Editorial

Sunday, May 19, 2024
కాల‌మ్‌'కాముని బొగుడ' - 'హోలీ కేళీ కోలాటం' – శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల...

‘కాముని బొగుడ’ – ‘హోలీ కేళీ కోలాటం’ – శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి, ‘కాముని బొగుడ – రంగుల పున్నమి యాది’ ఈ వారం.

శ్రీర్ రావు దేశ్ పాండే

ఫిబ్రవరిలో శివరాత్రి తర్వాత ఎండలు ముదురుతాయి. మార్చ్ నెల నాటికి ఉష్ణోగ్రతలు తీవ్రమౌతాయి. శివరాత్రి తర్వాత పిల్లలకు వంటి పూట బడులు ఉంటాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బడి ఉంటుంది. పిల్లలు ఇంట్లో నీడ పట్టున ఉండాలని ప్రభుత్వం ఉద్దేశ్యం.

బోథ్ లో వాతావరణం ఆ రోజుల్లో .. అంటే 1970 వ దశకం చివరి దాకా ఒక హిల్ స్టేషన్ ఉన్నట్టు ఉండేది. వాతావరణం చల్లగా ఉండేది. ఎండ 35 డిగ్రీలు దాటేది కాదు. పెద్దవాగు ఎండాకాలంలో కూడా మస్తుగా పారేది. మేము బడి వదలగానే పుస్తకాలు ఇంట్లో పడేసి అన్నం తినేసి ఊరి మీద పడేది.

కామ దహనం

కాముని పున్నమ రోజున దహనం చేసే కాముని కోసం దొంగతనంగా కట్టెలు జమ చేయడం, పిడకల దండలు తయారు చేయడం.. అటు నుంచి అటే పెద్ద వాగులో జలకాలాడి మామిడి కాయలు పండ్లు కోరలు పోయేటట్టు ఉప్పు కారం అద్దుకొని తిని చీకటి పడే వేళకు ఇళ్లకు వెళ్ళడం ..నెల రోజుల పాటు కాముని దహనం జరిగే దాకా మాకు ఇదే ద్యాస.

బోథ్ లో కాముడు పేర్చే స్థలం పేరు కాముడి బొగుడగా స్థిరపడిపోయింది. బొగుడ అంటే ఎత్తైన ప్రదేశం అని అర్థం.

నెల రోజుల పాటు జమ చేసిన కట్టెలు, చేతితో చేసిన పిడకల దండలతో కాముడుని పేర్చి దహనం చేసే వాళ్ళం. అవుసలోళ్ల తాత శ్రీరామోజు గంగారాం గారు ఒక మైథునం బొమ్మ గీసి ఇచ్చేవారు. చిన్న పిల్లలం మాకు ఆ బొమ్మలో ఎముందో అర్థం అయ్యేది కాదు. ఆ బొమ్మతో సహా కామ దహనం జరగాలని మాత్రమే తెలుసు. ఇప్పుడు లేవు గాని ఆ రోజుల్లో బోథ్ ప్రాంతంలో నల్లులు విపరీతంగా ఉండేవి. వాటిని సజీవంగా కాముడిలో దహనం చేస్తే నల్లులు నశించి పోతాయన్ననమ్మకంతో నల్లులను పట్టి తెచ్చి కాముడిలో వేసేవారు పెద్దవారు.

బోథ్ లో కాముడు పేర్చే స్థలం పేరు కాముడి బొగుడగా స్థిరపడిపోయింది. బొగుడ అంటే ఎత్తైన ప్రదేశం అని అర్థం. ఒకప్పుడు ఇది ఎత్తైన ప్రదేశమే. కాలక్రమేణా బొగుడ కనుమరుగు అయ్యింది. పేరు మాత్రం మిగిపోయింది. విఠలేశ్వర దేవాలయం వద్ద, హనుమాండ్ల గుడి వద్ద కూడా కాముడిని పేర్చి కాల్చేవారు. ఈ మూడింటి మధ్య ఒక పోటీ లాగా జరిగేది ఉత్సవం. ఈ నాటికి కాముని బొగుడ వద్ద ఈ కామ దహనం కార్యక్రమం తప్పకుండా జరుగుతున్నదని బాల్య మిత్రులు చెప్పారు. మా కాలంలో శ్రీరామోజు గంగారాం తాత గీసి ఇచ్చే మైథునం బొమ్మను ఇప్పుడు ఎవరు గీస్తున్నారో మరి!

