ‘తెలుపు’ కోసం…

కెఎస్ఆర్ 

క్రికెట్ .. మూడక్షరాల పదం . సచిన్ మూడక్షరాల పేరు. మన దేశంలో ఈ రెండు పదాలూ సయామీ ట్విన్స్. క్రికెట్ క్రీడ స్థాయి నుంచి మతం స్థాయికి చేరితే.. సదరు మతానికి దేవుడి స్థాయికి సచిన్ చేరాడు. భారత క్రికెట్ హిమాలయమంత ఎదుగుతూ ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా బీసీసీఐ ఎదిగింది. మరీ క్రికెటర్లకైతే అడుగు తీసి అడుగు వేస్తే కాసుల వర్షం. స్టార్ డమ్.. దేశమంతా అభిమానులు.. బోర్డుకే కాదు.. ఆటగాళ్లూ హ్యాపీ..

టెస్టులు, వన్డేలతోనే ఇంత జరిగితే టీ20ల రంగప్రవేశంతో భారత క్రికెట్ మరో దశకు చేరింది. నిడివి మూడు గంటలు. ఆట మొత్తం కలిపి 40 ఓవర్లు. ధనాధన్ షాట్లు. థ్రిల్లర్ మూవీని మించి మలుపులు. ఈ టీ20 ఫార్మాట్ జనానికి బాగా కనెక్ట్ అయింది. అన్ని దేశాలూ ఈ ఫార్మాట్ ను ప్రోత్సహించాయి. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలువడంతో క్రికెట్ లో ఈ ఫార్మాట్ కు మరింత క్రేజ్ పెరిగింది. అంతే, బీసీసీఐ ఈ ఫార్మాట్ తో మరింత సంపద, ఆటను మరో స్టేజ్ కు తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో సక్సెస్ అయింది. బీసీసీఐ మానసపుత్రికగా ప్రపంచంలోనే అత్యధిక క్యాష్ రిచ్ లీగ్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అవతరించింది.

కొవిడ్ తో కష్టాలు

2008 నుంచి ఐపీఎల్ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. 2009 ఏడాదిలో దేశంలో జరిగిన సాధారణ ఎన్నికల నేపథ్యంలో సీజన్ ఆసాంతం దక్షిణాఫ్రికాకు తరలించిన బీసీసీఐ విజయవంతంగా నిర్వహించింది. అనంతరం 2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలో తొలి అంచె ఐపీఎల్ ను యూఏఈ లోని మూడు వేదికల్లో నిర్వహించింది. కొవిడ్ నేపథ్యంలో 2020 సీజన్ మొత్తాన్నీ యూఏఈ వేదికగా బబుల్ బుడగలో నిర్వహించి సెహభాశ్ అనిపించుకుంది. 2021 ఏడాదిలో మన దేశంలోనే నిర్వహిస్తున్న ఐపీఎల్ మళ్లీ కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. తొలి అంచె పోటీలు ముగిసిన అనంతరం కొన్ని జట్ల ఆటగాళ్లు కొవిడ్ బారిన పడడంతో బయో బబుల్ బుడగ బద్దలైంది. దీంతో బీసీసీఐ టోర్నీని వాయిదా వేసింది.

BIO BUBBLE...

బయో బబుల్ అంటే ఆటగాళ్ళను ఏదైనా బుడుగలాంటి ఏకాంత ప్రదేశంలో ఉంచడం కాదు, వైరస్ బారిన పడకుండా ఉండేందుకు గాను వాళ్ళను బయటి ప్రపంచంతో ఎలాంటి సంభంధాలు లేకుండా కొన్ని నిర్ణీత ప్రోటోకాల్స్ నిర్దిష్ట ప్రదేశంలో గడిపేలా చేసే పద్ధతి. కానీ కరోనా ఆ మానవ నిర్మిత సురక్షణ చర్యలను కూడా దెబ్బతీయడంతో ‘ఐపిఎల్’ మల్లగుల్లాలు పడాల్సిన స్థితిలో పడింది.

