Editorial

Sunday, May 19, 2024
సాహిత్యంనేటి మథనం : వాడ్రేవు చినవీరభద్రుడు

నేటి మథనం : వాడ్రేవు చినవీరభద్రుడు

తెలుగు భాష గురించి మాట్లాడేవాళ్ళంతా, సాహిత్యభాషగా తెలుగు గురించి మాట్లాడుతున్నారు. సాహిత్య భాషగా తెలుగు ప్రపంచంలోని అత్యుత్తమమైన పదిభాషల్లో ఒకటి. ఆ విషయంలో దిగులు లేదు. కానీ వ్యాసకర్త తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్నది శాస్త్ర, సాంకేతిక భాషగా, సామాజిక శాస్త్రాల భాషగా తెలుగు వికసించవలసిన అవసరం గురించి. ఆ దిశలో ఈ వ్యాసం ఒక మేలుకొలుపు.

ఒక భాష అంతర్జాతీయంగా విస్తృతిపొందడానికీ, గ్లోబల్ భాషగా ఎదగడానికీ మధ్య చాలా అంతరముంది. ఒక భాష మాట్లాడేవాళ్ళు ప్రపంచదేశాలు చాలా వాటిలో విస్తరించి ఉంటే ఆ భాషని అంతర్జాతీయ భాష అనవచ్చు. కానీ, ఒక భాష నేర్చుకోవడానికో లేదా ఆ భాషలో మూలగ్రంథాలు చదవడానికో వివిధ భాషలకి చెందినవాళ్ళు ఆసక్తి కనబరుస్తూ ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని గ్లోబల్ భాష అని పిలవగలుగుతాం. ఇంగ్లిషుకాక, స్పానిష్, ఫ్రెంచి, జపనీస్, చైనీస్ లాంటి భాషల్ని గ్లోబల్ భాషలు అనవచ్చు. భారతీయ భాషల్లో సంస్కృతానికి అటువంటి స్థాయి ఉంది. హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీల్ని కూడా నేర్చుకోడానికి విదేశీయులు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. కాని తెలుగు?

ఒకప్పుడు మా హీరాలాల్ మాష్టారు ఒక మాట చెప్పారు నిన్న ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పుస్తకానికి హిందీ అనువాదం ఇవాళ మార్కెటులో దొరుకుతుందని. ఇప్పుడు మలయాళం గురించి ఆ మాట చెప్పవచ్చు. పదేళ్ళ కిందట ఆర్ఫాన్ పాం కి నోబెల్ పురస్కారం వచ్చినప్పుడు నా మిత్రురాలు ఆ పుస్తకాన్ని తాను మలయాళంలో చదివానని చెప్పింది. ఇదొక కొలమానంగా తీసుకుంటే, గత ఇరవయ్యేళ్ళల్లో నోబెల్ బహుమతి వచ్చిన ఎన్ని నవలలు తెలుగులోకి అనువాదమయ్యాయి? కవుల విషయంలో కూడా, ఒకటో రెండో కవితలు అనువదించడం కాదు, ఆ కవి గురించిన సమగ్ర పరిచయంతో కనీసం ఒక సంకలనమేనా తెలుగులోకి అనువాదమయ్యిందా?

తెలుగునుంచి ఎన్ని పుస్తకాలు ఇంగ్లిషులోకిగాని, ఇతర భాషల్లోకిగాని అనువాదమయ్యాయి? ఆ మధ్య నేను తమిళనాడులో పర్యటించినప్పుడు నాకు ఒక్క తమిళ అక్షరం రాకపోయినా సంగం సాహిత్యం నుండి సుబ్రహ్మణ్య భారతిదాకా ప్రసిద్ధ కవుల గురించి తెలుసుకోవడానికీ, వారి సాహిత్యం మాత్రమే కాదు, ఆ సాహిత్యం మీద విమర్శకులు ఏమి రాసారో తెలుసుకోవడానికీ కూడా నాకు ఇబ్బంది లేకపోయింది. ఎందుకంటే తమిళ సాహిత్యంలోని విశిష్టకృతులన్నీ దాదాపుగా ఇంగ్లిషులోకి అనువాదమయ్యాయి. షేక్ స్పియర్ లాగా తిరువళ్ళువర్ కీ, సంగం సాహిత్యానికీ ప్రతి ఏడాదీ కొత్త అనువాదం, కొత్త పరిచయం వస్తూనే ఉన్నాయి. ఇటువంటి విషయం మనం తెలుగు సాహిత్యం గురించి చెప్పుకోగలమా? ఎవరేనా తమిళనాడు నుంచి తెలుగు ప్రాంతంలో పర్యటిస్తూ ఒక్క తెలుగు అక్షరం కూడా నేర్చుకోకుండానే తెలుగు సాహిత్యం గురించి సాధికారికంగా మాట్లాడగలిగేటంతగా తెలుగు సాహిత్యం ఇంగ్లిషులో లభ్యమవుతున్నదా?