కామ దహనం తెల్లవారి హోలి నాడిచ్చే బూతు నినాదాలు కూడా యాదికి వస్తున్నాయి. వాటిని ఇక్కడ రాయడం కుదరదు. వినేవాళ్ళు కూడా నవ్వుతూ సంతోషంగా స్వీకరించేవారు.

స్త్రీలు కాముని పున్నమ రోజున రంగు రంగుల శక్కరి పేర్లు(దండలు) తమ స్నేహితులు, బంధువుల ఇండ్లకు పంపి తమ ప్రేమను అభిమానాన్ని చాటుకునేవారు. అవి ఆఖరుకు పిల్లలకు పలారంగా దక్కేవి. కామ దహనం తెల్లవారి హోలి నాడిచ్చే బూతు నినాదాలు కూడా యాదికి వస్తున్నాయి. వాటిని ఇక్కడ రాయడం కుదరదు. వాటిని ఏ జంకూగొంకు లేకుండా అరిచేవాళ్ళం. వినేవాళ్ళు కూడా నవ్వుతూ సంతోషంగా స్వీకరించేవారు. వారూ తమ బాల్యంలో ఈ పని చేసిన వారే కనుక. ఆ బూతులకు ఆ ఒక్క రోజుకే అనుమతి ఉండేది.

కాముని పున్నమ సాహిత్యం

బతుకమ్మ పాటల మీద జరిగిన పరిశోధన కాముని పున్నమ సందర్భంగా పిల్లలు పాడే జాజిరి పాటల మీద, స్త్రీల పాటలు, పెద్దలు ఆడుతూ పాడే కోలాటం పాటల మీద జరిగిందో లేదో తెలియదు.

శ్రీలక్ష్మీ గారు, రావి ప్రేమలత గారు ఒకటో రెండో పరిశోధనా పత్రాలు సమర్పించారని ప్రొ. పులికొండ సుబ్బాచారి గారు చెప్పారు. కానీ పుస్తకాలు మాత్రం ప్రచురణ అయినట్టు లేవని ఆయన ఆన్నారు. శ్రీ మాదాడి నారాయణ రెడ్డి గారు “ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు”, “ఆదిలాబాద్ జిల్లా జానపద గేయ స్రవంతి” అనే రెండు పుస్తకాలు వెలువరించినారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రాంతంలో కాముని పున్నమకి పిల్లలు పాడే కోలాటం జాజిరి పాటలు, స్త్రీల పాటలు కొన్ని ఇప్పటికీ యాదికి ఉన్నాయి.

పిల్లల పాటలు

రింగిసు బిళ్ళ రూపాయి దండ
దండ గాదురా దామెర మొగ్గ
మొగ్గ గాదురా మోదుగు నీడ
నీడ గాదురా నిమ్మలబాయి
బాయి గాదురా బల్సింత కూర
కూర గాదురా గుమ్మడిపండు
పండు గాదురా పాపిట మీసం
మీసం గాదురా మిరియాల పొట్టు
పొట్టు గాదురా పొరని జుట్టు
పొరని జుట్టుకు దారం గట్టి
గిరగిరా దిప్పి బండకు గొట్టు

ఏది చెప్పినా కాదు అని చెప్పే ఆగం పొరడిపై కోపంతో చివరి వాక్యం అల్లినారెమో అనిపిస్తుంది.

ప్రశ్న జవాబు రూపంలో ఉండే ఈ పిల్లల జాజిరి పాట ముగింపు మనిషి చివరి మజిలీ వద్దకు తీసుకు పోతుంది.

కోతి పుట్టుడెందుకు? కొమ్మలెగురతందుకు
కొమ్మలెగురుడెందుకు? నార జీరతందుకు
నార జీరుడెందుకు? రథం కట్టెతందుకు
రథం కట్టుడెందుకు? రాముడెక్కేతందుకు
రాముడెక్కుడెందుకు? ఆన వడెతందుకు
ఆన వడుడెందుకు? అడ్లు వండేతందుకు
అడ్లు వండుడెందుకు? బువ్వ తినేతందుకు
బువ్వ తినుడెందుకు? భూమిలో వోతందుకు ..

ప్రశ్న జవాబు రూపంలో ఉండే ఈ పిల్లల జాజిరి పాట ముగింపు మనిషి చివరి మజిలీ వద్దకు తీసుకు పోతుంది. ఇంకా కొన్ని పాటల చరణాలు గుర్తున్నాయి కానీ పూర్తి పాట యాదికి లేదు. వీటిని సేకరించవలసి ఉన్నది.

