Editorial

Monday, May 20, 2024
కథనాలుమూడొకట్లొద్దు, ఏడుకట్ల సవారీ ముద్దు!! - 111 జీఓ రద్దు నేపథ్యంలో ఎన్ వేణుగోపాల్ వ్యంగ...

మూడొకట్లొద్దు, ఏడుకట్ల సవారీ ముద్దు!! – 111 జీఓ రద్దు నేపథ్యంలో ఎన్ వేణుగోపాల్ వ్యంగ రచన

ఒందానొందు కాలదల్లి దిబ్బరాజ్యము నుండి విభజింపబడిన పబ్బురాజ్యమును మహాఘనత వహించిన నాసికాదత్తుడు పాలించుచుండిన మహత్తర సందర్భములో తలెత్తిన చిత్రమైన వివాదము గురించిన కథనమిది.

ఎన్ వేణుగోపాల్ 

నాసికాదత్తుడి ఆశ్రితలోకము విచిత్రమైన జీవులకు ఆలవాలము. అందు కొందరు విద్యను తిని త్రేన్చెడి వారు. మరి కొందరు భూమిని తిని అరిగించుకొనెడివారు. మరి కొందరు ప్రజలకు వ్యసనములు మప్పి అందుండి తమ బొక్కసములు నింపుకొనెడివారు. విద్యను తినుట యనగా యథాక్షర అర్థమును కాదు, భావార్థమును గ్రహించవలెను. విద్యను అతివేలమైన ధరతో ప్రజలకు అమ్ము విద్యనందు ప్రవీణులై కోట్లకు, తప్పు తప్పు, వందల వేల కోట్లకు పడగలెత్తి, రాజకీయ రంగ ప్రవేశము చేసి రాజుగారి ఆంతరంగిక సహచరులుగా మారిరి.

విద్యా భోక్తల తర్వాతి స్థానము భూభోక్తలది. వాస్తవమునకు విద్యాభోక్తల కన్న భూభోక్తల స్థాయి చరిత్రలోనూ, సంపదలోనూ, రాజాశ్రయములోనూ, వంచనాశిల్పములోనూ విస్తారమైనది. వారు భూమిని ఎకరములలో సేకరించి, గజములలో వితరణ చేయు మహా లాభకరమైన విద్యలో పారంగతులైరి. వితరణ అనగా ఉచితముగ కాదు, అనుచితముగనే. సాధారణ ప్రజకు అందుబాటులో లేని ధరలకే ధరాతలమును అంటగట్టు విద్య అది. ఎక్కడ భూమి నిరలంకారముగా, గృహ జన రహితముగా కనబడునో అక్కడికి వారి చూపులు మనోవేగ, వాయువేగముల ప్రసరించును. ఆ భూమి వారి పేరు మీదికి మారును. వారి చూపులు పడిన భూములలో గృహములో జనములో ఉన్నప్పటికీ వారు వాటిని క్షణములలో అదృశ్యము గావించి ఆ భూమిని నిరలంకారము చేసి, ఆ పై తమ వర్ణ పతాకములను ఎగురవేయగలరు. అవ్విధముగా దిబ్బ రాజ్యమున భూభోక్తల సామ్రాజ్యము జగజ్జగీయమానముగా సాగుచుండెను.

అంతకు ముందు ఉండిన భూభోక్తలు భూబకాసురులుగా మారజొచ్చిరి. అందులోనూ రామేశ్వర భోక్త, మేఘేశ్వర భోక్త అను ఇద్దరు మహా భూబకాసురులు నాసికాదత్తుడి ప్రతిరూపముగా మారిపోయిరి.

అటువంటి స్థితిలో దిబ్బరాజ్యము రెండు ముక్కలాయెను. దిబ్బను మించిన దుబ్బగానో, మబ్బుగానో, ఉబ్బుగానో, పబ్బుగానో ఉండవలెను గాని చిరకాలము దిబ్బగానే ఉండుట ఎంత అవమానకరము అని నాసికాదత్తుల ఆశ్రమము ఉద్యమము లేవదీసి ఉండెను. ఆ ఉద్యమము విజయవంతమై, దిబ్బరాజ్యము స్థానములో దుబ్బ రాజ్యమూ, మబ్బు రాజ్యమూ, ఉబ్బు రాజ్యమూ కలగలిసిన పబ్బు రాజ్యము ఉనికిలోకి వచ్చెను. రాజ్య విభజన జరిగి అర్ధరాజ్యము నాసికాదత్తుని పాలనలోకి వచ్చెను.

అంతకు ముందు ఉండిన భూభోక్తలు భూబకాసురులుగా మారజొచ్చిరి. అందులోనూ రామేశ్వర భోక్త, మేఘేశ్వర భోక్త అను ఇద్దరు మహా భూబకాసురులు నాసికాదత్తుడి ప్రతిరూపముగా మారిపోయిరి. రాజ్యములో ఏదైనా ఒక కార్యము జరిగినదనిన అది ఈ త్రిమూర్తులలో ఎవరో ఒకరిదే అయి ఉండవలెను. పేరు ఏ ఒక్కరిదైనను, మిగిలిన ఇరువురి హస్తమూ ఆలోచనా అందులో ఉండితీరవలెను.

