Editorial

Tuesday, May 14, 2024
అభిప్రాయంఎవరు సన్నాసి? భూముల అమ్మకంపై దుర్గం రవీందర్ తెలుపు

ఎవరు సన్నాసి? భూముల అమ్మకంపై దుర్గం రవీందర్ తెలుపు

భూముల అమ్మకాన్ని కోర్టులు తప్పు పట్టిన సంగతి తెలుసు. తెలంగాణ వాదులు గత పాలకులనూ ఆక్షేపించడమూ తెలుసు. అన్నీ తెలిసిన కేసీఆర్ భూముల అమ్మకాని ప్రశ్నిస్తే వారిని ‘సన్నాసులు’ అని ఎద్దేవా చేయడం విచిత్రం. కబ్జాలకు గురయ్యే అవకాశమున్నచోటే భూములు విక్రయిస్తున్నామని అనడం బక్వాస్ ముచ్చట.

దుర్గం రవీందర్

Durgam Ravinderఅవి ప్రభుత్వ భూములు కావు, అవి రాజ్యపు భూములు, ఐదేళ్లు పాలించడానికి నియమితులయిన వారు భూములను శాశ్వతంగా అమ్మేయడం కుదరదు, అది తప్పు, చట్ట విరుద్ధం, అధర్మం  అని గతంలో కోర్టులు చెప్పాయి. అంతేకాదు, ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు, వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి తదితరులు హైదరాబాద్ లో భూములు వేలం వేసి అమ్ముతుంటే దాదాపు తెలంగాణా వాదులందరు దాన్ని నిరసించారు, ఆక్షేపించారు. ఇప్పుడు అదే పని చేస్తున్న ముఖ్యమంత్రిని ఆ పని చేయవద్దు అంటే ‘సన్నాసులు’ అని సాక్షాత్తు ముఖ్య మంత్రి అనడం విచిత్రం.

భయపడో, ప్రయోజనం ఆశించో మేధావులు, పత్రికా ఎడిటర్లు, సుదర్శన్ రెడ్డి లాంటి రిటరైడ్ జడ్జిలు, మాజీ మంత్రులు తేదితరులు మౌనంగా ఉంటున్నారు. తెలంగాణ ఏర్పడినాకా ఇది మూడవ దఫా అమ్మకం.

హైదరాబాద్‌ నగరంలో కేవలం 40 ఎకరాల భూమి అమ్మితే ఏకంగా రూ 2 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గర్వంగా అన్నారు. కబ్జాలకు గురయ్యే అవకాశమున్నచోటే భూములు విక్రయిస్తున్నామని, భూములు అమ్మిన డబ్బులు పేదల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని సీఎం వివరించారు.

నిస్సహాయ తెలంగాణ

“తెలంగాణ.. ఒక బంగారు తునక. ఇక్కడ సమృద్ధిగా వనరులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పరాధీనమై నలిగిపోయామే తప్ప… మనకు వనరులు లేక కాదు! ఎకరం రూ.45 కోట్లు పలుకుతుందంటే తెలంగాణలో భూముల విలువ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.  హైదరాబాద్‌లో చిన్న, చిన్న ముక్కలు అమ్మితేనే వేలకోట్లు వచ్చినయ్‌. అది ప్రజా ధనం. ఈ సొమ్మును చేనేతలు, దళితులు, పేదల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తాం. సమాజంలో ఉన్న ప్రతి వర్గం, ప్రతి కార్మికుడు, ప్రతి ఒక్కరూ తలెత్తుకొని మాది తెలంగాణ.. అని చెప్పే పరిస్థితిని తీసుకురావడమే నా లక్ష్యం’’ అని సీఎం కేసీఆర్‌ నిన్న తెలంగాణ టిడిపి అధ్యక్షులు రమణ టిఆర్ ఎస్ చేరిక సమయంలో మాట్లాడుతూ ఇలా ప్రకటించారు. ఈ సందర్భంగా భూములు అమ్ముతుండడంపై “కొందరు సన్నాసులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ” ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్రమేమిటంటే, కబ్జాలకు గురయ్యే అవకాశమున్నచోటే భూములు విక్రయిస్తున్నామని అనడం  హాస్యాస్పదమయిన బక్వాస్ ముచ్చట. ప్రభుత్వం , రాజ్యం అంత బలహీనమయినవేమీ కాదు. వ్యక్తులు, కబ్జాకోరులు భూములు ఆక్రమిస్తుంటే నిస్సహాయంగా ఎందుకుంటాయి, ఉండకూడదు. అలా ఉంటే గింటే  అందులో  లోపాయికారి ఒప్పందం ఏదో ఉన్నట్లు అర్థం తప్పా మరొకటి కాదు.

ప్రజా అవసరాలకు తిరిగి ఎం చేస్తాం?

ప్రభుత్వం భూములను అమ్మకూడదని గతంలో సుప్రిం కోర్ట్, హై కోర్ట్ పలు సంధార్భాల్లో స్పష్టంగా చెప్పాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలాయాలు ఎన్నో ఇప్పటికీ అద్దె భవనాల్లో ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వ బడులు, దవాఖానాలు అద్దె ఇండ్లల్లో, ఇరుకు భవనాల్లో శిథిల భవనాల్లో నడుస్తున్నాయి. ప్రజా అవసరాల కోసం భవిష్యత్ లో భూమి అవసరం అయితే ఎలా? అమాయక గ్రామీణ రైతుల దగ్గర గుంజుకున్నంత తేలికగా నగరంలో భూమిని ప్రభుత్వం సేకరించలేదు. అంతేకాదు, ఎన్నో విధాలా అమ్మకం కూడని పని. అతిశయోక్తి కాదు గానీ, ప్రభుత్వం అమ్మే భూమిని పొరుగు రాష్ట్రమో, దేశమో కొని అది మా భూమి అక్కడ మా జెండా ఎగరేస్తాము అంటే మనం చేసేది ఏముంటుంది?