మనం ఒక గూగీని చదివినట్టు, ఒక అమిహాయ్ కవిత్వంకోసం పుస్తకాల షాపులు తిరిగినట్టు, ఒక రూమీ గురించి సమావేశాలు పెట్టుకున్నట్టు, ప్రపంచంలో ఎక్కడేనా ఒక తిక్కన గురించో, పోతన గురించో, కృష్ణశాస్త్రి గురించో మాట్లాడుకుంటున్నామా?

అసలు తెలుగు కవులెంతమంది గురించి ప్రపంచానికి తెలుసు? poetryinternational.org సమకాలిక కవుల గురించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన వెబ్ సైట్. అందులో ఇద్దరు తెలుగు కవులు, శివారెడ్డి, వరవరరావు కి మాత్రమే చోటు దక్కింది. గత అయిదేళ్ళలో ప్రపంచం ఎవరైనా తెలుగు కవి గురించి మాట్లాడిఉంటే అది వరవరరావు మాత్రమే. ఆయన ఆ గౌరవానికి పూర్తిగా అర్హుడు. కాని మనం ఒక గూగీని చదివినట్టు, ఒక అమిహాయ్ కవిత్వంకోసం పుస్తకాల షాపులు తిరిగినట్టు, ఒక రూమీ గురించి సమావేశాలు పెట్టుకున్నట్టు, ప్రపంచంలో ఎక్కడేనా ఒక తిక్కన గురించో, పోతన గురించో, కృష్ణశాస్త్రి గురించో మాట్లాడుకుంటున్నామా?

ఆధునిక యుగం మొదలయ్యేదాకా భాషా వికాసం సాహిత్యవికాసం మీద, మతగ్రంథాలకు భాష్యాలు రాయడం మీదా ఆధారపడేది. కాని 17, 18, 19 శతాబ్దాల్లో ఇంగ్లిషు, జర్మన్, ఫ్రెంచి భాషల్లో తత్త్వశాస్త్రం, సైన్సు, సామాజికశాస్త్రాల విస్ఫోటనం జరిగింది. అప్పటిదాకా సాహిత్యానికి మాత్రమే పరిమితమైన ఆంగ్లో-సాక్సన్ భాషని న్యూటన్, థామస్ హాబ్స్, ఫ్రాన్సిస్ బేకన్ లు వైజ్ఞానిక భాషగా, రాజనీతి, సామాజికవిశ్లేషణల భాషగా మార్చేసారు. అలా చూసినప్పుడు గత మూడు వందల ఏళ్ళల్లో తెలుగులో ఒకటేనా మౌలిక గ్రంథం, సైన్సులో, రాజనీతి శాస్త్రంలో, వైద్యం, ఇంజనీరింగ్ రంగాల్లో, తత్త్వశాస్త్రాల్లో , కనీసం ఒక్కటేనా వెలువడిందా? వడ్డెర చండీదాస్ Desire and Liberation కూడా తెలుగులో వచ్చి ఉంటే దాని గురించి ప్రపంచం ఈ రోజు మాట్లాడుకుంటున్నంతగా మాట్లాడుకుని ఉండేదా?

ఏనుగుల వీరాసామయ్య కాశీయాత్ర చరిత్ర తరువాత ఇంగ్లిషులోనూ తెలుగులోనూ వెలువడిన యాత్రాకథనం ఏదైనా ఉందా? తెలుగువాళ్ళల్లో ఎందరో పర్వతారోహకులు, సముద్రాల్ని ఈదినవాళ్ళు, అడవులు తరిచి చూస్తున్నవాళ్ళు, ఆకాశంలోకి ఎగిరినవాళ్ళు ఉన్నారు. ఎవరేనా ఒక్కరేనా తమ అనుభవాల్ని తెలుగులో గ్రంథస్థం చేసారా? సైన్యంలో, రాజకీయాల్లో, విదేశీ దౌత్యంలో, అంతర్జాతీయ శాంతికాముక ప్రయత్నాల్లో, ఆఫ్రికా దేశాల్లో కరువునివారణలో పాలుపంచుకుంటున్న తెలుగు వాళ్ళకి తక్కువలేదు. ఎవరేనా ఒక్క పుస్తకమేనా తెలుగులో రాసారా? లేదా ఇంగ్లిషునుంచి తెలుగు చేసారా? లేదా తెలుగులోంచి ఏ పుస్తకమేనా ఇంగ్లిషులోకి అనువదించారా?