సెప్టెంబర్ లో ఐపీఎల్!

కరోనా దెబ్బకు ఐపీఎల్ 2021 సీజన్ కూడా నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. పటిష్టమైన బయో బబుల్ లో కూడా కరోనా ప్రవేశించింది. ఆ తర్వాత ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్థారణ అవ్వడంతో క్యాష్ రీచ్ లీగ్ ను బీసీసీఐ అర్థాంతరంగా నిలిపివేసింది. అయితే, వాయిదా పడిన ధనాధన్ లీగ్ ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే చర్చ నడుస్తోంది. ఈ సీజన్‌ సెకండ్ ఫేస్ పూర్తి చేసేందుకు సరైన సమయం, వేదిక గురించి బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇతర దేశాల క్రికెట్‌ షెడ్యూల్ కు అనుగుణంగా సెప్టెంబర్లో రెండో దశను నిర్వహిస్తే బాగుంటుందని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో విజయవంతంగా నిర్వహించారు. మళ్లీ అక్కడికే వేదికను మారిస్తే మెరుగని మరో ఆలోచన. అక్కడి పిచ్‌లు, వాతావరణం, బయో బుడగ, కరోనా పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఇంగ్లండ్‌ సిరీస్‌ ముగియగానే నేరుగా ఇంగ్లండ్, భారత ఆటగాళ్లను దుబాయ్‌కు తీసుకెళ్లాలన్నది యోచన. యూఏఈకి వచ్చేందుకు ఇతర దేశాల ఆటగాళ్లకూ అభ్యంతరం ఉండదని బీసీసీఐ భావిస్తోంది. లీగ్‌ ముగియగానే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను కూడా నిర్వహించే అవకాశం ఉంది. మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు కూడా భారత్ దగ్గరే ఉన్నాయి. కానీ, సెప్టెంబర్‌లో యూఏఈలో ఎండలు విపరీతంగా ఉంటాయి. కాకపోతే గత సీజన్ కూడా సెప్టెంబర్‌లోనే జరగడం సానుకూలాంశం. మరోవైపు జూన్ లో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయ్. టెస్టుకు కొన్ని రోజుల ముందుగానే కోహ్లీసేన అక్కడికి చేరుకోనుంది. ఫైనల్‌ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో తలపడనుంది. సిరీస్‌ ముగిసే సరికి సెప్టెంబర్‌ అవుతుంది. అందుకని అదే నెలలో ఐపీఎల్‌ మిగిలిన మ్యాచులు అక్కడే నిర్వహించాలన్నది ఐపీఎల్ పెద్దల మరో ఆలోచనగా తెలుస్తోంది.

పెర్త్ వేదికగా

ఆస్ట్రేలియాలో ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుందని మరో ఆలోచన. ప్రస్తుతం ఆ దేశంలో రాకపోకలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. మరో నాలుగు నెలల్లో ప్రభుత్వం వీటిని తొలగిస్తుందని అంచనా. వాస్తవంగా 2020లో టీ20 ప్రపంచకప్‌ను ఆసీస్‌లోనే నిర్వహించాల్సింది. అది వాయిదా పడటంతో 2021 కప్‌ను భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. 2022 హక్కులు ఆసీస్‌కు ఇచ్చారు. చర్చలు జరిపితే ఈ ఏడాది మెగా టోర్నీని అక్కడ నిర్వహించే వచ్చే ఏడాది భారత్‌లో ఆతిథ్యమిచ్చేందుకు మార్గం సుగమం కావచ్చు. క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఇందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇదే జరిగితే పెర్త్‌ వేదికగా సెప్టెంబర్లో ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటందనే చర్చ కూడా జరుగుతుంది. ఒక వేళ సెప్టెంబర్ సమయానికి కరోనా కల్లోలానికి భారత్ లో బ్రేకులు పడితే తిరిగి మనదగ్గరే నిర్వహించే ఛాన్స్ కూడా లేకపోలేదు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article