“ఉమ్మడి సంసారంలో వ్యవహారం తెలియని, అనుభవం లేని కొడుకు చేతికి అధికారం వస్తే పెద్దలు కూడ బెట్టిన ఆస్తులు అమ్మి, అప్పులు చేసి సంసారాన్ని నడిపినట్లు ఉంది రాష్ట్ర పాలన. తల్లిని చెల్లెలును తార్చి, ఆలు బిడ్డలను అమ్మి ఇల్లు నడిపినట్లు ఉంది “ అని ఒక సఫాయి కార్మికురాలు అన్న మాట  ఆలోచింప చేస్తున్నది.

సద్వినియోగం అనుమానమే

అది పన్ను అయినా, భూమి అమ్మినా ముందుగా ఆ డబ్బు ప్రభుత్వ ప్రధాన ఖజానాకు వెళుతుంది. ఆ డబ్బును ముఖ్యమంత్రి అభిష్టం మేరకు ఖర్చు చేస్తారు, నిజానికి ఆర్థిక శాఖ ఆచి తూచి డబ్బులు ఖర్చు చేయాలి  కానీ చాలా కొద్ది రాష్ట్రాల్లో అలా జరుగుతుంది, చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి అభీష్టం మేరకే, ఖర్చులు, బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. ఈ భూములు అమ్మిన డబ్బు దళిత బహుజనుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తాము అనడము అర్థం లేని మాట. ఆ డబ్బులు  పులుసులో కలిసి పోయి సద్వినియోగం కావన్నది మాత్రం ఎక్కువ నిజం.

2019-20 లో రెవెన్యూ వసూళ్లు 1,02,544 కోట్ల రూపాయలు, 2020-21 లో 1,43,151.84 కోట్ల రూపాయలు ఉంది. ఇది కాకుండా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు భూములు అమ్ముతున్నారు. ఒక వ్యక్తి తల మీద దాదాపు ఆరు లక్షలు అప్పు చేసినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ప్రపంచములో ఎక్కడా లేనంత ధరకు రాష్ట్రంలో పెట్రోలు అమ్ముతున్నారు. ఏడాదికి 30 వేల కోట్ల ఆదాయం సారాయి అమ్మకాలమీద వస్తున్నది. రాష్ట్రంలో డబ్బు అంతా ఒకటిన్నర కులాల వారి దగ్గర ప్రోగు అవుతున్నది. కార్పొరేట్ దవాఖానాలు, కార్పొరేట్ల దోపిడి ఘరానాగా సాగిపోతున్నది.

ఏ మూలకు ఈ డబ్బులు?

నగరంలో కోకాపేట భూముల తర్వాత, ఖానామెట్‌ భూముల ఈ-వేలం ముగిసింది. ఖానామెట్‌లోని దాదాపు 15 ఎకరాల్లో 5 ప్లాట్లకు వేలం జరిగింది. కోకాపేటలో భారీ రేటు వచ్చిందనుకుంటే, ఖానామెట్ భూములు అంతకుమించిన ధర పలికాయి. ఊహించినదాని కంటే భారీ ఆదాయం వచ్చింది. సైబర్ టవర్స్‌కు కూత వేటు దూరంలో ఉన్న భూముల విక్రయంతో ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం వచ్చింది. లక్షన్నర కోట్ల ఆదాయం ఉన్న రాష్ట్రంలో 729 కోట్లు ఏ మూలకు వస్తాయో ఆలోచించవచ్చు.

రియల్టర్ గా ప్రభుత్వం

ఖానామెట్‌లో ఎకరం భూమి ధర అత్యధికంగా రూ.55 కోట్లు పలికింది. కోకాపేటలోని 49.94 ఎకరాల భూమిని నిన్న తెలంగాణ ప్రభుత్వం విక్రయించిన సంగతి తెలిసిందే. 8 ప్లాట్లుగా విభజించి వేలం పెట్టగా ప్రభుత్వం ఊహకు అందని ధర పలికింది. గరిష్ఠంగా ఎకరం భూమి 60 కోట్ల రూపాయలు పలికింది. మొత్తం 49 ఎకరాల విక్రయం ద్వారా రూ.2 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. హెచ్‌ఎం డి ఏ హైదారాబాద్ మహా నగర అభివృద్ది సంస్థ, రాష్ట్ర పరిశ్రమల మౌలిక సాదుపాయాల సంస్థ (టి‌ఎస్ ఐ ఐ సి)  రియాల్టర్ అవతారమెత్తి భూములు అమ్మడమే అభివృద్ది అని చెబుతున్నాయి. ఇదెక్కడి సిగ్గు మాలిన తనం.

దగ్గరి వారికే కట్టబెట్టారని ఆరోపణలు

కోకాపేట భూముల వ్యవహారంలో తెలంగాణ పీసీసీ అద్యక్షులు  రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కోకాపేట భూముల వేలంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణ చేశారు. ఆ ప్రదేశంలో రూ.60 కోట్లకు ఎకరం అమ్ముడయ్యే భూమిని కేవలం రూ.30 నుంచి రూ.40 కోట్లకే ఎకరం అమ్మారని ఆరోపించారు. వేలం ప్రక్రియలో బయటి కంపెనీల వారు పాల్గొనకుండా అడ్డుకున్నారని అన్నారు. వేలంలో పాల్గొన్నవారంతా కేసీఆర్ బంధువులు సన్నిహితులే అని అన్నారు. తక్కువ ధరకే భూములను ఆ కంపెనీలకు కట్టబెట్టారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article