***

అడేల్ తొడేల్ జింకపిల్ల
జీడి మేతల్ మెయ్యవోతే
రామరెడ్డి కీక గొట్టే
కీకకు కీకకు నన్నే విల్చే (ఇంకా ఉన్నది)

***

లింగరెడ్ లింగరెడ్ నీకెన్నెడ్లు
అన్నిగాదిన్నిగాద్ పదమూడెడ్లు
పదమూడెడ్లకు జీతమెంత.. (ఇంకా ఉన్నది)

స్త్రీల పాటలు

కాముని పున్నమ, హోలీ సందర్భంగా సామూహికంగా పాడుకునే అద్భుతమైన స్త్రీల పాటలు కూడా అనేకం ఉన్నాయి.

ఉసికెల పుట్టిన కామయ్యా ఉసికెల వెరిగిన కామయ్యా
నిను గన్నతల్లి లీల్లకు వోతే నిదురల్లేవోయ్ కామయ్యా
కామయ్యాకూ దోతూలాటా సై
కామయ్యాకు దుప్పట్లాట సై
అందుకోయే చంద్రాగిరి సై
కామయ్యా నువ్వే రారా ముత్యాల పందిరి కిందికీ

ఉదయం కామునికి ఆహ్వానం పలికి సాయంత్రం దహనం చేసే దాని వెనుక తాత్వికత ఏమిటని ఒక మిత్రుడిని అడిగాను.

కామిడి పున్నమి రోజున ఉదయం ఒక తాంబాలంలో బియ్యం పోసి ఒక బొమ్మను ఉంచి కన్నె పిల్లకు పూల బాసింగాలు కట్టి ఇంటింటికి తిరుగుతూ కామయ్యకు ఆహ్వానం పలుకుతూ పాడుతారు. సాయంత్రం కాముడిని కాలుస్తారు.

ఉదయం కామునికి ఆహ్వానం పలికి సాయంత్రం దహనం చేసే దాని వెనుక తాత్వికత ఏమిటని ఒక మిత్రుడిని అడిగాను. వాడు చెప్పినదేమిటంటే.. కామం పునరుత్పత్తికి మూలం. పునరుత్పత్తి లేకపోతే మానవ నాగరికత ముందుకు సాగాడు. కాబట్టి ఉదయం కాముడి ఆహ్వానిస్తూ పాటలు వచ్చాయి. అదే సమయంలో కామాన్ని అదుపులో ఉంచుకొకపోతే అనర్థాలు జరుగుతాయి. కాబట్టి కామాన్ని అదుపులో ఉంచుకోవాలన్న దృక్పథంతో కామ దహనం అనే సాంప్రదాయం వచ్చింది.

టో పోయిన ప్రియుడిని, అతను ఉండే తావులన్నీవెతికినా ఎక్కడా కనబడని ప్రియుడిని తలచుకుంటూ పాడే పాట ఇది.

కాయిదాలు రాసేటి కాసిర్ల
యాడా లెంకినా లేడె ఎలదరియా
ఎలదరియా నా రాజ ఎలదరియా
చెండులూ ఆడేటి చింతల్ల
యాడా లెంకినా లేడె ఎలదరియా
ఎలదరియా నా రాజ ఎలదరియా (ఇంకా ఉన్నది)

ఇట్లా ఎటో పోయిన ప్రియుడిని, అతను ఉండే తావులన్నీవెతికినా ఎక్కడా కనబడని ప్రియుడిని తలచుకుంటూ పాడే పాట ఇది. ఈ పాటలు అన్నీ ఒక తీరుగా ఉండవు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంత భాషా బేధాలు, పాట అల్లికలో తేడాలు ఉంటవి. ఇప్పుడు ఉటంకించిన పాటలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్నవే.

తెలంగాణ ఉద్యమంలో హోలీ కేళీ కోలాటం

తెలంగాణలో పిల్లలూ పెద్దలూ సాంప్రదాయికంగా జరుపుకునే ఈ హోలీ సాంస్కృతిక ఉత్సవాలను తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా మల్లేపల్లి లక్ష్మయ్య పురమాయింపుతో ‘హోలీ కేళీ కోలాటం’ అనే కార్యక్రమాన్ని తెలంగాణ రచయితల వేదిక తరపున 2005 లో హైదరాబాద్ లో ప్రారంభించాము. మొదటగా బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ లో చిన్నగా ప్రారంభించాము.

