Editorial

Friday, May 17, 2024
సినిమాThe Diving Bell And The Butterfly : స్వరూప్ తోటాడ తెలుపు

The Diving Bell And The Butterfly : స్వరూప్ తోటాడ తెలుపు

swaroop thodata

మాట, వినికిడి, స్పర్శ, కదలిక, భాష ఇవన్నీ మనకు అందుబాటులో ఉండి ఈ సమాచార, భావ ప్రవాహాన్ని సులువు చేస్తాయి. ఆ ప్రవాహం వెళ్లే దారిలేక ఒక చోట ఆగిపోతే? ఆలోచించగలిగే మెదడు మాత్రమే ఉండి ఈ సమాచార మార్గాలు ఏవీ లేకపోతే మన పరిస్థితి ఏమిటి? చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలిగీ, ఆ ప్రపంచంతో ఏ సంభాషణా చేయలేని నిస్సహాయ స్థితిలో ఒక వ్యక్తి అనుభవం తెలుపు సినిమా సమీక్షణం ఈ వ్యాసం.

స్వరూప్ తోటాడ

మనకు ఏదన్నా అనిపించగానే మన పక్కనున్న మనిషితో నేరుగానో, చమత్కారం గానో ఓ మాట అనేస్తాం. ఒక బుజ్జి కుక్కపిల్ల మన కాళ్ళ దగ్గరకు వస్తే కాస్త వంగి దాని తల నిమురుతాం. ఎవరన్నా జోక్ చేస్తే వారికి వినిపించేలాగా నవ్వి మన ప్రతిస్పందన తెలియజేస్తాం. మనకు కలిగిన ఆలోచనో, అనుభవిస్తున్న పరిస్థితో, అనుభూతి చెందుతున్న ఒక భావోద్వేగమో, ఏదైనా అది మన తల గోడల మధ్య పుట్టి, పెరిగి ఆవిరైపోదు. అది వ్యక్తపరచబడితే తప్ప దానికంటూ అవసరమైన ఒక పరిపూర్ణతను సంతరించుకోదు. ఆ ఆలోచనో, మాటో, పాటో, ఏడుపో మరో మనిషి చెవిన పడి ఓ ప్రతిస్పందన వస్తేనో, కనీసం ఓ కాగితం మీద అక్షరంగా కుదురుకుంటేనో ఆ సంభాషణ ముగిసిన భావన కలిగి మనసు ముందుకెళ్ళగలిగేది.

మాట, వినికిడి, స్పర్శ, కదలిక, భాష ఇవన్నీ మనకు అందుబాటులో ఉండి ఈ సమాచార, భావ ప్రవాహాన్ని సులువు చేస్తాయి. ఆ ప్రవాహం వెళ్లే దారిలేక ఒక చోట ఆగిపోతే? ఆలోచించగలిగే మెదడు మాత్రం ఉండి ఈ సమాచార మార్గాలు ఏవీ లేకపోతే మన పరిస్థితి ఏమిటి? చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలిగీ, ఆ ప్రపంచంతో ఏ సంభాషణా చేయలేని నిస్సహాయ స్థితిలో మనల్ని మనం ఊహించుకోగలమా?

రియాలిటీ ని వెలుగుగా, శబ్దంగా, స్పృహగా కొలుస్తున్న మన human consciousness. ఈ అలంకారాలతో నిమిత్తం లేకుండా ఆ spectrum లో నిలబడితే ఆ కాస్త వెలుగూ అబ్బురమే అనిపిస్తుంది. అలా దృశ్యంలోంచి జ్ఞాపకం లోకి, ఊహలోకి తప్పిపోయే అతని అంతరంగాన్ని ఛాయాగ్రాహకుడు dreamy visuals తో చక్కగా ఆవిష్కరించాడు.

The Diving Bell And The Butterfly సినిమాలో Jean Dominique Bauby అనే నిజజీవిత వ్యక్తి కి అలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఈ నలభైయ్యేళ్ళ జర్నలిస్ట్ Elle అనే ఒక ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ కి ఎడిటర్. రంగు రంగుల ప్రపంచపు అందాల్లో నిరంతరం మునిగితేలే అతని జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనవుతుంది. ఒక stroke అతన్ని మూడు నెలలు coma లోకి నెట్టి, స్పృహలోకి వచ్చాక ఎడమ కనురెప్ప తప్ప శరీరంలో మరే భాగం కదపనివ్వకుండా చేసింది. అతను ఎడమ కన్నులోంచి చూడగలడు, వినికిడి శక్తి ఉంది. అంతే. మాట్లాడలేడు, కదలలేడు, వేరేమీ చేయలేడు. దీన్నే locked in syndrome అంటారని డాక్టర్ చెబితే విని తిరిగి ఏమీ అనలేని పరిస్థితి అతనిది. అతను మంచం మీద పడ్డ తర్వాత అతని నిజజీవిత కధే ఈ సినిమా.

