Editorial

Monday, May 20, 2024
సంపాద‌కీయంరెంటికీ చెడ్డ రేవడు - ఈటెల

రెంటికీ చెడ్డ రేవడు – ఈటెల

 

eetela

తానిప్పుడు లెఫ్ట్ కాదు, రైట్ కాదు, కేసీఆర్ వ్యూహానికి చతికిలపడిన లౌకిక ఆయుధం. రెంటికి చెడ్డ రేవడి. నేటి గన్ పార్క్ ప్రతిజ్ఞ నుంచి తెలుపు సమీక్షా సంపాదకీయం.

కందుకూరి రమేష్ బాబు 

ఈటెల రాజేందర్ శాసన సభ్యత్వానికి రాజీనామా సమర్పించి గన్ పార్క్ వద్ద అయన చేసిన ప్రతిజ్ఞ ఎంతో ఉత్తేజకరంగా సాగింది. అదే సమయంలో మరెంతో లౌక్యంతో సాగింది. చాలా స్పష్టంగా ఆ ప్రతిజ్ఞలో ఈటెల రెండు విషయాలను ప్రజలకు తెలియజేశారు. ఒకటి, గతంలో తనకున్న నక్సలైట్ బ్యాక్ గ్రౌండ్ నుంచి చూసి, తనను లెఫ్ట్ అనుకోనక్కర లేదని. త్వరలో బీజేపిలో చేరనున్నందున తాను రైట్ వింగ్ అనుకోనూ అక్కరలేదని. తన ఎజెండా అంతా నియంత పాలనకు చరమగీతం పాడటమే అని. “ఇవ్వాళ నా ఎజెండా రైట్ ఎజెండా కాదు, లెఫ్ట్ ఎజెండా కాదు, తెలంగాణ యావత్ ప్రజానీకం ఒక ఫ్యూడల్ నియతృత్వ పాలనలో కొనసాగుతున్నది కాబట్టి దాని నుంచి విముక్తి చేయడమే, దానికి ఘోరీ కట్టడమే” అని స్పష్టం చేశారు. ఆ పోరాటంలో తనకు అండగా నిలువ వలసిందిగా యావత్ ప్రజానీకాన్ని అయన అభ్యర్థిస్తున్నారు.

కేసీఆర్ నియంతృత్వానికి ఘోరీ కట్టే తన లక్ష్యం ముందు బెజేపిలో చేరడం అన్నది చిన్న విషయం అని ఆయన నివేదన. ఒక మతానికో లేదా కులానికో జత కట్టి చూడరాదన్నది కూడా అయన ఆవేదన. ఎట్టి పరిస్థితుల్లోనూ తనని ‘లౌకిక వాది’గానే చూడమని అయన ఉత్తేజకరమైన ప్రతిజ్ఞ లేదా వినమ్ర  ప్రమాణంలోని అసలు ప్రకటన. విచారకరమైనది ఏమిటంటే, అదెంత బలహీనమో చూడాలి.

ఈ ప్రతిజ్ఞలో అయన మరో ముఖ్య విషయం ప్రస్తావించారు. తనకి ప్రొఫెసర్లు, శ్రేయోభిలాషుల నుంచి ఫోన్లు వచ్చాయని, వారంతా తనను సొంత పార్టీ పెట్టి ముందుకు సాగమన్నారని చెప్పారు. కానీ  ఉద్యమకారులైన వారిని కేసీఆర్ ఎన్నడూ పట్టించుకోలేదని, వారి ఆధ్యర్యంలో కమిటీ వేసి బంగారు తెలంగాణకు పాటు పడదాం అన్నప్పటికీ ఆ ప్రతిపాదన వైపు కన్నెత్తి చూడలేదని,  ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా ఘాట్ నే ఎత్తివేసిన అనుభవం ఉందని, వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే తాను ఉద్యమకారులతో కలిసి వెళ్ళడం గానీ, సొంత పార్టీ ఏర్పాటు గానీ సాధ్యపడటం లేదని గన్ పార్క్ సమక్షంలో వారికి స్పష్టంగానే సమాధానం ఇచ్చారు ఈటెల.

kcr

ఈ లోగా… చిత్రమేమిటంటే, ఈటెల తాలూకు లెఫ్ట్…రైట్.. రెంటినీ వీక్ చేసి, సెంటర్ లో కూడా దెబ్బ తీసిన లౌకికుడు కేసీఆర్. అతడే ఈ కలికాలానికి తగిన యోధుడు అని ప్రజలు అనుకుంటే తప్పు ఎవరిది? ఈటెలది కాదా? కేసీఆర్ని సన్నిహితంగా ఎరిగి కూడా చేష్టలుడిగేలా మారడం స్వయంకృతం కాదా?