జయశంకర్ సారు, కేశవరావు జాదవ్ సారు కోలాటం ప్రారంభించారు. జయశంకర్ సారు తొందరగానే వెళ్లిపోయారు. కొన్ని నిముషాల్లోనే పోలీసులు లాఠీ ఛార్జ్ మొదలుపెట్టారు. నేను, పాశం యాదగిరి, కేశవరావు జాదవ్, మల్లేపల్లి లక్ష్మయ్య ఇంకా కొందరు విద్యార్థులు అరెస్ట్ అయ్యాము.

మల్లేపల్లి లక్ష్మయ్య గారి స్వంత ఊరు రామగుండం దగ్గర జనగామ నుంచి కోలాటం కళాకారులు వచ్చారు. అది విజయవంతం అయ్యింది. ఆనాడు పార్క్ కు వచ్చిన సందర్శకులను ఈ కోలాటం విశేషంగా ఆకర్షించింది. మరుసటి సంవత్సరం 2006 లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో  జరిపాము. తీవ్ర నిర్బంధం ప్రయోగించింది వైఎస్ఆర్ ప్రభుత్వం. పోలీసులు గుర్రాలతో మమ్ములను చుట్టుముట్టారు. “పర్మిషన్ లేకుండా యూనివర్సిటీలో హోలీ కోలాటం జరపటానికి వీల్లేదని” అన్నారు. “విసి పర్మిషన్ ఇచ్చాడు. హోలీ జరుపుకోవడానికి పోలీసుల పర్మిషన్ అక్కెర లేదు” అన్నాము.

జయశంకర్ సారు, కేశవరావు జాదవ్ సారు కోలాటం ప్రారంభించారు. జయశంకర్ సారు తొందరగానే వెళ్లిపోయారు. కొన్ని నిముషాల్లోనే పోలీసులు లాఠీ ఛార్జ్ మొదలుపెట్టారు. నేను, పాశం యాదగిరి, కేశవరావు జాదవ్, మల్లేపల్లి లక్ష్మయ్య ఇంకా కొందరు విద్యార్థులు అరెస్ట్ అయ్యాము. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో మమ్ములను ఉంచారు. కోలాటం భగ్నం చేసిన వార్త మీడియా ద్వారా రాష్ట్రమంతా తెలిసిపోయింది.

కరపత్రం

తెలంగాణలో పండుగ జరుపుకునే సాంస్కృతిక స్వేచ్ఛలేదా? అని తెలంగాణ అంతా ఉడికిపోయింది. అప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ వార్త తెలిసి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని స్థంభింపజేసారు. అసెంబ్లీ వాయిదా పడింది. పెద్దలు, దివంగత నేత శ్రీ నాయిని నరసింహారెడ్డి గారి నాయకత్వంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు యూనివర్సిటీకి వచ్చి మమ్మలని విడిపించారు. ఆ తర్వాత కోలాటం రెండు గంటల పాటు అద్భుతంగా కొనసాగింది. రెండో సంవత్సరం కూడా కోలాటం వేయడానికి మల్లేపల్లి లక్ష్మయ్య వాళ్ళ ఊరు రామగుండం దగ్గర జనగామ నుంచి రప్పించాడు. మల్లేపల్లి రాజన్న నాయకత్వంలో పది మంది కళాకారులు యూనిఫాం, కాళ్ళకు గజ్జెలు, కోలలతో హైదరాబాద్ వచ్చారు. మల్లేపల్లి లక్ష్మయ్య కూడా స్వయంగా కళాకారుడు కావడంతో వాళ్ళతో కోలాటంలో అడుగులు కలిపేవాడు. సాంప్రదాయిక కోలాటం పాటలతో పాటూ ఉద్యమ గీతాలను ఆలపించారు కళాకారులు.

సాంప్రదాయిక కోలాటం పాటల్లో .. “నీయారు గుర్రాలు నాయారు గుర్రాలు
పన్నెండు గుర్రాల బగ్గి వోతున్నాది..బగ్గిలో మేనత్త బిడ్డ వోతున్నాది ” అనే పాట బాగా పాపులర్ అయ్యింది.

