Editorial

Friday, May 10, 2024
కథనాలు'మనిషి కాకిలా... గొంతు కోకిలలా' : పార్వతి తెలుపు

‘మనిషి కాకిలా… గొంతు కోకిలలా’ : పార్వతి తెలుపు

ఇటీవల జీ తెలుగు చానల్‌లో ‘సరిగమప’ పాటల ప్రోగ్రాంలో కోకిలను మరిపించేలా పాట పాడిన ఈ అమ్మాయి గ్రామానికే కాదు, సమాజానికి ఎంత అవసరమైన ప్రతీకగా మారిందో , మరెంత గొప్ప ప్రేరేణగా నిలిచిందో మీరు గమనించే ఉంటారు.

ఒకరకంగా ‘కాకి తెలుపు’ ఈ సంపాదకీయం.

కందుకూరి రమేష్ బాబు 

‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’ అన్న పాటను అద్భుతంగా పాడిన పార్వతి తమ గ్రామ ప్రజల చిరకాల స్వప్నమైన ఆర్టీసి బస్సు వేయించడం ఇప్పుడు అందరినీ ఆకర్షించింది. ఏళ్ల తరబడి ఊరికి బస్సు కావాలని అధికారులకు మొర పెట్టుకున్నా జరగని పనిని ఆమె ఒక్కపాటతో కదిలించింది. సామాన్య ప్రజల కోరికలు ఎంత చిన్నవో అవి ఎంత సామాన్యమైనవో కూడా ఈ ఉదంతం మనకు తెలియజేసింది. ఇలాంటి వారికి అవకాశాలు వస్తే ప్రజలకు ఎంత భాగ్యమో కూడా ఈ నల్లటి అందమైన అమ్మాయి తేట తెల్లం జేసింది.

మనసు నిండిపోయింది

కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన దాసరి పార్వతీ జీ- సరిగమపలో పాడే అవకాశం దక్కించుకొవడం ఒకెత్తయితే ఆమె పాడిన చక్కటి పాట మరో ఎత్తు. ఆమె పాడిన తీరు మరో ఎత్తు. దాంతో ఆమె నిర్వాహకులను ఎంతగా అబ్బురపరిచిందీ అంటే ‘నీకేం కావాలమ్మా కోరుకో’ అనేలా చేసింది. దానికి ‘ఏమొద్దు సార్. మా ఊరికి బస్సు వస్తే చాలు” అన్న సమాధానంతో అందరినీ విస్మయ పరిచింది. మనసు నిండినట్టు చేసింది. అభినందనల వర్షం అందుకునేలా చేసింది.

ఆమె కోరుకున్నట్లే తమ ఊరికి బస్సును సాధించింది కూడా. పార్వతి విన్నపానికి డోన్‌ ఆర్టీసీ అధికారులు స్పందించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం డోన్‌ నుంచి దేవనకొండకు వెళ్లే బస్సును లక్కసాగరం మీదుగా తిప్పుతుండటం విశేషం.

ఒక నాడు ‘కాకి’ అని న్యూనత పరిచిన వారికే కాదు, ఊరందరికీ ఆమె నేడు ‘వెన్నెల’ కావడం, అదే అసలైన అందంగా పదుగురికీ తెలియడం ఎంత అద్భుతం. మరి చూడండి. దాసరి పార్వతి పూర్తి వివరాల కోసం ఈ వీడియో దర్శించండి.

