Editorial

Sunday, May 19, 2024
ఆనందంమా 'జైన్' గురించి చెప్పాలి : సయ్యద్ షాదుల్లా తెలుపు

మా ‘జైన్’ గురించి చెప్పాలి : సయ్యద్ షాదుల్లా తెలుపు

మనిషి స్వార్ధం పెచ్చుమీరుతున్న ప్రతీసారి, తూఫానులు, సునామీలు, భూకంపాలు తదితరాలు ద్వారా ప్రకృతి వీలయినంత మేర పగ తీర్చుకుంటుంది. అయితే కొలుకోలేనంత దెబ్బ తగిలిన ప్రతీసారి మనిషికి కొద్దోగొప్పో మానవత్వం గుర్తొస్తుంది!!

మనిషి తత్వమే మానవత్వం అవ్వాలని బలంగా నమ్మిన నాకు, కోవిడ్ సమయంలో ఒంటరితనానికి గురయిన కొడుకు ఒక వైపు కనిపిస్తే, ఓ ఆసరా కోసం చూస్తున్న ‘జైన్’ మరో వైపు కనిపించారు.

సయ్యద్ షాదుల్లా

జైన్ .. మా పిల్లి..!!

ఒకరికొకరుగా ఉంటే, ఇద్దరి సమస్య తీరుతుంది కదా అని తాను మా కుటుంబంలో ఒకరిని చేసుకున్నాను.

అన్నట్టు, ‘జైన్’ అర్థం అరబిక్ భాషలో అందమైనది అని.

జైన్ ఇంటికి రాగానే మొదటి ఆటంకం నా భార్య. “ఇల్లంతా అద్దంలా చూసుకుంటాను, ఇది ఎక్కడ పడితే అక్కడ పని కానిస్తే ఎవరు శుభ్రం చేస్తారు? మీరా? నువ్వా?” అంటూ నన్ను నాకొడుకును గుమ్మం దగ్గరే ఉరిమింది. ఐతే దానికి జవాబున్నది. చెప్పడమే కాదు ఉదాహరణగా చూపించాను.

“అది ఎక్కడ పడితే అక్కడ మన మనుషుల్లా తన పని కానివ్వదు. చాలా క్రమశిక్షణతో తనకు కేటాయించిన ఒక లిట్టర్ బాక్స్ లోనే తన పని కానిస్తుంది. కావాలంటే చూడు” అని ఓ డెమాన్సట్రేషన్ దానితో ఇప్పించాను. ప్చ్. మా ఆవిడ ముఖంలో 0.1% ప్రశాంతత మెరుపులా మెరిసి మాయమయ్యింది.

తెచ్చింది కొడుకు కోసమైనా అది నా చెంతకే చేరింది. దాని ఆలన పాలన అన్నీ నా వంతే అయ్యింది.

జైన్ కోసం ఆన్‌లైన్‌ లో షాపింగులు. షాంపూలతో స్నానాలు. హెయిర్ డ్రయ్యర్ తో డ్రయ్యింగ్లు మామూలే.

జైన్ ఎంత దగ్గరయ్యిందీ అంటే దాన్ని వీధికుక్కలు తరుముతున్నట్లు కల పడితే దిగ్గున లేచి పక్కనే ఉన్న దానినోసారి తడిమి ముద్దు చేసి పడుకున్న రాత్రులెన్నో…

నేను నా లాపీతో పనిచేస్తుంటే జైన్ నాతో బాటు కూర్చుంటుంది. అప్పడప్పుడూ తనూ టైప్ చేస్తుంది. నేను పడుకుని ఉంటే నా పెదాలపై అది సున్నితంగా ముద్దుపెడుతుంది. తన చేయితో నన్ను తట్టి లేపుతుంది. బ్లాంకెట్ ను లాగుతుంది లేవమని. ఆకలేసినప్పుడు నా కళ్ళళ్ళో కళ్ళు పెట్టి చూస్తుంది. నేను ఎక్కడికి వెళితే వెంట వెంట వస్తుంది.

నాతో దాగుడు మూతలాడుతుంది. బయటకి వెళితే గుమ్మం దాకా వస్తుంది. దీనంగా చూస్తున్నట్లనిపిస్తుంది.

బయటకెలితే ఇంటికి వచ్చే దాక దాని ధ్యాసే. రావడంతోనే కాళ్ళకు చుట్టుకుంటుంది. దొర్లుతూ గంతులు వేస్తూ చిన్నగా అరిస్తే ‘అమ్మా’ అన్నట్లుగా వినిపిస్తుంది. ఎక్కడికైనా దూరంగా వెళితే వీడియో కాలింగ్ లో నన్ను తెరపై చూసి చేతితో తాకేదట. అట్లా మా కుటుంబంలో అందరి హృదయాలకు జైన్ ఎంతో దగ్గరయ్యింది.

జైన్ ఎంత దగ్గరయ్యిందీ అంటే దాన్ని వీధికుక్కలు తరుముతున్నట్లు కల పడితే దిగ్గున లేచి పక్కనే ఉన్న దానినోసారి తడిమి ముద్దు చేసి పడుకున్న రాత్రులెన్నో…

దీనికి చేసిన సేవ బహుశా నా కొడుక్కి చేయలేదంటే అతిశయోక్తి కాదేమో!

సయ్యద్ షాదుల్లా డైరీ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేశాక దేశ విదేశాల్లో దాదాపు మూడు దశాబ్దాలు వివిధ సంస్థల్లో వేరు వేరు హోదాల్లో పనిచేశారు, చివరకు స్వదేశంలో ఉంటూనే తన వృత్తి నైపుణ్యాలకు పని చెప్పాలని భావించాక  నాలుగేళ్ల క్రితం సౌది అరేబియా నుంచి తిరిగి భారత్ వచ్చేశారు. అప్పటి నుంచి కన్సల్టెంట్ గా వివిధ దేశ విదేశీ సంస్థలకు సేవలు అందిస్తూ షాద్ నగర్ లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. సాహిత్యం, సంగీతం వారి అభిరుచులు.

 

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article