జలాశయములను తప్పనిసరిగా సంరక్షించవలెనని దిబ్బరాజ్య పాలకులు చట్టములు కూడా తెచ్చిరి. ఆ జలాశయముల పరిసరములలో నిర్మాణములు జరగగూడదని, ప్రవాహములను అడ్డగించగూడదని, జలాశయములకు నష్టము కలిగించు ఏ చర్యనూ చేపట్టగూడదని ఆ చట్టము నిర్దేశించెను. ఆ చట్టమును మూడొకట్ల చట్టము అందురు.

మీకు మరింత శ్రమ ఇవ్వకుండా ఉండగలందులకు ఇక ప్రస్తుతమునకు వద్దుము.

దిబ్బరాజ్యపు ప్రాచీన యుగములో రాజధానీ నగర ఆహ్లాదము కొరకు, రాజధాని పౌరుల తాగు నీటి అవసరముల కొరకు, రాజధానీ నగరపు భూగర్భ జలమును పరిరక్షించుట కొరకు రెండు విశాల జలాశయములు నిర్మించబడి ఉండెను. కాలక్రమమున నీటి అవసరములను తీర్చగలిగిన ఇతర వనరులు ఏర్పడి, ఈ జలాశయములు కేవలము ఆహ్లాద, విహార స్థలములుగ మాత్రమే మిగిలెను. తెలియకుండగానే భూగర్భ జల పరిరక్షణ అవసరములు తీర్చుచుండెను. రాజధానీ నగర పర్యావరణమును రక్షించుటకు ఈ జలాశయములను తప్పనిసరిగా సంరక్షించవలెనని దిబ్బరాజ్య పాలకులు చట్టములు కూడా తెచ్చిరి. ఆ జలాశయముల పరిసరములలో నిర్మాణములు జరగగూడదని, ప్రవాహములను అడ్డగించగూడదని, జలాశయములకు నష్టము కలిగించు ఏ చర్యనూ చేపట్టగూడదని ఆ చట్టము నిర్దేశించెను. ఆ చట్టమును మూడొకట్ల చట్టము అందురు.

దశాబ్దముల తదుపరి, దిబ్బరాజ్యము నుండి పబ్బు రాజ్యము విభజన జరిగిన తదుపరి, రాజధాని నగరములో సమస్త భూమండలము పైనా భూబకాసురుల కన్ను పడెను. ఆ జలాశయములు రాజధాని తాగునీటి అవసరములను తీర్చుట లేదు గనుక, వాటిని ఆక్రమించి, నిర్మాణములు గావించుట ఎట్లు అని సమాలోచనములు ప్రారంభమాయెను. అప్పటికే ఆ జలాశయముల భూమిని అక్కడక్కడ దురాక్రమించి నిర్మాణములు సాగించుచుండిరి. మూడొకట్ల శాసనము అమలులో నిర్లక్ష్యము సాగుచుండెను. ఆ శాసనము రాజశాసనముల కవిలెకట్టలో ఒకానొక విస్మృత ప్రాచీన చిహ్నముగ మాత్రమే మిగిలెను.

ఇన్ని వివాదములెందుకు, అసలు వివాదకారణమైన మూడొకట్ల చట్టమునే ఏడు కట్ల సవారీ ఎక్కించుట ఉచితము కాదా అని నాసికాదత్తులు ఆలోచించిరి.

అది యట్లుండగా, నాసికాదత్తుడి సుపుత్రుడు, ఆతని సహచరులు, సన్నిహిత మిత్రులు ఆ జలాశయముల అంచున తమ విలాసభవనములు నిర్మించుకొనిరి. అధికార పీఠమున ఉన్నవారే అట్టి చర్య చేపట్టుట మూడొకట్ల చట్టమునకు ఉల్లంఘన కాదా అని అక్కడక్కడ రాజద్రోహులు విమర్శలు చేసిరి. ఇన్ని వివాదములెందుకు, అసలు వివాదకారణమైన మూడొకట్ల చట్టమునే ఏడు కట్ల సవారీ ఎక్కించుట ఉచితము కాదా అని నాసికాదత్తులు ఆలోచించిరి. అట్లయిన ఆ రెండు జలాశయ గర్భములలోని కొన్ని వందల ఎకరములు, కొన్ని లక్షల గజములుగా మారి రామేశ్వర భోక్తకూ, మేఘేశ్వర భోక్తకూ, వారి శిష్య ప్రశిష్యులకూ ఎన్ని వందల, వేల కోట్ల దీనారములు సంపాదించి పెట్టును గదా, అందులో సింహాసన భాగముగా తమకు ఎంత దక్కును గదా అని నాసికాదత్తుల కుటుంబము ఆలోచనలలో మునిగెను.
కాని అట్టి చర్య ఒక్క ఆ చట్టమును మాత్రమే కాదు, నగర జీవన సౌందర్యమును, ఆహ్లాద విహార స్థలములను, రాజధానీ నగర భూగర్భ జల పరిరక్షణను, మొత్తముగా రాజధానీ నగర ప్రజా జీవనమును ఏడు కట్ల సవారీ ఎక్కించుటయేనని ఆకాశవాణి పలికెను.

ఎన్. వేణుగోపాల్ కవి, రచయితా విమర్శకులు. వీక్షణం సంపాదకులు. తన తాజా రచనలు చదివేందుకు కడలి తరగ క్లిక్ చేయవచ్చు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article