Editorial

Wednesday, May 22, 2024
Songబతుకమ్మ పాట - పద్మ త్రిపురారి

బతుకమ్మ పాట – పద్మ త్రిపురారి

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల

పద్మ త్రిపురారి

ప్రకృతి పండుగ ఉయ్యాలో
సంస్కృతే చాటంగ ఉయ్యాలో
సౌభాగ్యమిచ్చేటి ఉయ్యాలో
సల్లని బతుకమ్మ ఉయ్యాలో
జగతి సిగలోన ఉయ్యాలో
వెలిగినే బతుకమ్మ ఉయ్యాలో
తొమ్మిది సద్దులు ఉయ్యాలో
తీరు తీరున పెడుదురూయ్యాలో
చింత పులుపు సద్ది ఉయ్యాలో
చెంత చేరి ఇద్దు ఉయ్యాలో
చింతలే తీర్చమ్మ ఉయ్యాలో
చలువనే పంచమ్మ ఉయ్యాలో
నిమ్మకాయ సద్ది ఉయ్యాలో
నెనరుతోడ పెడుదు ఉయ్యాలో
నెమ్మదైన ఓర్పు ఉయ్యాలో
నెమ్మి పెంచవమ్మ ఉయ్యాలో
పెరుగుతోటి సద్ది ఉయ్యాలో
ప్రేమతో పెడుదు ఉయ్యాలో
పెరుగుతున్న స్వార్థముయ్యాలో
తుంచవమ్మ జనుల ఉయ్యాలో
పెసరుతోటి సద్ది ఉయ్యాలో
కొసరి ఇద్దునమ్మ ఉయ్యాలో
పెరిగిన అవినీతి ఉయ్యాలో
వేళ్ళతో కదిలించు ఉయ్యాలో
నువ్వుల సద్దిని ఉయ్యాలో
నమ్మినీకిద్దును ఉయ్యాలో
నిలిచిన అభివృద్ధి ఉయ్యాలో
నీవునడుపవమ్మ ఉయ్యాలో
కొబ్బరి సద్దిని ఉయ్యాలో
కోరి నీకు పెడుదు ఉయ్యాలో
కోపాలు తాపాలు ఉయ్యాలో
లేకుండ చూడమ్మ ఉయ్యాలో
శనగపప్పు సద్ది ఉయ్యాలో
శ్రద్ధతో ఇడుదును ఉయ్యాలో
శ్రద్ధను బుద్ధిని ఉయ్యాలో
మంచినే పెంచమ్మ ఉయ్యాలో
ఆవపొడిసద్ది ఉయ్యాలో
ఆత్మతో నేపెడుదు ఉయ్యాలో
ఆత్మీయతే పంచి ఉయ్యాలో
అనురాగమే పెంచు ఉయ్యాలో
దబ్బనిమ్మ సద్ది ఉయ్యాలో
దండిగా నేనిద్దు ఉయ్యాలో
ధనదాన్యాలిచ్చి ఉయ్యాలో
దయతో మము సూడు ఉయ్యాలో
మలీద ముద్దలు ఉయ్యాలో
మమతతో నేనిడుదు ఉయ్యాలో
మితిమీరిన చెడును ఉయ్యాలో
మనుషుల్ల తగ్గించు ఉయ్యాలో
సత్తుపిండి ముద్దలుయ్యాలో
సత్యంగ నేనిద్దు ఉయ్యాలో
సత్తునే మాకిచ్చి ఉయ్యాలో
సత్యమే పెంచమ్మ ఉయ్యాలో
పసుపు కుంకుమలు నీకు ఉయ్యాలో
పసిడిగా నేనిద్దు ఉయ్యాలో
పాడి పంటలు మాకు ఉయ్యాలో
పచ్చగా పండించు ఉయ్యాలో
భక్తి శ్రద్ధలతోటి ఉయ్యాలో
మెండుగా పూజిద్దునుయ్యాలో
పిల్ల పాపల జనులనుయ్యాలో
సల్లంగ సూడమ్మ ఉయ్యాలో

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article