నడిచిన ‘పాదం’

కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు, మీనాక్షమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరి చిన్న కుమార్తె దాసరి పార్వతి బాల్యం నుంచే పాటలు పాడడంపై ఆసక్తి పెంచుకుంది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో పాటలు పాడే విధానాన్ని గమనించి ఉపాధ్యాయులు ప్రోత్సహించడంతో ఇంటర్‌ పూర్తి చేశాక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో చేరింది. అక్కడ శిక్షణ తీసు కుంటూ పార్వతి టీటీడీ చానల్‌ ‘అదిగో అల్లదిగో’ కార్యక్రమానికి ఎంపికైంది. అటు పిమ్మట ఇటీవల జీ తెలుగు చానల్‌లో పార్వతికి పాట పాడే అవకాశం రావడం, చివరకు ‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’ అనే పాట పాడటం, ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రశంసలు కురిపించడం, పార్వతిని ఏమి కావాలో కోరుకోమని అడగగా.. తాను పడ్డ కష్టాలు తమ గ్రామస్తులు పడకూడదని, తన గ్రామానికి బస్సు తిప్పాలని కోరడం, దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా లేచి నిలబడి పార్వతికి ధన్యవాదాలు తెలియజేయడం, అంతా అనూహ్యంగా జరిగిపోయింది.

ఒకనాడు నడుచుకుంటూ బడికి వెళ్ళిన ఈ అమ్మాయి మనసులో గ్రామం, అక్కడి పరిస్థితులను మార్చాలన్న పట్టుదల ఉంది. అందుకే ఆమె బస్సు కోరుకున్నది.

ఒకనాడు నడుచుకుంటూ బడికి వెళ్ళిన ఈ అమ్మాయి మనసులో గ్రామం, అక్కడి పరిస్థితులను మార్చాలన్న పట్టుదల ఉంది. అందుకే ఆమె బస్సు కోరుకున్నది. ఆమె వల్ల తల్లిదండ్రులకే కాదు, ఉపాధ్యాయులకూ గౌరవం లభించింది. ఆసక్తి కరమేమిటంటే, నిర్వాహకులు తల్లిదండ్రులను ” మీరు పాపను కనలేదు. పాటను కన్నారు” అని అభినందించడం విశేషం.

తన పాటకు అధికారులు స్పందించి బస్సు సర్వీస్‌ ఏర్పాటు చేయడం విశేషం. గ్రామానికి బస్సు వచ్చే విధంగా చేసిన పార్వతికి ఆదివారం లక్కసాగరంలో అభినందన సభ నిర్వహించారు కూడా.

‘కాకి’ తెలుపు

చాలా మంది గొప్పవాళ్ళు, ప్రతిభావంతులు సామాన్యుల్లా మన మధ్య ఉన్నారు. అటువంటి వారికి అవకాశం వస్తే వారు తమ గొప్పతనాన్ని నిరూపించుకోవడమే కాదు, తమ ఔదార్యంతో తమ ఊరుకు, వాడకు ఇలా గొప్ప మేలు చేస్తారు. అటువంటి వారి గొంతు కోకిల వంటిదే కావొచ్చు. కానీ కాకి అని మొదట ఈసడించుకుంటారు. కానీ కాకులే శుభ సూచకం. మంచి చెడు చెప్పేది కాకే. ఎక్కడికక్కడ అదే శుభ్రతకు, శాంతికి మూలం. ఈ అమ్మాయి తెలుపేది అదే.

ఊరంతా వెన్నెల

అన్నట్టు, ‘జి – సరిగమప’లో పాడేందుకు ‘రంగ్ దే’ చిత్రంలో మంగ్లీ పాడిన పాటను పార్వతి ఎంచుకోవడం విశేషం. ఆ పాట కూడా ఒక విన్నపం. రేపటి కల ఒకటి తీరడం గురించే. అది ‘ఓ కంట కన్నీరు .. ఓ కంట చిరునవ్వు’…వినండి.

ఊరంతా వెన్నెలా…  మనసంత చీకటి
రాలిందా నిన్నలా….రేపటి కల ఒకటి
జగమంతా వేడుక …మనసంత వేదనా
పిలిచిందా నిన్నిలా…అడుగని మలుపోకటి
మడికే ముసుగే తొడుగే…అడుగే ఎటుకో నడకే
ఇది ఓ కంట కన్నీరు .. ఓ కంట చిరునవ్వు

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article