Editorial

Sunday, May 19, 2024
ఆనందంఆపాదమస్తకం : మారసాని విజయ్ బాబు

ఆపాదమస్తకం : మారసాని విజయ్ బాబు

Illustration
చిత్రం బీర శ్రీనివాస్

జీవితంలో ఆపాదమస్తకం కుదిపేసే అపురూప ఆనంద క్షణాల గురించిన అనుభవగాథా సంపుటికి ‘తెలుపు’ ఆహ్వానం.

కథ చాలా బాగా కుదిరింది. గతంలో యెన్నడూ కలుగని సంతృప్తి నన్ను అల్లుకుపోతోంది. సంబరంతో మనసు యెగసిపడుతోంది. యెంతో ఆనందంతో గోడ గడియారం వైపు చూశాను.
రాత్రి రెండు గంటలకు యింకా అయిదు నిమిషాలు తక్కువ వున్నాయి.
పక్కనే నా భార్య గౌరి, పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. గౌరిని నిద్రలేపి నాలో రేగుతున్న సంతోషానంతా చెప్పాలనిపించింది. నేను రాసిన కథను చదివి ఆమెకు వినిపించాలనిపించింది.
ఆ వెనువెంటనే నా ప్రయత్నం విరమించుకున్నాను. నిజానికి అమెకు కథలపై మక్కువ లేదు. అనవసరంగా నిద్రలేపడం యెందుకనిపించింది.
వో. హెన్రీ తాను రాసిన దొంగ కథలో చెప్పిందేమిటి?
మీ అనుభూతిని అదే స్థాయిలో యెవరైనా రిసీవ్ చేసుకోవాలంటే సరిగ్గా అలాంటి స్థితిని వారు పొంది వుంటేనే అది సాధ్యమవుతుందన్నారు. అందుకే ఆమెను యిబ్బంది పెట్టదలుచుకోలేదు.
మరేంచేయాలి?
నాలోని సంతోషం పెరిగిపోతోంది. వెంటనే యెవరితోనైనా చెప్పాలనిపిస్తోంది.
సౌదా గుర్తుకొచ్చాడు. యింత రాత్రిలో వెళితే బాగుండదనిపించింది. యేంచేయాలో కాస్తంత కూడా పాలుపోలేదు.
నాలో ఆనందం మరింత యెక్కువైంది. గాల్లో తేలుతున్నట్టుంది. ఆ సమయంలో నాకిలా అనిపించింది.
యీ ప్రపంచంలో నాకంటే సంతోషవంతుడు బహుశా మరెవ్వరూ వుండరేమో! అన్న భావన కలిగింది. అది నిజమో కాదో తెలియదు. ఈ తలంపుతో కొంతసేపు కొట్టుమిట్టాడాను.
అటుతర్వాత సంతోషానికి తోడు యేదో తెలియని వుద్వేగం నాలో చోటుచేసుకుంది. అప్పుడు హృదయాంతరాళం ఆనందంతో పూర్తిగా నిండిపోయింది. అయినా పెరుగుతున్న సంతోషం ఆగలేదు. పె…రు…..గు…….తో………ం………….ది………………
ఏంటింది?. చిత్రంగా వుందే! శరీరం మొత్తం రెండుగా చీలిపోతుందా?… భయం, బాధ, ఇంకా యేవేవో కలిసి సమ్మిళితమైపోయాయి.
నరకం అంటే ఏమిటో అనుభవలోనికి చొచ్చుకొచ్చింది. నన్ను నేను నిలువరించుకోలేకపోయాను.
త్వరత్వరగా దుస్తులు వేసుకొని క్షణాల్లో రెండో అంతస్తు నుంచి కిందికి పరుగిడి బైక్ పై బయలుదేరాను.

స్త్రీ కౌగిలిలోని మధురిమ యేమిటో తెలుసు నాకు. గొప్ప అభినందనతో కూడిన యీ పరిష్వంగము అంతకుమించి అనిపించడం చిత్రమే. కేవలం కళాకారులకు మాత్రమే యిలాంటి జీవనోత్సహం దక్కుతుంది కాబోలు.

