Editorial

Friday, May 17, 2024
సాహిత్యం'పృథ' పునః కథనం : చీకటి వెక్కిళ్లలోని కాంతి లేని ముఖం

‘పృథ’ పునః కథనం : చీకటి వెక్కిళ్లలోని కాంతి లేని ముఖం

ఈ సాయంకాలం 21 జనవరిన 6 గంటలకు వేదిక అంతర్జాలంలో రేణుక అయోల రాసిన ‘పృథ’ సుదీర్ఘ కవితా సంపుటిపై మీరు చదవబోయే ఈ విశ్లేషణకు గాను తూముచర్ల రాజారామ్ గారు నవసాహితీ ఇంటర్నేషనల్ ఉత్తమ సాహితీ విమర్శ పురస్కారం అందుకుంటున్నారు. పురస్కార ప్రదాత – ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు డాక్టర్ కె. శ్రీనివాస్. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతూ అ విమర్శనా  వ్యాసం తెలుపుకు ప్రత్యేకం.

రాజారామ్ తూముచర్ల

“చూపులలో హింస చేతులలో హింస
అన్నిటిలోనూ ఆమె రక్తం ప్రవహిస్తూనేవుంది
చరిత్ర పొరల్లో దొరికిన అప్పటి చిత్రం
ఇప్పటి ముఖం ఒక్కలాగే వున్నప్పుడు
సమాధానం లేని ప్రశ్నలు వెంటబడినప్పుడు
తన వెనకే రమ్మని పిలిచిన అక్షరాల మధ్య
తొంగి చూస్తే కనబడిన దృశ్య కావ్యమే పృథ“

“పృథ వొక అన్వేషణ “ – అనే దీర్ఘ కవిత ఆవిర్భావానికీ గల నేథ్యాన్ని రేణుక అయోల గారు తన మాటల్లో పై వాక్యాల్లో చెప్పారు. పృథ ఒక ఐతిహాసిక పాత్ర. పృథకీ కుంతి అనే మరో పేరు కూడా వుంది.ఈ పేరే ఎక్కువ జనాల నోళ్ళల్లో నానుతున్నది.

అతి ప్రాచీనమైన పురాణ ఐతిహాసిక కథల్నో పాత్రల్నో తిరగతోడి పునఃర్లిఖించడానికీ ఎంతో సాహసం కావాలి.చిత్ర బెనర్జీ దివాకరుని గారు రాసిన “ The palace of illussions “ లోను అనే కవితా కానే గారు రాసిన “Karana’s wife “మున్నగు నవలల్లో కర్ణుడు, ద్రౌపది పాత్రల మనోధర్మ నిర్మాణంలొనూ, చిత్రీకరణలోనూ ఈ రచయితలు కొత్తపుంతలు తొక్కారు. అట్లాగే తెలుగులో కొందరు రచయితలు ఈ మార్గంలోనే రామాయణ, భారతాలలోని పాత్రల్ని పునర్లిఖించారు. ఓల్గా గారు ప్రధానంగా ఈ రామాయణ,భారతాలలోని స్త్రీ పాత్రలని మూల కథలొని పాత్రలకన్నా భిన్నంగా వాటిని సాధారణ మానవుల స్థాయికి తెచ్చి ఈనాటి రాజకీయ, సాంఘీక, ఆర్థిక మానవ సంబంధాల పరిస్థితులకీ అన్వయించారు.

“ఇలాంటి పునఃర్లేఖనాలు ఈనాటి సామాజిక అవసరం. పిల్లలు కలుగకపోవడానికీ కారణం స్త్రీ మాత్రమే అనే భావన ఇంకా సమాజపు పాదుల్లోంచి పోలేదు. స్త్రీల పట్ల జరుగుతున్న దోపిడి..తండ్రి ఎవరో తెలియని బిడ్డల దుస్థితి .ఇవన్నీ ఈ కావ్య ప్రాసంగికాలే.