2018 లో సరిగ్గా ఈ రోజు నేను ఇట్లాంటి అభిప్రాయాలే రాసాను. ఈ మూడేళ్ళల్లోనూ నా దృష్టికి వచ్చినవి రెండు పుస్తకాలే.

2018 లో సరిగ్గా ఈ రోజు నేను ఇట్లాంటి అభిప్రాయాలే రాసాను. ఈ మూడేళ్ళల్లోనూ నా దృష్టికి వచ్చినవి రెండు పుస్తకాలే. ఒకటి ఎప్పుడో శతాబ్దకాలానికి కిందట, వలసకూలీగా దక్షిణాఫ్రికా వెళ్ళిన తన ముత్తాత వీరయ్య గురించి కృష్ణ గుబిలి ఇంగ్లిషులో రాసిన పుస్తకానికి వారి తండ్రి గురుమూర్తి గుబిలి చేసిన అనువాదం ‘వీరయ్య.’ మరొకటి అంతర్జాతీయ వైద్యనిపుణుడు నోరి దత్తాత్రేయగారి ఆత్మకథ ‘ఒదిగిన కాలం’. కాని దత్తాత్రేయగారు వైద్యరంగానికి చెందిన సాంకేతిక అంశాలతో తెలుగులో ఒక పుస్తకం రాయకూడదా?

అమెరికాలో సాఫ్ట్ వేర్ లో అగ్రశ్రేణి నిపుణులుగా ప్రఖ్యాతి చెందిన తెలుగు వాళ్ళు ఎందరో ఉన్నారు. వారిలో ఎవరేనా సాఫ్ట్ వేర్ గురించో, కంప్యూటర్ భాషల గురించో, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించో తెలుగులో ఒక్క పుస్తకమేనా రాసారా? లేదా ఏ దినపత్రికలోనైనా కొన్ని వ్యాసాలైనా రాసారా? లేదా ప్రసంగాలేనా చేసారా? నా మిత్రుడు కన్నెగంటి రామారావు ఇటువంటి కృషి చెయ్యడానికి పూర్తిగా అర్హుడు. ఆయన ఇటువంటి ప్రయత్నం మొదలుపెట్టాలని కోరుకుంటున్నాను.

రక్షణ రంగంలో, యుద్ధాల్లో, లేదా శాంతికాముక సైన్యాల్లో పనిచేసిన తెలుగువారెవరన్నా తమ అనుభవాలు గ్రంథస్థం చేస్తే చదవాలని ఉంది. ఒడియా, హిందీ సాహిత్యాలకు చెందినవారెందరో పార్లమెంటేరియన్లుగా, మంత్రులుగా పనిచేసినవారున్నారు. తెలుగులో పి.వి.నరసింహారావు పేరు తప్ప మరొక పేరేదైనా స్ఫురిస్తున్నదా? ప్రతి ఆర్థిక శాఖామంత్రి బడ్జెటు ప్రతిపాదనలు సమర్పిస్తున్నప్పుడు తిరుక్కురళ్ నుంచో, టాగోర్ నుంచో ఏదో ఒక వాక్యం ఉదాహరించకుండా తమ ప్రసంగం పూర్తి చేయరు. ఎప్పుడేనా వేమన వాక్యమొకటేనా అలా వినగలుగుతామా?

పూర్వకాలపు పారశీక, ఆరబిక్ పదజాలం సరే, ఇప్పుడు కొత్తగా రష్యన్, ఫ్రెంచి, జపనీస్ ల నుంచి ఎన్ని కొత్త పదాలు తెలుగులో ప్రవేశించాయి?

గత ఏడాది కాలంలో విదేశీ భాషలనుంచి తెలుగులోకి ఎన్ని కొత్తపదాలు చేరాయి? ఇంగ్లిషు సరే, పూర్వకాలపు పారశీక, ఆరబిక్ పదజాలం సరే, ఇప్పుడు కొత్తగా రష్యన్, ఫ్రెంచి, జపనీస్ ల నుంచి ఎన్ని కొత్త పదాలు తెలుగులో ప్రవేశించాయి? 2020 ఆక్స్ ఫర్డ్ ఇంగ్లిషు నిఘంటువులో తెలుగు నుంచి ప్రవేశించిన ఎరువుపదమేదన్నా ఉందా? నాకు తెలుసుకోవాలని ఉంది.