ఈ చిత్రం మనకు కథను Jean Do దృక్కోణం నుంచే చెబుతుంది, చూపిస్తుంది కూడా. అతని తలలోపల మనల్ని బంధించి అతని స్థానంలో ఉండి చూడమని చెబుతుంది కెమెరా. మొదటి పది నిమిషాల్లో కాస్త ఇబ్బంది అనిపించినా తర్వాత ఈ గమ్మత్తైన అనుభవంలోకి మనం త్వరగానే సర్దుకుంటాం. ఒళ్ళంతా paralysis వచ్చిన వ్యక్తి కథ అనగానే విషాద వయోలిన్ శబ్దాల మెలోడ్రామా లో మనల్ని ముంచేయకుండా ఈ పరిస్థితి యొక్క భయానక అనుభవానికీ విధి చమత్కారానికీ సమాంతరంగా తన అధ్యయనాన్ని నడిపించుకుంటుంది సినిమా. అందుకు ఈ విషాదానికే ప్రత్యేకమైన హాస్యాన్ని అక్కడక్కడా చక్కగా ఉపయోగించుకుంటుంది. ఉదాహరణకి Jean Do కి సేవ చేయడానికి వచ్చే నర్స్ లు ట్రైనర్ లు చాలా అందమైన ఫ్రెంచ్ అమ్మాయిలు. Jean Do స్వతహాగా తిండి తినడం నేర్చుకోవాలంటే అతను నాలుకతో exercise చేయాలని చెప్తూ వాళ్ళు చేసి చూపిస్తుంటే అన్నీ చచ్చుబడి పడక మీద ఉన్న Jean Do కి రావాల్సిన ఆలోచనలే వస్తాయి. ఎంతైనా అతను మగాడు కదా మరి. “God this is not fair” అనుకుంటాడు అతను మనసులో.

సినిమా trilar

మొదట్లో తన పరిస్థితి పట్ల అతనే జాలి పడుతూ అదే పడక మీద రోజులు వెళ్లదీస్తున్న Jean Do ఒక రోజు ఇక ఆ ఊబిలోంచి బయటకు వచ్చేస్తాడు. అతని speech therapist ఒక alphabet board తయారు చేసి అతనికి కావాల్సిన అక్షరం చదివినప్పుడు అది అవునంటే ఒక సారి కన్నార్పమంటుంది. అలా ఒక్కో అక్షరానికీ ఒక్కోసారి alphabet చదువుతూ మొత్తానికి ఒక పదం కమ్యూనికేట్ చేయడం అలవాటు చేసుకుంటాడు. తర్వాత వాక్యాలు కూడా dictate చేస్తాడు. అలా ఆ ఎడమ కన్ను blink చేస్తూ ఒక పుస్తకం రాస్తాడు Jean Do. ప్రపంచంలో కోమా లోనో paralysis వచ్చి మంచం మీదో ఎంతో మంది ఉన్నా ఇతని కధే సినిమా అవ్వడానికి కారణం ఈ పోరాట పటిమే.

Jean Do కి ఆ stroke రాకపోయి ఉంటే అతని జీవితం ఎలా ఉండేది? అద్భుతంగా ఉండేది. ఐతే అది ఇక అప్రస్తుతం. ఆ విషయం గుర్తించినప్పుడే అతని జీవితం మళ్ళీ ప్రారంభం అయ్యింది.

నిర్దాక్షిణ్యంగా అతని జీవితం మొత్తం అతన్నుంచి కత్తిరించబడింది. ఐతే ఇంకా ఒక కంటికి సరిపడా వెలుగు కళ్ళలోంచి లోపలికి పడుతుంది కదా. ఆ వెలుగులో అతని జీవితాన్ని తేరిపారా చూసుకున్నాడు Jean Do. మాట్లాడలేని, కదల్లేని అతని శరీరం ఊహకి మాత్రం ఇంకా అనుమతిని ఇస్తుందని గుర్తించి మనో ప్రపంచపు లోతుల్లోకి వెళ్తాడు. ఇలా జరక్కపోయి ఉంటే అనే ప్రశ్న ఒక చీకటి చెరసాల. అక్కడ చిక్కుకున్నవాడికి విడుదల ఉండదు. జీవితం ఈ ఈ విషయాలతో కట్టబడుతుంది అని మనం నమ్మేవి అన్నీ చాలా సన్నటి శరీరానికి తొడిగిన బరువైన ఆభరణాలు. దానికి రుజువే ఈ చిత్రం. సామాజిక జీవితం నుండి పూర్తిగా తుంచబడి మెదడు లో బంధించబడ్డ Jean Do ది కూడా జీవితమే. ఈ జీవితం దేనితో కట్టబడింది? అతని హాస్పిటల్ గదిలోకి చొరబడే వెలుతురు రేఖల వెచ్చదనం, రకరకాల శబ్ద తీవ్రతలతో అతనికి వినబడే మాటలు, ముఖాన్ని తాకే గాలి, చెమట వాసన, నొప్పి, అతన్ని చూడటానికి వచ్చేవాళ్ళ కళ్ళలో అతని పరిస్థితి పట్ల ఆసక్తి, అతని మస్తిష్కంలో ఇప్పటినుండి అతని ఊహ మొదలైన రోజు వరకూ అనంతంగా పరుచుకున్న గతం, ఇవన్నీ అతని జీవితాన్ని కడతాయి, కుడతాయి. ఈ పరిధుల మధ్య చిక్కే అనుభవాల్ని, అనుభూతుల్ని మాత్రమే లక్ష్యపెట్టి, తక్కిన మనుషులకు ఇవ్వబడుతున్న అపారమైన జీవితాన్ని ఒప్పుకుని తనదైన ప్రత్యేక పరిస్థితిలో నిలదొక్కుకోవడమే Jean Do చేయగలిగింది.