నిజానికి పైకి చూస్తే గన్ పార్క్ ప్రతిజ్ఞలో ఈటెల కేసీఆర్ ను బలంగానే విమర్శించినట్టు అనిపిస్తుంది. ‘ఈటెల’ లాంటి మాటలే వాడినట్లు కూడా అనిపిస్తుంది. కేసీఆర్ ని ‘నియంత’ అన్నారు. తెలంగాణ చైతన్యాన్ని ‘గంగ’లో కలిపారన్నారు, ఉద్యమకారుల ఐక్యతను ‘నాశనం’ చేశారన్నారు. అతడిది ‘నియంతృత్వం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ‘ఘోరీ’ కడతానని కూడా ప్రతిజ్ఞ చేశారు. ఐతే, ఆ నియంత, అహంకారి, అబద్దాల కోరు, ఉద్యమ విఘాతకుడు తనను మాత్రం బతికి బట్ట కట్టనిస్తాడా? లేదు. అందుకే తాను బిజెపిలో చేరవలసి వస్తుందని చెప్పకనే చెప్పాడు ఈటెల. ఆ పార్టీ అండతో ముందు శాసన సభ్యుడిగా తన ప్రాతినిధ్యం కాపాడుకోవలసి వస్తోందని, ఈ అనివార్యతను గుర్తించి తనను బీజేపిలో చేరినా లౌకిక వాదిగానే చూడమని విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ మతతత్వ ఎజెండాలో భాగమయ్యానని ఎంతమాత్రం భావించరాదంటూ తన వైఖరికి వివరణ ఇచ్చుకున్నారు.

శాసన సభ్యుడిగా మనగలగడం ఈటెలకు జీవన్మరణ సమస్య అయింది. కాబట్టే అయన బిజెపి అండతో హుజురాబాద్ ఎన్నికల్లో గెలవడానికి సన్నద్ధమయ్యారు. ఇప్పుడు ప్రొఫెసర్లు, ఉద్యమకారులు కాదు, కావలసింది. లెఫ్టా- రైటా ఎజెండా అన్నది కూడా కాదు చూడవలసింది, తనను కాపాడే ‘కేంద్రకం’ అన్నది ఆయన లౌకిక సారాంశం.

పాపం. ఈటెలను అర్థం చేసుకోవాల్సిందే. ఈటెల బిజెపి వైపు పోవడం ఎవరికీ ఇష్టం లేదు. నిజమే. సొంత పార్టీ పెట్టాలన్న మెజారిటీ అభిప్రాయాన్నీ తాను స్వీకరించలేడు. అదీ నిజమే. కానీ రోజు రోజుకూ కేసులను ఎదుర్కొంటూ, వీగిపోతున్న తన ఆర్థిక మూలాలను కాపాడుకుంటూ, అష్ట దిగ్భంధనం చేస్తున్న కేసీఆర్ కి ఎదురొడ్డి నిలవడం అంటే మాటలు కాదు. ఎవరెన్ని చెప్పినా ప్రాక్టికల్ గా అది అసంభవం. అందుకే కనీసం తన ఉనికి తాను నిలుపుకోవడం ఇప్పుడు ఈటెలకు ప్రాణ సంకటంగా మారింది. ఆ తర్వాతే తనపై పడే బిజెపి ముద్ర …అవన్నీ తర్వాతి అంశాలే. అందుకే తిరిగి మళ్ళీ శాసన సభ్యుడిగా మనగలగడం ఈటెలకు జీవన్మరణ సమస్య అయింది. కాబట్టే అయన బిజెపి అండతో హుజురాబాద్ ఎన్నికల్లో గెలవడానికి సన్నద్ధమయ్యారు. ఇప్పుడు ప్రొఫెసర్లు, ఉద్యమకారులు కాదు, కావలసింది. లెఫ్టా- రైటా ఎజెండా అన్నది కూడా కాదు చూడవలసింది, తనను కాపాడే ‘కేంద్రకం’ అన్నది ఆయన లౌకిక సారాంశం. అందుకే అయన బిజేపి శరణు కోరడం, ఆశించినట్లే అప్పుడే హుజురాబాద్ నియోజక వర్గంలోని మండలాల ఇంచార్జీలుగా ఐదుగురు బిజేపీ ఉద్దండ నేతలు నియమితులై పనిలోకి దిగడమూ జరిగింది.