విదేశీ భాషల సంగతి అలా ఉంచండి. తెలుగులో ఏదైనా కొత్త నిఘంటువు వెలువడిందా? ఈ మధ్య ఆచార్య వకుళాభరణం రామకృష్ణ గారు మామిడి వెంకయ్య గారి నిఘంటువు ఒకటి తాము వెలువరించబోతున్నామనీ, దానికి ముందుమాట రాయగల పండితుడి పేరేదైనా సూచించమని అడిగితే, ఇప్పటిదాకా నాకు ఒక్క పేరు కూడా స్ఫురించలేదు.

ఉపాధ్యాయ శిక్షణలో చేరిన విద్యార్థులకు విద్యాతత్త్వశాస్త్రం గురించి ఏమి చెప్తున్నారో తెలుసుకుందామని తెలుగులో రాసిన పుస్తకాలు చూసాను. అందులో వైగోట్స్కీకి ఒక పేరా, పియాజికి మరొకపేరా, అంతే, అది కూడా వారి జీవితవిశేషాల గురించిన వివరాలు మాత్రమే. విద్యాతత్త్వశాస్త్రంలో వారి మౌలిక పరిశోధనల గురించిన వాక్యం ఒక్కటి కూడా లేదు ఆ పుస్తకాల్లో.

ఒకప్పుడు వ్యావహారిక భాష గురించి వాదించినప్పుడు, గిడుగు, గురజాడ ప్రధానంగా తెలుగును విజ్ఞానవ్యాప్తికి అనుగుణంగా ఎలా మలచగలమనే ఆలోచించారు.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు భాష గురించి మాట్లాడేవాళ్ళంతా, సాహిత్యభాషగా తెలుగు గురించి మాట్లాడుతున్నారు. సాహిత్య భాషగా తెలుగు ప్రపంచంలోని అత్యుత్తమమైన పదిభాషల్లో ఒకటి. ఆ విషయంలో దిగులు లేదు. నేను మాట్లాడుతున్నది శాస్త్ర, సాంకేతిక భాషగా, సామాజిక శాస్త్రాల భాషగా తెలుగు వికసించవలసిన అవసరం గురించి. ఒకప్పుడు వ్యావహారిక భాష గురించి వాదించినప్పుడు, గిడుగు, గురజాడ ప్రధానంగా తెలుగును విజ్ఞానవ్యాప్తికి అనుగుణంగా ఎలా మలచగలమనే ఆలోచించారు. తన A Memorandum on Modern Telugu (1912) లో గిడుగురామ్మూర్తి ఒక అమెరికన్ విద్యావేత్త రాసిన ఈ వాక్యాల్ని ఉటంకించారు:

..In the interests of the children themselves and in order to give them the best possible training for their future work, whatever it may be, it is surely unwuse to allow them to spend so large a portion of their school time in literary studies. Even those children, who display special literary ability as some undoubetdly do, and whose intellectual bias unfits them for manual work will found no less competent to pursue their future studies on the linguistic side by having been brought, during the early period of their school life in direct contact with things learnt to be careful observation, thoughtful in reasoning and acuurate in expression.’

ఇది వందేళ్ళ కిందటి మాట. అప్పుడు కనీసం తెలుగు అంటే సాహిత్య చర్చలైనా జరుగుతుండేవి. మరి ఇన్ని పత్రికల్లో, ఇన్ని సైట్లలో, ఇన్ని సమాచార ప్రసార మాధ్యమాల్లో తెలుగులో ఏమి వస్తున్నది? అందులో ఒక్క వాక్యమేనా తక్కిన ప్రపంచం తెలుసుకోవటానికి అర్హత కలిగినదేనా?

వ్యాసకర్త ఫేస్ బుక్ అకౌంట్ ఇది : వాడ్రేవు చినవీరభద్రుడు

More articles

1 COMMENT

  1. మిత్రమా , శుభోదయం. తెలుగు లో శ్రీ కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ రాసిన కవితా సంపుటి అక్షరంలో అంతరిక్షం , ప్రొఫెసర్ వేణు గోపాల్ (అమెరికా) రాసిన కవితా సంపుటాలు సైన్స్ ని స్ప్ర మించిన గ్రంథాలు. నేను ఇటీవలే ఈ అంశంపై సేవ వాట్సాప్ గ్రూప్ లో ప్రస్తావించాను. మంచి అంశాన్ని ప్రస్తావించారు. శుభాభినందనలు 🎉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article