తిరుపతి కోటకొమ్మల వీధి నుంచి కేశవాయనగుంటకు వెళడానికి పది నిమిషాలు పట్టింది. స్నేహితుడింటి కాలింగ్ బెల్ నొక్కాను. సౌదా వాళ్లనాన్న కంగారుపడుతూ తలుపు తీశాడు.
యేమైంది విజయా. యింత రాత్రిలో వచ్చావని ఆదుర్దాగా అడిగాడు.
విషయం ఆయనకు చెప్పాను. దాంతో ఆయనా, నేనూ ఇద్దరం కాస్తా తేలికపడ్డాం. సౌదా గదిలోకి వెళ్లి నిద్రలేపాను.
యేంటి విజయ్, యింత రాత్రిలో…
కథ రాయడం యిందాకే పూర్తయింది సౌదా. యిక తట్టుకోలేకపోయాను. యేమైతే అవనీ అని వచ్చేశాను. సారీ సౌదా నిన్ను యిబ్బంది పెట్టాను.
యిబ్బందేంది విజయ్. మంచి పనిచేశావ్. అలా వచ్చేయాలి. అప్పుడే బాగుంటుంది. అన్నీ పద్ధతి ప్రకారమే జరిగితే జీవితం యేం బాగుంటుంది. బోరు కొట్టేస్తుంది కదా! అప్పడప్పుడు ఇలాంటివి జరిగితే థ్రిల్ వుంటుంది. పద యెస్జీయస్ కాలేజీ దగ్గరకు వెళ్దాం అని అన్నాడు.
అప్పటికి సమయం రెండన్నర అయింది. కాలేజీ ఆవరణలో వీధిలైట్ కింద మేం కూర్చున్నాం.
నేను కథలోకి జారిపోయాను. ఉద్విగ్నతకు లోనయ్యాను. ఆయా పాత్రలకు అనుగుణంగా గొంతులోంచి భావం ధ్వనిస్తోంది. కొద్దిసేపటిలోనే కథ చదవడం పూర్తయింది.
విజయ్ అద్భుతంగా రాశావు. భలే. లెయ్ విజయ్ అంటూ సౌదా తన రెండు చేతులతో నన్ను దగ్గరకు తీసుకొని గట్టిగా కౌగిలించుకున్నాడు.
స్త్రీ కౌగిలిలోని మధురిమ యేమిటో తెలుసు నాకు. గొప్ప అభినందనతో కూడిన యీ పరిష్వంగము అంతకుమించి అనిపించడం చిత్రమే. కేవలం కళాకారులకు మాత్రమే యిలాంటి జీవనోత్సహం దక్కుతుంది కాబోలు.
విజయ్, ఆయా వ్యక్తుల పాత్రలు గొప్పగా ఆవిష్కరించావు. శైలి అద్భుతం. మునుపటి కంటే యెంతో పరిణితి కనిపిస్తోంది. ముగింపులోని చివరి మాటలు కథను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయి.
ఆ చూపులు శతాబ్దాల నాటి పాత చూపులు…
బహుశా మరెన్నో శతాబ్దాల దాకా ఉండవచ్చు…
యెక్సెలెంట్ వోర్డ్స్… నా భుజాన్ని చరుస్తూ అభినందించాడు సౌదా.
సౌదా మాటలకు నా భుజాలుపై కొత్తగా రెక్కలు మొలిచాయి.
సౌదా మీసాలాయన ఛాయ్ తాగుదామా?
అలాగే. పద అన్నడు సౌదా.
+++
రెల్వేస్టేషన్ వద్దకు వెళ్లి మీసాలాయన్ను విష్ చేశాం. ఆ వెనువెంటనే ఆయన రెండు స్ట్రాంగ్ టీలు అందించాడు మాకు. వేడివేడి టీ తాగుతూ…
సౌదా కథ పూర్తయిన తర్వాత ఆకాశంలో హాయిగా యెగురుతున్నంత ఆనందం కలిగింది. యేదో కొత్త భావనకు లోనైయాను. గతంలో యెన్నడూ ఇలాంటి అనుభూతి కలగలేదు. యెంతో సంతోషం. అదెంతో చెప్పలేను. యింతటి మధుర భావన యెన్నడూ కలగలేదు.
సౌదా వొక విషయం అడుగుతాను చెబుతావా?
చెప్పు విజయ్.
యింతటి ఆనందం నీకెపుడైనా కలిగిందా?
ఆ ఆనందమే లేకపోతే మనం యెలా రాయగలమో చెప్పు విజయ్….
మనంగాక ఇంకెవరు ఈ సమాజాన్ని మరమ్మతు చేయగలరు (if not we… then who else) అంటూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నారు మారసాని విజయ్ బాబు. ఆయన రైతుబిడ్డ. పుట్టింది చిత్తూరు జిల్లా మంగినాయనిపల్లిలో.  స్వతహాగా ఆర్టిస్ట్. సాహిత్యంపై అభిలాషతో కథలు రాశారు. అలాగే మహత్తర జీవిత కాంక్షను రగిలించే తాత్వికతతో ‘కొత్తగీతలు’ అన్న నవలను అందించారు. పైగా సీనియర్ పాత్రికేయులు. ‘సహచర’ సమాంతర ఆలోచనల సామాజిక వేదిక వ్యవస్థాపకులు. జీవితానుభవంలో ఎగసిపడిన ఆనందోత్సాహాలను తాను వారం వారం రాసే ‘ఆపాదమస్తకం’  ‘తెలుపు’కి ప్రత్యేకం.

email: vijayababumarasani@gmail.com

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article