ఓల్గా గారి కన్నా ముందుగానే పురాణ కథనాల పునఃకథనాలను తెలుగు లో త్రిపురనేని గారి శంభూక వధ, నార్ల వారి జాబాలి, సీత జోస్యం, చలం గారి పురూరవ, యార్లగడ్డ వారి ద్రౌపది మున్నగు పునర్లేఖనాలు వచ్చాయి.ఇతర భాషల నుండి కూడా యుగాంతం, పర్వ, అసుర అనే రచనలు వచ్చాయి. వీటిలో యల్. భైరప్ప గారు కన్నడలో రాసిన “పర్వ” అనే నవల అనేక కొత్త ఆలోచనల్ని ఇచ్చింది.

ఈ నవల చదివాక తనలో చిన్నప్పటినుంచి రేగుతున్న అనేకానేక ప్రశ్నలకు రేణుక గారికి దొరికిన సమాధానాలు ఊరకుండనీయలేదు. అలా ఊరకుండనీయని ఆలోచనలనుంచే పుట్టుకొచ్చిన కావ్యమే “ పృథ వొక అన్వేషణ. “ఇలాంటి పునఃర్లేఖనాలు ఈనాటి సామాజిక అవసరం. పిల్లలు కలుగకపోవడానికీ కారణం స్త్రీ మాత్రమే అనే భావన ఇంకా సమాజపు పాదుల్లోంచి పోలేదు. స్త్రీల పట్ల జరుగుతున్న దోపిడి..తండ్రి ఎవరో తెలియని బిడ్డల దుస్థితి .ఇవన్నీ ఈ కావ్య ప్రాసంగికాలే.

అందరు రచయితలు కథకులు తమ పునర్లేఖనాలను నాటకంగానో, నవలగానో,కథలగానో రాశారు. కవిత్వంగా ఎవరన్నా ఇతర భాషల్లో రాశారో లేదో తెలీదు. కానీ తెలుగులో వచనకవిత్వంలో అందులోను దీర్ఘ కవితగా ఒకప్పటి పౌరాణిక పాత్రని ఇప్పటి తరం ఆలోచనల ప్రతిబింబంగా వొక అన్వేషణతో మొదటగా పునఃకథనం చేసింది చేస్తున్నది రేణుక అయోల గారేనని ఎలాంటి సందేహం లేకుండా స్పష్టంగా చెప్పొచ్చునేమో.

కవయిత్రి రేణుక అయోల ‘పృథి’ తో…

ఒకప్పటి పౌరాణిక పాత్రని ఇప్పటి తరం ఆలోచనల ప్రతిబింబంగా వొక అన్వేషణతో మొదటగా పునఃకథనం చేసింది చేస్తున్నది రేణుక అయోల గారేనని ఎలాంటి సందేహం లేకుండా స్పష్టంగా చెప్పొచ్చునేమో.

నాకు తెలిసీ పృథ, మాద్రి లాంటి పౌరాణిక స్త్రీ పాత్రలను పునఃకథనాలుగా ఫ్రీ – వర్స్ లో దీర్ఘకావ్య రూపంలో మొదటగా రాసింది మాత్రం రేణుక అయోల గారే. పృథ గురించే ఎందుకు రాశారో కూడా రేణుక గారు స్పష్టం చేశారు. కవయిత్రి కావ్య ఆరంభంలోనే ఇలా అంటారు.

“ఎప్పటికప్పుడు
ఎంతో తేలికగా వొక నింద
వాళ్లమీద వాలుతూనే వుంటుంది
ఎవరిదో వొక మాట వీపు అద్దానికి తగిలి
ముక్కలవుతూనే వుంటుంది
వందలు వేలుగా ఆమె ముఖం
చరిత్ర రహదారిలో నాపరాళ్ళుగా
పరచబడుతునే వుంటుంది“

ఈ ప్రారంభవాక్యాలను బట్టే ఈ దీర్ఘ కవితలో కవయిత్రి పునఃర్లేఖనం చేయాలనుకున్న పాత్రల్ని స్త్రీవాద నేపథ్యంలోనే నిర్మించాలనుకున్న దృక్పథం ద్యోతకమవుతుంది. ‘చాలుతుందో చాలదో అడిగే హక్కు నీకెక్కడిది”- అని అనడంలోనే ధిక్కార స్వర తీవ్రతను, ”అందమైన దేహం చుట్టూ కథ, కథ చుట్టూ నమ్మకాలు, బానిసత్వాలు “అని అనడంలో స్త్రీవాద దృష్టికోణాన్నికవయిత్రి సూచిస్తుంది. కుంతీ కథ అందరికీ తెలుసు. కానీ ఆ పాత్ర యొక్క ‘ దుఃఖంతో పొలమారిన గొంతు’ నిస్సహాయస్థితిని కవయిత్రి చాలా గొప్పగా పునఃకథనం చేసింది. పృథ జీవితం కింద మంటలు పెట్టినమాటల్ని చూపెట్టింది.