ఇందాక అన్నట్టు జీవితం ఆయా విషయాలతో కట్టబడుతుందని చెప్పబడేవి అన్నీ అలంకారాలే. మరి శరీరం? రియాలిటీ ని వెలుగుగా, శబ్దంగా, స్పృహగా కొలుస్తున్న మన human consciousness. ఈ అలంకారాలతో నిమిత్తం లేకుండా ఆ spectrum లో నిలబడితే ఆ కాస్త వెలుగూ అబ్బురమే అనిపిస్తుంది. అలా దృశ్యంలోంచి జ్ఞాపకం లోకి, ఊహలోకి తప్పిపోయే అతని అంతరంగాన్ని ఛాయాగ్రాహకుడు dreamy visuals తో చక్కగా ఆవిష్కరించాడు.

ఆ ఒక్క కంటిరెప్పనే సీతాకోక చిలుక రెక్క లాగ ఆడిస్తూ Jean Do ఇక్కడ మనకో రెండు మాటలు చెప్పగలడు. అది తన పుస్తకంలో చెప్పిందే. అన్నీ మూసేయబడి ఓ గుప్పెడంత వెలుతురే మిగిలితే, ఆ వెలుతురులోనే నడవమని.

“నీ పరిస్థితి నేను అర్ధం చేసుకోగలను” అని Jean Do తో అంటుంటారు ఈ సినిమాలో తక్కిన పాత్రలు. Jean Do తండ్రి ఒక యనాభయ్యేళ్ళ ముసలాడు. “ఒక అంతస్తు ఎక్కలేను, దిగలేను. నువ్వు నీ శరీరంలో ఇరుక్కుపోయావు. నేను నా గదిలో” అంటాడు కొడుకుతో ఫోన్ లో.

ఇదివరకూ Jean Do సహాయం చేసిన వ్యక్తి ఒకడు తనను చూడటానికి వచ్చి అతని plane హైజాక్ చేయబడ్డ అనుభవాన్ని గుర్తు చేసుకుని “ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అప్పుడు నాకూ అలానే అనిపించింది” అంటాడు.

Bauby, blinking, to Claude Mendibil, transcribing, 1996

మనుషులందరూ ఏదో ఒక స్థాయిలో తమలో తాము, తమ జీవితంలో తాము, తమ పరిస్థితుల్లో తాము ఇరుక్కుపోయి కదల్లేని నిస్సహాయతతో చుట్టాముట్టబడతారు కాబోలు. అందుకే ఇలాంటి సినిమాలు మనతో మాట్లాడగలుగుతాయి. మనకు కావాలనుకున్న జీవితం నుండి వేరు చేయబడి వేరెక్కడో బలవంతంగా పాతబడ్డప్పుడు మన అనుభవం ఏమిటి? మన కార్యాచరణ ఏమిటి? జీవితం దాని అర్ధం మొత్తాన్నీ కోల్పోయినట్టేనా?

కావచ్చు. ఐతే ఆ వ్యాఖ్యానం మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. ఆ ఒక్క కంటిరెప్పనే సీతాకోక చిలుక రెక్క లాగ ఆడిస్తూ Jean Do ఇక్కడ మనకో రెండు మాటలు చెప్పగలడు. అదేంటో తెలుసుకోవాలంటే మనం alphabet board వెతుక్కోనక్కర్లేదు. అతని పుస్తకంలో చెప్పిందే అతని పుస్తకంతో కూడా చెప్పాడు. అన్నీ మూసేయబడి ఓ గుప్పెడంత వెలుతురే మిగిలితే, ఆ వెలుతురులోనే నడవమని. Rage, rage against the dying of the light.

(Mubi లో ఉంది)

స్వరూప్ తోటాడ ఇటీవల వెలువరిచిన వ్యాస సంపుటి -UNTITLED. తెలుపులో ప్రచిరితమైన దాని ముందు మాట ఇక్కడ క్లిక్ చేసి చదవొచ్చు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article