బిజిపిని మతతత్వ పార్టీగా చూడరాదు. తాను సంకట పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ అలా అతడిని మనం అనుకోరాదు. ఈటెలను ‘ఈటెల’ అనే అనుకోవాలి. అదే తన నిస్సహాయ ప్రకటన. ఆ నిస్సహాయత లోంచే అయన యావత్ తెలంగాణా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక్కడ స్పష్టమైన విషయం ఏమిటంటే తాను రేపటి నుంచి బిజేపి. కానీ బిజేపి కాదు. తాను రేపటి నుంచి పోరాట యోధుడు. కానీ కాదు. అంతేకాదు, నిన్నా నేడూ కేసీఆర్ నియంత. కానీ ఆ నియంతను రేపు ఎదుర్కోవడం తనంతట తనకు అసాధ్యం. మరి ఏమిటయ్యా అంటే, ముందు తనను కాపాడుకోవడం. అందుకోసం బిజిపిని మతతత్వ పార్టీగా చూడరాదు. తాను సంకట పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ అలా అతడిని మనం అనుకోరాదు. ఈటెలను ‘ఈటెల’ అనే అనుకోవాలి. అదే తన నిస్సహాయ ప్రకటన. ఆ నిస్సహాయత లోంచే అయన యావత్ తెలంగాణా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరంతా ఎక్కడున్నా సరే, తన నియోజకవర్గంలో గెలుపుకోసం కృషి చేయాలీ అని ప్రాధేయపడుతున్నారు.

వింటున్నారా? నేడు తెలంగాణ ప్రజలే మళ్ళీ నిర్ణేతలు. లౌకికానికీ, లౌక్యానికీ తేడా వారికి తెలుసు. తనను తాను కాపాడుకోలేని ఈటెలను వారు కాపాడుకుంటారో లేదో చూడాలి.

ఈ లోగా… చిత్రమేమిటంటే, ఈటెల తాలూకు లెఫ్ట్…రైట్.. రెంటినీ వీక్ చేసి, సెంటర్ లో కూడా దెబ్బ తీసిన లౌకికుడు కేసీఆర్. అతడే ఈ కలికాలానికి తగిన యోధుడు అని ప్రజలు అనుకుంటే తప్పు ఎవరిది? ఈటెలది కాదా? కేసీఆర్ని సన్నిహితంగా ఎరిగి కూడా చేష్టలుడిగేలా మారడం స్వయంకృతం కాదా?

అందుకే తనను ‘రెంటికి చెడ్డ రేవడి’ అని… రేపెప్పుడో కాకుండా నేడే తెలుపవలసి వస్తోంది.

*రేవడు అంటే చాకలి లేదా రజకుడు. తను నది ఒడ్డున బట్టలు ఉతుక్కుంటున్నాడట. ఉతికిన బట్టలు ఎగువన తెరపగా ఉన్న చోట ఆరేసి మిగిలిన బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఇంతలో దూరంగా నదికి ఉధృతంగా నీరు రావడం చూసి, గబగబా ఆరవేసిన గుడ్డలు తీయడానికి పరుగెత్తాడు. అతడు ఆరవేసిన బట్టలు సేకరించే లోపలే ఆ ధౌతవస్త్రాలు వరదనీటిలో కొట్టుకొని పోసాగాయట. దిగువన ఉతకవలసిన బట్టలనైనా కాపాడుకొందామని కిందకు పరుగులు తీస్తే, అతనికంటే ముందే వరద ప్రవాహంలో అవీ కొట్టుకొని పోయాయట. పాపం ఆ దురదృష్టవంతుడు రెంటికీ చెడిన రేవడు(డి) అయ్యాడట.ఈ ఘటనే సామెత అయిందంటారు. మరి ఈటెల విషయంలో ఈ సామెత వర్తిస్తుందనే అనిపిస్తోంది, నేటి స్థితిని బట్టి…

More articles

2 COMMENTS

  1. రెంటికీ చెడ్డ రేవడి అనే సామెత నీ విపులంగా చెప్పడం సంతోషం అన్న గారు…

  2. విశ్లేషణ బాగుంది.
    సంపాదకుడి దార్శనికత అద్భుతం.
    ‘రెంటికి చెడ్డ రేవడు యీటెల… అని రేపెప్పుడో కాకుండా నేడే తెలుపవలసి వస్తోంది’ అన్న వాక్యం సాహసోపేతమైనది. గొప్ప పరిశీలన, దార్శనికత లేని వ్యక్తి యీ మాటను యింత ధైర్యంగా వెల్లడించలేడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article