ఆనాటి నుంచీ ప్రతీ సంవత్సరం యూనివర్సిటీలో హోలీ పండుగ ఉద్యమ ఉత్సవంగా మారింది. తెలంగాణ వచ్చేదాకా హోలీ కోలాటం ప్రతీ ఏడు కొనసాగించాము.

దిగుమతి అయిన పండుగ కాదు!

హోలీ ఉత్తర భారతంలో ఘనంగా జరుపుకునే పండుగ. అయితే తెలంగాణలో కాముని పున్నమి, రంగుల పున్నమి, బూడ్దుల పున్నమి అనే స్థానిక పేర్లు ప్రాచుర్యంలో ఉండేవి. ఆ తర్వాత హోలీ అనేది వ్యాప్తిలోకి వచ్చింది. రంగుల పున్నమి సంప్రదాయం మనకు ఉత్తరం భారతం నుంచి దిగుమతి అయ్యింది అనేది అవాస్తవం.

కాముని పున్నమ సాహిత్యం మీద, బతుకమ్మ సాహిత్యం మీద జరిగినంత సమగ్ర పరిశోధన, విశ్లేషణ జరగక పోవడం, జానపద పరిశోధకుల దృష్టి ఇటువైపు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

వందల సంవత్సరాలుగా రంగుల పున్నమికి తెలంగాణలో తనదైన ప్రత్యేక సాంస్కృతిక సాంప్రదాయం ఉన్నది. అద్భుతమైన సాహిత్య సంపద ఉన్నది. కోలాటం, జడ కొప్పులు, చిరుతలు లాంటి కళారూపాలు ఉన్నవి. పూర్తిగా తెలంగాణ స్థానికత, వైవిధ్యం ఉన్న కాముని పున్నమ సాహిత్యం మీద, బతుకమ్మ సాహిత్యం మీద జరిగినంత సమగ్ర పరిశోధన, విశ్లేషణ జరగక పోవడం, జానపద పరిశోధకుల దృష్టి ఇటువైపు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

కాముని పున్నమి సాహిత్యంపై పరిశోధన చేయించే విషయమై తెలుగు విశ్వ విద్యాలయం, తెలంగాణ విశ్వ విద్యాలయాల తెలుగు శాఖలు దృష్టి సారించవలసిన అవసరం ఉన్నది.

కాలమిస్టు పరిచయం

శ్రీధర్ రావు దేశ్ పాండే గారు వృత్తి రీత్యా ఇంజనీర్. తెలంగాణ బిడ్డగా జల వనరుల నిపుణులుగానూ గత మూడు దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సామాజిక రంగాలపై అనేక వ్యాసాలు రచించారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను నొక్కి చెబుతూ  స్వయంగా పలు పుస్తకాలు రచిస్తూనే తెలంగాణా టైమ్స్, తెలంగాణా సొయి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక అధికారిగా (OSD) సాగు నీటి పారుదల రంగంలో వారు పని చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ‘బోథ్’ వారి స్వగ్రామం. తెలుపు పాఠకులకు తమ ఊరి పేరిటే ‘బొంతల ముచ్చట్ల’ను పంచుకునేందుకు గాను వారు ఈ శీర్షికకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా ఇది మెత్తటి జ్ఞాపకాల శయ్య. తొలి భాగం “రింజిం రింజిం ఆదిలాబాద్…. బోథ్ వాలా జిందాబాద్”. రెండో భాగం నాది మూల నక్షత్రం పుట్టుక. మూడో భాగం బోథ్ పెద్దవాగు – ఒక పురా జ్ఞాపకం. నాలుగో భాగం స్వామి స్నేహితులు – మాల్గుడి క్రికెట్ క్లబ్. ఐదో భాగం కోడి – గంపెడు బూరు : మా చిన్నాయి చెప్పిన కథ. మీరు చదివింది ఆరో భాగం వారి ఇ -మెయిల్ : irrigationosd@gmail.com

 

More articles

1 COMMENT

  1. హోలీ కోలాటం ముచట్లు చాలా బాగున్నాయి. నా చిన్నప్పటి ముచట్లు గుర్తుకు తెచ్చాయి.నేను కోలాటా ఆడే పిల్లలను బాగా గమనించే దాన్ని కాబట్టి మీరు రాసిన పాటలన్నీ నాకు వచ్చు.మా స్కూల్ పిల్లలు ఇప్పటికి హోలీ పండగ వచ్చిందంటే కోలాటం ఆడడానికి వెళ్తారు..బడిలో ముచ్చటగా చెప్పుకుంటారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article