మాద్రి పాత్రలోని ‘ కాలిపోతున్న కలల ఆరని నిప్పు”ని, ‘చీకటి వెక్కిళ్లలోని కాంతి లేని ముఖాన్ని రేణుక అయోల గారు ఈ దీర్ఘ కవితలో పునర్లిఖించారు. ఇతిహాసపు చీకటి కోణంలో కనిపించని కుంతీ, మాద్రి పాత్రలకు సంబంధించిన కథల్నివచన కవిత్వంలో జ్వలితం చేశారు. పౌరాణిక పాత్రల పునర్లేఖనం కవయిత్రి అనుభూతి సాంద్రతతో కవిత్వపు చిక్కదనపు మెరుపులతో పరిమళం చెడకుండా పరిపక్వతతో చేశారు. కవిత్వ నిర్మాణంలో, నడకలో కుంతీ,మాద్రి పాత్రల సోయగపు నడకలా రేణుక గారు నడిపించారు. ఈ కవయిత్రి కవిత్వ నిర్మాణ మార్మికత తెలుసుకోవడానికీ ఈ వాక్యాలు చూడండి.

“రాత్రీ సమయాల నక్షత్రాల్ని పోగుచేసుకొని
మిగిలిన శున్యమంతా తానై
కూలిన మాద్రి
తోటంతా తిరిగొచ్చిన ,సీతాకోక చిలుకలా
తబాధంతా చెప్పుకుంటూ
నిలువునా నీరై
కుంతి ఒడిలో ముడుచుకొని పడుకుంది“

ఇట్లాంటి కవిత్వ సాంద్రత వున్న వాక్యాలు ఈ దీర్ఘ కవితలో అనేక చోట్ల అగుపిస్తాయి. పురాణ పాత్రల పునఃర్లేఖనమే కదా! కేవలం సిద్ధాంతాల వాదాల ప్రతిబింబాలుగా పాత్రల్ని మలిస్తే చాలుకదా! అని రేణుక గారు భావించలేదు.రక్తమాంసాలున్న సజీవ పాత్రలుగా సాటి స్త్రీ అయిన మాద్రికీ కూడా జరుగుతున్న దురన్యాయాన్ని గుర్తించి ఆలోచించదగ్గ పాత్రగా పృథని కవయిత్రి శిల్పీకరించింది.

గతంలో రాసిన కథల్నే,గతంలో చిత్రించిన పాత్రల్నే మళ్లీ ఎందుకు పునఃకథనం చేయాలని ఎందరో అనుకుంటుంటారు. పురాణాలలో, ప్రాచీన కావ్యాలలో పేర్కొనబడిన కొన్నిటికీ కాలం చెల్లివుండొచ్చు.ఆ పురాణాలు కావ్యాలు ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయి కాబట్టి వాటిని చూసుకొని మరొకసారి మాట్లాడుకోవలసివున్నది. అలా మాట్లాడుకోవడానికీ పునఃర్లేఖనం అవసరం. పునర్లేఖనమంటే..మూల గాథల్లో వున్న గ్యాప్ లను (ఖాళీలను) పూడ్చుతున్న వైనమే. కుంతీ,మాద్రి పాత్రల నిర్మాణంలో వున్న ఖాళీలను సమర్థవంతంగా రేణుక అయోల గారు పూరించి వొక సత్యాన్వేషణ చేశారని చెప్పొచ్చును. 2021 లో పృథ , మాద్రి ల మనోగతాల్ని విశ్లేషించిన అద్భుత రచనగా ఈ దీర్ఘ కావ్యం నిలుస్తుందని విశ్వసిస్తున్నా.

‘పృథ’ పుస్తకావిష్కరణ అనంతరం రచయిత్రి రేణుక అయోల స్పందన ఈ వీడియో ద్వార వీక్షించండి

 

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article